"అయామ్ సారీ! హాస్పిటల్ లో బిజీగా వుండి ఇంటికి రాలేకపోయాను. అయినా, మీరు నాకు ఫోను చేసి చెప్పి ఉండాల్సింది....." అన్నాడు శరత్ చంద్ర. ఆయన తప్పు తన మీదకి తోసేయడానికి ప్రయత్నించడం అర్ధమైంది.
"ఫోన్ చేసినా నువ్వు దొరకాలి కదా! అమ్మాయి చేసుంటుందిలే అనుకున్నాను. ఇంటి విషయాలు కూడా కాస్త పట్టించుకొంటుండాలి బాబూ.
"పిల్ల ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఏమీ పట్టించుకోకపోతే ఎలా?" ఆయన గొంతులో వినిపించిన అధికారం చిరాకు తెప్పించింది శరత్ చంద్రకి. తనకీ నీలిమకీ మధ్య ఆయన జొరబడుతున్నట్లు అయిష్టం కలిగింది.
"నీలిమకి ఫోను ఇవ్వండి!" అన్నాడు ఆయన మాటలని మధ్యలో తుంచేస్తూ.
అటు నుండి కాస్త నిశ్శబ్దం తర్వాత.
"హల్లో" అంది నీలిమ.
"నీలిమా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయావేం? జీవన్ ఎలా వున్నాడు?"
"తమరు ఎక్కడున్నారని చెప్పాలి? ఇంటికి వస్తానని చెప్పి కనీసం ఫోనయినా చేయకపోతే.... స్వంత మనుషుల మీద ఎంత శ్రద్ధ వుందో తెలుస్తూనే ఉందిగా!" నీలిమ కోపంగా మాట్టాడింది.
"నీలిమ రాత్రేం జరిగిందంటే...." అంటూ విషయం క్లుప్తంగా వివరించాడు.
"మీరు తప్ప ఇంక డాక్టర్లెవరూ లేరా అతని దగ్గరుండటానికి" విడిగా ఉన్నప్పుడు భర్తని 'నువ్వు' అని పిలిచినా పెద్దల ముందు 'మీరు' అంటుంది నీలిమ.
"ఉన్నారు కానీ, అతని దగ్గర ఉండడానికి సిద్ధంగా లేరు. అందుకే నేనుండి పోవాల్సొచ్చింది.
"అయితే ఇంకేం? అక్కడే కాపురం పెట్టేయండి. అందరికీ పట్టనిది కూడా మీ ఒక్కళ్ళకే అవసరం అయింది కదా!"
"ప్లీజ్, అండర్ స్టాండ్ మీ నీలూ. ఇక్కడికొచ్చాక అన్నీ మాట్లాడుకొందాం! అక్కడందరూ వినడం బావుండదు. ఎప్పుడొస్తావు చెప్పు?"
"ఇప్పుడే రావటంలేదు" ఫోన్ పెట్టేసింది.
హతాశుడయ్యాడు శరత్ చంద్ర. భార్య ధోరణి కన్నా మామగారి ధోరణి మరీ చిరాకు పెట్టింది. తానేదో తన కుటుంబాన్ని రోడ్డునపడేస్తే ఆయన తీసుకెళ్ళి కాపాడుతున్నట్లు మాట్లాడుతున్నాడు. తనతో విడిగా మాట్లాడితే అర్ధం చేసుకునేవాడే. కాని నీలిమ ముందు మాట్లాడాడు. అసలే మంట మీదున్న నీలిమకి ఇంకాస్త ఆజ్యం పోసినట్లవుతోంది. అనవసరంగా మా మధ్యకొచ్చి దూరాన్ని పెంచుతున్నాడీ మనిషి అనుకున్నాడు. ఈ చలపతిరావు విషయం తేలేవరకూ నేనెలాగూ ఇంటికి వెళ్ళలేడు. నీలిమ కిష్టమైనన్ని రోజులు అక్కడే ఉంటే బాగానే వుంటుందిగానీ, నీలిమ మనసు బావుండకుండా, ఆ వాతావరణంలో గడపడమే నచ్చడంలేదు. భోంచేస్తూ అనుకున్నాడు శరత్ చంద్ర. ఆ మధ్యాహ్నం క్యాంటీన్ నుండి క్యారియర్ తో వాళ్ళున్న గదిలోకే భోజనము వచ్చింది!
రోజూ ఆ టైమ్ లో భోంచేయడు శరత్ చంద్ర. క్యాంటీన్ లో స్నాక్స్ తీసుకొి కాఫీ తాగి పని కొనసాగిస్తాడు. అవికూడా, థియేటర్ దగ్గరికి తెప్పించుకొని. రోజుతో పోల్చుకుంటే ఇవాళ చాలా ఖాళీగా ఉన్నట్లు. చూసుకోవాల్సి వున్నదొక్కడే పేషెంట్. ఖాళీగా ఉండటం వల్ల ఆకలేస్తోంది!
"హల్లో.... భోం చేస్తున్నారా?" గడప అవతల నిలబడి రవళిని అడిగాడు కిరణ్.
"ఆ... ఆ! మీరు?"
"ఇప్పుడే క్యాంటీన్ కి వెళుతున్నాను" రాత్రి తను అర్ధాంతరంగా రావడం వల్ల రవళి ఏమనుకుందోనని సిగ్గుపడి, ఉదయంనుండీ ఇటు రావడానికి ఇబ్బంది పడ్డాడు. రవళిని చూడకుండా వుండలేక క్యాంటీన్ కి వెళ్తూ క్యాజువల్ గా వచ్చినట్లు వచ్చాడు.
"ఎలా ఉన్నాడు సార్ మీ పేషెంట్? ఏమయినా ప్రాబ్లం ఉందా?" అప్పుడే సింక్ దగ్గర్నుండి వెనక్కు తిరిగిన శరత్ చంద్రని అడిగాడు.
"బి.ప్. ఫ్లక్చువేట్ అయింది. మళ్ళీ సెటిలవుతోంది...." అన్నాడు.
కిరణ్ మొహం కాంతివంతంగా వుండటం గమనించింది రవళి. ఆకాంతి ఆమె గురించిన ఆలోచనల నుండే వచ్చిందని మాత్రం తెలీదు.
"సార్....!" అన్నాడు కిరణ్ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్టు.
ఏమిటన్నట్లు చూశాడు శరత్ చంద్ర.
"బైపాస్ సర్జరీ కోసం భగవంతంగారి దగ్గరికి ఓ కేసు వచ్చింది. సర్జరీ చేస్తే చాలా ప్రమాదమని ఆయన వెళ్ళిపొమ్మన్నారట వాళ్ళు మీకోసం అడిగారు. మళ్ళీ వస్తామని వెళ్ళారు.
"ఐసీ, వార్డులో పేషెంట్స్ ఎలా ఉన్నారు?"
ఒక్కొక్కళ్ళ గురించీ వివరంగా చెప్పాడు. కిరణ్. సర్జరీ చేయడమంటే భయపడతాడు గాని.... వ్యాధి గుర్తించడంలో ట్రీట్ మెంటు ఇవ్వడంలో కిరణ్ మీద చాలా నమ్మకం శరత్ చంద్రకి. అతనికి కావాల్సింది వెనుకనుండి పుషింగ్! అంతే!
"చిన్న కేసులు రెండు, రేపు మీరు చేయకూడదా కిరణ్? నాకూ కాస్త వర్క్ లోడ్ తగ్గుతుంది" అన్నాడు ఏమంటాడో చూద్దామని.
"నేనా? మీరు లేకుండానా సార్? తర్వాత మనం కలిసి చేద్దాంలేండిసార్" అన్నాడు తడబడిపోతూ.
నవ్వొచ్చేసింది రవళికి. అతనికి కనబడకుండా తన ప్రక్కకి తిప్పేసుకొంది. రాజ్యం ఏదో పని చేసుకొంటున్నట్లు అటు తిరిగి నిలబడింది.
"వస్తాను సార్!" అంటూ వెళ్ళిపోయాడు కిరణ్.
"కిరణ్ చేత బలవంతంగానయినా సర్జరీ చేయించడానికి నిర్ణయించుకున్నాను. ముందు చిన్న చిన్న వాటితో మొదలుపెట్టాలి" వెళ్ళిపోతున్న అతన్నే చూస్తూ అన్నాడు శరత్ చంద్ర.
"నైఫ్ చేతికిస్తే దాన్ని చూసి వణికిపోతూ పదిసార్లు దేవుడికి దండం పెట్టడమే సరిపోతుంది! ఆయనెక్కడ సర్జరీ చేస్తారు సార్" అంది రాజ్యం.
"నాకూ నమ్మకం లేదు" అంది రవళి.
"నా ప్రయత్నం నేను చేస్తాను. మీరెవ్వరూ అతన్ని డిస్కరేజ్ చేసి మాట్లాడకండి. అతన్ని ప్రోత్సహించడంలో మీ పాత్ర చాలా వుంటుంది రవళీ. మనం అతన్నిలాగే వదిలేస్తే గొప్ప మేధాశక్తి పనికిరాకుండా పోతాడు" అన్నాడు. రవళిని చూసినప్పుడు కిరణ్ లో వచ్చే మార్పుని నిన్నటినుండి గమనిస్తూనే ఉన్నాడు.
"తప్పకుండా ఎంకరేజ్ చేస్తాను సార్" రవళి అంది.
ఏదో అడగబోయి, అప్పుడే అడగటం బావుండదని ఆగిపోయాడు.
