"వొద్దు తల్లీ! నాకింకేయీ వొద్దు!"
రవణయ్య సీతమ్మెంపు మల్లా సూశాడు. అది తలెత్తలేదు.
ముసలయ్య రవణయ్యెంపు సూశాడు. ఆడి కళ్లలో మెరుపు మెరిసినాది.
ఎనక్కి తిరిగినాది సీతమ్మ. ముసలయ్య పిలిశాడు.
"సూడమ్మా! పాపం ఎంతో దూరం నించోచ్చాడు. సానా అలిసి పోయాడు. ఆ గళాసు యీ బాబు కియ్యి. నీ సేత్తో యిచ్చిందానికి కోటి జనవాల దాగం తీరతాది!"
రవణయ్య గళాసందుకున్నాడు.
సీతమ్మ పయిట సరుదుకున్నాది.
"అంతా నీ సలవ తాతా!" రవణయ్య నోట్తోంటి మాటలు రాలేక పోయాయి.
"నాదేవుంది బాబూ! అందర్నీ సల్లగా సూసీ వోడు ఆ రావయ తండున్నాడు. ఆయన్ని నమ్ముకున్నోడి కెప్పుడూ అన్నాయం జరగదు. ఎవుర్ని ఎక్కడ కలుపుతాడో, యెక్కడదీత్తాడో ఎవ్వరూ సేప్పలేరు." ఆమాటంటా వుంటే ముసలయ్య గొంతుకు లో ఏదో అడ్డడి పోయినాది. కళ్ళు నీళ్ళు సిమ్మినాయి. సేతులు వొనికినాయి.
సీతమ్మ లోని కెల్లినాది. పోతా రవణయ్య ఎంపు సూసినాది.
రాయి సెట్టు నెత్తి మీదకి పాక్కోచ్చాడు సేందురుడు. వోటేలవతల కొబ్బరి కాయల బత్తా లేనక జనం సందుడేక్కువయినాది. ముసలయ్య లగేత్తుకొచ్చి పడ్డాడు.
బద్రయ్య ముటావొళ్లు కల్లు కుండ సుట్టూ సేరి గొడవ సెత్తన్నారు. వొకడి కంట మరోడు యిరుసుకు పడతా, కుండ కాలీ సేయడవుకోసం కొట్టుగుంటన్నారు.
ముసలయ్యకి కోపవాగింది కాదు. ఆళ్లని తిట్టాడు. గట్టిగా అరిశాడు. అళ్ళీనిపించుకోలేదు. దొరికినాడ్నాల్లా బనీనట్టుకు లాగి యీదవోడా ఆదవోడా వోయించాడు. ఓకొడు తిరగబడ్డాడు. మరోడు పక్క కెల్లీవోడు. మల్లీ అందరూ కలిసి కుండ మీద పడివోరు.
ఎనకాతల రైలు పట్టాల కాడ యీలిని పించినాది! ముసలయ్య కి దుడుకుట్టినాది. కానేం సేత్తాడు?
పోలీసోళ్లు దాపుకొచ్చారు. అక్కడికుండక్కడే యిదిలేసి అందరూ కాళ్ళకి బుద్ది సెప్పారు. ఇద్దరు ముగ్గుర్ని పోలీసోళ్లు తరిమారు. అంకలా! ఓ పోలీసోడు పాపం బోర్లబొక్కలా పడ్డాడు. ఇంక సేసీదెం లేక ముసలయ్య మీదిరుసుకు పడ్డారు.
"ఎవురాళ్ళు?" బక్కటోడడిగాడు.
"నా వోల్లె!"
"ఏడిశావ్! ఎన్నాళ్ళనించీ యాపారం?"
"నీ తెలివి తెల్లారిన కాన్నించీ!"
"నోరు ముయ్! సీతకబోడగ్గలం."
"నీ సిత్తం!"
కర్రెత్తబోయాడు బక్క పలాసటోడు . ముసలయ్య సేదల్లెదు. రొండో వోడు కన్ను గీటాడు.
ముసలయ్య నవ్వాడు. ఆ నవ్వులో కిటుకు ఆళ్ల కెవురికీ తెలీలేదు పాపం!
"ఇదుగో సూడు ముసలోడా! మాతో ఉత్తి పున్నాన్ని పేసీ పెట్టుకోకు. గుట్టు సప్పుడు కాకపొతే నీకేం బయం లేదు. లేపోతే యీ యేలనీ సావు మూడతాది!"
మల్లా నవ్వాడు ముసలయ్య.
"ఎర్రి నాయన్లారా! నేనెవకే సచ్చిపోయాను. నాతొ ఎందుకీ గొడవ? మీ పనేదో మీరు సేసుకోండి!"
బక్కటోడికి సిర్రేత్తుకోచ్చినాది. గట్టిగా రోండుసార్లు యీలూదాడు.
వోటేల్లోంచి సేంద్రకాంతం ఎలపలి కొచ్చినాది.
పోలీసోళ్ల కళ్ళు తలుక్కుమన్నాయి!
ఎనకాతలే బద్రయ్యా వొచ్చాడు.
బక్క పలాసటోడు మొకం సిట్లించుకున్నాడు!
గుడిసి లోంచి సీతమ్మ కూడా లగేత్తుకోచ్చినాది. పక్క నించి రవణయ్య కలిశాడు. ఎనకాతల ఎంకన్నా వొచ్చాడు!
అంతమందిని సూడ్డవుతో పోలీసోళ్లకి అదురుట్టినాది. బక్కటోడు మల్లా యీలేశాడు.
సిటికి లో ముగ్గురు పోలీసోళ్లు దిగొచ్చారు.
ఎనకాతలే సర్కిలూ మోటారోచ్చి గట్టు మీదాగింది! ఆడ్ని సూసి బక్కటోడు , పక్కవోడు బెరుకు బెరుగ్గా సలావు లేట్టారు.
సర్కిలినస్పేట్టరు దగ్గిరుండి ముసలయ్య సేతులికి బేడీలు వేయించాడు. బక్కటోడు కల్లు కుండ తీసుకు పట్టుకున్నాడు.
బద్రయ్యా, రవణయ్య , ఎంకన్నా అక్కడున్నారన్న మాటేకాని సోరవసేసి ఎదట కెల్లలేక పోయారు!
సీతమ్మ వోలవోలా ఎడిసినాది. రవణయ్య గుండి సేరువయినాది. బద్రయ్య ఆడి కాళ్లట్టుకు వోదల్లేదు.
"వొద్దు తాతా! నువ్వెక్కడికి ఎల్లోడ్డు. నువు లేకపోతె మేం సచ్చిపోతాం!"
"నే నెక్కడికి ఎల్తా బద్రయ్య! ఎప్పుడూ మీ మనస్సుల్లో ఉండనో?"
సీతమ్మ ముద్దలా పడిపోయినాది. తెలివి తప్పిందనుకున్నాడు రవణయ్య.
అప్పటిదాకా గోదారొంక సూతన్న ఎంకన్న కొంచెం కదిలాడు.
"మా తాత నెందుకు పట్టుకున్నారు బాబూ?" బద్రయ్య అడిగాడు.
"ఎందుకా? దొంగతనంగా సారాయాపారం సెత్తన్నందుకు!"
"ఆడు కాదండయ్యా! ఈ యాపరవు నాది! కావాలంటే నన్ను తీసికెల్లండి!"
ముసలయ్య నవ్వాడు.
"వుట్టిది బాబూ! ఆళ్ల మాటలు నమ్మకండి. యీ యాపారవంతా నాదే! యీళ్ళూ నా పిల్లలు. నన్నిడిసుండలేక ఆల్లాగంటన్నారు. ఆళ్ల మాటలినకండి. మనదార్ని మనం వెల్దాం , రండి!"
బద్రయ్య యిదల్లేదు. రొండదు కర్రలోచ్చి అడ్నీ ఎనక్కి తోసేశాయి.
ఎంకన్న ఎనక్కి తిరిగాడు. ముసలయ్య ఏదో సెబుదారని నోరిప్పాడు. మాటలు రాలేదు. ముందుకి రాబోయాడు. పోలీసోళ్లు ఎనక్కి లాగేశారు. ఎంకన్న అల్లాగే సూత్తా నిలుసుండి పోయాడు. ముసలయ్య సంతోషంగా ఆళ్ళతో ఎల్లిపోయాడు!
ఎంకన్న మనస్సు పీకినాది. ముసలయ్య ఎందు కబద్డవు సెప్పాడు? తను సేసిన తప్పుడు పనికి ఆడేందుకు జేయిలు కెళ్లాడు? తన మీద అంత కనికార వెందుకు సూబించాడు? అసలు తనకీ, ఆడికీ సుట్టరికవేంటి? ఎంకన్న గిజగిల్లాడిపోయాడు!
ఆళ్ళంతా లోన కెళ్లి పోయారు. ఎల్లలేదు, ఏమో బొమ్మలు కదిల్నట్టే కదిలారు. కొండ మీంచి పడతాన్న ఎన్నిల సెట్టు గుబుల్లో నిలిసి పోయినాది!
గదిలో దీపం సన్నగా ఎలుగుతోంది. ఎంకన్న యీ ఎంపు నించి ఆ ఎంపుకి వొత్తిగిలాడు.
రావులమ్మ వుండుండి మూలుగు తన్నాది. నిద్దర్లో ఎడుత్తాది. ఉసూరని వూపిరి దుల్తన్నాది.
గట్టు మీద ఆవు అరిసినాది. పిచ్చి కుక్క మొరిగింది. పడవ మీద పల్లెడేవురో ఏదో రాగం తీత్తన్నాడు.
ఎంకన్న మల్లా కునుకట్టలేదు. బల్ల మీద దోల్డుతున్నాడు.
రావులమ్మకి తెలివోచ్చినాది. మూలుగెక్కువయినాది. ఎంకన్న తలతిప్పి సూశాడు. నేత్తిని కట్టు, సెదిరిన జుట్టు , కయిలి పోయిన మొగవు, తోటకూర కాడల్లా కనిపిత్తన్న సేతులూ! దాన్ని అప్పుడే ఆడు సరింగా సూశాడు.
అయినా ఆడి మనసు మారలేదు. గోడమీదున్న బొమ్మని సూసినట్టే సూశాడు.
రావులమ్మ గొంతు కేండి పోయినాది. సుట్టూ సూసింది. గోడ మూల నీళ్ళ కుండ కనిపించినాది. గళాసు లేదు. మంచం మీద లెగిసి కూకున్నాది. కిటికీ కాడ నిలుసుని ఎలపలికి సూత్తా వున్న ఎంకన్న కనిపిచ్చాడు. అడ్నీ సూసి వోనికి పోయిందది. గుండి దబదబా కొట్టుకున్నాది.
ఏదో అందారనిపిత్తాది. నోరు పెగల్డు. గొంతుకు తడారి పోయింది. మాట రాదు. మంచవు మీంచి లెగిసి నిలబడ పోయినాది. కాళ్ళు కదల్లేదు. ఎనక్కే తూలీ పోయినాది.
"అడిల్లా గెందుకయి పోయాడు? మొన్న మొన్నటి దాకా తన్ని కన్ను రెప్పలో దాసుకుని మురిసి పోయీవొడల్లా ఎందుకింత మారిపోయాడు? దీనికంతకీ కారనవు తనే! తనే, తనే! పట్నవెల్లి అంటికాయిలు అమ్ముకు రమ్మందేవరు? సుక్కల సీరలూ, రంగుల రాయికలూ తెమ్మందేవరూ? ఆడు ముచ్చట పడి తెచ్చిన కోక కట్టుకోకుండా సీదరించుకు తోసిసిందేవరూ? పట్నం లో ఆడు బోగం కొంపలు సుట్టూ తిరుగుతా వుంటే ఆడి మనసు తిప్పుకోలేక సేడామడా తిట్టిందేవరూ? అయినో డల్లాగయిపోయినా పిల్లల కోసమని రవణ య్య మావ మీద మోజు పడిందేవరూ? సిగురికి అన్ని కోరికలూ సంపుకుని సీకటి కొట్లో దాగున్న దెవరూ? మొగోడి సర్దాలు తెలుసుకోలేక , తన సుకాన్నీ మొగుడి సుకాన్నీ నీళ్ల కోదిలిందెవరూ? యీటన్నింటికీ కారనం ఎవరు? ఎవరు?"
రావులమ్మ మల్లా లెగిసినాది. నెమ్మలంగా గోడట్టుకుని మూల కెల్లింది. కుండ మీద మూకుడు తీసి నీళ్లు తీసుకోబోయింది. సేతులు పట్టుతప్పినాయి. కళ్ళు సీకట్లు కమ్మినాయి. తల తిరిగి పోయినాది. అంతెత్తు మనిసీ , రావులమ్మ నేలమీద బోర్లా పడిపోయినాది.
గిరుక్కుని ఎనక్కి తిరిగాడు ఎంకన్న. ఆడి గుండి సివుక్కుమన్నాది. దాపు కెళ్లాడు. మూకుట్టోకి నీల్లోంచి, మొకం మీద కొట్టాడు. రెండు సుక్కలు నోట్లో కూడా పోశాడు.
ఆడి బుర్రలో ఏయేయో సంగతులు సురుగ్గా తిరిగి పోయినాయి!
బాలయగారూ, సత్తేన్నాయినగారూ, రావోణయ్యా, బద్రయ్యా , సెరబయ్య , సేందరకాంతం , సీతమ్మా , సిగురికి ముసలయ్యా , ఇప్పుడు రావులమ్మా, ఎవురీళ్ళంతా? ఈళ్ళందరికీ తనేవుడు? ఈ పెపంచం లో మంచేంటి? సుకవేంటి? కనికారవేంటి? ముసలయ్య తనమీద దయ ఎందుకు సూబించాడు? రావులమ్మ తన్ని దేనికి నమ్ముకున్నాది? ఏంటి, ఏంటి , ఏంటి దంతా?
రావులమ్మ కల్లెత్తి సూసినాది. అడికాళ్ళ మీదకి వొలి వోలవోలా ఎడ్సినాది.
"ఎడుత్తా వెందుకు? లెగు!" ఆ మాటలు ఎంకన్న గొంతుకు లోంచి ఆగాగి వొచ్చినాయి.
మొట్టమొదటి సారిగా ఎంకన్న కళ్ళు సెమ్మరించినాయి. దాని సేతులట్టుకు తడివాడు. సల్లగా కలవకాడల్లాగున్నాయి. కల్లల్లో వూపిరితగ్గినాది. అడు గిజగిజలాడి పోయాడు.
"వొద్దురావే! నువ్వు సావడాని కీల్లేదు. నేను సావనియ్యను. ఎంత డబ్బయినా కరుసు పెట్టి నిన్ను బతిగించుగుంటాను! రావే! నిన్ను కల్లల్లో దాసుకుని కనిపెట్టుగుంటాను!"
దాన్ని గుండి కొత్తుగున్నాడు!
ఎలపల్నించి యేలపాట యినిపిత్తన్నాది.
సెట్టు మీద పిట్టలు కిసకిస మన్నాయి.
రావులమ్మ పెదాల్లో ఏయో మాటలు కదలాడినాయి!
పాకిపాకి గోదారి పై కొచ్చి నీళ్ళ మీద పడ్డ ఎన్నెల్లో గోదారి గట్టంతా ఎలిగి పోతన్నాది!
(సమాప్తం)

