Previous Page Next Page 
మైదానం పేజి 25


    నేను ముందే చెప్పలా. యిట్లా జరుగుతుందని? అతనడగడం, దానికి నువ్వు భయపడడం, నాతో మాట్లాడానికి వీలులేకపోవడం."
    "అతని దగ్గిర రహస్యం యెందుకు? వృధాగా అనుమానం కలిగించి ఏం లాభం?"
    "అనుమాన మేమిటి? మీరాతో వెళ్ళానను. ఏం?"
    "కాని రహస్యంగా అతను వినకుండా. అతను చూడకుండా మనకేముంది? చెప్పు."
    "ఏం లేకపోతే మాత్రం? ఏం లేదు కనకనే మనం వొంటరిగా వుంటేనేం?"
    "ఎందుకు వుండడం?"
    "మరి నాతో మాట్లాడవా?"
    "మాట్లాడనన్నానా? అక్కడికే రా."
    "పోనీ. యిట్లా నాతో మాత్రం తిరగకూడదా?"
    "అతను కూడా వుంటేనేం?"
    "వుండక పోతేనేం?"
    నేను మాట్లాడలేదు. ఆ సమస్య నా కర్థం కావటం లేదు. అమీర్ని చూస్తే భయం వేస్తోందనే సంగతి వొప్పుకోడం యిష్టంలేదు.
    "నీ కిష్టం లేదనరాదూ."
    "మీరా?"
    "పోనీ అతని కిష్టంలేదు. నీకు భయమను."
    ఆలోచించాను.
    "మీరా! నీతో యెట్లా మాట్లాడాలో నాకు తెలీటంలేదు. ఏదో తప్పు పనిచేసిన వాడిమల్లే దొంగతనంగా దాక్కున్నావెందుకు?- ఎందుకు ఇంటికి రావూ! రా. మాట్టాడు. ఆడుకో స్వేచ్చగా వుండు. మా యిద్దరితో సఖ్యంగా వర్తించు. అందులో అమీర్ నీకు కొత్తవాడా? నాకన్న ముందు అతనే కదా నీకు స్నేహం, కొత్తవాడా?"
    "అప్పుడు నీతోనూ షికార్లు వొస్తా, అతనితో వస్తా....కాని మధ్య దోవలో పిలుస్తావేం, అక్కడికి వచ్చి పిలవరాదూ? ఇప్పుడతను లేనిపోని అనుమానాలు పడతాడంటే అన్యాయమా?"
    "అతనెవరు అనుమానాలు పడడానికి?"
    "నువ్వు సహిస్తావు."
    నేను మాట్లాడలేదు. "నువ్వక్కడికి ఎందుకు రావు చెప్పు" అన్నాను.
    "నాకు బావుండదు. అతనికి బావుండదు. మనిద్దరమే వున్నట్టుండదు."
    "అది కొత్త. అంతే. నువ్వు నాలుగుసార్లు వొస్తే అదే అలవాటవుతుంది." అతను మాట్లాడలేదు. నా మాటలు అబద్ధాలని నా అంతరాత్మ అంటూనే వుంది. ఇద్దరిలో యెవరిని వొదలడానికి చేతగాక ఎవర్నీ వొదలకూడదనే పేరాసతో, ఆ యిద్దర్నీ ప్రయత్నించి ఒకచోట చేర్చటం అనర్థక మంటూనే వుంది అంతరాత్మ. కాని నా శక్తిలో వుండే నా అహంభావం నన్ను ప్రోత్సాహపరిచింది.
    కాని అహంభావమేనా? స్వార్థమేనా? కాదేమో! అమీర్ మీద ప్రేమ. నేను లేకపోతే అమీర్ యామౌతాడో అని అతనిమీద జాలి. నేను లేకపోతే మీరా బతకలేడే అని అతనిమీద జాలి. నా హృదయంలో వుండే మార్దవం. కాదా నన్నీ గతికి తీసుకొచ్చింది. నాకన్న కఠినాత్మురాలు. తన సౌఖ్యమే చూసుకునే దుర్మార్గురాలు తనకు నచ్చినవాణ్ణి దరిచేర్చి రెండోవాణ్ణి కఠినంగా వొదిలేసేది, సౌఖ్యంగానే. బతుకునుగద! వాళ్ళిద్దరిలో కూడా ఒకరన్నా సౌఖ్యపడేవారు, రెండోవారు మరచిపోయి బతికేవారు. ఈ గతి రాదుకద?
    "తప్పదు. నువ్వు కావాలి. అమీర్ని నీతో స్నేహంగా ఉంచడం నా భారం. ముగ్గురుమూ యెంతో ఆనందంగా వుందామని ఎంతో అనుకుంటే, చివరికి యిట్లా అయిపోయింది. అమీర్ తగాదా పెడతాడేమోనని భయపడ్డానుగాని నువ్విట్లా అవుతా వనుకోలేదు" అని కోపంగా అన్నాను. నా పెదిమలు వొణకడం అతన్ని లొంగదీసింది. అతని భయాన్ని అణగదొక్కి సహజ వివేకాన్ని, అతన్ని కాపాడే 'ఇస్టింక్టుని' నాశనం చేసింది. పాపం ఏమీ తోచక కళ్ళంబడి నీళ్ళు పెట్టుకుంటూ నుంచున్నాడు. అమీర్ని నమ్మవద్దనీ, నా మాటలు అబద్ధమనీ అతని అంతరాత్మ అంటూనే వుంది. కాబోలు, దుష్టురాల్ని నేను, నా సౌఖ్యంకోసం అతన్ని బలవంతంగా లోబరుచుకున్నాను. నా మీరా?
    పడమటి మెరుపు అతని మొహాన్ని వెలిగించింది. అప్పుడే ప్రారంభించిన గాలి అతని ముంగురుల్ని చీకట్లో వూయించింది.
    "వెడతావా?" అన్నాడు.
    "నువ్వో?"
    "నేనింతే?"
    ఆ యెడారిలో, చీకట్లో కీచుమనే శబ్దాలలో ఈ వొంటరిగా, నిస్సహాయంగా, బంధువులందర్నీ విడిచి, నాకై పడివున్న చిన్న నా బాబును చూసి, నా మనసు కరిగిపోయింది! దగ్గిరిగా కావలించుకున్నాను.
    "మీరా! మీరా! ఏదో విపరీతమైన బాధతో నువ్వు మాడిపోతున్నావు. నా దగ్గిరికి రావు. నన్ను ఓదార్చనియ్యవు. ఏం చెయ్యనోయి నీ కోసం."
    వెక్కి వెక్కి యేడ్చాడు నా మీరా! అమీర్ని వొదిలేసి యితనితో వెళ్ళిపోనా అనిపించింది పాపం! ఈ లేత హృదయం, ఈ అమాయకత్వం, నామీది విశ్వాసం, నా మీద ఆధారపడడం, ప్రాణమన్నా నా కోసం యివ్వడానికి సిద్ధం. ఎట్లా ఓదార్చను అతన్ని?
    "నీ కోసం ఏం చెయ్యను? మీరా! నువ్వు లేక నేనెట్లా బ్రతకను? ఎట్లా, నేనేం చెయ్యను?" అని యేడ్చాను. నా కన్నీళ్లు అతని నిశ్చయాన్ని కరిగిస్తున్నాయి. నే నబద్ధం ఆడ్డంలేదు. మీరాని చూస్తే అట్టానే వుంది. నాకు "నాకు తెలుసునా ఏం చెయ్యాలో? అంథకారంలో సముద్రం మధ్యలో వున్నవాడికి తీరమెటు వుంటుందో యెం తెలుసో, నాకంత తెలుసు కర్తవ్యం. మనమేం చెయ్యాలో తెలిసి, చెయ్యకపోతే శిక్షించవచ్చు దేవుడు. కాని యింత అజ్ఞానం, అంధకారంలో వుంటాము కద! ఎంత యోచించినా తెలీదు కద! అంతా ఐ, నాశనం చుట్టూ అల్లుకున్న తర్వాత, ఇల్లుకూలి నెత్తిమీద పడ్డతరవాత కాంతి వొస్తుంది. దోవ కనపడుతుంది. ఏం లాభం? కాని నావంటిదానికి అప్పటికీ, యెప్పటికీ తెలీదు దోవ. అసలు నువ్వందుకా సమస్యలో ప్రవేశించావు? అంటారు పతివ్రతలు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS