మొదట్లో ఆ వాతావరణం పద్మకి భయం కలిగించింది. రానురాను అలవాటు పడటం వల్ల సర్దుకుపోతోంది.
ఎంత సర్దుకుపోయినా ఎప్పుడేం జరుగుతుందో నన్న భయంతో హైద్రాబాదు మీద అభిమానం పెంచుకోడం వీలుపడింది కాదు.
అల్లాంటిది అక్కడ కృష్ణమూర్తితో పరిచయం కలిగిం తర్వాత హైదరాబాదుతో అపారమైన అనుబంధం ఏర్పడింది.
హైదరాబాదంటే నీ కెందుకంత యిష్టమని ఎవరైనా అడిగితే అక్కడ కృష్ణమూర్తి వున్నాడు గనక అని టక్కున సమాధానం చెప్పేందుకు వెనకాడని స్థితికి ఎదిగిపోయింది పద్మ.
అక్కడున్న రోడ్లూ, భవనాలు, ధియేటర్లూ, మ్యూజియంలూ, పార్కులూ, హోటళ్ళు. కాలక్షేపానికి కొరతలేని పలు ప్రదేశాలు పద్మను అంతగా ఆకర్షించలేదు.
ఒక్క కృష్ణమూర్తి కారణంగానే ఆ నగరం తన పాలిట నందనవనమైంది.
తన మనసులో కృష్ణమూర్తి చోటు చేసుకోక మునుపు పద్మ మనసు ఎప్పుడూ బందరు మీదే వుండేది. ఏపాటి సెలవు దొరికినా బందరు వెళ్ళిపోదామనే తొందర్లో వుండేది.
కృష్ణమూర్తి దగ్గరైన తర్వాత ఆ అభిప్రాయం తారుమారయ్యింది. బందరు వెళ్ళాలంటే చిరాగ్గా వుంటోంది. జీవితం పర్యంతం హైద్రాబాదులోనే గడపాలని కోరుకుంటోంది.
భారతదేశంలొ హైదరాబాదుని మించిన నగరం లేనే లేదని వ్యాసాలు రాయాలనిపిస్తోంది.
పరీక్షలై పోయిన కారణంగా తప్పనిసరై బందరొచ్చిందేగాని లేకపోతే ఎంచక్కా అక్కడే వుండేపని.
పాడు పరీక్షలు అంత చప్పున అయిపోవాలా.
బందరొచ్చి ప్రతిక్షణం కృష్ణమూర్తి గురించిన ఆలోచనల్తోనే గడుపుతోంది.
ఆమె ధోరణి లక్ష్మీపతికి వింతగా తోచినా పట్టించుకోలేదు. ఎందుకట్లా వుంటున్నావని అడగనూలేదు.
ఈ బంగారు బొమ్మకి కోటీశ్వరుడి కొడుకుని వెతికే ప్రోగ్రాం గురించి పధకాలేస్తున్నాడు.
ఇంక ముహూర్తం పెట్టుకోడమే మిగిలింది.
పద్మ కాఫీ తాగుతుంటే లక్ష్మీపతి ఆమె ముందు కూర్చున్నాడు.
"చాలా చిక్కిపోయేవమ్మా!" అన్నాడు.
పద్మ చిన్నగా నవ్వేసింది.
"హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టరా ఏమిటి! బోలెడు డబ్బు పోస్తున్నాం కదా కడుపు నిండా పెట్టకపోతే ఎలా?"
దానిక్కూడా పద్మ చిరునవ్వే సమాధానంగా చెప్పింది.
మాటా పలుకూ లేకుండా కేవలం చిరునవ్వుతోనే వెలిగి పారేస్తున్న కూతురి వాలకం అతనికి చిరుకోపం కలిగించింది.
ఆమెచేత మాటాడించాలనే పంతంలో ఒక బాణం వేసేసేడు---
"ఈ ఏడాదే నీ పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాను!"
అంతమాట విన్నాక ఏ సగటు ఆడపిల్లా కిమ్మనకుండా తనకేం పట్టనట్టు వుండదు.
అప్పుడే పెళ్ళికేం తొందరనో, ఇంకా చదవాలని వుందనో, నా పెళ్ళి నాకు విడిచిపెట్టండనో, నేనో అబ్బాయిని ప్రేమించేననో---ఏదో ఒక జవాబు చెప్పాలి. అది రూలు.
అల్లాంటిది పద్మ తండ్రి స్టేట్ మెంటుకి కించిత్తుకూడా చలించలేదు.
పైగా అప్పుడు కూడా ఆమె చిరునవ్వు ముద్రనే సమాధానంగా వాడుకుంది.
లక్ష్మీపతి ఆ దెబ్బతో డల్లయిపోయేడు.
అందమైన అమ్మాయికి చిరునవ్వు మరింత అందాన్ని తెచ్చిపెట్టచ్చు. కానీ-పెళ్ళి సంగతి కదిపినా అక్షరం మాటాడకుండా చిరునవ్వుతో సరిపెట్టుకుంటుందంటే ఏమిటర్ధం?
అర్ధాలు వెతికే ఓపికలేక ఆ విషయాన్ని అక్కడ్తో ఆపేసి లక్ష్మీపతి అక్కడ్నించి లేచిపోయేడు.
లక్ష్మీపతి హాల్లోకి వచ్చేసరికి శాస్త్రి పద్దుపుస్తకం తిరగేస్తూ కనిపించాడు.
వీడొకడు---
పెడన చౌదరిగారి బాకీ వసూలు చేయకుండా వుత్తచేతుల్తో తిరిగొచ్చాడు. "శిక్షగా" నీ జీతంలో పాతిక తెగ్గోస్తున్నానని చెప్పినప్పుడు సింపులుగా తమ చిత్తం అన్నాడేగాని--- "అంత పని చేయకండి మహాప్రభో" అని కాళ్ళా వేళ్ళా పడలేదు.
ఏం చూసుకుని అంత ధైర్యంగా చిత్తమన్నాడో లక్ష్మీపతికి తెలిసింది కాదు.
ఇప్పుడింకో చురక తగిలించాలనే కోరిక కలిగింది లక్ష్మీపతికి అందుకు ప్రాతిపదికగా---
"నీ జీతంలో పాతిక రూపాయలు తగ్గించి నందుకు నాక్కూడా బాధగానే వుందోయ్ శాస్త్రీ!"
"చిత్తం!"
"ఆ చౌదరి బాకీ వసూలు చేస్తేనే నీకు ఆ నష్టంగానీ నాకు బాధగానీ ఉండేది కాదుగదా?"
"అవునండి. మన నష్టాలూ లాభాలూ ఆ చౌదరిగారు పట్టించుకునే రకం కాదండి. ఇష్టమొచ్చినప్పుడు ఇస్తాను పొమ్మని కసిరికట్టేరు."
"కొడతారయ్యా! కొడతారు! అప్పు తీసుకొనేప్పుడు అయ్యా, బాబూ అంటారు. తీరా తీర్చేసరికి నీ దిక్కున్నచోట చెప్పుకోమంటారు, చూడూ-- గొడుగు పేట ఇంట్లో ఒక వాటా ఖాళీగా ఉందికదూ?"
ఆ సంగతి శాస్త్రికి కూడా తెలుసు. అయినా ఇప్పుడింత అర్జంటుగా ఆ విషయం ఎందుకు కదిపేరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో చిన్న తురుపు కార్డు 'అంటే' అంటూ ప్రయోగించాడు.
"అదేనయ్యా!" ఆర్టీసీ సుబ్బారావు ఒక వాటాలో ఉన్నాడు. ఆ రెండో వాటా ఖాళీగా ఉందికదా?"
"చిత్తం! అది ఆర్నెల్లనుంచీ అట్లాగే ఉండండి" అన్నాడు శాస్త్రి కొంచెం భయం భయంగా.
"ఉందంటే ఎట్లా? అద్దె నష్టంకదూ? ఎవరో ఒకరు అద్దెకు దిగాలి కదూ?"
"దిగరండి!" అని ఖచ్చితంగా చెప్పేశాడు.
"ఎంచేత?"
"ఇంతకు మునుపు ఆ వాటాలో వున్న నర్సు ఉరేసుకు చచ్చిపోయిందన్న వార్త ఊరుఊరంతా తెలిసిపోయింది కదండీ?"
"అయితే ఏమిటంట?"
"చచ్చి ఊరుకోలేదటండీ! దెయ్యమై తిరుగుతోందిట! దెయ్యాలున్న కొంపలో చూస్తూ చూస్తూ ఎవరు దిగుతారు చెప్పండి?" అని సమస్యని ఈజీగా తేల్చిపారేశాడు శాస్త్రి.
"అదేం కుదరదు. ఆ వాటా ఎవరో ఒకరు అద్దెకు దిగాల్సిందే! నెలకి రెండొందలు అద్దె ఇవ్వాల్సిందే!"
"చిత్తం నా అభిప్రాయం కూడా కరెక్టుగా అదేనండి. కాని అద్దెకు దిగేవాళ్ళ సెంటిమెంట్సు కూడా మనం గౌరవించాలి గదండీ!" అన్నాడు ఏదో కీడు శంకిస్తూ.
"ఇరవయి నాలుగ్గంటలు టైమిస్తున్నాను!" లక్ష్మీపతి సీరియస్ గా.
"ఎవరికండీ?"
"నీకు!"
