శ్రీధర్ దగ్గర్నించి దొంగిలించుకుని తెచ్చిన 'ఆంటీమనీ' సీసా మూత తెరచి, ఫ్లాస్క్ మూత ఓపెన్ చేసి ఆ సీసాలో ఉన్న ద్రవాన్ని ఆ కాఫీల్లో కలిపాడు అవినాష్. తిరిగి ఫ్లాస్క్ మూత పెట్టేయడం- ఖాళీ సీసాను వెంటనే సూట్కేసు వెనక దాచేయడం అంతా క్షణాల మీద జరిగిపోయాయి.
ఫ్లాస్కుని రెండు చేతుల్తో పట్టుకుని అవినాష్ నిల్చున్న సమయంలో-
బాత్ రూంలోంచి గౌతమి బయట కొచ్చింది.
"కాఫీ వేడిగా ఉందా..." అని అడిగింది బెడ్ వేపు చూస్తూ.
"అదే చూస్తున్నాను..." ఆ సమయంలో ఒక క్షణం పాటు తత్తరపడ్డాడు అవినాష్.
సూట్ కేసు వెనక తనుంచిన సీసాను ఆమె చూసిందేమో?
చూసుండదు, కానీ అవినాష్ లో ఏదో భయం.
ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ, జారిపోతున్న దుప్పటిని వంటికి సర్దుకుంటూ అవినాష్ దగ్గరకు వచ్చి, అతని చేతుల్లో ఉన్న ఫ్లాస్కుని తీసుకొని, ఆ పక్కనే ఉన్న కప్పుని తీసి-
"నీక్కూడా ఇవ్వనా..." అడిగింది.
"నాకిప్పుడొద్దులే..." జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ 'ఇదయిపోయాక' అంటూ సిగరెట్ ను చూపించాడు.
కప్పు నిండుగా కాఫీని పోసుకుని ఫాస్కు మూత యధాప్రకారం పెట్టేసి, ఒక చేత్తో కాఫీ కప్పుతో మంచం వారగా కూర్చుంది.
ఎలాగో ఒకలాగ మాయమాటలు చెప్పి, ఆ కాఫీని తాగించాలనుకున్నాడు అవినాష్.
కానీ-
తన మట్టుకు తనే కప్పులో కాఫీ ఆమే పోసుకుంటుందని ఊహించలేదు అవినాష్.
అన్నీ అనుకుంటున్నట్టుగా-
తన పని సులవయేటట్టుగా జరుగుతున్నందుకు అవినాష్ కి చాలా ఆనందంగా ఉంది.
సిగరెట్ కాలుస్తూ, రెప్పలార్పకుండా గౌతమి వేపే చూస్తున్నాడు.
గౌతమి కళ్ళు నవ్వుతున్నాయ్. ఓ ప్రక్క కాఫీ త్రాగుతూనే అవినాష్ వేపు చూస్తుండిపోయింది.
కాఫీ ఒక్కొక్క చుక్క ఆమె గొంతులోంచి కంఠంలోకి జారుతున్నపుడు ఆమె ఫీలింగ్ ను పసికట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అవినాష్.
"ఏమిటి... ఏదో వాసనేస్తోంది..." సగం తాగిన కాఫీ కప్పు వేపు చూస్తూ అంది గౌతమి.
"ఏం వాసన...?" అవినాష్ గుండెల్లో ఏదో తెలీని ఆందోళన-
"ఫ్లాస్కు వాసని ఉంటుందిలే..." జవాబు చెప్పాడతను.
సరిగ్గా సమయానికి తన మెదడులోకి ఆ జవాబు వచ్చినందుకు చాలా ఆనందించాడతను.
ఆమె పూర్తిగా కాఫీ తాగేసింది.
మాట్లాడకుండా బెడ్ మీదకు జరిగింది.
'ఆంటీమనీ' పని చేస్తోందా?
అవినాష్ సిగరెట్ పారేసి, వెళ్ళి పక్కనే కూర్చున్నాడు.
"లైట్ తీసెయ్... అవినాష్..." మెత్తగా గొణిగింది గౌతమి.
అవినాష్ లేచి లైటార్పేసి, ఆమె పక్కకు చేరి, ఆమె కప్పుకున్న దుప్పటిని పూర్తిగా తీసేసి పక్కకు పడేశాడు.
ఆమె మీద ఒరిగిపోయాడు అవినాష్.
అలసటతో, మత్తుతో, తెలీని ఉద్రేకం చల్లగా హఠాత్తుగా చల్లారుతున్న దేహంతో గౌతమి-
"అవినాష్... నా నరనరాల్నీ చీల్చెయ్... నన్ను... నీతో తీసుకు పో... రా... అవినాష్... ఎందుకు భయపడతావ్... ఈ... గౌతమి నీది... నీదే కదా... అవినాష్... నీ కోసమే... ఇంత దూరం వచ్చింది కదా... అవినాష్... పిచ్చి అవినాష్... నేనంటే... నీకెందుకింత ప్రేమ అవినాష్..." మత్తుగా గొణుగుతోంది.
వెచ్చని శ్వేదంతో గౌతమి శరీరం తడిసిపోతోంది.
అదే సమయంలో-
గౌతమి శరీరం నుంచి అవినాష్ విడివడిన సమయంలో-
ఆమెకు స్పృహ తప్పిపోయింది- తల పక్కకు వాల్చేసింది.
గబుక్కున లేచిపోయాడు అవినాష్. లైటు వేశాడు.
దీపాల వెలుగులో ఆమె వేపు చూశాడు.
అవినాష్ లో ఒక్కసారి భయం.
అయిపోయింది. గౌతమి చరిత్ర సమాప్తం.
అయిపోయింది.
అతి ప్రమాదకరమైన 'ఆంటీమనీ' గౌతమి దేహాన్ని పూర్తిగా ఆక్రమించుకోడానికి-
ఇంకో అయిదు నిమిషాలు పడుతుంది.
అప్పుడు గౌతమి శవమై పోతుంది.
అవినాష్ గబగబా ఫ్యాంటు షర్టు వేసుకున్నాడు.
తనదుస్తుల్ని సూట్ కేసులో సర్దుకున్నాడు.
బాత్ రూంలో ఉన్న తన టూత్ బ్రెష్ ని, టంగ్ క్లీనర్ని తీసుకున్నాడు. అన్నిటినీ సూట్ కేస్ లో సర్దాడు.
అప్పుడతని చూపులు-
స్టూలు మీదున్న ఫ్లాస్కుమీద పడ్డాయి.
ఆ ఫ్లాస్కుని, అక్కడున్న రెండు కప్పుల్లో గౌతమి తాగిన కాఫీ కప్పుని తీసుకుని ఆ కాటేజీలోంచి బయటికొచ్చాడు.
బయట చీకటిగా ఉంది. ఎక్కడో దూరంగా దీపాల వెలుతురు.
పది గజాల దూరం నడచి వచ్చాడతను. అక్కడ దట్టంగా ఉన్న పొదల్లోకి ఆ ఫ్లాస్కుని, ఆ కప్పుని విసిరేసి పరిగెత్తుకొంటూ మళ్ళీ వెనక్కొచ్చాడు.
గదిలో-
గౌతమి
నగ్నంగా నిద్రపోతూనే ఉంది.
టేబిల్ మీదున్న సూట్ కేసుని తీసుకుని ఆ గదిలోంచి బయటకు రాబోతున్న అవినాష్-
ఒక్కసారి, చివరిసారి గౌతమి మొహం వేపు చూశాడు.
ఏదో జాలి అతని మనసులో కదలాడింది.
మంచం దగ్గరగా వెళ్ళి-
ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకొని "సారీ! గౌతమి... ఈ జన్మకు సారీ... ఇంకెప్పుడూ నాలాంటి వాళ్ళని ప్రేమించకు... నమ్మకు..." అని అనేసి-
