Previous Page Next Page 
జోగబాల పేజి 26


    "అవును. నీవు రాత్రుళ్ళు రోజూ జోగినుల దగ్గరకు వెడుతున్నావనీ తెలుసు. డాక్టర్ ఆనందబాబు దగ్గరకెందుకు వెడుతున్నావో తెలుసు. అసలీ ఊరు యిందుకే వచ్చావనీ తెలుసు."


    విలాస్ నవ్వాడు. "వర్ష దగ్గరకు నువ్వెందుకు వెడుతున్నావో నాకూ తెలుసు."


    శ్రీహర్షకు సాధారణంగా కోపంరాదు. కానీ ఈ మాట వినేసరికి కోపమాపుకోలేక పోయాడు. "విలాస్ ప్రపంచంలో నీ కర్థంకాని విలువలు చాలా ఉన్నాయి. వర్షను గురించి ఇంకెప్పుడూ తేలికగా మాట్లాడకు" అన్నాడు.


    విలాస్ కూడా అతనివైపు ఆగ్రహంగా చూశాడు కాని తమాయించుకుని ఊరుకున్నాడు.


                                             6


    కోదండపాణి సాధారణంగా హరిజనవాడలో వెళ్ళాడు. అతనికి జోగినుల విషయంలో తలదూర్చడం ఇష్టం ఉండదు. కాని మోహన మాట కాదనలేక ఓ రాత్రి ఎనిమిది గంటలవేళ రాగిణి ఇంటికి వెళ్ళాడు.


    "రండి రండి ఇన్ స్పెక్టర్ గారూ? అమ్మాయి ఖాళీగానే ఉంది. లోపలికి వెళ్ళండి" అంది, గోవిందమ్మ సాదరంగా ఆహ్వానిస్తూ.


    కోదండపాణి ఆమెవంక ఓసారి నిర్లక్ష్యంగా చూసి లోపలకెళ్ళాడు.


    రాగిణి ఓ చిన్న అడ్డం యెడమా చేతిలో పెట్టుకుని హరికెన్ లాంతరు వెలుగులో కుడిచేత్తో తల దువ్వుకుంటోంది.


    అలికిడి విని వెనక్కి తిరిగి "ఇన్ స్పెక్టర్ గారా? రండి రండి" అంది ఓ నవ్వు విసిరి.


    ఆమెముఖంలోని ఆకర్షణ, శరీరంలోని ఒంపుసొంపుల సొగసులూ చూసి కోదండపాణి క్షణంపాటు అవాక్కయి పోయాడు. అంతలోనే "ఎవరు నువ్వు?" అనడిగాడు కఠిన స్వరంతో.


    "జోగిని"


    కానీ, నీ వాలకం చూస్తే అలా లేదు." అతను కఠినంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు.


    "అదేమిటండీ అలా అంటారు. అందరు జోగినులూ ఒకేలా ఉంటారా? రండీ" అంటూ దగ్గరకువచ్చి చెయ్యి పట్టుకొని మృదువుగా లాగింది.


    ఆమె ముఖంలోకి చూశాడు. కదిలే కళ్ళూ వాటిలోని వెలుగులు.


    ఇన్ స్పెక్టర్ బాబు కరిగిపోతున్నాడు. మహామహులైన మగవాళ్ళు మామూలు ఆడదాని దగ్గర వెన్న ముద్దలై పోయినట్టు.


    "అమ్మాయ్!" అని పిలిచింది తల్లి బయటనుంచి__


    "ఇప్పుడే వస్తాను" అని రాగిణి బైటకు వెళ్ళింది.


    "ఇన్ స్పెక్టరుగారి లాంటి గొప్పవారు మనింటికి వస్తే గౌరవించవద్దూ?" అని తల్లి అంటూ ఉండడం వినిపించింది.


    ఓ నిమిషం గడిచాక రాగిణి లోపలకు వచ్చింది. చిన్న గదిలోనే ప్రక్కన ఓ చెక్క బీరువా ఉంది. అవి తెరిచి అందులోంచి బ్రాందీ సీసా ఒకటి బైటకు తీసింది.


    "కూచోండి ఇన్ స్పెక్టర్ గారూ!" అంటూ ఓ ఇనుప కుర్చీని అతని ముందుకు జరిపింది. అలా చెయ్యడంలో ఆమె పైట ప్రక్కకి జారిపోయింది. ఆమె గమనించనట్లు అతనికి కుర్చీ వెయ్యడంలోనూ, దాని ముందు చిన్న టీపాయ్ అమర్చడంలోనూ నిమగ్నమై ఉంది. అలా చేస్తున్నప్పుడు కళ్ళు చెదరగొడుతున్న ఆమె ఉవ్వెత్తులు, జాకెట్ ని కాదని బయటపడుతున్న వాటి మెరుపులు...అతని కళ్ళలోకి ఎర్రజీర ప్రవేశిస్తోంది.


    "ఏమిటిదంతా? నేను వచ్చింది..." మీ రెందుకు వచ్చినా మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత నామీద ఉంది. కూచోండి." అతని చెయ్యి పట్టుకులాగి కుర్చీలో ఆశీనుడయ్యేలా చేసింది. తర్వాత బ్రాందీసీసా గాజుగ్లాసు టీపాయ్ మీద అమర్చింది. "ఉండండి" అంటూ మళ్ళీ బీరువా దగ్గరకు వెళ్ళి ఓ కవరు తీసుకొచ్చి "మీకు నా కానుక" అంటూ అతని జేబులో కుక్కింది. ఆ కవరులోంచి తొంగిచూసే నోట్లు అతని కళ్ళ పడకపోలేదు.


    బయట్నుంచి రాగిణి తల్లి గొంతు వినిపించింది. "అమ్మాయ్! ఇన్ స్పెక్టర్ గార్ని స్పెషల్ డ్యూటీకింద బాగా గౌరవించు. ఈ రాత్రంతా యింకెవర్నీ రానీకుండా నేను చూసుకుంటాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS