Previous Page Next Page 
వెలుగు వెన్నెల గోదారీ పేజి 24

 

    పదిమంది ముసలయ్య మీదికి యిరుసక పడ్డారు.
    "తాతా!" గిలిగిల్లాడినాది సీతమ్మ.
    కాంతం గుండి సివసివ లాడినాది!
    "ఆగండర్రా! ఏంటా గొడవా?' తువ్వాలు గుడ్డ దులిపి భుజం మీదేసుకొచ్చాడు బద్రయ్య
    ఆళ్ల సేతుల్లో కర్రలు బిగిసి పోయాయి. గుంపులో కొచ్చి తాతను సూత్తా అలాగే నిలుసుండి పోయాడు.
    అడ్నీ సూడ్డవు తోటే అరికాలి మంట నెత్తి కేక్కినాది ముసలయ్యకి.
    కాంతం గుండి కుదుట బడ్డాది.
    "కూడా ఉండి నువ్వు సేయిత్తన్న పనేనేయిది?' తాత అడిగాడు.
    "ఏం సేశారూ?"
    "ఏంటా? కళ్ళు మూసుకుపోయా ఏంటి? ఈళ్ళందర్నీ సేరదీసి తయ్యితక్కలాడిత్తా వున్నది నువుకాదో?"
    "నలుగురూ బాతింలాడితే సెంద్రకాంతం మేళవు పెట్టించాను . తప్పా?"
    "కాదో? నా ఎదటల్లా తిరిగి మాటాడ్డానికి దమ్మెల్లా గోచ్చిందంట?"
    "ఆళ్ల ముచ్చట కోసం పెట్టించానంతే!"
    "ముచ్చట పడ్డాని కాళ్ళేవర్రా?"
    "నా జట్టోళ్ళు!"
    "సేప్పుకోడానికి కూడా సిగ్గు లేదో?"
    "ఎందుకో? నన్ను నమ్ముకున్నోల్లాళ్ళు!"
    "నమ్ముకున్నోళ్ళా? దేనికిరా> నగలు కత్తిరించడానికీ, యిళ్ళు దోసుకొడానికీ, దార్లు కాయిడానికీ, కూనీలు సేయ్యడానికీ ! అవునా?"    
    "అల్లెం అలాంటోళ్ళు కారు!"
    "నోర్మూయ్! నాకాడ నిజవు దాద్డావనుకున్నా వంట్రా? సీరవనవమి పందిల్లలో ఆడోళ్ళ మేళ్ళు కత్తిరించడానికి రావుడిగాడి జట్టును పిలిపించింది నువు కాదో? ఈనాం జవీందారు కారడ్డ గొట్టడానికి ఎంకట్రాయిడ్ని మాటాడించింది నువు కాదో? గుండోరీదు లో దుకానాలు దోసుకోడానికీ సూరయ్య గాడ్నీ రప్పించింది నువు కాదో? బట్టల మూటల బల్ల మీద సరుకు తగలెట్టడానికి సువాని సాయెబు కవురంపించింది కూడా నువు కాదంట్రా?"
    రావుడు గాడు మొగం దాసుకున్నాడు.
    ఎంకట్రాయుడు ఎనక్కి జంకాడు.
    మరాయగాడు సురసురా సూశాడు.
    సువానీ సాయేబుకి 'అల్లా ' గురుతుకొచ్చాడు.
    బద్రయ్య కు దేవులయిపోయాడు!
    "మాటాడయేరా? నేసెప్పింది అబద్దమనీ దమ్మున్నాదా నీకూ?"
    బద్రయ్య తలొంచుకున్నాడు!
    ఆళ్ళంతా రెప్ప లోల్సకండా యిద్దరోంకా సూత్తా ఉండిపోయారు.
    "సెప్పవేం?"
    నోరు మెదపలేదు బద్రయ్య.
    ఆళ్లలో ఆళ్లు గుస గుస లాడుకున్నారు.
    బద్రయ్య గుట్టంతా ముసలయ్య కెలా సిక్కిందో ఎవుడికీ తెలీలేదు!
    "అన్నెం పున్నెం ఎరగనోళ్ళని దోసుకుంటా ఉంటే సూత్తా వూరుకుంటాననుకున్నా వంట్రా? పేనాలు తోడేత్తాను. జాగ్రత్తా! పరువుగా బతకడం సేతకాక వూల్లో వొళ్ల పొట్టలు కొట్టి మీ జేబులు నింపుకుందారనుకుంటన్నా రంట్రా? మనుసులు కారో? వోన్నం తింటవు లేదో? స్సీ! బురద లో పోల్లీ పందులు నయం మీకన్నా!"
    గుంపులో వొళ్ళకి వుక్కురోసవచ్చినాది. సల్లగా బద్రయ్య కాలు గోకాడోదు. ఆడు తలెత్తాడు. తన వొళ్లు, తన్ని నమ్ముకునోళ్ల కళ్ళు నిప్పులు సెరగడం సూశాడు. ఇంక కోపం పట్టలేక పోయాడు. పేనాలికి తెగించయినా ఆళ్ల పరువు నిలబెట్టాలనుకున్నాడు. ముసలయ్య ని టకీమని టోకాయించాడు. "నన్నేనేనా అనుకాని యీళ్ళ వూసేందుకెత్తుతావ్?"
    "ఎత్తితే ఏం సేత్తావురా?"
    ఆ మాట యిండవు తోనే ఆళ్ళంతా ముసలోడి మీదికి వురకబోయారు. బద్రయ్య సేయ్యడ్డవు పెట్టాడు.
    "నువ్ సేప్పినట్టు, యీ బూమ్మీద అన్నాయవు సెయకుండా బతుకుతున్నవోడ్ని వక్కడ్ని సూబిత్తావా ముసలయ్యా? లచ్చలికి లచ్చలు గడిచ్చి, మేడలూ, మిద్దెలూ కట్టి వొళ్ళంతా లాబవనీ, నవుకరీలో నమ్మకవనీ, ఆడదాన్తో ముచ్చటనీ రకరకాల పెర్లేట్టి , తడి గుడ్డల్తో గొంతు క్కోసేవొళ్లంతా పరువు గల వోల్లెనా? పైకి సేప్పేదో మాట, లోన సేసేదింకోటే! పొగలంతా పెద్ద మనిసి, సీకట్లో ఎదవన్నేరేదవ! ఆళ్లు బుద్దిగా బతకరు. ఇంకోళ్ళని బతక నీయరు! ఏవంటావు ముసలయ్య? మాటాడవేం? ఆళ్ళకి తెలిసిందోక్కటే యిద్దె. బక్కటోళ్ళ నీ, నోరు లేనోళ్ళని తవోరిక్కవలసి నట్టు వోడుకుని పీల్చి పిప్పి సేయడవు ఆళ్లకి సర్ధా! తిరగబడి బలవు లేనోళ్ళు ఆళ్ల అడుగులికి మడుగులోత్తుతారు. మేవలాంటోళ్ళం కాం! మాకు బలవుంది. బుర్ర్రుంది. మా కన్నాయవు సేత్తా వుంటే సేతులు కట్టుక్కూకోలెం! మోసవు సేసేటోళ్ళని మోసం తోటే దెబ్బ తీత్తాం! మా గొప్ప మేవూ నిలబెట్టుకుంటాం. నయాన్నీ బయాన్నీ మాకు నచ్చింది మేము గుంజి లాక్కుంటాం. ఆ పనికి అడ్డ వచ్చినోళ్లందర్నీ అలోకానికే పంపేత్తాం! తెలిసిందా? ఇప్పుడు సెప్పు ముసలయ్యా పరువుగా ఉన్నావోళ్ళు మేనా, ఆళ్లా?"
    "అయితే బతకడానికి యింకే దారీ లేదా?"
    "బలుసాక్కూడా పిరమాయిపోయింది తాతో?' అన్నాడో కోటిగాడు కొంటిగా.
    "అయ్యా, ఎనకట్రోజులు తాతా! ఇప్పుడు కాలవు మారినాది. ఉన్నవొళ్లు సత్తే కానీ యిదల్సరు. లేనోళ్లకి ఎడ్డం తప్ప ఏరేపని సేతకాదు . అవునా?"
    "ఏవంటా?' అన్నాడింకోడు.
    "అడేవంటే మనకేంటే హి! నడండి! రావే ఎంకట్రాయిడూ, ఒరేయ్ సూరిగా! పదండే హి ఓరి సాయేబూ , లేగవెం?' అంటా అరిశాడు బంగారయ్య. ఎవుడి కర్రలాడు తీసుకుని కదిలారు. కత్తులూ మెరిసినాయి. గుంపు గుంపంతా వొక్కసారి నడిసినాది. బద్రయ్య కూడా ఆళ్ళేనకాలే ఉన్నాడు.
    ముసలయ్యకి మూరిసొచ్చినంత పనయినాది.
    సీతమ్మ రాయిలా నిలుసున్నాది.
    కాంతం కళ్ళప్పగించి సూత్తన్నాది.
    ముసలయ్య బుర్ర సుళ్ళు తిరిగినాది. గుండి దాడెక్కువయినాది, సేరాసేరా పరిగెత్తి బద్రయ్య నట్టుగున్నాడు.
    "ఏం?" కళ్ళ కొసల్లోంచి సూశాడాడు. "వొద్దు బద్రయ్యా! ఎల్లోద్దు. నా మాటిను. ఎక్కడి కక్కడ పోలీసోళ్ళు కాపలా ఉన్నారు!"
    ఏవంటావు బద్రయ్యా? అల్లా జరక్కుండా ఎవుడి మట్టుక్కాడు మనసులోకి నీసుకంపు రాకుండా ఎప్పటి కప్పుడు తుడుసుకోవాలి. అప్పుడు మనకి అంతా ఎలుగె! ఎప్పుడూ ఎన్నిలే! అందరూ మంచోల్లే!"
    "అల్లా గెప్పటికీ జరగదు ముసలయ్యా!"
    "కాదు బాబూ! తప్పకుండా జరుగుతాది. దానికోసం ఎవుడి మట్టుక్కి నాడు సూసుకోవాలి. సిలగ్గా సిలగ్గా ఎన్న తేరినట్టే సేతీవొడి మంచి తనవూ తప్పకుండా ఎలపలి కొత్తాది! ఇది ముమ్మాటికి నిజం. కొత్తగా నుయ్యి తవ్వినప్పుడు బురద నీళ్ళు పడవా బద్రయ్యా? మన మంచి తనాన్నే సేదగా జేసి, వోపిగ్గా బురద తోడెత్తే సిగురికి తేటనీరు తేరదా? సెప్పు! నేలమీద పడ్డవోడికల్లా మంచితనాన్ని దేవుడు గుండిల్లో పెట్టకుండా ఉండడు. బాబూ! అది తెచ్చుకునీ నేరువు మన్లో ఉండాలి. కాదంటా బద్రయ్యా?"
    బద్రయ్య మాటాల్లేదు . తలొంచుకున్నాడు. మిగిలినోళ్లంతా, ఆళ్ల సేతుల్లో వున్న కర్రల్లాగే నిలుసుండి పోయారు.
    "మనుసుల మంచితనం కుళ్లి పొతే పగ అవుతాది బద్రయ్యా! ఒక్క మాట సేబుతావా బద్రయ్యా! ఎదటోళ్ళు సెడ్డ పన్లు సేత్తన్నారని తెలుసుకునీ, ఆటిని మన దరికి రానీకండా , ఆళ్ల నీసాన్ని ఆళ్లకి తెలీసేప్పుడవు మేలా, ఆళ్లల్లా మనవూ సేడిపోడం గొప్పా? నువ్వు సేసిన దొంగతనాలకి ఎంతమంది తిట్టుకున్నారో యిన్నావా? నువ్వు సేసిన కూనీలకి ఎంతమంది ఉసురు తగుల్తాదో తెలుసుకున్నావా? తొమ్మిది నెల్లూ నిన్ను మోసి, కని, పెంచి ఎన్నో కట్టాలు పడ్డ నీతల్లి -- యిప్పుడింకా నువు సేసీ పన్లు సూత్తే ఎంత ఎడుత్తాదో ఎప్పుడేనా అలోసించు కున్నావా? సెప్పు బద్రయ్యా, సెప్పు!"
    అమ్మ పూసేత్తేతలికి బద్రయ్య కల్లల్లో నీళ్లు తిరిగాయి! ఎవురికీ కనిపించకుండా పక్కకి తప్పుకున్నాడు.
    ముసలయ్య పక్కకి తిరిగాడు. "నీ పేరేంటి తల్లీ?"
    "సెంద్రకాంతం."
    "ఇంకా దరికిరా అమ్మా! నీ పేరు సెంద్రకాంతవా? కాదు తల్లీ, కాదు! నీ పేరు సెంద్రకాంతం కాదు!"
    అందరూ కళ్ళప్పసెప్పి సూత్తన్నారు.
    "అయ్యేకళ్ళు, అదే ముక్కు, సిన్న నోరు, అదే మొకం, అంతా అదే! నువ్వు కాంతం కాదు తల్లీ, కాంతం కాదు!"
    "నాలాటిదాన్ని ఎక్కడేనా సూశావా తాతా?"
    "ఎక్కడో కాదమ్మా యిక్కడే , యిప్పుడే , నువ్వే!"
    కాంతవు తికమికలాడినాది. సీతమ్మ కేం తెల్ధావులేదు.
    "కన్నవోళ్ళు బతికుండగానే నీ కెంత గతట్టిందే తల్లీ!"అంటా కాంతం బుజం మీదికి వోలిపోయాడు.
    "సిన్నప్పన్నించి నన్ను కలావతే పెంచినాది. మాయమ్మా, అయ్యా సచ్చిపోయారు!"
    "కాదమ్మా! కాదు. నీ అయ్య యింకా బతికే వున్నాడు సిట్టీ!"
    "నా పేరు సిట్టి కాదు, కాంతం!"
    ముసలోడు వోలవోలా ఏడిశాడు.ఆడికి పిచ్చేక్కిందేవో అనుకున్నా రందరూ. ముసలితనం రాడవుతో ఆడి మనసు అలా గయి పోయినాదేవో అనుకున్నాది కాంతం.
    "ఏడవకు తాతా! దీనికేం బయవు లేదు. నేవున్నాను. దాని బతుకు నే సక్కబరుస్తాను" అంటా తిరిగాడు బద్రయ్య. అప్పుడు ఆడి కళ్ళనించి పడ్డ నీళ్ళతో ఎయ్యి జనవాల పాపాలు తుడుసుకు పోయినాయి.
    ముసలయ్య మొగవేత్తాడు.
    "నువ్వింత మంచోడి వనుకోలేదు బద్రయ్యా!" అంటా అడ్నీ గట్టిగా కౌగలించుకున్నాడు. బద్రాద్రి రావుడికి మనస్సులోనే దాడ్నాలెట్టుకున్నాడు.
    కాంతానిక్కూడా కల్లంట నీల్లోచ్చినాయి. సీతమ్మ తన సేంగుతో తుడిసినాది. మిగిలినోళ్ళు ఎనక్కి తప్పుకున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS