"గౌరవిస్తున్నానమ్మా" అంటూ బ్రాందీలో కొంచెం నీళ్ళు కలిపి అతని పెదాల దగ్గర పెట్టింది.
బ్రాందీకైపు, ఆమె శరీరపు కదలికల ఘాటు కొత్తగా విరుచుకుపడిన అమర రుచుల మైమరపు...
మర్నాడు మోహనకు కబురుచేశాడు. "చాలా కట్టుదిట్టంగా ఎంక్వయిరీ చేశాను. ఆమె నిజమైన జోగినియే."
* * * *
వర్ష రామాపురం నుంచి నడిచి వస్తోంది. స్కూల్లో ఎవరో రాజకీయ నాయకుడు రాగా, మీటింగు పెట్టడం వల్ల బాగా ఆలశ్యమైపోయింది. అప్పుడే చీకటి పడిపోతున్నది కూడా. ఆమె కంగారు పడుతూ త్వరత్వరగా నడవసాగింది.
సగం దూరమొచ్చి ఉంటుంది. ఇంతలో వెనకనుంచి ఓ సైకిలు దూసుకొచ్చి ఆమె ప్రక్కగా ఆగుతోంది.
"శ్రీహర్ష కాదుకదా. అయితే ఎంత బాగుండును." అనుకొంటూ తల ప్రక్కకి తిప్పి చూసింది.
కాదు ఎవరో కొత్త యువకుడు. శ్రీహర్ష వయసే ఉంటుంది. షోకిలాలా, పొగరుగా కనిపించాడు. వెంటనే ప్రక్కకి తొలగి సాధ్యమైనంత గబగబా అడుగులు వేస్తోంది.
"వర్షా!" అన్నాడు యువకుడు. "ఎన్నాళ్ళబట్టో నిన్ను కలుసుకుందామను కొంటున్నాను. ఈ వేళ నా కోరిక తీరింది."
వర్షకు కోపం వచ్చింది. "నన్ను కలుసుకునేందుకా దేనికి?" అనడిగింది.
"నువ్వందంగా ఉంటావు కాబట్టి"
"అందంగా ఉంటే ఆడపిల్ల వెంటపడాలా?"
"నీ అందమంటే నా కిష్టం కాబట్టి."
వర్ష అటూ ఇటూ చూసింది. కనుచూపు మేర ఎవరూ కనపడడంలేదు. ఆమెకి కొద్దిగా భయమేసింది. అయినా తన భయం బైటపెడితే అలుసైపోతానని ధైర్యంగానే ఉండదల్చింది.
"ఇంకా చెప్పమంటావా?" ఆమె ఏమీ మాట్లాడలేదు. "నిన్నారాధిస్తున్నాను కాబట్టి"
"నీలాంటి జులాయి వెధవకి ఆరాధనంటే ఏమిటో తెలుసా?"
"నేను జులాయికోరునా? మా ఊరొచ్చిచూస్తే నా బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుస్తుంది. విలాస్ అంటే అక్కడ ఎంత పేరో..."
"నీ బ్యాక్ గ్రౌండూ. నువ్వూ ఎవరికి కావాలి. నీ దార్న నువ్వు పో"
"అబ్బో! చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావ్. వెళ్ళకపోతే ఏం చేస్తావు?"
"అరుస్తాను. కేకలేస్తాను"
"నీ అరుపులూ, కేకలూ వినడానికి దగ్గరలో ఎవరూ లేరు."
"అదా నీ ధైర్యం! నీలాంటివాడికి ఎలా జవాబు చెప్పాలో నాకు తెలుసు. ఎవరి సాయమూ అక్కరలేదు."
"అహ! అలాగా?" అంటూ అతను సైకిలు స్లోగా పోనిస్తూ ఆమె జడపట్టుకులాగాడు.
ఆమె త్రాచుపాములా రివ్వున యెదురు తిరిగి ఒక్కతోపు తోసింది. విలాస్ బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. సైకిలు అతనిమీద పడిపోయింది. కోపంతో ఊగిపోతూ సైకిల్ ను పక్కకి తోసేసి లేవబోయాడు. కాని కింద పడినప్పుడు కాలు మెలిక పడిపోయి బెణికినట్లయింది. బలం చాలక మళ్ళీ నేలమీద చతికిలపడిపోయాడు.
"దీన్ని..." అనుకొంటూ ఆమెకోసం చూశాడు.వర్ష అప్పటికి చాలాదూరం వెళ్ళిపోయింది. దూరంగా నడిచి వస్తోన్న మనుషులు కూడా కనిపించారు.
* * * *
ఆ రాత్రి శ్రీహర్ష వర్షను కలుసుకున్నప్పుడు ఆమె జరిగిందంతా చెప్పింది.
"ఏమండీ...ఈ వాతావరణం, నిరంకుశత్వం...ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందండీ" ఆమె గొంతు వొణికింది. కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.
"వర్షా! నీ వెనుక నేనున్నాను. ఎలాంటి కష్టంలోనైనా, బాధలోనైనా నీవెంట నేనుంటాను" అని గుండెల్లోంచి ఉబికిన భావాన్ని చెప్పాలనిపించింది. ఆమె కళ్ళలో తళతళ లాడుతోన్న నీటి బిందువులు, గొంతులోని వొణుకు అతని హృదయాన్ని కలచివేశాయి. ఆమె భుజాలచుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని తల నిమరాలనిపించింది. కాని ఏదో సంకోచం అతనా పని చెయ్యకుండా ఆపింది. "భయపడకు వర్షా! నీ కండగా నే ఉన్నానని మరచిపోకు." అన్నాడు.
