Previous Page Next Page 
మైదానం పేజి 27


    "రండి ముగ్గురమూ తిందాం" అన్నాను. అమీర్ కదలడు. మీరా కదలడు. ఎంతసేపు నుంచున్నామో? నా కళ్ళు తిరుగుతున్నాయి. నా తల్లో ఒక్క ఆలోచనా లేదు. చప్పున నా స్త్రీత్వాన్ని వుపయోగించి నవ్వు చిమ్ముతూ- "మీరు యిద్దరూ పిల్లలంటూ నేను కలిపి పెడతాను, ఏం?" అని వాళ్ళ వంకన్నా చూడక వెళ్ళి అన్నమూ దోసకాయ పచ్చడీ కలిపి తీసుకొచ్చాను.
    "ముందు ముద్దనాది. తరువాత అమీర్."
    "నేను తర్వాత తింటానులే" అని, కళ్ళన్నా ఎత్తక, విసిరాడు మాటల్ని అమీర్. అపజయంతో గుటకలు మింగాను.
    "నువ్వన్నా నా మాట వినవా?" అన్నట్టు కళ్ళు మీరా మొహంకేసి ఎత్తి ముద్ద నోటిలో పెట్టాను. అతనితో మధ్య మధ్య నాలుగు ముద్దలు నేనూ తిన్నాను. తరువాత అమీర్ దగ్గిరికి వొచ్చాను.
    "అక్కడ పెట్టు" అన్నాడు కఠినంగా.
    'తింటున్నాను. చూశావా? ఎట్లాను నేను వేరే!' అన్నట్లు చూస్తున్నాయి మీరా కళ్ళు.
    మూకుడింట్లో పారేసివొచ్చి బైట కూచున్నాను. ఇంకా మీరా వెళ్ళడేమో, వాడికక్కడేమిపని. అన్నట్లు తలెత్తిచూస్తాడు అమీరప్పుడప్పుడు. మీరా కూనిరాగం తీస్తూ కూర్చున్నాడు. కూని రాగం రావడానికి ఎంత ప్రయత్నం లోపల జరుగుతుందో నాకర్థమవుతూనే వుంది. నీడలతోపాటు అమీర్ ముఖంమీద క్రోధపు నీడలు కూడా దట్టమవుతున్నాయి. "చెట్టుకింద కూచుందాం" అన్నానో లేదో మీరా తను వెడతానని లేవబోయినాడు. ఏమనుకుంటున్నాడో అనుకుని -
    "అప్పుడేనా? కూచో" అని కూచోపెట్టాను. అమీర్ తలెత్తి నావంక చూశాడు. ఏదో కనిపెట్టేవాడివలె. కాని మీరాని యింకా పిలిచి, రమ్మని ఆశపెట్టి, ఏడిపించి పంపుతున్నానని నాకు దిగులేసింది. కావలసి మీరా భుజం మీద చేయి వేశాను. పది నిమిషాలలో అమీర్ లేచి వెళ్ళాడు. మీరా నిద్రపోయినాడు. నేను అట్లానే యోచిస్తూ దిగులుగా కూచున్నాను. అట్లానే నా కళ్ళముందు రాత్రయింది. నేలమీద నాముందుపడి నిద్రపోతున్న నా బాబు, నా నవాబుని చూసి నాకు వూరికే దిగులేస్తోంది. అమీరెక్కడ వున్నాడో, ఏయే కోపాలతో మండిపోతున్నాడో, ఏయే నిశ్చయాలతో పోట్లాడుకుంటున్నాడో! పాపం, అతని మీద నాకు ప్రేమ పోయిందని యెంత బాధపడుతున్నాడో? యెట్లా అతనికి నా హృదయం అంతా అతని దేనని తెలియ చెయ్యడం? అతనిదేనా?
    చెట్ల ఆకులు మెల్లిగా వూగుతున్నాయి, పటమట చంద్రుడుదయించి అప్పుడే అస్తమిస్తున్నాడు. రెక్కలు కొట్టుకుంటూ చిన్నపిట్టలు యెగిరి మాయమవుతున్నాయి. వాటి కర్థమవుతుందా నా బాధ, నా నిరాశ ఆ రాత్రి అనిపించింది. యీ మీరానించీ, అమీర్నించీ, యీ మైదానంనించీ తప్పించుకొని బైటపడగలిగితే? ఎక్కడ? దిక్కేది? ఒకటే శరణ్యం. ఆ నల్లని రాత్రి నా ప్రాణాలని, తల్లి నా యేరు కడుపులో దాచుకోనా?
    "దీదీ దీదీ?" కలవరిస్తున్నాడు. నా చిన్నిబాబు!
    "నా బాబూ, మీరా" నిన్నేం చేస్తానో కద! నీకేగతి రాసి వుందో నేను బతికివుంటే నీకే ఆపదో రాకమానదు, నేను కాళిని నీప్రాణం తీసుకుంటా? నన్ను వొదిలి పోరాదూ! కృతఘ్నురాలినిగా కనపడే ధైర్యం లేక నిన్ను నా వెంట యీడ్చుకొంటున్నా. నిన్ను తోసెయ్యలేక నాతో అగాధానికి నిన్నూ లాక్కుపోతున్నాను.
    "మీరా! నేను అమీరు దాన్ని, నువ్వు నా కఖ్కర్లేదని పంపితే! అప్పుడే నిజంగా నీ ప్రాణాలు రక్షించుకుంటా, నిజంగా నీ దీదీ నౌతాను! ఆ మాట అనగలనా? నా గుండె రక్తంకారి, నిన్ను పిలిచి, నామాట అబద్ధమని చెప్పదా?"
    "దీదీ" మీరా లేచాడు.
    "దీదీ, దీదీ, వున్నావా? నువ్వు చచ్చిపోయినట్లు కలవొచ్చింది."
    నా మోకాళ్ళు కావలించుకున్నాడు. "దీదీ? నిజంగా మా యిద్దరి మధ్యా యీ బాధ పడలేక నువ్వు చచ్చిపోవు కద?"
    నా బాధ అంతా, యిద్దరినీ సంతోషపెట్టడానికి. నేను చేస్తున్న బ్రహ్మ ప్రయత్నమంతా జ్ఞాపకం వొచ్చి యేడ్చాను. గబగబ యేడ్చేశాను. నా బాబు నా మీరా ఎన్నోవిధాల నన్నోదార్చాడు.
    "నేనింక ఎన్నడూ కనబడను. వెళ్ళిపోతా. నువ్వు సుఖంగా వుండు"
    "అయ్యో! నిన్ను వొదల గలిగితే యింత క్షోభ ఎందుకు?"
    నిజంగానేనా? నిజంగానేనా? నా కోసం. నా మీద జాలిపడి కాదు. పొమ్మనక పోవడం? నీ కోసమేనా?
    "ఇంక ఏం కానీ, నా గొంతులో వూపిరి వున్నంతవరకు నిన్ను, నిన్ను వొదలను" నా మెడ కావలించుకున్నాడు.
    నక్షత్ర మొకటి కిందికి జారింది.
    వెంటనే వొస్తానని మీరా వూళ్ళోకి వెళ్ళాడు. అమీర్ వొచ్చి మాట్లాడకుండా కూచున్నాడు. పొద్దుటి అన్నమే తిన్నాం. నేను అమీర్ దగ్గిర కూచుని కబుర్లు చెబుతున్నాను. నా హృదయానికి కొంచెం విశ్రాంతి కలిగింది. మీరా రాలేదు. వొస్తాడేమోనని భయంగా వుంది. నక్క గాని, కుందేలు గాని చీకట్లో చప్పుడు చేసినప్పుడల్లా వులికిపడి చూస్తున్నాను. అమీర్ కనిపెట్టాడు గావుననుకుంటా." రా తిరుగుదాం."
    మీరా వొచ్చి వెతుక్కుంటాడేమోనని దిగులుగానే వుందిగాని- హృదయం మాత్రం యింకా విశ్రాంతి కావాలని కోరుతోంది, బైలుదేరాము.
    చీకటి. కటిక చీకటి. అమీర్ భుజం మీద నించి, మెడమీద నించి చెయ్యివేసి, నా శరీరమంతా అతనిమీద ఆనించి, మోకాళ్ళ వరుకు రాసుకునే చెట్లలో, గడ్డిలో, రాళ్ళలో, ఇసుకలో నడుస్తున్నాము. అంతులేని ఆకాశంలో, గుర్తులేని లోకంలో, ఏమీ కనపడని అంధకార గర్భంలో యిద్దరమూ, దగ్గిరిగా మృదయాలు కొట్టుకుంటూ తిరుగుతున్నాము! ఎంతసేపో! అమీర్నానుకొని. అతని చేతికింద సమస్తమూ-నా బాధలు, నా సందేహాలు, భయాలూ అన్నీ మరిచి ఆ రాత్రిలో కలిసిపోయినాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS