సతీసావిత్రి
ఆడపిల్లలు "ఆవారాలు" ఎందుకు అవుతారో అర్థంకాదు-ఎంత ఆలోచించినా. ఆడదాని కదలాడే ఎడదను కాపాడే కనుల ముకురం ఉండదా వీళ్ళ దగ్గర?
దేవునితోడు నాకైతే వాళ్లు కాకమ్మ కథలో కనిపించే గంధర్వాంగనల్లా కనిపిస్తారు. ఏమిటి పరపురుషుల్తో కళ్లు కలపడం- ప్రేమలేఖలు రాయడం.... ఇంకా..... ఇంకా..... అబ్బా! సిగ్గేస్తుందబ్బా! విన్న మాటలు కాదు కంటితో కన్న కథ చెపుతాను.
ఇంకా నేను ఏడో క్లాసులోనే ఉన్నాను, పారాల్లో కాదుకాని అమ్మా అక్క చెప్పేది నరకాన్ని గురించి. అబ్బో వణికిపోయేదాన్ని, ఎంత ఏడ్చేదాన్నో- నన్నుమించిన వారుండేవారు కారు. పన్నేండేళ్ళన్నా లేవు-మాటంటే పడదు- మూతిముడుచుకూర్చుంటుంది అనేది బామ్మ. అవును అర్థంలేని ఆలోచనలు - నా గుండె అంత - ఏంచేయమంటారు?
మరిస్తిని.....ఏమిటీ చెప్పదల్చకున్న కథ.....? ఆ జ్ఞాపకం వచ్చింది- నేను ఏడోక్లాసులో ఉన్నప్పుడు ఒక అప్సరసను చూచాను. షీలా మెట్రిక్ లో ఉంది. అబ్బా మెట్రిక్ చదివేవాళ్ళ టెక్కు. క్రింది క్లాసులవాళ్లు వాళ్ళను నిజంగానే అప్సరసలనుకుంటారు. నేనైతే షీలాకంటే అందమైన అమ్మాయిని చూళ్ళేదబ్బా! రానా అంటుంది. సజ్జూ! షీలా నీ కాలిగోటికి కొరగాదని. సిరాజు ఏమంటాడంటే నా కళ్లు చేయడానికి దేవుడు పాపం చాలా కష్టపడ్డాట్ట. ఏ లక్షసార్లో స్కెచ్చులు వేసి చెరిపి ఉంటాడంటాడు. మరి నవాజు.....నవాజు.....అతనికి సిగ్గేలేదు. వాడి కళ్ళు ఎప్పుడూ నా.....నా మీదే. ఛ ఏమిటిది. నా కథ వినిపిస్తున్నానా మీకు!
ఏమోనబ్బా బాగా చదువుతారు- అందంగానూ ఉంటారు.....వాళ్ళ చేష్టలు చూస్తేనే చిర్రు. షీలా విషయమే చూడరాదూ- ఎప్పుడూ ఫస్ట్ డివిజన్ లో పాసవుతుంది. స్కూలు వార్షికోత్సవం అవుతుందా పది పది ఫ్రైజులు కొట్టేస్తుంది. డాన్స్ లో ఫస్టు, డ్రామాలో ఫస్టు, రన్నింగ్ లో ఫస్టు, ఆమె పరుగు వేగం ఒకనాడు గ్రహించాను. ఆమె చేతిలో గులాబీ కవరుంది. ఉరుకుతూంది. అష్రఫ్ ఆమెను అడ్డగించాడు-నిండు క్లాసులో. అప్పుడు చూడాలి ఆమె గతి! ఏమైందనుకున్నారు- బిక్కచచ్చిపోయింది. ఇహ అష్రఫ్ ఏంచేశాడో తెలుసా? ఉత్తరం తెరిచాడు. టీచర్స్ రూములో గట్టిగా చదివాడు. అమ్మాయిలంతా కిటికీల్లోంచి తొంగితొంగి చూడ్డం. టీచర్లు గడ్డిస్తే ఊరుకుంటున్నారా-పగలపడి నవ్వుతున్నారు. అది నవ్వడానికి కరువులేని కాలం. ఎందుకు నవ్వాలేమిటి? నవ్వడమే పని. ఏమీ లేదనుకోండి- అమ్మా అక్క ఎలక తోక జడచాలు-లేదా తొంబ హెడ్ మిస్ట్రెస్ టిక్కు టిక్కు నడక! ఏదైతేనేం నవ్వడం- అది నవ్వుల కాలం.
రెండోరోజు స్కూలుకెళితే షీలా భుర్ర్. మాకంటే చిన్నపిల్లలు కూడా గుటకలు మింగుతూ చెప్పుకుంటున్నారు- షీలా మీద మహమూద్ పడిచస్తాడని. ఈ విషయాల్లో అబ్బాయిలంత మొద్దులు కారు-అమ్మాయిలు. అబ్బో వాళ్లు చాలా తెలివైనవాళ్లు' బొమ్మలాటలోనే గ్రహిస్తారు. ఏ బొమ్మంటే ఏ బొమ్మ పడిచస్తుందో, ఆహా-షీలా అదృష్టమే అదృష్టం. ఏమంటారా? మహమూద్ కు మోటర్ సైకిలుంది. మహమూద్ అంటే బళ్ళో ఆడపిల్లలందరికీ ప్రాణం. సాదిఖ్ అక్కను స్కూలుకు తెచ్చేవాడు మోటార్ సైకిల్ మీద. ఇహ మా ఆషూ అత్త ఉంది. అబద్ధం ఎందుకు చెప్పాలి కాని వరుసకు బావల్ను నలుగురైదుగురిని ఎంచుకుంది. వారిమీద పడిచస్తానని ఆఫర్ ఇచ్చింది.
అబ్బో! మా అమ్మమ్మకు వలపు వాసన మైళ్లదూరంనుంచే వస్తుంది. వాసన బట్టి మొరుగుడు సాగిస్తుంది. ఇహ మా అమ్మ! వయసులో ఉన్న ఆడపిల్లలంటే టైంబాంబు కంటే తక్కువగా భావించదు. అయినా ఆషూ అత్త ఆటలు చూస్తూ ఊరుకునేవాళ్లు- పెదవి కదిలేదికాదు, ఎందుకంటారా ఆమె వయసు మా చిన్నమ్మకంటే ఎక్కువ. చిన్నమ్మ కూతురు రాహత్ నా క్లాస్ మేటు సరే అమ్మ అన్నదే నిజం అనుకుందాం. ఆషూ అత్త నల్లది-అందవికారి. అయితేమాత్రం-వరునీ వాళ్లు మా ఇంటి గడపే తొక్కడం మానేయడం ఎందుకు? ఇహ నసీం పిన్ని ఉంది పెళ్ళికోసం నిరీక్షిస్తూనే మెట్రిక్ పాసైంది. ఎఫ్ ఏ. అయింది, బి.ఏ. అయింది. ఎం.ఏ. దాకా వచ్చేసింది. బామ్మ వరునికోసం కుట్టించిపెట్టిన బట్టల ఫ్యాషన్ మారిపోయింది. జలతారు మాసిపోయింది. అమ్మ, బామ్మ పొరుగున జరిగే పెళ్లిని గురించి ముచ్చటపడ్తే, నసీం పిన్ని కాలేజీ కథలు వందలు చెపుతుంది. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. కట్నం గిట్నం లేవు-క్షణంలో పెళ్ళి జరిగిపోయింది. మొదలు మొదలు ఇలాంటి కథలు వినేదా బామ్మ-బీరాలు తీసేది. తుదకు నసీం పిన్నిని తనదారి చూచుకొమ్మంది. అయినా పప్పులు ఉడకలేదు. కాలేజీలో నసీంను అంతా "అక్కా" అని పిలువసాగారు.
ఇంతకూ ఏమిటబ్బా నేను చెప్పవచ్చింది? ఆఁ గుర్తుకు వచ్చింది. స్కూలు విషయంగదా! ఆ మోటార్ సైకిల్ అబ్బాయి షీలా కళ్లమీదపడి చచ్చేవాడు. అలా అనుకునేవారు స్కూల్లో అంతా. ఆ రోజుల్లోనే అమాంతంగా నాకు నా కనుల వెలుగును గురించి ధ్యాస కలిగింది. రానాకు నా కళ్ళంటే చాలా ఇష్టం. నా కనుచూపు చాలా విలువైందని అర్థం అయింది. అబ్బ ఎంత భయం నాకు? ప్రతివాడూ దోచుకునేవాడే అనిపించేది. రాత్రిళ్లు దడుచుకొని లేచేదాన్ని. ఎవరో నా పక్కన ఉన్నాడని భయం! వెధవ కళ్లు-వాటి వెలుగు ఎక్కువవుతూంది. స్కూలుకు వెళ్తుంటానా దారినడిచే వాళ్ళంతా తిరిగి చూసేవాళ్లు. ఇహ టీచర్లు బుగ్గలు నిమురుతూ వెళ్ళేవారు, నా వళ్లు మండేది.
దీన్ని మీరు కథ అని చదువుతుంటారు. అవునా! మీకెలాంటి అపోహలు కలుగుతాయో చెప్పనా? చందమామలాంటి నా ముఖంతో నేనేదో చాలా లాభపడ్డానని. మట్టి అలాంటిదేమీ లేదు. నన్నేం షీలా అనుకున్నారా మీరు రాత్రికి రాత్రే లేచిపోవడానికి! బాల్యం నుంచే నా ప్రణాళిక వేరు. ఒక ఆదర్శ పురుషుణ్ణి గురించి కలలు కంటున్నాను, ఇహ ఈ నేలమీద నడిచేవాళ్ళూ పురుగుల్లాంటి జనం, కోరికలు మింగిన కొంచపు యువకులూ నా కళ్ళకు ఆనుతారా? పూర్వకాలంలోనైతే నావలె అసదృశ చాతుర్యం కలిగి, అసమాన రూప సౌందర్యం గల రాజకుమారి జన్మిస్తే భగవంతుడు ఆమెకోసం దూరదేశాల్నుంచి చంద్రునిలాంటి రాజకుమారుణ్ణి పంపేవాడట. అట్టి సుందర రాజకుమారుడు ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు, ఏడు సముద్రాలు దాటేవాడు. ఏడు పర్వతాలు ఎక్కేవాడు. అప్పుడు రాజకుమారి దగ్గరికి వచ్చేవాడు. ఆమె ఏంచేసేది? తన హృదయ కమలంలో అతణ్ణి దాచేసేది. అందుకే నా కాలేజీ మిత్రులతోను, వరుసకు సోదరులతోనూ ఢంకా బజాయించి చెప్పాను నేను అలాంటి ఇలాంటి అమ్మాయిని కానని. నా ఛాయలకు వచ్చి చూడండి, నేనెలాంటి బట్టలు కట్టినా, ఎంత మేకప్ చేసినా, నా కళ్లు ఎన్ని వెలుగులు విరజిమ్మినా, నా బుగ్గలో ఎన్ని గులాబీలు విరిసినా..... నా.... నా.... ఛ ఈ మగాళ్ళ చూపులు ఎంత చెడ్డవి! మగాళ్ళా! వాళ్ళకు గుణపాఠం చెప్పడం నా దగ్గర నేర్చుకోండి. ఎంతోమందికి బుద్ధి చెప్పాను. ఎంతోమంది బుర్రలు సరిచేశాను, అయినా ఏడీ నన్ను ఆదరించేవాడు? నా విలువ కనుగొన్నవాడు?
నిన్నంటే నిన్నటిమాట బల్ఖీస్ లేదూ వెధవముండ. అది ఒక వెధవ బట్టల దుకాణంముందు నుంచుంది. దానిపక్కన వాడులేడూ కళ్లు నెత్తికెక్కిన అహ్మద్ వాడున్నాడు. ఆ ఏడుపుముఖం ముండ ఒక చీమిడిముక్కు పోరణ్ణి ఎత్తుకుంది. ఆ పుండాకోరు వేషంలో కూడా తనను ఫిలిం హీరోయిన్ అనుకుంటుంది. హఁ. అందరూ అనుకునేదేమంటే ఏ సినీతారా బల్ఖీస్ అండంతో పోటీ పడలేదని. నా కళ్ళకేమో దానికంటే వికారి కనిపించందే! అహ్మద్ ఉన్నాడే వాడు నన్ను గుటకలు మింగుతూ చూస్తున్నాడు. అప్పుడు బల్ఖీస్ నామీద ప్రేమ ఒలకబోసింది. 'అరే సజ్జూ ఎంత మారిపోయావ్ సురేందర్ నిన్ను వదిలేశాడని తెలిసి చాలా బాధపడ్డాననుకో. అరే నువ్వు మా పాపను చూశావా? మాటలు నేర్పించి. నిన్న ఏమందో విన్నావా 'మమ్మీ నా పెళ్లి చేసెయ్' అంటూంది." తరవాత పెళ్ళాం మొగుడు నవ్వుకుంటూ వెళ్లిపోయారు. జనానికి ఈ నవ్వుల ఖజానా ఎక్కడ దొరికిందో!
సురేందర్ నన్ను వదిలేశాడమ్మా బల్ఖీస్ కు ఎందుకు బాధ? ఏమనుకుంటుందని? నేను ముగ్గురు చీమిడికారే పిల్లల్ని ఎత్తుకొని నా సౌందర్యం వడిపించుకోవాలనా! నేనేంచేశానో తెలుసా? సురేందర్ ముఖాన ఊశాను. నన్ను వలచేవారు తక్కువ ఉన్నారనా! నేనేమిటో దానికి తెలీదు. ఒక్క కులుకు కులికానో వేలమంది చావడానికి సంసిద్ధం. అయినా నాకు అహ్మద్ ను గురించి ఆశ్చర్యం కలుగుతుంది! ఎంత రసికుడు ఎలా పాడైనాడు. అతనికి "ఆడదాని ఆత్మ" అని పేరుపెట్టాడు సిరాజ్. వేలుమంది ఆడవాళ్ళలో ఆడదాని ఆత్మను వెదుకుతున్నానంటాట్ట! వెర్రివాడు!!
