Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 25

సగం కొండ ఎక్కగానే -
అక్కడొక సన్నటి ఇరుకు లోయ! పది అడుగుల వెడల్పు కూడా లేదు. మొదటి కొండకి దాదాపు ఆనుకునే వున్నట్లుంది రెండో కొండ.
రెండు కొండల మధ్య ఇరుకు లోయ!
లోయలో అగాథం!
అట్టడుగున ఎక్కడో నీటి ప్రవాహం చప్పుడు!
అక్కడేదో ఏరు ప్రవహిస్తోందన్నమాట!
కొండ చరియల మీద వున్న రాళ్ళు అతి విచిత్రంగా, అతి పదునుగా కత్తులు పొడుచుకుని వచ్చినట్లు కనబడుతున్నాయి.
రెండు కొండలనీ కలుపుతూ అతి పురాతనమైన బ్రిడ్జి ఒకటి వుంది.
నిజానికి దాన్ని బ్రిడ్జి అనడానికి వీల్లేదు.
కేవలం నాలుగే నాలుగు దుంగలని, ఏవేవో చెట్ల తాళ్ళతో కట్టి రెండు కొండలనీ తాకేలా అడ్డంగా పడేసినట్లు వుంది.
దానిమీదికి వెళ్తే అది బరువుని ఆపుతుందో లేదో తెలియదు.
అతి జాగ్రత్తగా దానిమీద కాలు పెట్టాడు సాహస్.
'వంతెన' విపరీతంగా కదలడం మొదలుపెట్టింది.
వెంటనే వంగిపోయి వంతెనని బాలెన్స్ కోసం కాళ్ళతో చేతులతో కూడా పట్టుకున్నాడు సాహస్.
తన వెనకే రమ్మని అంకుష్ కి సైగ చేశాడు.
అంకుష్ కూడా అతి జాగ్రత్తగా కాళ్ళమీదా, చేతులమీదా పాకుతూ వెనకే రావడం మొదలుపెట్టాడు.
మెల్లగా సగం వంతెనని క్రాస్ చేశారు వాళ్ళు.
ఇంతలో -
చటుక్కున లేచి నిలబడ్డాడు అంకుష్.
"ఇక్కడ్నుంచి ఒక్క జంప్ చేస్తే అవతలకు చేరుకోవచ్చు" అని దూకేశాడు ఉత్సాహంగా.
వెంటనే పెద్ద కేక!
ఒక్క కాలు మాత్రమే అవతల కొండమీద పెట్టగలిగాడు అంకుష్. రెండో కాలుకి పట్టు దొరకలేదు.
స్లిప్ అయ్యాడు.
క్షణంలో సగంలో సాహస్ కూడా జంప్ చేశాడు.
అతనికి అంకుష్ చెయ్యి అందింది.
"భయపడకు నేనున్నాను" అన్నాడు సాహస్.
సాహస్ చెయ్యి పట్టుకుని వేళ్ళాడుతున్నాడు అంకుష్!
ఇంతలోనే -
సాహస్ కాలు కూడా జారింది.
చివరి క్షణంలో -
తన ఎడం చేత్తో వంతెన తాలూకు ఒక దుంగని పట్టుకోగలిగాడు సాహస్. రెండో చేత్తో అంకుష్ ని పట్టుకునే వున్నాడు.
అదే క్షణంలో
కిర్రుమని శబ్దం చేస్తూ -
దుంగ విరగడం మొదలుపెట్టింది.
"సాహస్! నన్నొదిలెయ్! లేకపోతే నాతోపాటు నువ్వు కూడా పోతావ్!" అన్నాడు అంకుష్ అర్జెంటుగా.
"ఏం పర్వాలేదు! ధైర్యంగా వుండు" అన్నాడు సాహస్. అంటూనే కాలితో కొండ చరియ మీద వున్న రాతిని అందుకుని పాదం ఆనించాడు.
కొద్ది నిముషాల స్ట్రగుల్ తర్వాత, ఇద్దరూ అవతలి కొండమీదికి చేరుకున్నారు.
వాళ్ళు రెండో కొండమీద అడుగు పెట్టగానే -
ఫెళ ఫెళమని శబ్దం చేస్తూ విరిగిపడిపోయింది నాలుగు దుంగల వంతెన!
భుజాలు ఎగరేశాడు అంకుష్. "బాస్! ఇంక మనం వెనక్కి వెళ్ళగలగడం కలలో మాట! నాగరిక ప్రపంచంతో సంబంధం తెగిపోయింది" అన్నాడు.
"బాయ్! నెవర్ లూజ్ హార్ట్" అన్నాడు సాహస్.
వంతెన కొండచరియలకు తగులుతూ ముక్కలు ముక్కలుగా విరుగుతూ లోయలోకి పడిపోవడాన్ని నిర్నిమేషంగా చూస్తూ నిలబడ్డారు ఇద్దరూ!
వంతెన పూర్తిగా లోయలో కూలిపోయేదాకా చూసి తర్వాత అన్నాడు సాహస్.
"కమాన్ బాయ్! మూవ్!"
భుజాలు ఎగరేసి, సాహస్ వెంట నడిచాడు అంకుష్.
కొద్ది గజాల దూరం మాత్రమే చదునుగా వుండి, ఆ తర్వాత మళ్ళీ ఎత్తు ఎక్కడం మొదలయింది దారి.
దాదాపు రెండు గంటలసేపు ఎక్కాక -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS