Previous Page Next Page 
మ్యూజింగ్స్ - 1 పేజి 24

 

    పూర్వత్తరపు నవ్వు నగలు ధరించి కూడా , నా మనసు భ్రమింప చేసింది --- నా ప్రేమా, నా సానుభూతా లేక నా కళ్ళలోని మెప్పా! ఏది ఆమెని ఆకర్షించగలిగింది/ చెప్పదు. ఆమెకే తెలీదేమో! నా మాటల సొగసు అని చెప్పి నవ్వుతుంది. మూగినైన నా మాటలు! ఆమె Silhoutte ఆమె మెడ దగ్గిర్నించి కాలి చిటికిన వేలు వరకు వుండే విల్లు వొంపు నన్ను తన్మయుణ్ణి చేసింది. ఆమె తన అరిచేతి మీద తలనానించుకుని పడుకుని మాట్లాడుతూ వుంటే, ఆమె వంక చూసి హృదయం ఝల్లుమంటే, చూడలేక కళ్ళు తిప్పుకునేవాణ్ణి, ఆమె శరీరాన్ని బుజాల దగ్గిర్నించి చెక్కినట్టుండేది. ఆమె చిరునవ్వు చంపల్ని స్విచ్చి నొక్కినట్టు వెలిగించేది. ఆమె సంసార క్షోభలు ఆమెలో Tragic romance నిచ్చాయి. ఆమె వింత భాష మాటలకో మాధుర్యాన్నిచ్చింది. అనుభవం లేని నా లేత తల, ఆమె వక్షం మీద, మధువును గ్రోలినంత కైపెక్కింది. ప్రౌడాంగ నాలింగనాన్ని ఆకస్మికంగా సంపాయించగలిగిన నేను, ఎక్కడ నడుస్తున్నదీ ఏమి చేస్తున్నదీ ఏమి కాబోతున్నదీ మరిచి పోయినాను. నా చిన్నతనపు మోహాన్ని అరిచేతిలో ఉంచుకుని, చిరునవ్వుతో నిదానంగా చూస్తో, యీ వరాన్ని ఏమి చేసుకుందామా అని యోచిస్తూన్నట్టు వుండేది ఆమె వాలకం.
    కాని వుత్తరాల్లో వింత అగ్ని కురిపించేది.
    ఈ రొమాన్సుల్ని ప్రజలు కేవలం తమాషాల క్రింద pastimes కింద చూస్తారు. "ఇంక లోకంలో అందమైన ఆడవాళ్ళే లేనట్లు యేడుస్తావేంరా?" అంటాడు పంతులు. ప్రతి ప్రేమనుభావాన్ని అతి serious గా తీసుకుని, అదే జీవితానికి మకుటం అనుకున్నట్టు వ్యవహరించే పురుషులు, పురుషుడికి ఆ అభిప్రాయాన్ని కలిగించగలిగిన స్త్రీలు అరుదు. ఎన్ని Disappointments జరిగినా, యెన్ని అనుభావాగ్నులు క్రూరాశ్రువులలో చల్లబడినా, యింకా మోహంలో  విశ్వాసం వదలని అవివేకులు. యీలోక ఐశ్వర్యాలకి పనికిరాని పరివ్రాజకులు అరుదు.
    స్త్రీ మోహంకన్నా వుత్తమమయింది వాంఛనీయమయింది. యీ లోకంలో ఏం వుంది? ఆత్మ సామ్రాజ్యం --- అనేదే వుంటే అది.
    లేకపోతే స్త్రీ సామ్రాజ్యం------
    ఈ రెండే . ఇంకేవి లేవు.
    వీటి ముందు తక్కినవి దుమ్ము. "ఎందుకు బ్రతుకుతున్నావు?" అని ప్రశ్నిస్తే.
    "ప్రేమించేందుకు"
    "ప్రేమని వెతుక్కునెందుకు"
    అని చెప్పగలగాలి.
    "ఏం చేస్తున్నావు ?" అంటే
    చివరికి "రోజూ సంభోగీస్తూన్నాను"
    "ప్రేమిస్తున్నాను"
    అని చెప్పగలిగిన ధీరులు కావాలి. ఈ ప్రపంచాన్ని ఉద్దరించడానికి అంతకన్న ముఖ్యమైన దేముంది!
    ప్రేమించే స్త్రీని కావిలించుకోవడం కన్న ముఖ్యమైన ఉద్దేశాన్ని కలిగిన మనుష్యులు- దురదృష్టవంతులు, వ్యర్ధులు, పాషాణులు,  మృతజీవనులు. ఆధ్యాత్మిక విద్యా/ లోకంలోని స్త్రీని ప్రేమించ లేని మనుష్యుడు ఆత్మరమతో ఏం రమించగలడు?
    ఈ దేశంలో అన్ని ఆనందాలు నశించాయి. వున్న అందాలన్నీ చాలా త్వరగా వొదిలిపోతున్నాయి.
    "భోజనం, పాలిటిక్స్" రెండు మిగిలాయి. అందువల్లనే ప్రజలకి కూడు గుడ్డా అని ఆల్లాడతారు నాయకులు.
    ప్రేమకన్న యితర విషయాలకి మోహం కన్న ప్రాముఖ్యమిచ్చే మిత్రుల్ని చూసినప్పుడు వీళ్ళేప్పుడన్నా జన్మలో వాస్తవమైన మోహాన్ని యెరుగుదురా? గంభీరమై తమ హృదయంలో కలిగించగల అగ్ని వంటి ఆనందాన్ని కాని, స్త్రీ మోహించినప్పుడు ఆమె అందిచ్చే స్వర్గాన్ని గాని యెన్నడన్నా అనుభవించారా? పోనీ చిన్నతనంలో నైనా పెళ్ళికొత్త రోజులోనన్నా -- అప్పుడైనా భార్య చిన్నదీ అనిభావం లేనిదీ కావడం చేత అప్పుడూ అపశ్రుతిలోనే గడుస్తుంది గావును రాసికానుభావం! అసలు రసికత్వం హృదయంలో వుండాలి కదా మొదలు!) ఒక్క రవ్వ ఉన్నత సౌందర్యాన్ని పొందారా? అని ఆశ్చర్యపడతాను.
    ఒక్కసారైనా నా నిజమైన మోహాన్ని గాని ప్రేమని గాని అనుభవించి వుంటే, యింకో ప్రయత్నానికి ప్రాధాన్యమివ్వగాలరా? ఆ ఉద్యోగాలు, అధికారాలు, సంపదనలూ, అన్నీ అన్నీ మోహశయ్యకు సహాయం కావడానికి ఉపకరణాలైపోవా?    సృష్టించడం కన్న ఆనందకరమైన విషయం ప్రపంచంలో లేదు. అందువల్లనే యీశ్వరుడీ సృష్టిని ప్రారంభించాడంయి వేదాలు. కధలు వ్రాయడం, శిల్పాలు యివన్నీ సృష్టి కార్యాలె ఈ నిర్జీవమైన కళలే అద్వితీయానందాన్నిస్తాయి కదా? యింకో జీవినే సృజించడం జడానికి ప్రాణమిచ్చే ప్రయత్నం, యీశ్వరుశక్తిని అందుకో గలగడ మన్నమాట. అట్లాంటి అనుభవం యింత సులభం , నీచమైపోయింది ప్రజల చేతుల్లో. పక్షులు, మృగాలు, చివరికి పురుగులు, పువ్వులు - సృష్టికార్యాన్ని యెంత ప్రేమిస్తాయి? ఒక దానివొంక ఒకటి ఎంత కృతజ్ఞతతో ఆనందంతో చూసుకుంటాయి! పావురాళ్ళు, కోళ్ళు తోక లాడించడం, పాములు యిటూ అటూ పరిగెట్టడం పువ్వులు తేనెటీగ యెగిరిపోగానే వోణకడం , పిల్లలు దేహాలు పులకరించడం. కాని యీ మనుష్యులకే కలిగింది, యీ నీచత్వం, ఆ కార్యం తరవాత యీ ద్వేషం. ఆ కార్యమేమిటో సరైన పేరుతొ వ్రాయనీయాకపోవడం - ప్రేమలేని అసహజ ఆలింగనంలో నరాలు అలిసి బాధపడడం. వివాహమనే బంధంలో , స్వంతమనే కాపీనంలో పాపం చేస్తున్నామనే భయంలో , పిల్లలు పుడతారనే దిగులులో , ఆనందాన్ని , ఆరోగ్యాన్ని సౌందర్యాన్ని తృప్తిని, శాంతిని ధ్వంసం చేసుకోడం.
    నీ కష్టాల బాధతో సానుభూతిచూపి , నీ మోహానికి నా అల్పానుభవంలో ప్రతి మోహమివ్వాలనే ప్రయత్నంలో నీ కెట్లాగో నాలో యింకా ముకుళించి వున్న రసికత్వాన్ని , ప్రేమరాగాన్ని తెలియచెయ్యాలనే కోర్కెతో నీ చేతుల మధ్య వొణికే నా ఆత్రుతని యేమని అర్ధం చేసుకుని వుంటావో , నా లేతతనాన్ని చూసి నవ్వుతున్నావో, లేక నా కొత్తతనాన్ని ఆనందించుకుంటున్నావో, అని నీ కళ్ళకేసి నిమిషానికొకసారి చూసే నా చూపు లెందుకు నిన్నిట్లా కలవరపెట్టేవి? సిగ్గువల్లనా, పశ్చాత్తాపం వల్లనా? సౌందర్యం ఎన్నటికీ యెవరి హక్కు కావడం అసంభవమని ఆనాడు తెలీని నేను నిన్నంతా , నీ వొంపుల్ని నీ నవ్వుల్నీ అన్నిటినీ నావిగా కొన్ని నిమిషాలన్నా, నా స్వంతంగా దాచుకోవాలని వెర్రిగా ప్రయత్నించాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS