Previous Page Next Page 
డెత్ సెంటెన్స్ పేజి 25


    "మాలాంటివాళ్ళే ఎన్కముందులాడితే ఎట్లాసార్? పదిసార్లు అడిగించుకుంటే మంచిగుంటదా దొరలకు!" అతని వీక్ నెస్ మీద కొట్టాడు.

 

    అతని జేబులోంచి అయిదు రూపాయలు తీసివ్వబోయాడు. "ఏంది అడుక్కుతినే వోని తీర్గ కనిపిస్తున్ననా బిచ్చమేసినట్లిస్తున్నరు?" నవ్వుతూ గదమాయించాడు గోవిందం.

 

    అతను మాట్లాడకుండా జేబులోంచి పదిరూపాయలు తీసి చేతిలో పెట్టాడు. పదీ జేబులో వేసుకున్న గోవిందం రో.బం. ఊహించలేనంత వేగంగా వెనక్కి తిరిగి లిఫ్ట్ లో దూరాడు.

 

    "ఇదిగో.... మరి స్ట్రెచర్ వార్డులోకి తీసికెళ్ళవేం?" కంగారుగా అన్నాడు రో.బం.

 

    "ఇప్పుడే వస్తా సార్? క్రింద ఒక పేషెంట్ వెయిటింగ్ చేస్తున్నాడు. అతన్ని కూడా తెచ్చి, ఇద్దర్నీ వన్ టైమ్ గుంజకపోత. నాకు లేటయితే మీరే గుంజక పోండ్రి" అన్నాడు లిఫ్ట్ తలుపు మూసుకుపోయింది.

 

    క్రిందికి వెళ్ళి మరో స్ట్రెచర్ లోపలికి లాగాడు.

 

    "ఎన్నో అంతస్థు సార్?"

 

    "థర్డ్!" మరో రో.బం. చెప్పాడు లిఫ్టు కదిలింది.

 

    "గుడ్ మాణింగ్ సార్!"

 

    "ఉదయం సిక్స్ ఓ క్లాక్ కి డ్యూటీకొచ్చాను సార్? నో టీ, నో టిఫిన్, మీ మెర్సీ సార్!"

 

    "నీ టిఫిన్ కి నేను డబ్బులెందుకివ్వాలి? మీ సంగతి నాకు బాగా తెలుసు! ఒక్క రూపాయి యివ్వను."

 

    "ఇవ్వవా?"

 

    "ఇవ్వను"

 

    "అయితే ఇక్కడే వుండు" లిఫ్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఆపి గోవిందం బయటికొచ్చేశాడు. లిఫ్టులోని రోగి బంధువు పిలుపులు వినిపించుకోనట్లు కారిడార్లో అడుగువేశాడు.

 

    "ఇల్లీగల్లీ బోరన్డ్ ఫెల్లో" పైకి అనుకొంటూ నడుస్తున్నాడు.

 

    "ఏ భాషన్న అది?" మరో వార్డుబోయ్ యాదగిరి ఎదరై అడిగాడు.

 

    "అరె, ఇంగ్లీషు భై. ఆ లిఫ్టులో ఒక ఇల్లీ గల్లీ బోరన్డ్ ఫెలో వున్నాడు. థర్డ్ ఫ్లోర్ లో వదిలి మనీ దీస్కోపో! వదలకు" గబగబా చెప్పేశాడు.

 

    కన్నార్పడం కూడా మర్చిపోయి "ఇప్పుడు నువ్వు ఇంగ్లీషుల జెప్పిన దానికి అర్ధమేందన్నా?" అన్నాడు యాదగిరి.

 

    "ఇల్లాగల్లీ అంటే చట్ట విరుద్ధం. బోరన్డ్ అంటే పుట్టినవాడు. తెలుగుల లం....కొ.... అనడాన్కి ఇంగ్లీషుల కూడా అనొచ్చునా! నీ డ్యూటీ హార్ట్ సర్జరీ వార్డుల గదన్నా! ఇక్కడ ఎందుకున్నావ్?"

 

    "అరె ఏం జెప్పమంటావ్! మా వార్డుల వచ్చినోళ్ళు జల్దిపోరు. కొత్తోళ్ళు రావాలంటే వీళ్ళు వోవాలెగద.

 

    ఒక్కసారి పైసలిచ్చినంక మళ్ళడిగితే వాళ్ళ ఆస్థులన్ని రాసిచ్చినట్లు ఫోజుబెడ్తరు. లిఫ్టు దగ్గరున్నోడు ఛాయకి బోయినట్లున్నాడు. నే బోయి నిలబడినలే" చెప్పి అక్కణ్ణించి కదిలాడు.

 

    "పైసలెక్కడ రాల్తే అక్కడే వుంటాడీ గోవిందన్న" అనుకున్నాడతను.

 

    ఇంటికి ఫోన్ చేశాక ఇంట్లో వాళ్ళకే మయిందోనన్న టెన్షన్ శరత్ చంద్రని నిలువనివ్వలేదు. కనీసం తనకు ఫోనయినా చేయకుండా ఎక్కడికి వెళ్ళినట్లు? తను చలపతిరావు దగ్గర్నుండీ కదలడానికి వీలు లేని పరిస్థితి! ఆలోచిస్తూనే బయటికొచ్చాడు.

 

    కారిడార్ లో గోవిందం కనిపించాడు. ఓ పనిచేద్దాం అనిపించింది.

 

    "గోవిందం" తన గది ముందే నిలబడి కేకేశాడు.

 

    అటు తిరిగి వెళ్ళిపోతున్న గోవిందం ఠక్కున ఆగి వెనక్కి తిరిగి చూసి -

 

    "సర్! గుడ్ మాణింగ్ సర్" అనుకొంటూ పరుగులాంటి నడకతో తన వినయం ప్రదర్శిస్తూ దగ్గరికొచ్చాడు.

 

    అప్పుడే యింటి నుంచి వచ్చి ప్రక్కనే వున్న గదిలోకి వెళ్ళాడు భగవంతం. శరత్ చంద్ర గోవిందాన్ని పిలవడం గమనించి ఓ చెవి అటు పారేశాడు.

 

    "ఓ సారి మా ఇంటికి వెళ్ళి రాగలవా?" అడుగుతున్నాడు శరత్ చంద్ర.

 

    "పోయొస్త సార్! అమ్మ కేమన్న జెప్పమంటారా?"

 

    "ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ ఎత్తడం లేదు. ఫోను ఫాల్టుందా లేక ఎక్కడికైనా వెళ్ళారేమో చూసిరా. తాళం వేసుంటే ప్రక్కింట్లో చెప్పారేమో అడుగు."

 

    "ఇంత పొద్దున్నే మీకు జెప్పకుండ ఎక్కడ పోతరు సార్. బాబు గారికి దెబ్బ తాకింది గూడ కద!"

 

    గోవిందం ఎక్కువగా మాట్లాడ్డం ఇష్టంలేక-

 

    "ఇంక నువ్వెళ్ళు. ఆటోలో వెళ్ళిరా" అంటూ జేబులోంచి డబ్బు తీసిచ్చాడు.

 

    "పోయెస్త సార్!" అంటూ కదిలాడు గోవిందం.

 

    అంతా వింటున్న భగవంతం కనుబొమలు చిత్రంగా కదిలాయి!

 

    శరత్ చంద్ర వార్డులోని పేషెంట్స్ అందర్నీ ఓసారి చూసి చలపతిరావు దగ్గరికెళ్ళిపోయాడు.

 

    "ఇంటికి తాళం బెట్టున్నది సార్. ప్రక్కింట్లో అడిగిన ప్రొద్దున అమ్మవాళ్ళు తల్లిగారి వూరు పోతున్నామని చెప్పిన్రట, తాళం చెవులు ప్రక్కింట్లో ఇచ్చెళ్ళిన్రట"

 

    మరో అరగంటలో తిరిగొచ్చి చెప్పాడు గోవిందం.

 

    నిశ్చేష్టుడయ్యాడు శరత్ చంద్ర. ఇప్పుడెందుకెళ్ళినట్లు యింత హడావిడిగా?

 

    కనీసం వెళ్ళేటప్పుడు అతనికి ఫోన్ లో నయినా చెప్పకుండా-

 

    ఎలా చెపుతుంది....? తనురాత్రి రాలేకపోయినందుకు ఫోన్ చేశాడా? నీలిమ తన మీద ప్రతీకారం తీర్చుకుంటోందా! ఎంత కోపమైన కాలు ఫ్రాక్చరయిన పిల్లాడ్ని తీసుకొని ఎలా వెళ్ళగలిగింది? తల్లి దండ్రులయినా ఎలా ప్రోత్సహించారు? ఎలా వున్నాడో జీవన్?

 

    వెంటనే ఫోన్ చేయాలనిపించింది. ఇంకా చేరాలో లేదో? మధ్యాహ్నం చెయ్యచ్చులెమ్మని అనుకున్నాడు.

 

    గోవిందం చెప్పింది విన్నదిగానీ విషయం అర్ధం కాలేదు అక్కడే వున్న రవళికి.

 

    అడగాలనిపించి కూడా ఏదో ఆలోచనలో వున్న శరత్ చంద్రని కదిలించడం ఇష్టం లేకపోయింది!


                               *    *    *    *


    "ఇలా రావోయ్ గోవిందం!" శరత్ చంద్రకి విషయం చెప్పి వెళ్ళిపోతున్న గోవిందాన్ని తన గదిలోకి పిలిచాడు భగవంతం.

 

    శరత్ భార్యతో ఏదో గొడవ అయిందనీ అదేమిటో ఆరా తీయాలనీ ఆత్రంగా వున్నాడతను.

 

    "ఏమిటీ ప్రొద్దునే ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్?" ఏం తెలీనట్లు అడిగాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS