Previous Page Next Page 
పావని పేజి 25


    "దొరా! కాల్మొక్త"
    శివయ్య అటు చూచాడు పెంటయ్య దీనాతిదీనంగా నుంచున్నాడు శివయ్య పెంటయ్యను చూచాడు పెంటయ్యలో మార్పులేదు సూర్యోదయంలో మార్పుంది అంతే శివయ్యకు ధైర్యం వచ్చింది.
    "ఏమిరా పెంటిగా మూడు రోజులాయె పనికిరాక - ఏమనుకుంటున్నవు? నెత్తి తిరుగుతున్నాదిర"
    "బాంచను, అమ్మకు కిందెట్టు-మీదెట్టుగున్నది బాంచెను, వస్తలేను గంజి తాగిచస్త నంటున్నది జరన్ని నూకలు పెట్టుండి, కాల్మొక్త"
    "లంజకొడక' చదువుకుంటున్రేమో గదరా - పోయి గా పావనమ్మ నడుక్కోని పనికి రాకుంటే గింజెట్లొస్తదిరా! మాడి చావున్రి, గాడ్ది కొడుకులు"
    "పనికి రాకుండ యాడున్నమండి ఆపతి వచ్చిందని ఇంట్ల ఉన్న పని చేయకుంటే పనులకు మేత ఏస్తలేదా నుండి మేం పసుల కంటే అన్నాల మానుండి?"
    "బలే! మాటలు నేర్చిన్రు ఆ పావని మిమ్ముల చెడగొడ్తోంది ఒకనాడు తీస్కపోయి ఏట్ల కలపుతాది"
    "దొరా! నన్నేమన్నా అనురి పావనమ్మను మాటలంటే బాగుండది ముసల్ది చస్తాంది, గింజలియ్యమన్న ఇయ్యకుంటే ఇయ్యనని చెప్పుండి గని, మాటలంటే పడెడిది లేదు" - పెంటడు వెనక్కు తిరిగి విసవిసా వెళ్ళిపోతుంటే శివయ్య గుండె గుబగుబలాడింది "చూసినవా జగన్నాథం?" అన్నాడు "కలికాలం దొరవారూ!" అన్నాడు జగన్నాధం.
    ఆ రాత్రి ఊరు నిద్రపోయింది ఎక్కడో ఒక గబ్బిలం ఎగురుతూంది కీచురాళ్ళు రొదచేస్తున్నాయి వెన్నెల విరిసింది నర్సిమ్మ ఊతంగ తాగి పదం పాడుకుంటూ సాగిపోతున్నాడు.
    "పాలాసంద్రంలోన
    పండిన నాసామి
    ఏలా ఈలోకమును
    ఏలా కున్నావయ్యా!
    ఆడ పాలసంద్రంల పండి ఏంచేస్తవు? కల్లు సంద్రంలనన్నా, సార సంద్రంలనన్నా  పండక పోయినాడు నాకింత పోస్తుండె, వాడింత తాగుతుండే పాలేంచేసుకుంటర్రా ఒరే నర్శిగా, మనమేం చాయ్ తాగేటోండ్లమా?"
    నర్సిమ్మకు చీకట్లో ఎవరో నక్కినట్లు కనిపించింది "ఎవరాడ? ఏమో చాటుకు నక్కుతాన్రు ఈడు నర్సిమ్మ దొరకు కుక్కసువంటోడు కుక్కపట్టినట్లు పడ్త, ఎల్లుండి ఇవతలికి" - తూలుతూ నీడవైపు కదిలాడు.
    "అన్నా! నేనే మల్లిని" - మల్లమ్మ జంకుతూ వెలుగులోకి వచ్చింది.
    "ఓసి మల్లి, నువ్వానె? ఎన్నెట్ల నిన్ను చూస్తే పానాలెగిరిపోతాన్నాయే అగ్గో ఏమో మూటపట్టినవు చాటుగ దొరింట్లో నుంచి దొంగతనంగా తెస్తాన్నవులే ఏమన్నా చేసుకోపో, ఒక్కసారి ఒక్కపాలి-" నర్సిమ్మ ఆమెను పట్టబోయాడు.
    "నర్సిమ్మా! నాకు అన్నసువంటాడివి, నా జోలికి రాకు దండం పెడ్త"
    "నువ్వు నాకు చెల్లెవుకావె, మరదలా" అని మల్లమ్మను పట్టిలాగాడు మల్లమ్మ రెండు చేతుల్తో నర్సిమ్మను నెట్టేసింది నర్సిమ్మ వెల్లకింతలా పడిపోయాడు కాని కొంగు పట్టుకున్న చేయి విడిపోగానే మూట విచ్చుకుంది.
    తెల్లని నూకలు నేలపాలయినాయి.
    అవి తల్లికి గంజి కాచి పోయడానికి మల్లమ్మ దొంగిలించిన నూకలు!
    "ముండా! దొంగతనం చేసినావు?" లేవపోయాడు నర్సిమ్మ.
    గూడెంలోంచి గొల్లున ఏడ్పులు వినవచ్చాయి.
    "అమ్మా! చచ్చినావె" అని మల్లమ్మ శరవేగంగా ఉరికింది గూడెం వైపు తల్లిశవం మీద పడి గొల్లుమంది మల్లమ్మ "ఒరే పెంటా! అమ్మకు గంజి నీళ్ళు పొయ్యలేక చంపుకున్నంరా! అమ్మ చావలేదురా, మనం చంపినం" అని సోకాలు పెట్టింది.
    "మల్లక్కా! అమ్మను మనం చంపలేదే - దరిద్రం చంపింది, పేదరికం చంపింది" అని తల బాదుకుని ఏడవసాగాడు పెంటయ్య.
    "పెంటా! అమ్మను చంపింది శివయ్యరా! దొరరా! దొర చంపిండురా! దొరే చంపిండు ఎందరినొ చంపిండు, ఇంకెంత మందినో చంపుతడు"
    "మల్లక్కా! ఏడవకుండి, ఏడుస్తే తిరిగొస్తరా? భూమి మీదికి వచ్చింది పోయేటందుకే పుల్లమ్మకు నూకలు అంతకాడికే ఉన్నయి, తీర్చుకున్నది, పోయింది ఏడవకుండి" అని ఓదార్చాడు పెంటడు.
    "అమ్మా, నిన్ను మేం మింగినమే, దొర మింగిండే, దరిద్రం మింగిందే" అని ఏడుస్తూనే ఉంది మల్లమ్మ పెంటయ్య కొంత ఊరడిల్లాడు.
    "పెంటా, మల్లీ" - ధర్మయ్యతాత పిలిచాడు.
    అక్కా, తమ్ములిద్దరూ ధర్మయ్య తాతను పట్టుకుని ఏడ్చారు.
    "పెంటా! ఏడవకు జీవి గూడు వదిలింది వెల్లిపోయింది కాని, ఇన్నవా మీ అమ్మ చావు మానుకు ఎంత తెలివి చెప్పించిందో" ధర్మయ్య ఇద్దరి తలలూ తన చేతులతో నిమురుతున్నాడు.
    "ఏంది తాతా! ఏం తెలివి వచ్చిందే" - ఇద్దరూ కళ్ళు తుడుచుకుని ధర్మయ్య ఛాతిమీదినుంచి లేచి అడిగారు.
    ధర్మయ్య తన చేతులు చూచుకున్నాడు చేతులు వచ్చాయి, కదులుతున్నాయి! చాచాడు, మడిచాడు, బావున్నాయి"
    "తాతా! నీకు చేతులొచ్చినయి" - మల్లమ్మ అన్నది ఎవరూ నమ్మలేదు అంతా ఆశ్చర్యంగా చూచారు గూడెం సాంతం కూడింది.
    "ఒరేయి! నాకు చేతులొచ్చినాయి మనకు తెలివి వచ్చింది"
    "ఏందే మనకొచ్చిన తెలివి?" పెంటడు అడిగాడు.
    "ఈ గూడెంలో ఎంతమంది చచ్చిన్రు, ఏమనుకున్నం? కాలం మూడింది చచ్చిన్రు అనుకున్నం మన కరమ అనుకున్నం, ఏడిచి ఊరుకున్నం పుల్లమ్మ చచ్చింది పెంటడేమనుకుంటున్నడు? దరిద్రం చంపిందనుకుంటున్నడు మల్లి ఏమనుకుంటాంది దొర చంపిండనుకుంటాంది  ఎన్నడన్న ఇట్లనుకున్నమా మనం? ఇట్లా ఇశారించినమా మనం? చచ్చినోండ్లను బొందల పెట్టినం - పిత్త తాగినం, పన్నం మనకు సత్తెం తెలుస్తాంది, సత్తెం తెలుస్తాంది పుల్లమ్మ చావు మనకండ్లు తెరుస్తాంది, తెరుస్తాంది" ఏదో మహ సత్యం ప్రకటించినట్లు గుండెలోంచి - హృదయ కుహురంలోంచి పలుకుతున్నాడు ధర్మయ్య.
    పావని వచ్చింది బ్రహ్మయ్య వచ్చాడు కొమరయ్య వచ్చాడు అక్కడి వాతావరణం చూచి ఆశ్చర్యపోయింది పావని సాధారణంగా ఈ పరిస్థితిలో ఏడుపు పెడబొబ్బల్తో దిక్కులు ప్రతిధ్వనించాల్సింది వాతావరణం సాంతం మౌనంగా ఉంది ఆలోచనలతో అలికిడి లేకుండా ఉంది.
    "ధర్మయ్య తాతా!" పావని పిలిచింది చిత్తరువుకు ప్రాణం వచ్చినట్లు మల్లమ్మ గొల్లుమంది "పావనమ్మా! మా అమ్మను దొర మింగిండు" అని పావనిని కావలించుకొని గొల్లుమంది పెంటయ్య గొల్లుమన్నాడు.
    "జీవితం ఒక నాటకరంగం రంగం మీదికి వచ్చిన పాత్రలన్నీ నిష్క్రమించాల్సిందే చూచే వాళ్ళమీద ప్రభావం వేసి వెళ్ళిపోయిన పాత్ర ధన్యం అయింది మీ అమ్మ పుల్లమ్మ మన కళ్ళు తెరిచి పోయింది ఆమె ధన్యురాలు మళ్ళీ ఇలా గంజిలేక, మందులేక ఎవరూ చావకుండా చూడడం మన కర్తవ్యం మీ అమ్మ పోయింది మనమీద భారం పెట్టి పోయింది ఏడవడం కాదు, ఏం చేయాలో ఆలోచించాలి" అని ఓదార్చింది పావని.
    "అమ్మా! పావనమ్మా! నువ్వు దేవతవు తల్లీ! చూచినవా నాకు చేతులొచ్చినయి" అని చేతులెత్తి దండం పెట్టాడు ధర్మయ్య.
    "తాతా! ధర్మానికి చేతులొచ్చాయి తాతా! ఈ చేతులు ఇహ  పడిపోవు, బలపడ్తాయి అధర్మాన్ని హతమారుస్తాయి"
    "ఇప్పుడెం చేద్దమంటవు తాతా! భజన జరగాలె సారనీలు కావాలె ఎట్లోస్తయి?" వెంకడు అడిగాడు.
    "ఎంకన్నా! మా అమ్మ బతికుండంగ గంజి పొయ్యలేక పోయినం ఇప్పుడు సారపోస్తే పున్నెమొస్తదా? ఇట్లనే చావులకని, లగ్గాలకని అప్పులు చేసే బాంచలమయినం నేను అప్పుతేనే సారపొయ్యనే నీయవ్వ ఏమన్న అనురి" పెంటయ్య తెగించి చెప్పేశాడు.
    "అట్లంటే ఎట్లరా, కులానికి కట్టుబడి ఉండాలే" - ఒక ముసలవ్వ అన్నది.
    "శాన కాకుంటే మానె - జరన్ని నీళ్ళన్న తెప్పించకుంటే బాగుంటాదే" భజన చేయడానికి డప్పు తెచ్చినవాడు అన్నాడు.
    "ఒరే! అప్పులు చేసే మనం ఈడికి వచ్చినం కూటికి గుడ్డకు అప్పుచేస్తే అర్తమున్నది-నీయవ్వ, అప్పుచేసి సారనీలు పోస్తే పుల్లమ్మ లేచొస్తాదిర?" కొమరయ్య ప్రశ్నించాడు.
    "అవ్! అప్పులు చేసే మన మీదికి వచ్చినం మన పానాలన్నీ కుదువ పెట్టి కాయిదాలు రాసిచ్చి ఇట్లయినం మనకేమి భూములు లేకుండెనా ఎవసాయం లేకుండెనా? అప్పులు చేసి కాగితాలు రాసిస్తిమి దొరకు అమ్ముకుంటిమి ఇట్ల బాంచోల్ల మయితిమి మల్ల అప్పులెందుకు చేసుడు? ఎంకడు చెప్పిందే బాగున్నది గప్ చిప్ న బొంద పెట్టిరాండి" - ధర్మయ్య ఉవాచ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS