Previous Page Next Page 
మైదానం పేజి 26


    "అమీర్ని వొదిలెయ్యనా, వెళ్ళిపోదామా యిద్దరమూ!" అన్నాను. నిజంగానే అన్నాను. ఆ మాటలు ఇప్పుడు తలుచుకుంటే, నా మాటలు అబద్ధం అని ఏడుస్తాను.
    దాంతో నా బాబు మనసు కరిగిపోయింది.
    స్త్రీ త్యాగానికి ఆయత్తపడితే ధీరుడైన పురుషుడు ఆ త్యాగ లాభాన్ని స్వీకరించగలడా? ఆ మాట చాలు. తనకోసం త్యాగంచేసే స్త్రీ వుండడం పురుషుడికి అమితమైన ఆత్మవిశ్వాసాన్నియ్యాలి. కాని త్యాగాలు గ్రహించడానికి అలవాటు పడ్డ పురుషుడు అతినీచుడు. పతివ్రతల త్యాగాల వల్ల నియమాలు నిలబెట్టుకునే గతి మీ పురాణ ధీరులకే గానీ అమీర్ కీ, మీరాకీ కాదు.
    "నేనే వస్తాను దీదీ. రేపణ్ణించి."
    "నిజంగా వస్తావా? నా పిచ్చి బాబూ. వూరికే భయపడ్డావు అవునా?"
    ఇద్దరమూ యింటివైపు చూశాము.
    "కాని దీదీ, ఇదివరకు మల్లేనే నీ పక్కన కూచుంటా. నీ భుజం మీద చెయ్యి వేస్తా" అన్నాడు మీరా.
    "ఆ, తప్పకుండా. ఎందుకు అడుగుతావు?"
    "మరి....అమీర్ని....చూస్తున్నా...."
    "ఆ, దానికేం?" అంటున్నాను గాని నా గొంతులో అబద్ధం వినిపించలేదా నీకు. మీరా? నా బింకం కొద్దీ అనుకున్నాను. కాని నా గుండె నీరైపోతుంది. ఏం జరుగుతుందో? కాని ఫరవాలేదు. అనుకుంటూ పక్కకి చూశాను. మీరా లేడు. ఇంటికి వెళ్ళాను.
    మర్నాడు మీరా వొచ్చేటప్పటికి అమీర్ నా తల చిక్కు తీస్తున్నాడు. మీరా తరహా మార్చాడు. రావడమే అదేదో అసహజమైన సాహసంతో, వుత్సాహంతో వచ్చి నా కెదురుగా కూచుని నిర్లక్ష్యమైన కంఠంతో- "నేనిచ్చిన దువ్వెన యేది దీదీ!" అన్నాడు. పాపం పూర్వం వలె మాట్లాడటానికి ప్రయత్నమది.
    "ఇంకెందుకు? అమీర్ వొచ్చాడుగా చిక్కు తియ్యడానికి. చిక్కు తీసుకుని మాత్రం ఏం ప్రయోజనం?" అన్నాను. అమీర్ వంక చిరునవ్వుతో చూసి మళ్ళీ మీరావంక చూసి నవ్వాను. ఆ పని యెట్లా వుందనుకున్నావు? రెండు మహాసముద్రాల మధ్య సన్నని తాడుమీద నడుస్తున్నట్టుంది. ఏ మాట మాట్లాడితే, ఏం మాట్లాడకుండా వూరుకుంటే, ఏ చూపు చూస్తే ఎవరికి కోపం తెప్పిస్తానో! ఏమర్థంచేసుకుంటారో? అబ్బా ఆ రోజుల యమబాధ! ప్రేమ యింత ప్రాణం తీస్తుందని అనుకోలేదు. కత్తిమీద సాములే కద!
    అమీర్ గంభీరంగా నా జుట్టువంక చూస్తూ వూరుకున్నాడు. మీరా ఇవీ అవీ గబగబా మాట్లాడుతున్నాడు. వూళ్ళో అమీర్ రావడాన్ని గురించి అనుకుంటున్నవీ, ఆ స్టేషనులో మెయిలురైలు ఆపాలని అర్జీ పెట్టడం అన్నీ చెప్పాడు.
    అమీర్ వొదలగానే వెళ్ళి మీరా పక్కన కూచున్నాను. అమీర్ కత్తిని పదును పెడుతూ, ఆ పనిలో నిమగ్నుడై వున్నాడు. మీరా యింక దగ్గిరికి జరుగుతాడేమోనని నాకు భయంగానే వుంది ప్రతి నిమిషం. కాని అమీర్ భయంకరమైన కళ్ళు ముందు పెట్టుకుని మీరా సాహసించలేదు. నేనింక ఆ నిశ్శబ్దం భరించలేక లేచి "స్నానానికి వెడదాం" అన్నాను. ఎవరూ లేవలేదు. "మీరా, నువ్వు రా."
    మీరా చప్పున నుంచుని అమీర్ మొహంవంక చూస్తున్నాడు.
    "అమీర్ నువ్వు కదలవేం?"
    కొంచెం మాట్లాడకుండా వూరుకొని,
    "వొస్తా పదండి" అన్నాడు కత్తిమీద ధ్యాస వుంచుకుని.
    ఇంకేం మాట్లాడ్డానికీ తోచక మేమిద్దరం బైటికి నడిచాము. ఎంత దూరం పోయినా అమీర్ జాడలేదు. ఎత్తుగా పెరిగిన తంగేడుచెట్టు కింద ఆగి యెండలో మాడుతున్న గుడిశవంక చూస్తూ మాట్లాడకుండా నుంచున్నాము. చప్పున మీరా "లాభంలేదు దీదీ" అని వూరుకున్నాడు. నేనూ మాట్లాడలేదు. "అమీరక్కడ వుండగా నీతో చనువుగా వుండలేను. నా చేతకాదు" అన్నాడు, నేనేమనను?
    "పోనీ తాక్కపోతేనేం మీరా. చనువుగా వుండకపోతేనేం?"
    మీరా కొంచెంసేపు ఆలోచించాడు.
    "అవును. తాక్కపోతేనేం? నీకేం?" అని నెమ్మదిగా అన్నాడు.
    ఆ "నీకేం!" అన్న మాటలు అతని కంఠంలో నిరాశ శూలాల వలె నాటుకున్నాయి.
    "అన్యాయం మీరా. నువ్వు నన్నలా అనడం ఇంకా తెలుసుకోలేకపోయినావు కద. నా మనసెటువంటిదో! మనకున్నటువంటి ప్రేమకి తాకడం అవసరమా?"
    మళ్ళీ ఆలోచించాడు. పాపం, ఆ చిన్నవయసులో యీ సమస్యలు అర్థంగాని యీ బాధలు యివన్నీ ఆలోచించి, చెప్పుకోవలసిన గతి పట్టింది మీరాకి. చక్కని కనుబొమ్మల్ని ముడిచి కళ్ళు మూసి, ఆలోచిస్తూ నుంచున్న నా మీరాని చూస్తే నా గుండె నీరైపోతుంది.
    "అవసరమని కాదు. అది అభ్యంతరం కావడమే మనకున్న ప్రేమ బంధాన్ని కాలుస్తోంది"
    "అమ్మా! మీరా! ఎంత ఆలోచన వుందోయ్! అతని మాటల్లోని సత్యం నన్ను గాయపరిచి సిగ్గులో ముంచింది. ఇంక జవాబు చెప్పలేక యింటివేపు మళ్ళాను. మీరా వెనకనే వొచ్చాడు. అమీర్ కత్తి నూరుతూనే వున్నాడు. కూచున్నాను. మళ్ళీ నిశ్శబ్దం. మొదట భరించలేక అన్నం తిందాం అన్నాను. తనని పొమ్మన్నా నన్నట్టు మీరా లేచాడు.
    నా తప్పు సవరించుకోవడానికి "మీరా, నువ్వు రా అన్నానికి" అన్నా.
    అన్నానో లేదో, నా అవివేకం మనసుకి తట్టింది. ఒకటే మూకుడు, దాంట్లో నేనూ, అమీర్ తిన్నాము. తరువాత రోజుల్లో దాంట్లోనే నేనూ, మీరా తిన్నాము. ఇప్పుడు మళ్ళీ నేనూ అమీర్ తింటున్నాము. ఆ మూకుడు కన్న ఇంకేమీ లేదు యింట్లో. ఇవ్వాళేం చెయ్యను? వెర్రిగా నుంచున్నాను. ఇద్దరూ నాకేసి చూస్తున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS