Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 25

 

                                   16
    మూసిన కన్ను తెరవలేదు రావులమ్మ. దాన్నలా సూత్తా వుంటే పుట్టెడు దుక్కవు కలిగినాది రవణయ్యకి. ఎంకన్న మీద కోపవూ రగిల్నాది.పళ్ళు పటపటలాడించాడు. కళ్ళు అగ్గి బరాటా లయినాయి. అడ్నీ సూత్తోనే కత్తితో పోడిసేయ్యాలనుకున్నాడు.
    లారీ వొచ్చి పడవోల్రేవు కాడ అగినాది. ఇద్దరు మనుసులు సేతులు మీద కెత్తుకుని వొటేలు కాడికి దింపు కొచ్చారు. రావులమ్మని అరుగు మీద పడుకోబెట్టారు.
    సీతమ్మా, ముసలయ్యా, సేందరకాంతం , బద్రయ్య దగ్గిరి కొచ్చి నిలుసున్నారు. తక్కివోళ్ళు కూడా సుట్టూ మూగారు.
    సెంద్రకాంతాన్ని సూసి మొకం పక్కకి తిప్పుకున్నాడు రవణయ్య. సీతమ్మ రావులమ్మ మీదికి వొలి కొంగుతో యిసురుతున్నాది.
    "ఎవరు బాబూ యీ మనిషి?"
    "ఎవురా? ఓ దొంగ సచ్చినోడి పెళ్లాం! ఏడాడు? ఎక్కడున్నాడు?"
    "ఎవరు బాబూ?"
    ఆడి పేరు నోటితో సేప్పడానిక్కూడా రవణయ్య కి యిట్టవు లేదు. సుట్టూతా సురుగ్గా కలీసూసి వోటేల్లోకి సోరబడ్డాడు. సారా కుండ కాడ ఎంకన్న కనిపించాడు. సటుక్కుని ఆడి జట్టట్టుకుని ఎలపలికి లాక్కొచ్చాడు.
    "ఇడుగో! యీడు!" అంటా టపటపా యీ దవడా ఆ దవడా వోయించాడు.
    ఎంకన్న తిరగబడ్డాడు. ఎంటనే బద్రయ్య సోరబడి ఇద్దర్నీ సేరికో ఎంపుకీ తోశాడు.
    "వొదలండే హే! నన్నట్టుగోకండి. యీ యేల యీడి సావో నా సావో తేలాల!"
    "తప్పు బాబూ! అల్లాటి మాటనకూడదు.
    "ఏవంట! ఈడు సేసే పనికి వూరికే పేనాలు తీత్తే సాల్డు. ముక్కలు సేక్కలు సేసి కాకులకీ, గెద్దలికి ఏసినా పాప వుందా?"
    "తప్పు నాయనా, తప్పు!"
    "ఏంటా తప్పనే అడుగుతన్నా! ఏపారవేపారవని వూళ్ళో నవుకిరీ మానుకుని పట్నానికి లెగిసోచ్చి అలోసని పెళ్లాన్ని ఏడిపించడవు తప్పు కాదో? కనిపించిన ఆడదానేంటల్లా పడి, బరితెగించి తిరగడం తప్పు కాదో? దొంగ ఎదవ లందరి తోటీ జట్టు కలిపి సీకట్లో సారా యాపారం సేయడం తప్పు కాదో? సెప్పు ముసలోడా! ఇప్పుడు తప్పేవుడిదో నువ్వే సెప్పు!"
    "నిజవే బాబూ! ఆడు సేసిన పని తప్పే!"
    "అవునా? అలాటప్పుడు కాల్లిరగ్గోట్టాలంటావా వొద్దా?"
    "కాల్లిరాగ్గోడితే బుద్ది మారతాదా బాబూ?"
    "మారదేం ? నడినెత్తి కడ్డంగా పెడితే అదెందుకు మారదో నేనూ సూత్తా!"
    ఆ మాటల్తో ఎంకన్న కి ఉక్కురోసం వొచ్చినాది.
    "రారా! మొగోడివయితే యీ పాలిరా!"
    "స్సీ ఎదవా! నోరు ముయ్! నీలాంటోడితో మాట్టాడ్డం కూడా సిగ్గుచేటు! నీలాగ పెళ్లాన్ని వుసురెట్టినోడు యీ బూమ్మీదేవడూ పుట్టడు!"
    "నా పెళ్లాం వూసునీకెందుకురా? నేనేం సేసుగుంటే మట్టుక్కు అడగటానికి నువ్వేవుడవ్?"
    "ఎవుడ్నా?నీ నెత్తి మీద జేజెమ్మన్రా! అసలు నీలాంటోడికి పెళ్లి సేసినోళ్ళది బుద్ది తక్కువ. ఎయ్యి జనవాలు జపవు సేసినా నీలాంటేదవకి రావులమ్మ లాటి ఆడది దొరుకుతాదంట్రా? కాకి ముక్కుకి దొండపండు కాదంట్రా? మనసుపడి పెళ్ళి సేసుకున్నాది. తన సుకాన్నంతా యిదులుకుని నీకోసవే బతికినాది. అల్లాటి దేన్నేడిపించి నువ్వేం పాంకుందా వనుకున్నావురా? రేపు నీ వొళ్లు పుచ్చిపోయి , మంచం పట్టి, నువ్వు కాటిక్కాళ్ళు సాసుకూక్కుంటే నీకు సాకిరీ సేసీ దేవోత్తిరా? ఈ బోగం దోత్తాదా? నా పెళ్లాం సచ్చిపోవడం తో నేనెంత గిలగిల్లాడుతన్నానో ఎప్పుడన్నా కల్లెట్టుకు సూశావురా? సంటోళ్ళు ఎంత గిజగిజ లాడిపోతున్నారో ఏయేలయనా తెలుసు కున్నావురా? నీలాటి సచ్చు సన్నాసి దాని కాల్లోత్తడాని క్కూడా పనికి రాడ్రా ఎంకన్నా!"
    "నీలాటి మావుండగా దానికి నేనెందుకో?"
    "ఏంటీ? ఏంటిరా పెల్తన్నావ్?" అంటా లగెత్తికెల్లి స్సేల్లుని లెంపకాయ కొట్టాడు. రొండు సేతుల్తో టీ పీకి పిసకబోతంటే , ముసలయ్యేల్లి రవణయ్యని ఎనక్కి లాక్కొచ్చాడు. ఎంకన్న ని బద్రయ్య తీసి కేల్లాడు.
    రవణయ్య బుజం మీద సెయ్యేసి పక్కకి నడిపించాడు ముసలయ్య.
    "నీ పెళ్ళావెపుడు పోయింది బాబూ?"
    "నాలుగు నెల్లాయినాది."
    "పిల్లలా?"
    "ఉన్నారు."
    "ఆళ్ళని కనిపెట్టుకుండడానికి ఎవుళ్ళూ లేరా?"
    "నేను బతికున్నా సచ్చి నోళ్ళల్లోనే జమ తాతా!"
    "ఏం సేత్తాం బాబూ! బూమ్మీద పడ్డ వొడి కల్లా సావు తప్పేది కాదు నాయినా! కూతంత ముందో ఎనకో పెతీవోడూ బూడిదయీ వోడే! పుట్టడం, సావడవూ ఏదీ మన సేతుల్లో లేదు. పేనాలు తీసుకుందారని పెద్ద వలువుతో వురోసుకున్నా అందరూ సచ్చి పోతారా? అంతా ఆ బగమంతుడి దయా! ఈ పెపంచకవులో తోజు రోజూ వొచ్చీ బాదలికి తట్టుకోలేక సావులు కోరుకుంటాం. అదీ మన తప్పు కాదు! కాని ఎవుడి కాదు సచ్చిపోతా వుంటే లోకవంతా ఏమయి పోవాలి బాబూ? బతుకు మీద ఏ అసీ లేపోయినా వున్నవోళ్ళని సూసయినా మనకి బతక్క తప్పదు. పప్పూ వోన్నవూ సెయిజారిందని గెంజి తాగడం మానేత్తావా?"
    రవణయ్య మాటాడ;లేదు.

                          *    *    *    *
    కొండమీదున్న సుక్కల రవ్వలు తలుకులోత్టు తన్నాయి. రాదారీలాంచీ సప్పుడేదో దూరాన్నించినిపిత్తా వున్నాది. గాలి అలికిడికి సిన్న కెరటాలు వోకోపాలి దొల్లుకుంటా వొచ్చి గట్టు మీద సెదిరి పడతన్నాయి. వొడ్డు నున్న రాయి సెట్టు ఆకులు కదల్తావున్నాయి. సెట్టు మీదున్న పిట్ట గూళ్లు వుయ్యాల్లూ గుతున్నాయి.
    రవణయ్య మనసు రకరకాలుగా పరుగెడతన్నాది!
    గుమ్మం కాడ నిసుకున్నసీతమ్మని ముసలయ్య సూశాడు. రెప్పలోల్సకుండా సూశాడు. సానా సేపే సూసాడు.
    సీతమ్మ దరి కొచ్చింది. దాని సేతులో గాళాసున్నాది.
    "నీకోసం నల్ల తెచ్చాను తాతా!"
    ఆ మాటినీ దాకా ముసలయ్య యీ లోకవులో లేడు. రవణయ్య బాధ సూత్తావుంటే ఆడి మనసు మనసులో లేదు. ఒంటెగాడయి పోయిన రవణయ్య , పిల్లల్ని పెంచి పెద్ద సెయ్యాలిసిన రవణయ్య , బతుకు బరువు మోయలేక అనగారి పోతున్న రవణయ్య -- యిల్లాటి రవణయ్యలు ఆడి కళ్ళ ముందల ఎంతమందో కనిపిచ్చారు! పుట్టిన కాడి నుంచీ సచ్చీ లోపల, సేసుకున్న దాని మేరకి ఎప్పుడూ ఏదేవో బాధ రాకుండా బతగ్గలిగి అదురుట్టవు అంతమందికీ దొరకదు. పురిటి గదిలో సంటిబిడ్డై కేరు మంటాది. వోల్లకాట్లో పీనుగు కట్టి సుయ్యి మంటాది. ఈ రెండింటికి నడాన్న మనిసి! ఎన్నో మనుషులూ , కోరికలు, బాధలు, కోపాలూ, సుకాలూ పగలూ, అన్నీ కూడబలుక్కుని మనిషిని గుప్పిట్లో పెట్టుకుంటాయి! సరదా పుడితే ఆడికి పట్ట పగ్గాలుండవు. ఏది పుట్టినా నిల్దోక్కుకొలేడు. అయినా అన్నీ తన సేతుల్లోనే వున్నాయనుకుంటాడు. ఆ నమ్మకవు తోనే ఏమేమో పన్లు ఎందుకేందుకో సేత్తాడు. సిగురికి అయి ఎలాగో తెల్తాయి! అప్పుడు తన్ని సూసి తనే దడుసుకుంటాడు. నాలిక్కోకురుక్కుంటాడు. పళ్ళు బిగిత్తాడు. జుట్టు పీక్కుంటాడు. కావేం లాబవు? అప్పటికే అంతా సేయిదాటిపోతాది!
    సీతమ్మ మనుసుల్లో పుట్ట వోలిసింది కాదు! ఎన్నలాటి ఎన్నిల గుండి. తుపాన్లో వోరికంకిలా కదలాడి పోతాది. గాల్లో దూదిలా ఎగిరి పోతాది. అన్నెం పున్నెం అసలే తెలీదు. దానికిద్దరే సుట్టాలున్నారు. గోదారి తల్లీ! తాతా! ఆయీడు క్కావలసిన  సర్దాలు లేవు. ఏ సరుకూ కావాలని కోరుకోదు. ఇచ్చినా తీసుకోవాలని తెలీదు. అల్లాటి దానికి అప్పుడే దేవుడు అన్ని అనబాలెందుకు పెట్టాలో? తప్పుడు పన్లు, సేసీవోడికి ఎప్పటి కోప్పటికి దండింపు తప్పదు. మరి ఏ పాపం ఎరగనోళ్ళ క్కూడా ఎందుకీ బాధలు? ఏంటీ మాయంతా? దేవుడింత కటికోడెం?
    రవణయ్య పక్కకి సూశాడు. సీతమ్మ బుర్రోంచుకున్నాది.
    "సల్ల తాగవా తాతా?"
    అప్పటికిక్కానీ ముసలయ్య నేల మీద నోల్దోక్కుకోలేదు. రవణయ్య , సీతమ్మా ఎదర కనిపించారు. యిద్దర్నీ యిడిడిగా సూశాడు. కలిసీ సూశాడు. ఆడి పెదాలు తడిగా కదిల్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS