Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 26


    "శరత్ చంద్రసారు హౌస్ కి పొయ్యిరమ్మంటే పోయొచ్చిన సార్" గోవిందం ఇంగ్లీషు పిచ్చి భగవంతంకి తెలుసు.

 

    "సార్ వైఫ్ కి మెస్సేజ్ ఇచ్చి వచ్చావన్నమాట" కుర్చీలో కూర్చుని మెడికల్ మ్యాగజైన్ తిరగేస్తూ, చాలా క్యాజువల్ గా అన్నాడు.

 

    "హౌస్ ల ఎవరు లేరు సార్, లాక్ జేసున్నది."

 

    "మేడం తల్లిగారి విలేజ్ పోయిందని సార్ కి తెలవదు సార్. ఫోను ఎవ్వరు లిఫ్టు చేస్తలేరని నన్ను పంపిన్రు."

 

    "అలాగా" సాలోచనగా అన్నాడు భగవంతం.

 

    "నాకు రెండు వక్కపొడి పొట్లాలు తెచ్చివ్వు. అందుకే పిలిచాను చిల్లర నువ్వుంచుకో" అంటూ ఐదు రూపాయల నోటందించాడు.

 

    'అర్ధరూపాయి వక్కపొడికి ఐదు రూపాయల చిల్లరుంచుకో మంటాడేంటి' అనుకున్నాడు గానీ, ఆలోచన చాలా సేపటిదాకా వదల్లేదు. శరత్ చంద్ర సార్ విషయంల భగవంతం సార్ కేదో ఇంట్రెస్టున్నట్లుంది అని తోచింది అతనికి.

 

    'భార్య భర్తకి చెప్పకుండా పుట్టింటి కెళ్ళిందంటే అర్ధం ఏమిటి? యిద్దరికీ పడటం లేదన్నమాట. అయ్యగారు మాత్రం రవళిని రాత్రింబవళ్ళు ప్రక్కనే వుంచుకొంటున్నాడు' నవ్వుతూ మనసులోనే అనుకున్నాడు భగవంతం.


                                *    *    *    *


    చిన్న చిన్న శబ్ధాలు, సన్నగా వినిపించే మాటలు చెవులను సోకుతూ, మెదడును తాకుతూ చలపతిరావుకి స్పృహ వస్తోంది!

 

    స్పృహ తెలుస్తున్న కొద్దీ గాలిలో తేలిపోతున్నంత నీరసంగా అనిపించింది.

 

    "అమ్మా.....!" అని మూలిగాడు.

 

    చేతిమీదెవరో చేయి వేసిన స్పర్శ గ్రహించాడు.

 

    "చలపతిరావుగారూ! ఎలా వుంది?" ఎవరో అడుగుతున్నారు.

 

    మెల్లగా కళ్ళు తెరిచి వెలుగు చూడలేక మళ్ళీ కళ్ళు మూసేసుకున్నాడు. ఎవరిదో అపరిచిత రూపం మసక మసకగా కళ్ళముందు కనిపించింది.

 

    ఒక్కక్షణం ఆగి మళ్ళీ కళ్ళు తెరిచి తనని తాను చూసుకున్నాడు. ఛాతి మీద నిలువుగా కట్టువేసి వుంది.

 

    మొహం మీద ఆక్సిజన్ మాస్కు, తన చుట్టూ ట్యూబులూ.... క్షణంలో పరిస్థితి అర్ధమైంది.

 

    తను హాస్పిటల్ లో వున్నాడు. గుండెమీద సూది మొనరాయితో బాదుతున్నట్లున్న నొప్పి ఇప్పుడే లేదు. నీరసం తప్ప అసలు ఏ నొప్పి లేదు. తనకు వైద్యం జరిగింది.

 

    తను బ్రతికాడు!

 

    తను బ్రతికిపోయాడు!!

 

    హృదయం పురివిప్పినట్లు చెప్పలేనంత సంతోషం కలిగింది.

 

    ఏరీ.... తన వాళ్ళంతా ఏరీ....? అనుకొంటూ కళ్ళు తెరిచాడు.

 

    "ఎలా వుంది" అపరిచితుడు అడుగుతున్నాడు వేసుకున్న దుస్తులను బట్టి అతను డాక్టరని తెలుస్తోంది.

 

    "బాగుంది డాక్టర్! నొప్పి లేదు" అన్నాడు. మాట అతనికే వినిపించేంత నీరసంగా ఉంది.

 

    "వెరీ గుడ్. మీరు కళ్ళు మూసుకు పడుకోండి. రేపటికి బాగా కోలుకుంటారు" చెప్పాడు శరత్ చంద్ర.

 

    "మా వాళ్ళు...." అన్నాడు మళ్ళీ.

 

    "అంతా ఇక్కడే ఉన్నారు. మీరు పడుకోండి" మరో మాటకు అవకాశం ఇవ్వలేదు శరత్ చంద్ర.

 

    అతను కళ్ళు మూశాడు. తన కూతురు ఎలా ఉంది? ఎవరో ముస్లింని పెళ్ళాడుతానని చెప్పింది కదూ!

 

    సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సాయిబుని అల్లుడ్ని చేసుకోవడం భరించలేకపోయాడు. ఎలా? ఎలా ఒప్పకుంటాడు?

 

    కాదన్నానని మొండిగా మాట్లాడింది. అది భరించలేకనే కదూ తనకి గుండెలో నొప్పి వచ్చింది? ఇప్పుడు తన భార్య ఎలా ఉందో .... అని ఆలోచిస్తూనే మళ్ళీ మగతలోకి జారిపోయాడు చలపతిరావు.

 

    కొడుకు స్నేహితుడు కూడా అయిన ఆ ముస్లిం కుర్రాడు తను బ్రతకడం కోసం రక్తం ఇచ్చాడని అతనికి తెలీదు.

 

    చలపతిరావు కష్టంలో వున్నాడని తెలిసి దగ్గరైన స్నేహితులూ బంధువులూ- 'ఎయిడ్స్' అనుమానం రాగానే తన కుటుంబాన్ని వదలి ఎక్కడి వాళ్ళక్కడ మాయమయ్యారనీ అతనికి తెలీదు!

 

    ఇప్పుడు తన కుటుంబానికి అండగా నిలబడింది ఆ ముస్లిం కుర్రాడు సలీం మాత్రమేనని కూడా తెలీదు!

 

    ఆ కుర్రాడిని గురించిన అశాంతితోనే గాఢ నిద్రలో కెళ్ళిపోయాడు.

 

    భర్త రక్తంలో ఎయిడ్స్ చేరినట్లు సత్యవతికి ఆ రోజు ఉదయమే తెలిసింది.

 

    బ్రోకర్ తీసుకొచ్చిన ఓ కుర్రవాడి రక్తం ద్వారా అది సోకిందని తెలిసి, ఆ కుటుంబం కృంగిపోయింది.

 

    ఎలాగో ప్రాణాలు దక్కించుకున్నందుకు సంతోషం పూర్తిగా అనుభవించకుండానే ఆ వార్త ఆశనిపాతంలా వాళ్ళని తాకింది.

 

    ఎయిడ్స్ వార్త వినగానే బంధువులూ, మిత్రులూ ఏదో వంకతో దూరం వెళ్ళిపోయారు.

 

    ఒంటరిగా మిగిలిన ఆ కుటుంబానికి, ఇంత దారుణానికి కారణం ఇతనే అని తిట్టుకుంటున్న కుర్రాడు సలీమ్, ఖాదర్ బాబాయి అండగా నిలబడ్డారు.

 

    ఆపరేషన్ టైములో, సలీమ్ మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడని సత్యవతి ఇప్పుడేం మాట్లాడలేకపోతోంది.

 

    ఖాదర్ తన బాధను ప్రక్కన పెట్టి, కన్నబిడ్డకన్న ఎక్కువగా సత్యవతికి అండగా నిలబడి ధైర్యం నూరిపోస్తున్నాడు. కష్టం తెలిసిన మానవత వాళ్ళని దగ్గర చేస్తోంది


                                                    *    *    *    *


    టైము మధ్యాహ్నం పన్నెండవుతోంది.

 

    హాస్పిటల్ ఎక్సేంజికి ఫోన్ చేసి అడిగి, మామగారి వూరికి యస్.టి.డి. కనెక్షన్ తీసుకున్నాడు శరత్ చంద్ర.

 

    "హల్లో.....!" అటు నుండి మామగారి గొంతు.

 

    "హలో నేను శరత్ చంద్రని మాట్లాడుతున్నాను."

 

    "ఏం బాబు బాగున్నావా....? నిన్న మేం జీవన్ ని చూడ్డానికొచ్చాం. నువ్వు ఇంటి మొహం చూడకపోతివి, మంచంలోని పిల్లాడితో నీలిమ అవస్థ చూడలేక ఇక్కడికి తీసుకొచ్చేశాం!"

 

    ఏక బిగిన చెప్పేశాడాయన.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS