Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 25


    సిరాజుతో వెళ్ళినప్పుడు అహ్మద్ కనిపించేవాడు ఎవతో ఆంగ్లో ఇండియన్ తో - సినిమాలోనో - క్లబ్బులోనో - నేను అడిగేదాన్ని ఆత్మ లభించిందా అని. అతడు నిట్టూర్చి 'ఆత్మదాకానా సజీవ శరీరాలే దొరకడంలేదు' అనేవాడు. అహ్మద్ ఈ వాగుడుంది చూచారూ. నాకూ నచ్చదు. ఏమనుకుంటాడు మొనగాడు. నన్నూ లెక్కచేయడు. నేను సజీవ శరీరాన్ని కాను నాకు ఆత్మలేదా? కొందరు మొగాళ్ళు తాము మొనగాళ్ళమనుకుంటారు.
    సిరాజ్ కూడా అలాంటివాడే. మా దగ్గరికి వచ్చేవాడు. గంటలతరబడి కూర్చునేవాడు. భోజన భాజనాలూ జరిగేవి. కాని, నా ప్రాముఖ్యత గమనించేవాడు కాడు. నేను ఇంట్లో ఉన్నట్లే అనిపించేదికాదు. రాగానే పాపల దగ్గర కూర్చునేవాడు. ఆటలాడేవాడు. అరే నన్ను చూడడే! నా కన్నుల్లో ఆకర్షణ లేదా నా నవ్వు గారడి చేయదా నాకు వాడి ముఖం చూస్తే అసహ్యం కలిగింది. అంటే ఏమనుకుంటున్నారు? నేను వాణ్ణి లెక్కచేసేదాన్ననా! ఛ తప్పు అయినా మీకెలా చెప్పడం సాక్ష్యానికి సిరజును ఏడినుంచితేను, నేను ధిక్కరిస్తే పెళ్ళాం పిల్లల్ని తీసుకొని అమెరికా వెళ్ళిపోయాడు. కాదు లండన్ అనుకోండి. అతని పెళ్ళానికి నేనంటే భయం, మొగుణ్ణి ఏసుకొని ఎక్కడికో ఎగిరిపోయింది, ఛ ఈ ఆడ జాతి ఉంది చూచారు దీనికున్నంత స్వార్థం మరెవరికీ లేదేమో! మొత్తం జీవితపు కోరికలన్నీ ఒకే పురుషుడు చెల్లించాలంటారు. ఇహ మగాళ్లు మురిసిపోతారు, ఆత్మ లభించిందని వాళ్ళ సంబరం.
    ఆ ఏమిటీ చెబుతుంటివి? ఆఁ- జ్ఞాపకం వచ్చింది, షీలాముండ కథకదా! ఛీ ఛీ ఆడదానికి సిగ్గుండాలి, సిగ్గులేని పోరి. దొంగచాటుగా మహ్మద్ ను కలుసుకునేది, తల్లితో చెప్పేసింది, మహ్మద్ లేకుంటే తాను చచ్చిపోతానని ఎంత ధైర్యం ఆమాట విన్నామా, ఆడపిల్లలమంతా వణికిపోయాం. గొంతులు ఆరిపోయాయి అరచేతులు చెమటతో తడిసిపోయాయి.
    ఒకసారి నవ్వులాటకన్నాను పెళ్ళాడనని, మగాని మోచేతికింది నీళ్లు తాగడం నాకిష్టంలేదని, అంతే అన్నది నవ్వులాటకే. మా అమ్మ ఏడ్చి ఏడ్చి సుడిబడ్డది. అమ్మమ్మకు నా మాటలు విషంలా తోచాయి. మీకు చాతనైతే ప్రపంచంలో ఉన్న ముసలివాళ్ళందర్నీ పరీక్షించండి. నవ్వుమీద 'కంట్రోల్' ఉన్న ముసలిది మా అమ్మ మాత్రమే అని తేల్చుకుంటారు. ఇప్పుడు చచ్చిందట లేండి. నా చెల్లెళ్ళు ప్రతి తద్దినానికి ఆమె పేరుమీద బిర్యానీ తింటుంటారు.
    సిరాజు తన మిత్రుడు నవాజు రొమాన్సును గురించి వినిపిస్తున్నాడండి. మీరే చెప్పండి నవ్వు ఎలా ఆగుతుంది? సరిపోయింది. ఇహ ఇప్పుడు నవాజు కథ చెప్పాలిగావాఁలు. సరే వినండి. అతడు రసికుడు గొప్పవారి బిడ్డ. వలపుల పందేలు అతని హాబీ. కాని ఒకటి నిజం. అంత అందగాణ్ణి నేను చూడలేదు. అతడు సూదంటురాయంటే నమ్మండి. అమ్మాయిలు అతడంటే ప్రాణాలు అర్పించేవారు. అయితే అతనికో నియమం ఉంది. ఏడాదికి ఇద్దరితో మాత్రమే వలపులాడుతాడు అందును గురించి సిరాజు రుచికరంగా చెపుతాడు. ఒకదాని ముద్దతు అయిపోకముందే నవాజు మిత్రులు బయల్దేరతారట. బావుల్లో వలలు వేసి వెదకుతారట. అందరూ సంప్రదించి ఒక అమ్మాయిని నిర్ణయిస్తారట. ముందు మిత్రులు పరికిస్తారట. ఆ తరువాత నవాజు ప్రియురాలు అవుతుంది. ఆర్నెల్లు నవాజు కథలు వింటుంటే నాకు ఒకటే నవ్వు. వేయి రూపాయిల ఉంగరంతో అతని పారితోషికాలు ప్రారంభం అవుతాయని సిరాజు చెబుతాడు.
    వేయా! ఖర్మ ఇక్కడ వెండి ఉంగరమే గతిలేదు. నాన్న సంపాదన ఆడ, మగపిల్లల చదువులకే సరిపోయేది. మగపిల్లల్ని చదివించడం రూపాయిలు వడ్డీకి నడపడంలాంటిదని నాన్న అభిప్రాయం. తర్వాత వడ్డీ సహితంగా వసూలవుతాయి. సిరాజు మాటల్లో స్వారస్యం ఉంది! గంటలు విన్నా గుండె నిండదు. కాని అమ్మమ్మకు నా ఆనందం అంటే వైరం.
    "ఒసే! ఏమిటే సిరాజు నీకు తవ్వి తలకెత్తేది? మూతిలో మూతిపెట్టి ముచ్చట్లాడుతూ గంటలు కూర్చుంటావు?" చూశావా చేయని నేరానికి మోసిన శిక్ష!  
    షీలా కథ ప్రచారమయిన నాటినుంచి అమ్మ నన్ను దయ్యంలా చూచేది. ఇంతకూ చెపుతున్నది షీలా కథ! అబ్బ! దాని ధైర్యాన్ని మెచ్చుకోవాల. తండ్రి గదిలో పెట్టాశాట్ట. రెండో అంతస్తు నుండి దూకిందట. పారిపోయిందట. వలపువెంట ఏదో మనోబలం ఉంటుందని ఆనాడు నాకు అర్థం అయింది. కాకుంటే రెండో అంతస్తు నుంచే దూకిన మనిషి బతికి బయటపడడం ఏమిటి? అమాంతంగా షీలా స్కూల్లో హీరోయిన్ అయిపోయింది. ఆమెతో మాట్లాడిన విషయమూ, ఆటలాడిన విషయమూ, తిట్లుతిన్న విషయమూ అమ్మాయిలంతా బహు గర్వంతో చెప్పుకోసాగారు. ఈ ఆడపిల్లల మనస్తత్వమే విచిత్రం. పుట్టింటిని ఇట్టే మరిచిపోతారు. ముఖమెరుగని మగానివెంట బుర్రున లేచిపోతారు!
    ఎక్కడిదాకానో ఎందుకు మా కుటుంబంలోనే ఒకళ్ళను మించిన వాళ్ళొకళ్లున్నారు. మా కుటుంబం అంటారా-ఉన్నతం అయింది. ఖ్యాతి గలది. కుటుంబం పెద్దదే అనుకోండి-నాకేం ఒరగపెట్టిందని! కుటుంబంలోని లొసుగులు దాచుకుంటే దాగుతాయా? ఇంకా నేను ఓణీ వేసుకోవడమే ఎరుగను మా సదీఖా అక్క తన పసందు పెళ్లి చేసుకుంది. ఇహ షమీమా పిన్ని విషయం ఏంచెప్పను? స్వయంగా ఆమె తండ్రి ఉత్తరాలు పట్టేశాడు. ఇలాంటి కుటుంబమండీ మాది. ఇహ నేను చేసిన తప్పూ చెప్పొద్దూ-ఏంలేదండీ-సిరాజ్ తో సినిమాకెళ్ళాను. ఇహ చూడండి ఏదో ఆపద ముంచుకు వచ్చినట్లే విరుచుకుపడ్డారు.
    నేనేం తక్కువ తిన్నదాన్నా! సిరాజ్ కు పాపం నేనంటే వణుకు. నా సాహసానికి అదిరిపోయేవాడు. నేను అతనివెంట సినిమాలు చూచాను, హోటళ్ళకు వెళ్ళాను, గంటల తరబడి అతనిగదిలో కూర్చున్నాను. ఇదంతా ఎందుకు చేశానంటారు? అతడంటే నాకు భయంలేదని నిరూపించడానికే! అంతేకాదు నాకు ఏ యువకుడన్నా భయంలేదు. అది సిరాజ్ కు తలవంపులయింది. అలిగాడు "సజ్జూ నేనంటే భయంలేదా?" అన్నాడు. తరవాత నా నవ్వులో గర్వంలేదు. ఎగిరిపోయింది. నా కన్నుల కాంతి కరిగిపోతుంది. చూచాడు. నివ్వెరపోయాడు. కన్నీరు నింపుకున్నాడు. నన్ను దీనురాలిని చూచినట్లు చూచాడు. నిజం చెప్పాలంటే నేను అతని కన్నీటిలో కొట్టుకుపోయాను.
    నేనెందుకని పనికొస్తాను? నాతో జరిగే పనేమిటి? ఇంటికీ కాలేజీకి తిరగడం- అంతే నాపని. సిరాజ్ కు విజయగర్వం రాకూడదనుకున్నాను, నేను మరచాను. అతడు మరవందే! జీవితాంతపు బంధం ఏర్పరచుకుందామనుకున్నాడు. ఎక్కణ్ణించో ఒక ఉంగరం కొనితెచ్చాడు. ఆ ఉంగరంలో ఇరుక్కొని నా జీవితాంతపు స్వేచ్చను పోగొట్టుకుంటాననుకున్నాడు. తన గెలుపును చూచుకొని పొంగిపోదామనుకున్నాడు. సిరాజ్ అంటే నాకు అసహ్యత ఏర్పడింది.
    షీలా ఆ మహ్మద్ అంటే ఎలా పడి చచ్చిందబ్బా! బతుకంతా వాడితోనే ఉండడానికి ఒప్పుకుంది-వరించింది. ఏమోనబ్బా ఈ ఆడపిల్లల్ని గురించి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళనంటే ఏంలాభం? ఈ మగాళ్లున్నారే వాళ్ళది అసలు తప్పు. ఈ మగాళ్ల దగ్గర ఏదో గారడి ఉంది. అందాకా ఎందుకూ నవాజ్ సంగతి చూడరాదూ! ఒకనాడు నన్ను సిరాజ్ గదిలో చూచాడు. ఇహ నా విషయం నేను అతన్ని చూస్తూనే ఉండిపోయా, అప్పుడు నాకు అర్థం అయింది అతని నవ్వులో ఆకర్షణ ఉందని. అమ్మాయిలు అతను తెచ్చే ఉంగరాలక్కాదు. అతని చిరునవ్వుకు కట్టుబడిపోతారని. నా కళ్ళలో ఎలాంటి కాంతి ఉందో.....? నా బుగ్గల్లో ఎలాంటి గులాబీల పరిమళం ఉందో....? ఏమో..... ఏమో..... నాకేమీ గుర్తులేదు. నవాజ్ నాకు నగలు తెచ్చాడు. విలువైన చీరలు తెచ్చాడు. అవన్నీ ఎప్పుడు గుర్తుకువచ్చాయంటారు నాకు? సురేందర్ ఇంట్లోంచి నూలు చీర కట్టుకొని బయటపడి, రాత్రి సాంతం రోడ్డుమీద చలికి వణికున్నాడు! అప్పుడలా ఎందుకు చేశానంటారు? మా ఇంటివాళ్లను ఏడిపించడానికి, ఎందుకూ వాళ్లు నేనంటే నిప్పులు పోసుకుంటారు? నామీద వారికి నమ్మకం ఎందుకుండకూడదు?
    ఆ సాయంత్రం కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చానండీ. ఇహ మా అమ్మమ్మ వంటికాలిమీద లేచింది. మా అమ్మ తలబాదుకుంటుంది. ఒక్కొక్కప్పుడు నాకేమనిపించేదంటే మా అమ్మకు ఒక పోకిరి కూతురు ఉండాల్సిందని నవాజ్ అనేది నిజం అనిపిస్తుంది- లోకం మనకు ఎన్నడూ అనుకూలం కాదు- అలాంటప్పుడు స్వేచ్చగా తిరిగి చూద్దాం. 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS