Previous Page Next Page 
జోగబాల పేజి 25


    శ్రీహర్ష ఆమె మొహంలోకి చూశాడు. ఆ సమయంలో ఆమెతో ఏమి మాట్లాడినా ప్రయోజనం లేదనుకున్నాడు. లేచి నిలబడ్డాడు.


    "ఒక్క క్షణం..."


    "ఏమిటి?" అన్నట్లు ఆమెవంక చూశాడు. పుష్ప కుడిచేతిని ముందుకు చాచింది. అతనికర్థం కాలేదు.


    "డబ్బు"


    "మౌనంగా ఉండిపోయాడు."


    "జోగినితో గడపడమంటే ఓ రకంగా దైవకార్యం చెయ్యటమన్నమాట. దేవుడి దగ్గరకెవరూ వట్టి చేతులతో రారు. అందుకని మేము డబ్బు వసూలు చేస్తూ ఉంటాం. నువ్వు నాతో ఉండకపోయినా నేను నీతో కొంతకాలం గడిపాను. డబ్బివ్వు" అంది.


    ఆమె మొహంలో కఠినత్వం లేదు. సౌమ్యంగానే ఉంది. కాకపోతే ఇందాక మాట్లాడేటప్పుడు ఉన్న గాంభీర్యం లేదు.ఎప్పటి అలవాటు, డబ్బుమీద లాలస కొట్టిచ్చినట్లు కనపడుతోంది.


    శ్రీహర్ష షర్టు జేబు తడుముకున్నాడు. ఒక పది రూపాయల నోటు తగిలింది. తీసి ఆమె కందించాడు. ఆబగా తీసుకుంది.


                                *    *    *    *


    శ్రీహర్ష తర్వాత పదిరోజుల్లో ఇరవై, ముప్ఫైమంది జోగినులదాకా కలుసుకున్నాడు. వారిలో పదహారేళ్ళ వయసులో ఉన్నవారి దగ్గర్నుంచి నలభై, నలభై అయిదేళ్ళ దాకా ఉండి యింకా జోగినిగా నిత్యజీవితం సాగిస్తున్న వాళ్ళున్నారు. జోగినులుగా గడిపి వయసు మళ్ళిన వృద్దాంగనలూ ఉన్నారు. వాళ్ళుకూడా యింకా జోగినులుగానే పిలవబడతారు. ఒక్కొక్క యింట్లో తల్లీ, కూతురూ, ఇంకొకచోట అమ్మమ్మా, తల్లీ, కూతురూ జోగినులుగా ఉన్నవారు కనిపించారు. కూతురు జోగినిగా ఉన్నా, ఆమెతో సమంగా పురుషులకు శరీరాన్ని సమర్పిస్తూ ప్రక్క గదిలోనే జోగినులుగా వ్యవహరించే తల్లులూ ఉన్నారు. వాళ్ళందరితోనూ వివరంగా మాట్లాడాడు శ్రీహర్ష. వాళ్ళెంతో చెడిపోయినట్లు, అన్యాయానికి గురయినట్లు, సహజమైన జీవితాన్ని కొనసాగిస్తున్నట్లు శ్రీహర్ష మాట్లాడితే నవ్వాపుకోలేక పోయేవాళ్ళు. వాళ్ళందరికీ కల్లు తాగటమలవాటుంది. కొంతమంది డబ్బెక్కువగా సంపాదించ గలుగుతున్నవాళ్ళు బ్రాందీ త్రాగేవారు. మొత్తంమీద అందరికీ తాగుడు అలవాటుంది. నిండైన, సుఖవంతమైన, సహజమైన జీవితం గడుపుతూన్న తృప్తి వారిలో ఉంది. శ్రీహర్ష వెళ్ళి గుచ్చిగుచ్చి ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొంతమంది ఎగతాళి చేసేవారు. కొంతమంది విడ్డూరంగా వింత పురుగుని చూసినట్టు చూసేవారు. ఒక నడివయసులో ఉన్న జోగినయితే "ఎవర్రా నువ్వు? మాదార్ని మేము దేవుడికి అంకితమైపోయి బతుకుతూంటే మా జీవితాల్లో విషపు చుక్క వేద్దామని వచ్చావా? మేమంతా నీ మాటలు విని భ్రష్టులమైపోవాలని నీ ఉద్దేశ్యమా? పవిత్రమైన ఆచారాన్ని దురాచారమంటావా? నీలాంటి పాపాత్ములవల్ల ఈ ప్రపంచం మైలపడుతుంది. సంఘం నాశనమైపోతుంది. ఈసారి ఈ ఛాయలకు వచ్చావో? జాగ్రత్త" అని కళ్ళెర్రచేస్తూ కొట్టబోయినంత పని చేసింది.


    మిగతా జోగినులెవరూ అంత తీవ్రంగా మాట్లాడలేదు గాని అతని వ్యాఖ్యలు చాలా పరిహాసంగా తీసుకున్నారు. "ఈ కబుర్లెందుకుగాని ఓ సారి ఉండిపో" అన్నది ఓ జోగిని. "పాపం చాలా ప్రయాస పడుతున్నావుగాని, నన్ను పెళ్లి చేసుకోకూడదూ?" అంది. ఇంకో జోగిని వెక్కిరింపుగా. "మా అందర్నీ నువ్వే పెళ్లి చేసుకుని ఒక్కోరోజు ఒక్కొక్కరితో గడుపుతూ అందర్నీ పోషించు" అన్నది మరో జోగిని. చివరకు అందరూ డబ్బులడిగేవారు. వాళ్ళు డబ్బులడగడానికి ఒక అర్థం, పర్థం ఉండేది కాదు.


    అతని ప్రయాస చూసి విలాస్ "ఎందుకురా ఈ అవస్థ. హాయిగా నీ జీవిత మేమిటో నువ్వు చూసుకోక" అనేవాడు.


    "వాళ్ళ అజ్ఞానం నాకేమీ బాధనిపించడంలేదు విలాస్. కానీ నీ అజ్ఞానం చాలా మనస్తాపం కలిగిస్తోంది."


    "నా అజ్ఞానమా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS