రుక్మిణి మెల్లగా నిట్టూర్చింది. ఈ మనీ ఎవరు కనిపెట్టారోగాని చాలా విచిత్రమయిన ఆకర్షణ. భూమి గురుత్వాకర్షణలో సూర్యునిచుట్టూ తిరుగుతుంటే- మనిషి మాత్రం మనీ ఆకర్షణలో దానిచుట్టూ తిరుగుతున్నాడు.
దాన్ని మనిషి చేరుకోవాలి.
అడ్డదారులు తొక్కినవాడికి అది అందుతుంది. నీతి, నిజాయితీ, శరీర కష్టం, ప్రతిఫలం అంటూ తిరిగే మనిషికి అది అందదు.
ఆర్ధిక సంబంధాల ప్రపంచం!
మనిషికి విలువలేదు. అతనిలో వున్న మనసు, అదిపోయే ఆలోచనలు ఆత్మ, దయ, కరుణ, స్పందన ఇవి ఈ ప్రపంచంలో విలువలేనివి.
ఎవరు రూపాయల పరుపులమీద నిద్రిస్తాడో వాడికే విలువ.
వాడికి మనసు లేకపోయినా ఆత్మ అతని కాఠిన్యపు పొరలక్రింద చచ్చి అతడో జడ పదార్ధంలా బ్రతుకుతున్నా, ఈ ప్రపంచంలో జరిగే ఏ కరుణ రసాత్మకమయిన చర్యకూ ప్రతిచర్యగా అతనిలో స్పందనలు లేకపోయినా....
అతన్ని ఈ ప్రపంచం కీర్తిస్తుంది.
కారణం అతనికి మనీ వుంది.
అసలు ఈ మనీ లేకుండా ప్రపంచం నడవదా!?
రుక్మిణికి విచిత్రమయిన ఆలోచన వచ్చింది. అలాంటి ప్రపంచం ఎలా నడవాలో మాత్రం ఆమెకు తోచలేదు. కానీ మనీ లేని సంబంధాలు మనుషుల్లో వుంటే బాగుంటుందని ఆమె మొదటిసారిగా అనుకుంది.
కాని అది అసాధ్యమని తెలుసుకుంది. ఈ భూగోళం మీద మనీ మనుషుల్ని మింగే అనకొందలా ఎదిగింది. అలా పెంచుకుంది కూడా మనిషే! చివరికి అది అతన్ని చుట్టుకుపోతుంది. ఆ బలమయిన పట్టునుండి అతడు బయటికి రాలేడు. ఇక అతని జన్మ అందులో అంతమవ్వాల్సిందే!
ఆమె మరింత బరువుగా నిట్టూర్చింది.
ఈ నాగరిక జనంకంటే అనాగరికులయిన ఆటవికులే కాస్త హాయిగా బ్రతుకుతున్నట్టున్నారు.
ఆ పూటకు దొరికింది తిని హాయిగా తమ గుడిసెల్లో బ్రతుకుతున్నారు. వారికుండే సమస్యలు వారికున్నా...అది ఆ రోజు తిండి గురించే...ఈ నాగరికుడిలో ఆస్థికి కరెన్సీ రూపమిచ్చి అది తరాలు కూర్చొని తిన్నా తరగని గుట్టల్ని వేయటం తప్ప!
ఒక తాత-
ఒక తండ్రి-
ఒక కొడుకు-
ఒక మనమడు-
ఏ తరం కూర్చుని తింటుంది? ఈ సంపాదించే మనిషి ఒక డాక్యుమెంట్ వ్రాస్తే బాగుండును.
ఒక తరం మాత్రమే కూర్చుని తినాలని....
ఒక తాత వేయి రూపాయలిస్తే, అది ఒక తండ్రి లక్షచేస్తే, ఒక కొడుకు కోటి చేస్తే, ఒక మనవడు కుంభకోణం చేసి వేలల్లో కోట్లు.....
ఒక మనిషి కోటి చేసిన ఆర్ధిక చరిత్ర వెనుక వందల జీవితాల విషాదం వుంటుందని ఈ మనుష్యుల ఎందుకనుకోరు?
ఏమిటో అంతా విచిత్రం!
తన భర్త మనీ అనే మనిషి రక్తాన్ని రుచిమరిగిన పులిలాంటి వాడయితే ఆ క్రూర సంస్కృతిని పావని బయటపెట్టింది.
మరి పావనికి ఈ మనీ 'మానియా' లేదా?!
ఆమె నిత్య జీవితంలో ఏ విలువలకోసం పాటుపడుతుందో! ఆమెకు తోడుగా వరుంటారో....
రుక్మిణి మనసు ఆలోచనల్లో సంఘర్షిస్తున్న సమయానికి__
ఆమెకు దూరంగా_
* * * *
సాజిత్ మెడికల్ చాంబర్!
పావని అతన్ని పెనవేసుకొని...
"చెప్పు సాజిత్! మొన్న నాకు జరిగినా మైమరపుకు కారణమేమిటి? అలాంటిది జరగటానికి అవకాశం వుంటుందా?" ప్రేమగా అతని బుగ్గల్ని సవరదీస్తూ అడిగింది.
"డియర్! అది చెప్పాలంటే నేను ఆ ఫైల్లో వున్న రెండో సమస్య నీ ముందుంచుతాను. దానికి నీవు నీ సమాధానం కంప్యూటర్ లో ఫీడ్ చేయాలి. అది నాకు నచ్చితే....నీకు జరిగిందేమిటో అలా ఎందుకు జరిగిందో చెప్పటానికి ప్రయత్నిస్తాను."
అనగానే పావని సాజిత్ వంక అనుమానంగా చూస్తూ-
అలాంటి మైమరపు నాకు మరోసారీ జరిగే అవకాశముందా?
"అంటే మరలా కావాలని కోరుకుంటున్నావన్నమాట. దగ్గరుంటే ఒకడే సాజిత్! దూరంగా వుంటే అసంఖ్యాకంగా ఈ సాజిత్ విడిపోయి అనుభూతుల్ని విస్పోటనం చేసి బ్రహ్మానందం ఇస్తున్నాడనికదా నీవు చెపుతుంది. అంటే ఇక్కడ ఈ లవ్ కూడా ఒక టెక్నికల్ ప్రాసెస్ కు గురవుతుందన్నమాట!
ఎవరో దూరంగా వుండి ఒక నెట్ వర్క్ మనమధ్య పరిచినట్టున్నారు. ఆ గ్రిడ్ లో ఒక 'రే' ఆఫ్ లవ్ ను నానుండి బ్రాడ్ కాస్టింగ్ చేసి నిన్నక్కడ రిసీవింగ్ సెంటరు చేసి నీలో అది మరింతగా విస్తరించేట్టు చేస్తున్నట్టున్నారు. లేకుంటే డియర్ యిక్కడ ఒక సాజిత్ చేతి స్పర్శ అక్కడ వేయి చేతుల స్పర్సగా ఎలా మారుతుంది? ఇదేదో విచిత్రంగానే వుంది.
పావనికి విషయం కొద్దికొద్దిగా అర్ధమవుతోంది.
కానీ సాజిత్ తనకు ఆ విషయం పూర్తిగా చెప్పటంలేదని మాత్రం గ్రహించింది.
ఏది ఎలా వున్నా తను ఓ హైటెక్ లవ్ కి గురయింది. బహుశా దాన్ని ప్రపంచంలో మొదటిసారిగా అనుభవిస్తుంది తనే అయివుంటుంది!! తన శరీరమంతా ఇంకా ఆ అనుభూతుల తీయటి రసాలతో నిండి.....అదోరకం హాయిగా వుంటోంది.
"సాజిత్!"
"అడుగు డియర్!"
"ఈ హైటెక్ లవ్ లో సాజిత్ నుండి బయలుదేరిన ఆ ప్రేమ తరంగాలు నా శరీరంలో మాత్రమే అనుభూతుల అణువులుగా మారి అనూహ్యమయిన రీతిలో విస్పోటనం జరుగుతున్నాయా, లేక ఇంకా ఈ హైటెక్ సిటీలో అనేకమంది గాళ్స్ శరీరాల్లోకి 'ట్రాన్స్ మీట్'అవుతున్నాయా?"
సాజిత్ అందుకు పెద్దగా నవ్వాడు.
"చూశావా డియర్...హైటెక్ లవ్ లో కూడా నీవు అతి సాదా స్త్రీగా ఆలోచించావు.
ఒక బ్రాడ్ కాస్టింగ్ కేంద్రం నుండి బయలుదేరిన శబ్ద తరంగాలు ఓకే ఒక్క రేడియోలో మాత్రమే పలుకుతాయా? కోట్లాది రేడియోలున్నా అవి ఒకేరకంగా వాటిలోంచి బయటకు వస్తాయి."
అతడలా అనగానే పావని ఒక్కసారిగా అతని బుగ్గల్ని పట్టుకుని సాగదీసి...
"యూనాటీ! మన మధ్య ప్రేమను చివరికలా తరంగాలుగా మార్చి, అందరిలోను పలికేట్టు చేస్తే....ఇంకా నిన్ను నేనెందుకు ప్రేమించాలి? నేను వెళ్ళిపోతాను" అంటూ కోపంగా లేచింది,
"ఆగు డియర్! ఇంత తొందరయితే ఎలా? ఇక్కడ హైటెక్ లవ్ ఓకే బ్రాడ్ కాస్టింగ్ సెంటర్ నుండి బయలుదేరి ఒకేఒక ట్రాన్సిస్టర్ లో పలుకుతుంది. ప్రస్తుతం ఆ టెక్నిక్ మన ఇద్దరిమధ్యే వుండి వుండాలి.
ఎంత హైటెక్ లవ్ అయినా దానికీ ఒక నీతి నిబద్ధతా వుంటుంది మేడమ్.
ప్రపంచం మారుతోంది కదా!
టీవీలో స్టేషన్ లో ఒక ఉపాధ్యాయుడు చెప్తుంటే కోట్లాది క్లాస్ రూమ్స్ లో ఒకేసారి కనపడి వినపడుతున్నట్టు ముందు ముందు ఈ ప్రేమానుభూతులు కూడా మైక్రో ప్రాసెస్ లో రిసీవింగ్ టెక్నాలజీని తమ శరీరంలో అమర్చుకున్న ఎవరికయినా కలుగవచ్చు. మనిషి కనపడకుండా స్పర్శించే అనుభూతులవి. నీవు ఎవరిని తలుచుకుంటే ఆ రూపమే అసంఖ్యాకంగా మారి తీయటి స్పర్శను వారి శరీరాలను అందజేయవచ్చు.
కానీ ఒక ప్రసార కేంద్రం మాత్రం ఒకచోట వుంటుంది.
పావనికి మరికాస్త అర్ధమయింది.
సరే.....ఈ అనుభూతుల ఆధునిక 'హైటెక్ ప్రాసెస్' మరింతగా తనకు ముందు ముందు అర్ధమవుతుంది. ఆమె అనుకుని....
"అయితే సాజిత్...దీన్ని అందుకుంటూ ఆనందిస్తున్న గాళ్ ని నేనేకదూ!"
"కావచ్చు!"
"కావచ్చు కాదు, ఖచ్చితంగా అవ్వాలి, లేకుంటే నేను నీతో పలుకను. నీ గదికి రాను."
"నీవు పలక్కపోయినా ఫర్వాలేదు. నీ వెక్కడున్నా నేను నీలో కొచ్చి తీయగా పలుకరిస్తాకదా? అందుకని డియర్__మైక్రోటేక్ లవ్ లో మారాం చేయడానికి వీలు లేదు.
ఇదుగో ఇటురా__ఈ కాస్ట్ లీ పేపర్ మీద కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ప్రింటయిన ఈ రెండో సమస్య కూడా పరకాయ ప్రవేశం చేసి వెంటనే నీ సమాధానం ఫీడ్ చేయి. ఆలస్యం చేస్తే అమృతం విషంగామారే సంగతి నాకు తెలీదు. కానీ అనుభూతులు దూరం అవుతాయి."
సాజిత్ ఆ ఫైలును ఆమె చేతికిచ్చాడు.
పావని అతని వంక ఫన్నీగా చూస్తూ, తిరిగి ఆసక్తిగా దాన్ని తెరిచింది. సాజిత్ చెప్పాడు.
"పావనీ....
ఇది మా రెండో ప్రాబ్లెమ్. దీని పేరు 'మధు గీతిక' ప్రాబ్లెమ్. అది తీయటి గీతం అనుకునేవు. కళ్యాణ్ రేఖ కంటే భిన్నమయింది. కానీ ఒకే గమ్యం వైపు పరిగెత్తాయి. తినబోతున్నావు కదా...రుచి చెప్పటం ఎందుకు...ప్రొసీడ్."
పావని మరింత ఆసక్తిగా ఆ సంఘటనలోకి తన తల దూర్చింది.
* * * *
అదో పెద్ద ఆసుపత్రి. ప్రభుత్వపరంగా ప్రజల కోసం వెలిసిన ఆసుపత్రి.
పేషెంట్స్ కూర్చోవడానికి వరుసగా బల్లలు వేయబడి వున్నాయి. జనం రద్దీ పెరుగుతోంది.
