దాదాపు ఆ కొండ కొమ్మని చేరుకున్నారు. అక్కడనుంచి చూస్తే -
పక్కనే అగాధంలాంటి లోయ!
కొండ చరియ కోటగోడలాగా నిట్ట నిలువుగా వుంది. ఆ కొండ దిగేటందుకు దారి ఏదీ కనబడటం లేదు.
"ఎలా?" అన్నాడు అంకుష్.
"అటు చూడు?" అన్నాడు సాహస్.
సాహస్ చూపించిన వైపుకి చూశాడు అంకుష్.
అక్కడ -
బ్రహ్మాండమైన చారిక లాంటిది కనబడుతోంది. నిరంతరం నీళ్ళు ప్రవహిస్తూ వుంటే చారిక కనబడుతుందే -
అచ్చం అలాంటిది!
అదే అన్నాడు అంకుష్.
నవ్వాడు సాహస్.
"అది నీటి చారిక కాదు"
"మరి ?"
"అది నీటి చారిక కాదు నిచ్చెన!"
"నిచ్చెనా?"
"నిచ్చెనే!"
దగ్గరగా వెళ్ళారు ఇద్దరూ.
సాహస్ చెప్పింది నిజమే! కొండ కొమ్ము మీదనుంచి కిందిదాకా ఒక లోహపు నిచ్చెన వుంది.
మొహం అదోలా పెట్టి ఆ నిచ్చెన వైపు చూశాడు అంకుష్.
"ఇది ఏ ఇక్ష్వాకుల కాలం నాటిదో! ఆ కర్ర వంతెనలా కొంపదీసి ఇది కూడా విరిగి పడితే!"
"ఏం చేస్తాం! వేరే దారేం లేదు!"
"ధైర్యే సాహసే లక్ష్మీ!" అన్నాడు అంకుష్.
అనుమానిస్తూనే మొదటి మెట్టు మీద కాలు పెట్టాడు సాహస్.
నిచ్చెన ధృడంగానే వుంది.
"కమ్!" అని అంకుష్ కి సైగ చేసి, దిగడం మొదలెట్టాడు సాహస్. అంకుష్ ఫాలో అయ్యాడు.
సగం మెట్లు దిగారు.
ఒకచోట చటుక్కున ఆగాడు అంకుష్.
"అరె! ఇదేమిటి?" అన్నాడు పరిశీలనగా చూస్తూ.
అంకుష్ తొంగిచూసి "కొత్త మెట్లు! థాంక్ గాడ్! ఇంక నిచ్చెన విరుగుతుందేమోనన్న భయం లేదు!" అన్నాడు తెరిపిగా.
అతని మాట పూర్తయ్యేలోగా -
సాహస్ కొత్త మెట్టుమీద అడుగుపెట్టడం, అది ఒక్కసారి భారంగా మూలిగి, విరగడం జరిగింది.
ఇద్దరూ పట్టు తప్పి జారారు.
ఒక్కొక్క మెట్టు పటపట విరిగి పడిపోతోంది.
ఫెయిలయిన రాకెట్లలాగా, వాళ్ళిద్దరూ అతి వేగంగా కిందికి జారిపడి పోతున్నారు.
వెంటనే సాహస్ కి అనిపించింది. ఈ అడ్వెంచరు ఇలా అర్దాంతరంగా, ట్రాజిక్ గా ముగిసిపోతుందా?
తనకి ఏమి జరిగినా, తను ఏమైపోయినా ఫర్వాలేదు!
కానీ - తను ఈ పిల్లాడిని కూడా వెంటబెట్టుకు వచ్చాడే! ఇతనికి పూర్తిగా పన్నెండేళ్ళు కూడా వుండవేమో పాపం!
"సారీ అంకుష్!" అన్నాడు సాహస్ బిగ్గరగా - కానీ ఆ మాటలు అంకుష్ కి వినబడతాయన్న నమ్మకం అతనికి లేదు.
కానీ, తక్షణం అంకుష్ సమాధానం వినబడింది.
"డోంట్ వర్రీ బాస్! ఇంకా మనం కిందపడలేదుగా! టైముంది"
"యూ! సన్ ఆఫ్ ఏ గన్!" అన్నాడు సాహస్ మెచ్చుకోలుగా.
వీడు పిల్లాడు కాదు - పిడుగు! అనుకుని, పెద్దగా నవ్వడం మొదలెట్టాడు సాహస్.
"నవ్వుతావేం?" అన్నాడు అంకుష్.
"నవ్వినా నాపచేనే పండుతుందిట! ఇప్పుడు మనం సీదాగా వెళ్ళి..." అని ఒక్క క్షణం ఆగి, "ఒక చేలో ఒక వరికుప్పలో పడుతున్నాం!" అన్నాడు సాహస్.
అంటూనే, అతను వరికుప్పలో పడ్డాడు. ఒక్క సెకెండు తేడాతో, అతని మీద వచ్చి పడ్డాడు అంకుష్.
వెంటనే -
"అయ్ బాబోయ్!" అని కేక వినబడింది.
దానికి ప్రతిధ్వనిలాగా -
"ఓర్నాయనోయ్!" అని ఇంకో కేక వినబడింది.
