కాలం గడిచింది. నువ్వు నన్ను వొదిలినచోటే నుంచుని నేను యింకా దిక్కులు వెతుకుతున్నాను. నువ్వా! నువ్వు ఎన్ని యోజనాలు దూరంగా కొట్టుకుపోయినావు?
ఈనాడు నేను దోసెట్లో విచ్చిన మల్లెపూలకేసి చూస్తో తల పైకెత్తి "జ్ఞాపకముందా!" అని కళ్ళతో ప్రశ్నిస్తే "యింకా ఆ పిచ్చి వొదలలేదా" అని సనాతన స్మరంతో తొలిగి వెళ్ళిపోతావు. నా ప్రేమ కళేబరాన్ని నీ కళ్ళల్లో చూస్తాను నేను.
రాధ వర్ణనలు చదివినప్పుడల్లా , నువ్వునన్ను కోరిన దినాల్లో నీ దూపం జ్ఞాపకం వొస్తుంది. యేళ్ళు గడిచిం తరువాత , హృదయానికి చాలా సమీపపరులైన మిత్రులతో కలిసి విహరిసో యిసిక తిన్నెల మీద గోదావరి గీసి వోదలిన చాళ్లు చూసినప్పుడు, నీ పక్షం మీద వొంపుగా లేచిపడే చంద్రహరపు మెరుగు జ్ఞాపకం వొచ్చి పరధ్యానంలో పడేవాణ్ణి. ఎండాకాలంలో నున్నటి శిలలమధ్య ప్రవహించే తుంగభద్ర నీళ్ళల్లో సాయింత్రపు పచ్చని యేండ ప్రతిఫలించినప్పుడు, యేదేవుడు తనవేళ్ళతో, పెదవులతో, యీ బంగారు నీటి పాయల్ని నదీ పక్షం మీద యిట్లా చిక్కు పడేసి పోయినాడు అనుకుని -- జ్ఞాపకం వుందా?
----------
ఒకసారి అం-----కొల్లేరు మీద పిట్టల వేటకి వెడుతో నన్ను ఆహ్వానించారు. అందమైన ఉదయం. ప్రియులతో విహరించడానికి దేవత లుద్దేశించి కటాక్షించిన ఉదయం. ఏ స్వర్గంలోనో రాత్రి ఉత్సవమై అక్కడి నుంచిన బంగారు నీరు వజ్రాలపొడి యీ లోకం మీద వొలికింది గావు ననిపించింది. గాలి కూడా ఆ జ్ఞాపకాలతో దక్షిణం నించి మా సైకిళ్ళ వెంట పరుగెత్తుతోంది. స్కూలు పిల్లవాడివలె. రెండు తాటిదుంగల మధ్య మంచాన్ని కట్టి దాని మీద ప్రయాణం నీటి మీద. మాతో ఇద్దరు పడవవాళ్ళు . రోజంతా నీటిమీదే గడపాలని నిశ్చయం. భోజనాల మాటలూ, నా సహచరిణి Book of verse పద్యాల పుస్తకం పైగా తుపాకీ. గట్టు దాటి పదిగజాలు వెళ్లేమో లేదో నేను స్తలచరననీ, నాది మట్టితో చేసిన దేహమనీ , ఆకలికీ కామానికీ బానిసననీ అన్నీ మరిచిపోయినాను. అది ఇంకో లోకం. శ్రీ శ్రీ మరో ప్రపంచం కాదు. --------
నీరు కనపట్టం లేదు ఆ పువ్వుల్లో. మైళ్ళకి మైళ్ళు ఎటు చూసినా పువ్వులు. రకరకాల పువ్వులు ఆకులకి కూడా స్తలం లేకుండా పువ్వులు. రంగు రంగుల పువ్వులు. పువ్వుల్నీ తీగేల్నీ చీల్చుకుంటో నీటి నీలపు చాలుని ఎండలో తళతళ లాడిస్తో "పడవ పయనం". మా పైన మా చుట్టూ కనపడకుండా ఎన్నడూ వినని కొత్త పక్షుల అరుపులు. ఒక్కటే లోపం -- ఇద్దరమూ మొగవాళ్ళం యాత్రికులం నా స్త్రీ మిత్రుల్ని తలుచుకున్నాను. ఒక్కొక్కర్నే! ఎవరెవరు ఏమని వుంటారో! ఏం చేసివుంటారో ! ఒక్కరైనా-
పువ్వులు నవ్వుతున్నాయి. పిట్టలు అరుస్తున్నాయి. చల్లగా నీళ్ళు తగులుతున్నాయి. సూర్యుడు తళతళ మంటున్నాడు. చల్లని గాలి మా చొక్కా కింద నించి తాకుతోంది. రెండు మైళ్ళ దూరాన పదివేలమంది. దాంటో నూటికి తొంభైమంది ఎన్నడూ యిటు రాని వారు. కాయితాలు దస్కతులు చేస్తున్నారు. వొండుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. తూస్తున్నారు. డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. ఇళ్ళు కట్టుకుంటున్నారు. అనందం అనుభవిస్తున్నా మనుకుంటున్నారు. ధన్యులమని కులుకుతున్నారు.
నా మిత్రుణ్ణి పడవని, నన్ను, నా అల్పత్వాన్ని, కాల్చే నా నీరీశ్వరత్వాన్ని అన్నిటినీ మరచి తన్మయున్నయి, సౌందర్యమయున్నయు కూచున్నాను, ఎంతసేపో నిశ్చలంగా కలలు కన్నాను. మళ్ళా తెప్పిరిల్లి ఆ పువ్వుల్లో ఆకాశంలో మనసు కలిపాను.
ఎంతసేపయిందో! పడవవాళ్ళు దిగిపోతున్నారు. ఎక్కడికో పోయిన ఆత్మకు లాక్కొచ్చాను, ఆ పడవ మీదికి ప్రస్తుతంలోకి. మిత్రుడు తయారవుతున్నాడు, సమయమాసన్నమైనట్టు. మేమో దుబ్బుని ఆ నీటి మధ్య ఒక దుబ్బుదీవిని సమిపించాము అప్పటికి. నేను అంతవరకు గమనించనేలేదు. ఆ దుబ్బునిండా గూళ్ళు కట్టుకుని, ఆ నీటి మధ్య యే భయమూ ఎరక్కుండా , కాపరాలు చేస్తున్నాయి నీటి పక్షులు. సముద్రమద్యాన మయుడు కట్టిన పట్టణం జ్ఞాపకం వొచ్చింది నాకు. ఈపడవ మనుషులు వెళ్ళి వాటిని లేవకొడుతున్నారు. నా మిత్రుడు తుపాకిని సవరించుకుంటున్నాడు. ఈ మనుషుల అదిలింపులకి దడిసి పెద్ద కేకలతో protests (ప్రోటేస్ట్సు) తో , గుడ్లను పొదిగే బాలింతలు, పిల్లలకు చల్దులు పెట్టె తల్లులు, ప్రియుల్ని ఎదురుచూసే ప్రేయసులు అన్నీ పైకి లేచాయి. వాటి దృష్టి ఆ గూళ్ళ వేపు పెట్టి గుండ్రంగా తిరుగుతున్నాయి ఆ రెల్లు పొదల చుట్టూ. నా ప్రాణం చివుక్కుమంది. నా అనందం భగ్గుమనే మంటలో కాలి బొగ్గయిపోయింది. ఏ దుఃఖాన్ని భయాన్ని యెరగని ఆ పక్షి పట్టణంలో ఆర్తనాదాలు నింపడానికి, ఆరని మరణ వేదనల్ని వదలడానికి వోచ్చామా యింత దూరం పని పట్టి? ఈ పుష్పాల నవ్వులలో, ఆకాశం శాంతత్వంలో , యీ నీటినీలం మీద రక్తపు చారలు అలకడానికా యీ యత్నమంతా?
తుపాకిని చూసి వోణికాను. ఆత్రుతపడే మిత్రుడి మొహాన్ని ద్వేషించాను. భరించలేను. ఏం చెయ్యను? వొద్దని గోల చెయ్యనా? తుపాకిని నీటిలో పారేయ్యనా? వింటాడా? నేను అతిధిని! నాకేం హక్కు వుంది? వెళ్ళిపోనా! ఎట్లా పోను?
