సత్యం అతనివేపు సీరియస్ గా చూస్తూ అడిగాడు.
"ఎంచేత?"
"ఎంచేతా అంటే అదంతే! ఎట్టి పరిస్థితుల్లోనూ డాన్సర్ని చేసుకోలేను, చేసుకోను"
సత్యం క్షణం ఆగి అడిగాడు...
"పోనీ- ఎవర్ని చేసుకుంటావు?"
"ఆ వ్యవహారమేదో నాకు వదిలేస్తే మంచిదేమో!"
"అంటే- నీ పెళ్ళి నువ్వే చేసుకుంటావన్నమాట?"
"ఏం చేసుకోకూడదా? నా కిష్టమైన పిల్లని నేను చేసుకోవడం తప్పా? నేరమా? ఫ్రాడా?"
కృష్ణమూర్తి హీటెక్కి ఆ విధంగా అరుస్తుంటే సత్యానికి కోపము ఆగింది కాదు తానుకూడా గొంతుపెంచే అన్నాడు.
"కిష్టుడూ! నాక్కోపం తెప్పిస్తున్నావు!"
"చెప్పదలచుకున్నది చెప్పాను అంతే!"
అనేసి అతను వెనక్కి తిరిగాడు.
"ఎక్కడికటు?" అరిచాడు సత్యం.
"నా గదికి" అతను కూడా అరిచాడు.
అరిచింతర్వాత అక్కడాగి అన్నాడు అతను...
"పెళ్ళంటూ చేసుకుంటే పద్మనే చేసుకుంటాను."
ఆ విధంగా తాను చెప్పదలుచుకున్నదేదో స్పష్టంగా చెప్పేయగలిగి నందుకు ఎంతో సంతోషించాడు అతను.
కొడుకు డైరెక్టు లైనులోకి రావడం తండ్రికిష్టంలేదు. వచ్చినవాడు ఎట్లాగూ వచ్చాడు గనుక ఇప్పుడు తగ్గిపోతే మరింత రెచ్చిపోతాడనే అభిప్రాయంతో...
"పద్మ ఎవరు?" అడిగాడు తండ్రి.
"నీకు తెలుసు!"
"తెలుసా?"
"నువ్వు ఆ అమ్మాయిని చూశావు కూడాను."
"చూసేనా! ఎప్పుడు? ఎక్కడ?"
ఇంకా బయటపడనందుకు తండ్రిమీద కోపమొచ్చింది అతనికి. అందుకే అసహనంగా అన్నాడు...
"నాన్నా! ఏమీ తెలీనట్టు మాటాడి నన్ను అవస్థపెట్టకు. పద్మని నీకు చూపించటానికి ఇన్నాళ్ళూ నేను ఎన్నో అవస్థలు పడ్డాను. చిట్టచివరకు రవీంద్రభారతిలో నాకు ఆ అవకాశం దొరికింది. పద్మని నీ ముందునుంచే తీసుకెళ్ళాను, నువ్వు చూశావు. నువ్వు చుశావని గ్యారంటీగా చెప్పగలను. ఇంతా జరిగినా ఆ పిల్ల ఎవరని మాట మాత్రంగా కూడా అడగటం లేదు. అసలా విషయమే వదిలేసి డాన్సరంటున్నావు, ముహూర్లంలాంటున్నావు. ఇదేం బాగోలేదు."
కొడుకు ఆవేశాన్ని పసిగట్టిన తర్వాత తాను కొంచెం తగ్గి మాట్లాడటమే శ్రేయస్కరం అనుకున్నాడు సత్యం.
అంచేత...
"ఆయాసపడకురా కిష్టుడూ! నిజమే. రవీంద్రభారతిలో మీ ఇద్దర్నీ చూసేను. ఎవరో అమ్మాయితో తిరిగినంత మాత్రాన... నువ్వు ఆ పిల్లని ప్రేమించావనీ, పెళ్ళికూడా చేసుకోవాలనుకుంటున్నావని నేననుకోవాలని నువ్వెందుకనుకున్నావు?"
"బుద్ధిలేక అనుకున్నాను చాలా" అన్నాడు అతను.
"అది అర్ధమవుతోంది. ఇంతకీ ఆ పిల్ల తల్లిదండ్రులెవరో తెలుసా?"
"తెలీదు."
"పోనీ నీ పెద్దవాళ్ళ గురించి ఆమెకు చెప్పావా?"
"చెప్పలేదు."
"ఎంచేత?"
"అనవసరమయిన విషయాలు గనక."
"కిష్ణుడూ!"
"నువ్వే చెప్పునాన్నా! నేను పద్మను ప్రేమించాను. పద్మ నన్ను ప్రేమించింది. నాకు పద్మకావాలి. పద్మకి నేనుకావాలి. అంతేగాని... నీ పెద్దవాళ్లెవరు? వాళ్ళ కులగోత్రాలేమిటి? ఇదంతా నాన్సెన్స్ కదూ?"
"కన్నతండ్రిని ధిక్కరించటం తప్పురా కిష్ణుడూ" అన్నాడు సత్యం బాగా కృంగిపోయి.
"కన్నబిడ్డ మనసుని మన్నించకపోవడం కూడా తప్పేకదా నాన్నా?" అన్నాడు కొడుకు.
"మామూలు పరిస్థితులలో నీ మాట కరెక్టవుతుందేమోగాని- మన పరిస్థితులు వేరు. మనిద్దరిమధ్యా మరొకవ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిని మన్నించడం మన ధర్మం!"
"ఎవరా వ్యక్తి?"
"నీకు జన్మనిచ్చిన తల్లి!"
అమ్మగురించి వినగానే కృష్ణమూర్తి మరింక మాటాడలేక పోయేడు.
సత్యం కృష్ణమూర్తి చేతిని పట్టుకుని సుభద్ర ఫోటో దగ్గరకి తీసుకెళ్ళేడు-
"చూడటు! నువ్వీ పెళ్ళి చేసుకుంటే మీ అమ్మ ఆత్మ క్షోభిస్తుంది!"
"ఎంచేత?"
అయితే గియితే నీది లవ్ మేరేజీ అవుతుంది. అవునా?"
"అవును!"
"ఆ రకం పెళ్ళి మంచిదో చెడ్డదో అడక్కు. ఆ పెళ్ళిలో సుఖంలేదని మీ అమ్మ అనుభవ పూర్వకంగా తెలుసుకుంది. అల్లాంటి పెళ్ళి నీకు చెయ్యద్దని నా దగ్గిర మాట తీసుకుంది!"
ఆ కథ వినగానే కృష్ణమూర్తి రెచ్చిపోయేడు-
"సిల్లీ! అమ్మ అట్లా అడగటం సిల్లీ? నువ్వు మాటివ్వడం మరింత సిల్లీ!"
అతని కామెంట్ వినగానే సత్యం రుద్రుడయ్యేడు. కళ్ళజోడు తీసి నేలకేసి కొట్టి గట్టిగా అరచేడు-
"కిస్టుడూ!"
కృష్ణమూర్తి తన చేతికున్న రిస్టువాచీ ఊడతీసి గోడకేసి కొట్టి రెట్టింపు స్వరంతో అన్నాడు-
"యస్! నథింగ్ బట్ సిల్లీ!"
--- ఆ తర్వాత ఏఏ వస్తువులు విసిరికొట్టాలో ఇద్దరూ గదంతా గాలించి చూసేందుకు అటూ ఇటూ పరుగులు తీసేరు. చేతికి నచ్చింది దొరక్కపోవడంతో ఇద్దరూ అలసిపోయేరు. గోడమీద జారగిలపడ్డారు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచేయి.
సత్యం సంబాళించుకుని అన్నాడు-
"విమర్శలొద్డు; విమర్శించి నన్ను బాధపెట్టవద్దు. నీకు పెళ్ళంటూ జరిగితే అది ఇరుపక్షాల పెద్దల అంగీకారంతోనే జరగాలి!"
ఆ మాటకి కృష్ణమూర్తి కూడా రిలాక్సయ్యేడు.
"అంతేగదా! మా పెళ్ళికి పెద్దవాళ్ళని నేను ఒప్పిస్తాను!"
"ఒప్పించటం కాదు. వాళ్ళంతట వాళ్ళే ఒప్పుకోవాలి!"
"ఎందుకు ఒప్పుకోరు? నాకు గుణముంది. అందచందాలున్నాయి. చదువుంది. అన్నిటికంటే ముఖ్యం డబ్బుంది!" అన్నాడు కృష్ణమూర్తి గర్వంగా.
అతని గర్వానికి సత్యం విషాదంగా నవ్వుకున్నాడు-
