"అవును... ఇన్ని రోజులు ఎవరన్నా చూస్తారేమోనన్న భయంతో నేను దొంగలా బతికాను.. నిన్నూ, నన్నమితంగా ప్రేమించే నిన్ను దొంగలా చేశాను... అవన్నీ జ్ఞాపకానికొస్తున్నాయి. నేనెక్కడకు రమ్మంటే అక్కడకు భయాల్నీ, బాధల్నీ బెంగల్నీ లెక్కచేయకుండా వచ్చిన నిన్ను, నీ ప్రేమను తలుచుకుంటుంటే... నీ లాంటి భార్య నాకు దొరకడం కన్నా మరే అదృష్టం నాకొద్దు... ఇక మననెవరూ ఏం చెయ్యలేరు... ఇంకో ఇరవై నాలుగ్గంటల్లో మనం... ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేకుండా కొత్త ప్రపంచంలో ఉంటాం. ఆ ప్రపంచం మనిద్దరిదే.. ఆ విషయం ఊహిస్తుంటేనే... నాకెంతో హాయిగా ఉందో తెల్సా..."
ఆ మాటలకు ఆమె మనసు పరవశంతో నిండిపోయింది.
అవినాష్ జుత్తు మీద, బుగ్గలమీద, పెదవులమీద చేతులమీద వత్తయిన జుత్తున్న గుండెల మీద ముద్దు పెట్టుకుంది.
ఇద్దరూ బెడ్ మీద పక్కపక్కనే కూర్చున్నారు.
తన గుండెలమీద పెదాలతో ముద్రలు వేస్తున్న ఆమె తలమీద ఫ్యాను గాలికి రెపరెపలాడుతున్న మెత్తని జుత్తుని వేళ్ళతో పక్కకు తీస్తూ-
రెండు భుజాలతో ఆమెను పొదివి పట్టుకుని, తలగడను సరిచేసి మంచమ్మీదకు చేర్చాడు అవినాష్.
"ఇప్పుడొద్దమ్మా..." సగం ఇష్టంగా, సగం అయిష్టంగా అంది గౌతమి.
అవినాష్ ఆ మాటను విన్పించుకోలేదు. అతని చేతులు తన పనిని తను చేసుకుని పోతున్నాయి.
"ఇలాగే నన్ను తినేస్తావా..." నవ్వుతూ, ఉద్రేకంతో వేడెక్కుతున్న అవినాష్ చేతుల్ని పట్టుకుంటూ అంది.
తెల్లటి ట్యూబులైటు పాలవెలుగు ప్రవాహం గదంతా నిండి ఉంది.
ఆ వెలుగులో గౌతమి పాలరాతి బొమ్మలా ఉంది.
ఆ పాలరాతి బొమ్మమీద నిండుగా ఒరగడానికి అవినాష్ సిద్ధమౌతున్న సమయంలో-
అవినాష్ చేతులు ఆమె నడుంమీంచి కొద్దిగాపైకి కదిలిన సమయంలో-
సరిగ్గా అదే క్షణంలో-
బయట తలుపు టకటక లాడింది.
ఎవరో తలుపు తడుతున్నారు.
ఎవరై ఉంటారు... ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. ఇద్దరి మనస్సులో సందేహం... పోలీసులా... పోలీసులేమో పోలీసులైతే... ఆ ఆలోచన రావడంతోనే అవినాష్ వంటికి చెమట్లు పట్టేశాయి.
కాకపోతే... ఈ సమయంలో... ఇక్కడ... ఎవరూ పరిచయస్తులు లేని ఊళ్ళో... ఏదో జరిగి ఉంటుంది... గబుక్కున మంచమ్మీంచి లేచి, లుంగీ సర్దుకున్నాడు అవినాష్.
గౌతమి పక్కనే ఉన్న దుప్పటిని ముసుగ్గా కప్పుకుని గోడ పక్కకు తిరిగిపోయింది. నెమ్మదిగా అడుగులేసుకుంటూ వచ్చి, ఎందుకైనా మంచిదని- ముందు జాగ్రత్త చర్యగా, ట్యూబ్ లైట్ స్విచ్ ఆపేసి-
తలుపు గెడ తీసాడు అవినాష్.
ఎదురుగా-
ఎవరో ముసలాయన.
వదులు ఫాంట్, లూజ్ షర్టు, ముక్కుమీంచి జారిపోతున్న గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు...
"ఎవరు మీరు...?" అవినాష్ నోటంట మాట వచ్చేటంతలోనే...
"హేయ్... నా రూంలో మీరు... హు.. ఆర్..యూ" ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ, చీకట్లో లోనున్న మంచంవేపు చూస్తూ అడిగాడా ముసలాయన.
ఆయన మాటలతో హట్ గుప్పుమంటూ విస్కీవాసన బయటికొస్తోంది. ఆ వాసనతో పాటు ఆ ముసలాయన అటూ ఇటూ చిన్నగా కదుల్తున్నాడు. అదంతా 'మందు' మహత్యం అని తెల్సిపోయింది అవినాష్ కి.
అవినాష్ లో అంతవరకూ చెలరేగిన భయం తగ్గిపోయింది.
"చూడండి మాస్టారూ... ఇప్పుడు మేముంటున్నది... మా కాటేజ్ లోనే- మీ కాటేజ్ పక్కనే ఎక్కడో ఉంటుంది- కాసేపు వెతికితే- అదే కనబడుతుంది - చూడండి-" అన్నాడు మర్యాదగా.
"ఆర్-యూ-ష్యూర్-" మందు నవ్వు నవ్వాడా ముసలాయన.
"అయితే - సారీ - సారీ- సారీ- మైడియర్ - యంగ్ ఫ్రెండ్- ఐ విల్ సెర్చ్ ఫర్ మై కాటేజ్ - ఐ కెన్ గెట్ - మై బాయ్ - ఐకెన్-" అంటూ తూలుతూ ముందుకి నడిచాడు.
అవినాష్ కాటేజ్ పక్కనే ఉన్న కాటేజ్ దగ్గరకెళ్ళి ఆ తలుపు వేపు నిశితంగా చూసి, జేబులోంచి 'కీ' తీసి తాళం తెరవడానికి ప్రయత్నం చేస్తూ-
"దిసీజ్ మై కాటేజ్ - దిసీజ్ మై కాటేజ్-" అంటూ అవినాష్ వేపు చూస్తూ అరిచాడు ఆ ముసలాయన.
"ఓ.కె- గుడ్ నైట్-" అవినాష్ కూడా అరుస్తూ చెప్పాడు.
తలుపువేసేసి లోనకొచ్చి లైటు వేశాడు అవినాష్.
పక్కకాటేజీలోంచి ఆ ముసలాయన అరుస్తున్న అరుపులు బాగా స్పష్టంగా విన్పిస్తున్నాయి.
గది నిండా వెల్తురు నిండింది.
గది గోడవేపు చూశాడు అవినాష్.
గోడ గడియారం సరిగ్గా పది గంటల్ని చూపిస్తోంది.
"ఎవరట" ముఖమ్మీద ముసుగుతీసి, దుప్పటిని వంటి చుట్టూ చీరగా కప్పుకుంటూ బాత్ రూంకి వెళ్ళడానికి లేస్తూ అడిగింది గౌతమి.
"ఎవరో పానకంలో ఓల్డ్ మేన్-" విసుక్కుంటూ అన్నాడు అవినాష్.
"జస్ట్ మినిట్ డియర్-" అంటూ బాత్ రూంలోకి నడిచిందామె.
లోన తలుపుకి గెడ పెట్టిన చప్పుడు స్పష్టంగా విన్పించింది.
ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాడు అవినాష్.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవినాష్ ముందుకి కదిలాడు. గబగబా తన జేబుల్లోంచి సూట్ కేసు 'కీ' తీసి సూట్ కేసుని చప్పుడుకాకుండా తీసి, బట్టల మడతల్లో ఉన్న 'అంటిమనీ' సీసాను పైకి తీసి మళ్ళీ సూట్ కేసు యధా ప్రకారం వేసేసాడు.
అప్పుడతని చూపులు-
బెడ్ పక్కనే ఉన్న స్టూలు మీద పడ్డాయి. స్టూలు మీద ఓ ఫ్లాస్కుంది. ఆ ఫ్లాస్కులో కాఫీ ఉంది. పధకం ప్రకారం తను కాటేజీకి వస్తున్నపుడు రెండు కాఫీల్ని పోయించుకుని వచ్చాడు అవినాష్.
