Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 26


    హుఁ... డబ్బు! ఒరే కిస్టుడూ! ఈ డబ్బు పాపిష్టిదిరా! డబ్బుందని తెలిస్తే కుక్కని కూడా గౌరవిస్తుందీ లోకం. నీ మనసు, నీ మంచితనం కనిపించవు. వాటిని నీ దగ్గరున్న డబ్బు మింగేస్తుంది. అంచేత వాళ్ళకి డబ్బొక్కటే కనిపించి దానికి దాసోహమంటారు! అది నీకిష్టమా? డబ్బు ఎర చూపించి వాళ్ళ ఆత్మీయతనూ అనురాగాన్నీ పొందుతావా?"

 

    "అయ్ డోంట్ మైండ్! వాళ్ళు నన్ను లైక్ చేయడమే నీకు ముఖ్యమన్నావు. ఏంచూసి యిష్టపడుతున్నారో నీకూనాకూ అనవసరం!"

 

    సత్యం లాజిక్కు పట్టుకున్నాడు-

 

    "ఆల్ రైట్---నువ్వొక బికారిగాడివైతే."

 

    "నెవ్వర్! నేను కోటీశ్వరుడి బిడ్డను."

 

    "బిడ్డవే గాని కోటీశ్వరుడివి కావు గదా!"

 

    "నాన్నా!"

 

    "ఇదంతా నా స్వార్జితం! నాకు ఇష్టంలేని పిల్లను చేసుకుంటే ఈ ఆస్థిలో చిల్లిగవ్వ దక్కనివ్వకుండా నిన్ను కేరాఫ్ రోడ్సు చేయగల పవర్ నాకుంది. ఏవంటావ్?" అడిగేడు సత్యం.

 

    వచ్చే కోపాన్ని దిగమింగుకొని అన్నాడు కృష్ణమూర్తి.

 

    "మనం సీరియస్ గా మాటాడుకుంటున్నట్టుంది!"

 

    "సరదాగా మాటాడుకున్నా ఫేక్టు ఫేక్టే!"

 

    "దట్ మీన్స్! పద్మని చేసుకుంటే నన్ను వీధుల పాలు చేస్తావ్? అంతేగా?"

 

    "అది తప్పు! నీ డబ్బుమీద ఆశపడి వాళ్ళు తమ పిల్లనిచ్చి పెళ్ళి చేయవచ్చు. మీ పెళ్లయేక నిన్ను వీధులపాలు చేస్తే ఆ పిల్ల బతుకు అధ్వాన్నమౌతుంది! ఆ ఉసురు నాకేల? స్ట్రెయిట్ సవ్-ఇప్పట్నుంచే-నా ఆస్థితో నీకేం సంబంధముండదు."

 

    ఆ మాటకి కృష్ణమూర్తి చాలా ఈజీగా నవ్వేసేడు. నవ్వేసన్నాడు-

 

    "ఓ.కే, నీ ఆస్థికోసం నేనెప్పుడూ ఆశపడలేదు."

 

    "అదీ మాట! ఆమాట గుర్తించుకుని వ్యవహరించు! కేవలం నీగుణం, నీ అందచందాలు, నీ చదువుతోనే ఆ పిల్ల పెద్దవాళ్ళను గెలుచుకుంటే ఆ పెళ్ళికి నన్ను పిలవకపోయినా వస్తాను. అక్షింతలు వేసి మనసారా దీవిస్తాను."

 

    "బెట్ కాస్తున్నావా?"

 

    "ఏవైనా అనుకో! నువ్వు ప్రేమించిన అమ్మాయితోనే నీ పెళ్ళి జరగాలనుకుంటే నువ్వీ పరీక్షలో నిలబడాలి!"

 

    "నిలబడతాను!"

 

    "ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కోటీశ్వరుడి బిడ్డవని వాళ్ళకి తెలీకూడదు"

 

    "తెలీనివ్వను!"

 

    "డబ్బు తప్పించి నీకున్న శీలసంపదతోనే ఆ పెద్దవాళ్ళని గెలుచుకోవాలి!"

 

    "గెలుచుకుంటాను!"

 

    "ఏం చూసుకుని నీకింత ధైర్యం?"

 

    "మనుషులు నువ్వనుకున్నంత దారుణంగా బతకడం లేదనే ధీమాతో! కేవలం డబ్బుతోనే పెళ్ళిళ్ళు ముడిపడి వుండవనే నమ్మకంతో!"

 

    "నీ ధీమా, నీ నమ్మకం నిజం చేయడానికి ఎన్నేళ్ళు కావాలి టైం?"

 

    "ఎన్నో ఏళ్ళు కూడానా? రోజులు చాలు!"

 

    "ఆవేశపడకు! ప్రేమలో పడ్డవాడికి ఆవేశం ఆరో ప్రాణమని నిరూపించేవు. రోజులుకాదు గానీ-నెలలయినా గడువు తీసుకో! డిసెంబరు 31వ తేదీతో ఈ సంవత్సరం పూర్తవుతుంది! ఆలోగా ఆపిల్ల పెద్దవాళ్ళ మనస్సు నీ శీల సంపదతో గెలుచుకోవాలి!"

 

    "ఓ.కే."

 

    "ఆ తేదీలోగా ఆ పెద్దవాళ్ళు నీ దార్లోకి రాకపోతే- ఈ పందెంలో నువ్వు ఓడిపోయినట్టే లెక్క!"

 

    "అగ్రీడ్!"

 

    "పందెంలో ఓడిపోతే నువ్వేం చేయాలో ఇప్పుడే అనుకుంటే మంచిదేమో?"

 

    "అది కూడా నువ్వే చెప్పు?"

 

    "అప్పుడు నీకు నా మాట ప్రకారం పెళ్ళి జరుగుతుంది. నే తెచ్చిన సంబంధం కాదనకూడదు ఓ.కే.?"

 

    కృష్ణమూర్తి క్షణంసేపు అలోచించి అన్నాడు-

 

    "అగ్రిడ్!" అని అక్కడ్నించి కృష్ణమూర్తి వెళ్ళిపోయేడు.

 

    సత్యం నిట్టూర్చేడు.

 

    ---లక్ష్మీపతి సంగతి ఈ పిల్లకాకికి తెలీదు గనక గట్టిగా ఛాలెంజ్ చేస్తున్నాడు. తెలిసుంటే వెనకా ముందూ ఆలోచించేవాడు. జేబులో వంద కాగితం కనిపించకపోతే ఆ మనిషెవడైనా సరే- పలకరించని పంతం లక్ష్మీపతి సొంతం.

 

    అల్లాంటి మనిషిని తన సుగుణాలతో దారికి తీసుకురావడం కృష్ణమూర్తికి సాధ్యమా?

 

    కొడుకు భవిష్యత్తు ఆలోచిస్తున్న సత్యానికి తన భార్య పిలుస్తున్నట్టు అనిపించింది. తలెత్తి గోడ వేపు చూసేడు.

 

    ఆమె నవ్వుతున్నట్టు కనిపించినా--- ఆ నవ్వులో ఎగతాళి కూడా కన్పించడంతో సత్యం నొచ్చుకున్నాడు.

 

    ఆమె ముందు నిలబడి గొణుక్కున్నాడు...

 

    "నీకే? నువ్వట్లాగే నవ్వుతావ్! కన్నబిడ్డ కళ్ళకు కసాయివాడిలా కనిపిస్తున్నా నేను. వాడి బతుకుమీద పందెం కాచి అల్లరిచేస్తున్న వెధవనై పోయేను. వాడు ఏ పెళ్ళిచేసుకుంటే నీకెందుకు? నా కెందుకు? వాడు క్షేమంగా వుండటమే కదా మనక్కావల్సింది! అదేమీ ఆలోచించకుండా నీ మనసుకి తట్టిందేదో నువ్వు అడిగేసేవ్! అట్లాగేనని నేను మాటిచ్చేసేను. అయినా--- చూసి చూసి--- ఈ ప్రపంచంలో ఎవరూ దొరకనట్టు---వీడు ఆ లక్ష్మీపతిగాడి కూతుర్నే ప్రేమించాలా? అనుకోకూడదుగానీ--ఈ పందెంలో అబ్బాయి ఓడిపోతే --- వాడికి ఎవర్నిచ్చి పెళ్ళిచేయను? వాడి మనసు నొక్కేసి - యిష్టంలేని పెళ్ళి చేస్తే వాడు సుఖపడగలడా? గోడెక్కి నవ్వితే చాలదు. ఈ పందెంలో వాడు గెలిచేటట్టుచూడు. అప్పుడు హాయిగా నవ్వుకోవచ్చు!"

 

    అప్పటికే కృష్ణమూర్తి సూటుకేసుతో వచ్చేడు. అతన్ని చూస్తూ అడిగేడు సత్యం---

 

    "ఎందాకా?"

 

    "బందరు! ఆ ఊళ్ళోనే వున్నారు పద్మ తల్లిదండ్రులు!"

 

    "మళ్ళీ ఎప్పుడు రాక?"

 

    "అది నా అదృష్టం బట్టి వుంటుంది. పందెంలో గెలిస్తే పద్మతో వస్తాను. ఓడిపోతే ఒంటరిగా వస్తాను."

 

    "ఏది జరిగినా డిసెంబరు 31లోగా జరగాలి. గాడ్ బ్లెస్ యూ?" అన్నాడు సత్యం.

 

    కృష్ణమూర్తి సత్యంగారింట్లోనుంచి బయట పడ్డాడు.

 

     పద్మ తల్లిదండ్రులు!"

 

    "మళ్ళీ ఎప్పుడు రాక?"

 

    "అది నా అదృష్టం బట్టి వుంటుంది. పందెంలో గెలిస్తే పద్మతో వస్తాను. ఓడిపోతే ఒంటరిగా వస్తాను."

 

    "ఏది జరిగినా డిసెంబరు 31లోగా జరగాలి. గాడ్ బ్లెస్ యూ?" అన్నాడు సత్యం.

 

    కృష్ణమూర్తి సత్యంగారింట్లోంచి బయట పడ్డాడు.


                                       17


    పద్మ బందరొచ్చిందేగానీ ఆమె మనసంతా హైద్రాబాద్ లోనే వుంది.

 

    కృష్ణమూర్తితో పరిచయం గాక ముందు పద్మకి హైద్రాబాదు మీద కొంచమో గొప్పో ఒళ్ళు మంటగానే వుండేది, చదువు పేరిట సొంత ఊరు వదిలి ఇంతదూరం రావడం ఒక కారణమైతే--- ఇక్కడ కర్ఫ్యూలు గందరగోళాల మధ్య పౌర జీవితం గొప్ప ఖంగారుగా వుండడం రెండో కారణమైంది.

 

    హైద్రాబాదుకి కర్ఫ్యూ నగరమని ముద్దుపేరు కూడా పెట్టుకుంది.

 

    సంక్రాంతి దసరా దీపావళీలకు సెలవులిచ్చినట్లే ఏడాదిలో కొన్ని రోజులు కర్ఫ్యూల సెలవులు దొరుకుతాయి. ఆ సెలవులుకూడా సీజను ప్రకారం వస్తాయి.

 

    రాబోవు కర్ఫ్యూ సెలవుల్లో యింటికి వస్తానని ఉత్తరాలు రాసే క్లాస్ మేట్స్ కూడా పద్మకి బాగా తెలుసు. అంచేత హైద్రాబాదు నగరానికి ప్రత్యేకించి ఒక కేలెండరుంటుంది. ఉన్నట్టుండి ఎందుకు చంపుకుంటున్నారో తెలీకుండానే నాలుగైదు కత్తిపోటు సంఘటనలు చోటు చేసుకోవడం--- దాంతో కర్ఫ్యూ పెట్టేయడం హైద్రాబాద్ వాతావరణానికి బాగా అలవాటు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS