Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 26


    రొమాన్స్ దట్టించిన ఇంగ్లీష్ ఫిలిం చూడాలని మంచి మంచి చీరలు కట్టి సింగారించుకొని అబ్బాయి వెంట అలా అలా విహరించాలనిపిస్తుంది. సిరాజ్ అనేమాట నిజం-అణిగి ఉండే ఆడవాళ్ళనే ఇంకా అణగదొక్కుతారు. ఆడవాళ్ళు తమను గురించి తాము ఆలోచించుకోంది పరులకేం పట్టింది? స్వేచ్చా సుమాలు పళ్ళెరంలో పెట్టి హాజరుపరుస్తారా? నేను అదే ఆలోచించాను. నా విషయం నేను చూచుకోవాలి ఏం! లోకంలోని అమ్మాయిలంతా ఈ మగాళ్ళ కోసమే జీవించాలా? వాళ్ళకోసమే చచ్చి పిడికెడు బూడిద కావాలా? నాకు సీతలు, సావిత్రులు, మరియమ్మలంటే అసహ్యం. వాళ్ళంతా మగాళ్ళకోసం చచ్చారు. మట్టిలో కలిసిపోయారు! ఆత్మ ఆత్మ అంటారు.....అదేమిటో నాకు ఇంతవరకూ అర్థం కాలేదు.
    జీవితం జీవితమే-దాన్ని బాష్పబిందువు చేసుకుంటావో నవాజ్ వలె నవ్వులగని చేసుకుంటావో.... నా కోరికల్లో నవాజు తీర్చనిదంటూలేదు. జీవితంలో మళ్ళీ ఆనంద తరంగాలు అందకపోవచ్చు కాని ఆనందాలు పరిహారం కోరవుగా! నవాజు ప్రేమ సూర్యకాంతివలె నమ్మకమైందనుకున్నాను. కాని అమాంతంగా కటిక చీకటి అయిపోయింది- కాళరాత్రి అయింది. నవాజు ప్రేమ, కేలండర్ లా మారిపోయింది.
    మా వాళ్లకు చాతనైతే నన్ను నమిలి మింగేవాళ్లు. నాకేంతెలుసు మగవాళ్లకు మరుపెక్కువని-అన్నీ ఇట్టే మారుస్తారని. నేను అమాయికను! ఆడపిల్లను!! నేనేమన్నా గడుగ్గాయనా? పదిమందిని పాడుచేశానా!
    ఛ! అసలు నా అదృష్టం బావుండలేదు. నా రాత వంకర. ఎంత మగాళ్లకు దూరంగా ఉందామనుకుంటానో అంతగా అవతరిస్తుంటారు. మా ఇంటిపక్కన లలిత ఉంది. ఆమె చేయనిదంటూ లేదు. చివరకు బొంబాయి వెళ్లింది. తల్లి అయింది. కూతురుతో దిగింది. విచిత్రం విన్నారా? తెచ్చిన కూతురును ఆమెకు చెల్లెలన్నారు. అలాంటిదండీ లలిత. ఆమె ఇవ్వాళ మొగునితో సంసారం చేస్తూంది. పాపం మొగుడు పిల్లిలాంటివాడు. ఎటు ఉరకమంటే అటు ఉరుకుతాడు.
    రాత్రింబగళ్లు మా అమ్మ ఒకటే శపించడం ఇహ ఎవడూ ఊయడానికి కూడా మా ఇంటికి రాడని. ఇంటివాళ్ల సాపెనలు పడలేక లలితను శరణు వేడాను. లలిత అన్న సురేందర్. అతడు నన్ను శరణు వేడాడు. బావుంది కాదూ! 'సజ్జూ! ఈ జనం మనసు ఊరికే బద్నాం చేస్తారు. ఈ మగాళ్ల మాయలు ఎవరూ గమనించరు' అంటుంది లలిత. నిజం. ఆమె అనేది అక్షరాలా నిజం.
    సురేందర్ ఒక వింతమనిషి. ఒక స్ఫోటకం మచ్చల అమ్మాయంటే  చచ్చేవాడు. అబ్బ! అది అందవికారి. ఇహ ఆమె టెక్కు విన్నారా? కన్నెత్తి చూచేదికాదు. సురేందర్ విరహం భరించలేకపోయాడు. యోగి అయినాడు, యోగి! అందమైన అమ్మాయి కనిపిస్తేచాలు తన ప్రేయసిని ఆమెలో చూచేవాడు. ఆ అమ్మాయి ప్రస్తావన రాగానే 'గాజర్ హల్వా' గుర్తుకు వచ్చేది. మరి ఆమెలో ఉన్న మాధుర్యం ఏమోగాని విరహవిషాన్ని కూడా అమృతంగా భావించేవాడు. అతని విరహాగ్నిలో నేను దగ్ధం కాసాగాను. అలా అని సురేందర్ అంటే నాకు సానుభూతి ఉందనుకునేరు. బొత్తిగా లేదు. అసలు విషయం ఏమంటే, మావాళ్ళమీద పంతం నెగ్గించుకోవాలని! నాకు పెళ్లికాకుండా చూచేవారున్నారే వారిమీద పగతీర్చుకోవాలని పంతం ఒకనాడు మా నాన్న నన్ను కొట్టడానికే వచ్చాడు. ఇహ ఆరోజు నిర్ణయించుకున్నాను ఆ ఇంట్లో ఉండరాదని. అమ్మాయిలూ పోకిర్లు అవుతారని ప్రేమికుల వెంట లేచిపోతారనీ అపవాదులు వేస్తుంది లోకం. ఆ ప్రేమికులు పాడుకాను-నాకేమీ తెలియదు. వట్టి అమాయకురాలిని. నేను ఇంటినుంచి బయటపడ్డానా! అప్పుడు నావెంట ఎవరున్నారు చెప్పండి. వంటరిదాన్నేగా! ఒక్కర్తినేగా బయటపడింది!
    ఆ రాత్రి ఏమిటో అంతా విచిత్రంగా జరిగిపోయింది. కలలో వలె లేచాను. సురేందర్ ఇంటికి చేరాను. అతడు నన్ను చూచాడు. నివ్వెరపోయాడు. నాలాంటి గర్విష్టి అందగత్తె అర్దరాత్రి శరణుకోరి తన ఇంటికి వస్తుందని అతడు కలనైనా అనుకొని ఉండడు. ఏంచేయను, తప్పేమైనా నాదా? మా నాన్నది.  సురేందర్ కారులో తమ ఊరికి తీసికెళ్ళాడు. వారం తర్వాత కలలోంచి మేల్కొన్నాను. నెలదాకా గదిదాటి బయటికి రాలేదు. ఆ తరవాత లోకంలో మిగిలిందేమి!
    తన ప్రియురాలి ముఖంలోలా నాముఖంలోనూ స్ఫోటకపు మచ్చలుండాలనుకున్నాడు సురేందర్. నేను తనకు వండిపెట్టాలనుకున్నాడు. గాజర్ హల్వాలో బాగా తీపి నింపాలనుకున్నాడు. ఉదయం ఊరు మేల్కొంటే మొగుళ్లు పెళ్ళాలను బాదడంతో ప్రారంభం అయ్యేది. సురేందర్ కన్నీటితో ఆ దృశ్యాలు చూచేవాడు. వింత జీవితాలు! ప్రేమించుకోవడం - ద్వేషించుకోవడం! ప్రేమ-ద్వేషం-ద్వేషం-ప్రేమ! సురేందర్ కు నేనంటే ప్రాణం. క్షణం విడిచి ఉండేవాడుకాదు. కాని నాకు మనశ్శాంతి ఏది? ప్రతి అలికిడికి ఉలికిపడేదాన్ని. సురేందర్ నన్ను వకీలు దగ్గరికి తీసికెళ్ళాడు. మా నాన్నకు వ్యతిరేకంగా కోర్టులో చెప్పాల్సిన సాక్ష్యాల్ను అతడు బట్టీపెట్టించాడు. బయటికి వెళ్లాలంటే భయం-నాన్న కనిపిస్తాడని! ఎవరో బలవంతంగా ఇంటికి లాక్కుపోతారని గుబులు! ఒకనాడు అహ్మద్ చెప్పాడు- నాన్న నామీద ఎలాంటి కేసూ పెట్టలేదని. వాళ్లకు నన్ను ఇంటికి తీసుకెళ్ళాలనీ లేదట. నాకు అగ్గిలో దూకినట్లనిపించింది. ఈ అవమానం సహించడం ఎలా? కిరసనాయిలు పోసుకుని నిప్పంటించుకోవాలనిపించింది. ఇటు ఆ స్ఫోటకపు మచ్చలది నా జీవితంలో హాలాహలం నింపింది. ఆ ముండ ఏదో మందు పెట్టింది. కాకుంటే ఎందుకు దానిమీద అలా పడిచస్తాడు? అలాంటి ముండలు ఏదైనా చేయగలరు. 'గాజర్ హల్వా వండిపెట్టిందట ఏమిటా గొప్ప? అదేం అమృతమా? రోజూ మిఠాయి దుకాణం నుంచి తెప్పించిపెడ్తా'నన్నానండీ అదీ తప్పు. అయ్యగారు అలిగారు. అంతే ఆ దారం తెగిపోయింది. ఆ బంధం విడిపోయింది. నేను మాత్రం వీడితో బతుకంతా పడిఉండడానికి కంకణం కట్టుకున్నానా? నేనే వాడి ముఖాన ఊద్దామనుకున్నాను. ఎందుకంటారా, చింపిరి చీరలకోసం వాడివెంట విరాగివి అయిందేమిరా అనుకోరూ లోకం. నా స్కూలు పిల్లలు కలిసినప్పుడు నవ్వేవాళ్లు నా బట్టలు చూచి ఎగతాళి చేసేవాళ్లు. ఒక స్నేహితురాలు ఇంటికే వచ్చేసింది. ఈ పిసినారిగాణ్ణి కట్టుకోవడానికేనా కలలు కన్నావు? అన్నది. ఇహ ప్రళయమే వచ్చేసింది.
    అబ్బ ఎంత పోకిరితనం పెరిగిపోయిందబ్బా! షీలానూ ఆమె మిండణ్ణి రైల్లో పట్టుకున్నారట! హవ్వ ఎంత అన్యాయం! ఎంత ధైర్యమండి ఈ ఆడపిల్లలకు! అబ్బో ఎంత సాహసం దానికి! కోర్టులో వాగ్మూలం ఇచ్చిందట! ఆ వకీళ్లు ఎన్ని ప్రశ్నలు వేసిఉంటారు? ఛ ఏమోనబ్బా నాకైతే వంటికి ముళ్లు వస్తున్నాయి. ఎలుకనయి కన్నంలో కాలం గడిపితే బావుండుననిపిస్తూంది. అలా కాకుంటే నాలాంటి శీలవంతులకు రక్షణలేదండీ. నా కళ్ళల్లో వెలుగు, ముఖంలోని వర్చస్సు, ఏం చేయమంటారు చెప్పండి. చూసినవాడల్లా గుటకలు మింగడమేనాయె.
    ఒట్టు నిజం చెబుతున్నాను షీలావలె లేచిపోవాలనే ఆలోచన నాకు క్షణంపాటు కూడా రాలేదు. నమ్మండి అంటే నాకు సతీ సావిత్రి కావాలనే కాంక్ష ఉందనుకునేరు! బొత్తిగా లేదు, మగవాని అదుపు ఆజ్ఞలో పడిఉండడం నాకు అసహ్యం. మగాడు సాధించిన విజయం ఏమిటి? పెళ్ళాం! పెళ్ళామేనండీ అది ఆడదాని నికృష్టరూపం అనిపిస్తుంది నాకు. మగానికి బానిసగా పడుండడమే ఆడదాని బ్రతుకా?
    ఆడదానికి స్వాతంత్ర్యం అక్కరలేదా? ఆమెకు స్వేచ్చ వద్దా? నా ఎదలో కదలాడే గుండెలేదా? నా గుండె లోతుల్లో ఉన్న ముత్యాలు వెలికితీయగల పురుషుణ్ణి వెదుక్కోవడం తప్పా? నేరమా! ఆ అన్వేషణలోనే ఇంతదూరం వచ్చాను. కాని ప్రతి స్త్రీ ఒక పురుషుని ఆశ్రయం వెదుక్కుంటుంది. ప్రతి పురుషుడు తన భార్యను తన సొత్తుగానే భావిస్తాడు. గర్విస్తాడు. ఇది తలచుకుంటే బాధ కలుగుతుంది.
    సురేష్ పాపం మంచి యువకుడు. అతని భార్య అతన్ని ఆటలాడిస్తుంది. వచ్చిన జీతం సాంతం లాక్కుంటుంది. తాగి వస్తే ఇంట్లోనుంచి గెంటేస్తుంది. మరో ఆడదాన్ని కన్నెత్తి చూస్తే పుట్టింటికి వెళ్లిపోతుంది. సురేశ్ ను సంతోషపెట్టడానికి ఎన్నెన్ని చేశానని! ఎందుకు చేశావు అంటారు. ఏంలేదు- ఆడదాని సాహచర్యం గొప్పది-అందుకు పెళ్ళాం అనే గుదిబండే అక్కరలేదని నిరూపించడానికి మేమిద్దరం స్వేచ్చగా ఎగిరే పక్షుల్లా ఎందుకుండలేం? అతణ్ణి నా ఇంటికి పిలిచేదాన్ని, తాగించేదాన్ని, రోజూ సినిమా చూపించేదాన్ని. మంచి హోటల్లో భోజనాలు చేసేవాళ్లం. రోజంతా రమ్మీ ఆడేవాళ్లం. ఒకనాడు అతడు ఓడిపోసాగాడు. రూపాయిలు అయిపోయాయి. గడియారం వంతు వచ్చింది. అదీ అయిపోయింది. ఉంగరం లాక్కోపోయాను. అతనికి చప్పున కోపం వచ్చింది. "ఈ ఉంగరం సీత గుర్తు. దీన్ని పణం పెట్టలేను. దీన్ని నీవు తాకకు" అన్నాడు.
    అమాంతంగా ఆ ఉంగరంలో నాకు పాము పడగ కనిపించింది. ఈ మగాళ్లు తమను గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆడదాని దగ్గరికి వస్తే పాత చింతకాయ పచ్చడే కావాలి. అదిలేకుంటే వాళ్ల కడుపు నిండదు.
    నా మనసు పరితపించింది. గడచిన కాలం గిర్రున తిరిగిరావాలనిపించింది, మళ్లీ నేను పుట్టాలి. అమ్మమ్మ కోప్పడాలి. కన్నీరు దిగమింగాలి. లోకాన్ని చూడకుండా కళ్లు మూసుకోవాలి. నా గుండెను తన గుండెలో దాచుకోగల పురుషుణ్ణి చేయిపట్టుకోవాలి. అలాంటివాడికోసం రెండో అంతస్తు నుంచి దూకగలను. జీవితాంతం పొయ్యి ముందు కూర్చుని కళ్లు పోగొట్టుకోగలను. అతనికి "గాజర్ హల్వా" వండిపెట్టగలను. అలాంటివానికి ఆత్మార్పణం చేసుకోగలను.
    తన పాతివ్రత్యం నిరూపించడానికి శకుంతల పన్నెండేళ్లు తపస్సు చేసింది. పునీత సీతకోసం భూదేవి తన హృదయ కవాటాలు తెరిచింది-సీతను తనలో తాచుకొని సీత పాతివ్రత్య ప్రకాశాన్ని సూర్యునిలా సర్వదా వెలిగించడానికి. నేనూ క్రమక్రమంగా భూమిలోకి కూరుకుపోతున్నాను. నా కనుల ఖజానాలు ఖాళీ అయినాయి. నా బుగ్గల్లోని గులాబీలు వాడిపోయాయి-ఏడీ ఆ రాకుమారుడు నన్ను వెదుక్కుంటూ రాడేమి? ఎవత్తో తొత్తుముండ పెళ్ళాం రూపం ధరించి అతన్ని చెరపెట్టలేదుకదా? నేను నా జీవిత హవన కుండంలో కోరికలు ఆహుతి చేశానని ఎవరికి తెలుసు? నేనూ వికసించని కుసుమంలా పవిత్ర హృదయం కలదాన్నే అని ఎవరు గ్రహిస్తారు? గమనిస్తారు?
    ఓ సావిత్రీ! ఓ సీతా! ఓ మరియమ్మా!  మీకు నా కథ వినిపించబోవడంలేదు.
    ఆడపిల్లలు "ఆవారాలు" ఎందుకు అవుతారో నాకు అర్థంకాదు. ఆడదాని కదలాడే ఎడదను కాపాడే కనుల ముకురం ఉండదా వీళ్ల దగ్గర?
    ఆ ఏమిటి నేను చెప్పింది......? ఆ ఏమిటి నేను చెపుతున్నది?

                                              * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS