Previous Page Next Page 
పావని పేజి 24


    గూడెంలో శ్మశాన ప్రశాంతత వెలిసింది ఒక్కరూ మాట్లాడ్డంలేదు పావనిని చూచారు- ధర్మయ్య నోరు విప్పాడు.
    "అమ్మా! తప్పు చేసినం, మన్నించు మేం చేయలేదమ్మా, నర్సిగాడు చేయించిండు వాడే సారా తెచ్చి పోసిండు మమ్ములను మళ్ళా పశువులను చేసిండు"
    వెంకడు ఏదో తప్పుచేసిన వాడిలా వదిగి వదిగి  కూర్చుంటున్నాడు.
    పావని అసలువిషయం గ్రహించింది.
    "ఇదంతా శివయ్య చేసిన నాటకం"
    "అవునండి, వాడే చేయించిండు గిదంత" - గూడెంలో అడుగుపెడ్తూ అన్నాడు కొమరయ్య బ్రహ్మయ్య ఊళ్ళో లేడు, భార్యదగ్గరికి వెళ్ళాడు.
    "నర్సిగాడితో చెప్పి సార పోయించిండు సార పోయించి ఊరిని మల్ల పశులమంద చేయాలనుకున్నాడు ఈ ముండకొడుకులకు సార కనబడ్డది సురసురమని లేచిన్రు, అమ్మను మరిచిన్రు, చదువు మరిచిన్రు, తెలివి మరిచిన్రు"
    "అవునే, అట్లనే అయినమే అమ్మా! ఇగ చేయం, నీ కాళ్ళ మీద పడ్తం మేం తప్పుచేసినం, పాపం చేసినం, మన్నించు తల్లీ!" వెంకడు పావని కాళ్ళమీద పడ్డాడు ధర్మయ్య తప్ప గూడెం సాంతం చేతులు జోడించి ప్ర్రార్ధించింది.
    "ఇప్పుడు జరిగింది, ఇహ ఇట్లా జరగరాదు"
    "జరగదు, జరగదు" ముక్తకంఠంగా అన్నారు.
    "మీ బలహీనతలు శివయ్యకు తెలుసు "ఇంకా ఏదో చెప్పబోతూంది మల్లమ్మ పగిలినకుండ పట్టుకుని ఏడుస్తూ ప్రవేశించింది పెంటయ్య ముందుకు ఉరికి అక్కను తీసుకుని వచ్చాడు ఏమైందో చెప్పమని అడుగుతున్నాడు మల్లమ్మ ఏడుస్తూంది తుదకు ఆమె చెప్పిందాని సంగ్రహార్ధం ఇది -
    తల్లికి జబ్బుగా వుందని సుభద్రమ్మతో చెప్పకుండా గూడేనికి వచ్చింది ఇంట్లో నీళ్ళు లేవని కడవ పట్టుకుని బావికి పోయింది ఎవరోతల్లి నీళ్ళుచేది పోసింది కడవ నెత్తిన పెట్టుకుని వస్తుంటే వెనకనుంచి వచ్చిన నర్సిమ్మ బల్లెంతో కడవను పొడిచాడు నీళ్ళన్నీ కారిపోయినాయి వెనక్కు తిరిగి చూస్తే నర్సిమ్మ ఏడ్చుకుంటూ వచ్చి గూడెంలో పడింది.
    పెంటడు నర్సిమ్మ మీద నిప్పులు చెరిగాడు ధర్మయ్య వారించాడు వాడు ఊరకుక్క ఇంత తిండి పడేస్తే కాళ్ళు నాకుతుంది అన్నట్లు మాట్లాడాడు.
    "అసలు మల్లమ్మ ఎందుకు అమ్ముడు పోయింది?" పావని అడిగింది.
    "మాకే మెరికయితదండి పరిమిగాడు అప్పుచేసిండు, పారిపోయిండు మల్లమ్మ అమ్ముడు పోయింది"
    "పరమయ్యా అప్పుచేసింది పెళ్లి కోసం పెళ్లి మనసులకు సంబంధించింది మనసులు కలిస్తే పెళ్లి అయిపోతుంది అలాంటి పెళ్లికోసం అప్పులు చేసి తాగి తందనాలాడాలా? అప్పున పడ్డందుకే పరమయ్య, మల్లయ్య-శివయ్య చేతికి చిక్కారు. వంద ఏళ్ల పంట కావలసినది, ఇద్దరూ విడిపోయాడు మల్లమ్మ సీతలా, సావిత్రిలా పరమయ్యకోసం ఎదురు తెన్నులు చూస్తూంది పెళ్ళికి అప్పుచెయ్యలేదనుకోండి, వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళుగా!"
    గూడేనికి, మల్లమ్మకూ ఏదో పరమసత్యాలు గోచరిస్తున్నాయి జరిగిన సంఘటనలన్నీ మల్లమ్మ కళ్ళముందు చకచకా సాగిపోతున్నాయి.
    "చావుకు అప్పులు చేస్తాం అప్పులు చేశామని తాగుతాం తాగకున్నా, అప్పులు చేయకున్నా చచ్చినవానికి వచ్చిన ప్రమాదం లేదు చచ్చినవాని పేరుమీద తాగి మనం బానిసలం అవుతున్నాం పుట్టబోయే బిడ్డలను బానిసలను చేస్తున్నాం"
    "అవునమ్మా! అదే మేం చేస్తున్నం లగ్గాలు, చావులు, తాగుడు - ఇవి లేకుంటే  మేమూ రైతులమేనమ్మా! మాకూ బూములున్నయి మేమూ దున్నుకున్నాం" ధర్మయ్య చరిత్ర నెమరు వేసుకుంటున్నాడు.
    "ధర్మయ్యతాతా! మల్లయ్య పొలాలన్ని ఎట్లా పొయ్యాయే?" మల్లమ్మ ఆసక్తిగా అడిగింది.
    "అప్పులు చేసి కాగితాలు రాసిస్తే పొలాలు పోయినాయె మీరంతా శివయ్య దస్తరంలో చిక్కిపోయాడు శివయ్య బీరువాలో ఉన్న కాగితాల్లో మీ బతుకులున్నాయి కాగితం మీద అంగుష్ఠం వేసినప్పుడల్లా మొదలు భూమి, తరువాత మీరూ అమ్ముడుపోయారు మీ ప్రాణాలు ఇప్పుడు మీ దగ్గర లేవు శివయ్య దస్తరంలో ఉన్నాయి శివయ్య అల్మారలో ఉన్నాయి శివయ్య గుప్పిట్లో ఉన్నాయి అతను మీ ప్రాణాలను పట్టుకున్నాడు ఆడిస్తున్నాడు అతడు చావమంటే చస్తున్నారు లేవమంటే లేస్తున్నారు వెంకడి తండ్రి ఎలా చచ్చాడు? వెంకడి తల్లి ఎలా చచ్చింది? ఆలోచించండి ఒక్కసారి శివయ్య దస్తరం చంపింది శివయ్య కాగితాలు చంపాయి ఈ విషయాలు మీరు తెలుసుకోవాలి తెలుసుకొంటే పరిష్కారాలు మీరే కనుగొంటారు"
    పావని ఉపన్యాసం ముగించింది.
    వాతావరణం ఆవేశంగా ఉంది ఆలోచనలో ఉంది మవునంగా ఉంది ఎగిరే గబ్బిలపు రెక్కలు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.
    "అమ్మా! ఆ దస్తరం పోతే మా భూములు మా కొస్తయా? మా బాంచతనం పోతుందా? నా బావ పట్నంనుంచి వస్తడా? నన్ను చూస్తడా?" మల్లమ్మ అడిగింది ఆమె ఊహాలోకంలో కాగితాలు లేవు అప్పులు లేవు తాను పరమయ్య బాహుబంధంలో ఒదిగిపోయినట్లు ఊహించుకుంది.
    "పిచ్చిదానా! కాగితాలెట్లపోతాయే? సర్కారు కాయితాల్నే నమ్ముతది మనుషులను నమ్మదు మనుషుల్ను నమ్మే సర్కారొస్తే చెప్పలేం"
    "తాతా! పావనమ్మ మనకు తెలివి తెచ్చింది తెలివి అన్ని పనులు చేస్తది తాతా! పోత మరి, దొర్సానికి చెప్పకుండొచ్చిన" - మల్లమ్మ వెళ్ళిపోతూంది.
    మల్లమ్మ ముందడుగు వేసింది.
    ఆమె మరో ప్రపంచాన్ని గురించి కలలు కంటూంది.
    ఆ రాత్రి శివయ్యకు పీడకల వచ్చింది పావని నోట్లోంచి  మంటలు వస్తున్నాయి తాను మంటల్లో చిక్కుకున్నాడు జ్వాలలు నాల్కల్చాచి చుట్టుకుంటున్నాయి పెద్దగా కేకపెట్టి ఉలిక్కిపడి లేచాడు చూస్తే పక్కన సుభద్రమ్మ పడుకొని ఉంది.
    
                            14
    
    శివయ్య చిక్కుల్లో చిక్కుకున్నట్లు చితికి పోతున్నాడు. నిరంకుశంగా సాగిన అతని అధికార్నైకి ఎక్కడో గండిపడినట్లు అనిపిస్తూంది పావన్ని బదిలీ చేయింతా మనుకున్నాడు చేయలేకపోయాడు ఓడిపోయాడు. ప్రభుత్వమే తనకు ఎదురు తిరుగుతున్నట్లుంది. అక్కడ తన మాట చెల్లుబాటు లేకుండా అయింది అదే అతనికి తలవంపులుగా ఉందంటే, పావని ఊళ్ళో కల్లోలం లేపుతూంది బడి పెట్టింది పిల్లలను ఆకర్షిస్తూంది ఇది తనకు కలిగిన రెండో ఓటమి పావనికి సాయం చేసినందుకు బ్రహ్మయ్యను బెదిరింతామనుకున్నాడు పనిముట్లు ఇవ్వడం మానేశాడు పాత అప్పులు వసూలు చేస్తానని బెదిరించాడు బ్రహ్మయ్య వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు లొంగిపోతాడు అనుకున్నాడు అలా జరగలేదు బ్రహ్మయ్య జంధ్యం తెంపుకుని గూడేనికే పోతున్నాడు. అగ్నికి వాయువు తోడయినట్లు పావనికి బ్రహ్మయ్య తోడయినాడు. బ్రహ్మయ్య ఇల్లు స్వాధీనం చేసుకుందామనుకున్నాడు కాని, ఎందుకో ఎన్నడూ లేని జంకు ప్రవేశించింది అతనిలో పావని కోర్టుకు లాగుతుందేమో! తెలివి మీరుతున్న ప్రజలు ఎదురు తిరుగుతారేమో! ప్రభుత్వంలో ఎవరూ తన మాట వినేట్లు లేరు అంతా పేదల పక్షం వహిస్తున్నారు అంతా అయోమయంగా ఉంది శివయ్యకు అమావాస్యలా ఉంది ఎక్కడా వెలుగు కనిపించడం లేదు పావని మీద చేయిచేసుకుందామనుకున్నాడు పావనిని అంతం చేతామనుకున్నాడు పావని అష్టభుజాలతో అనంతం అయిన ఆదిశక్తిలా కనిపించింది మహిషాసురుని మర్దిస్తూంది గౌరీనాధశాస్త్రి కపాలం ధరించి కనిపించాడు అతడు శివశక్తిలా ఉన్నాడు మూడో కన్ను తెరచేట్టున్నాడు గౌరీనాథశాస్త్రి తనకు చలిమంటలా ఉపకరించాడు ఇప్పుడు కార్చిచ్చులా కనిపిస్తున్నాడు తననే కాల్చేట్లున్నాడు తన కొంప తగల పెట్టేట్టున్నాడు అవన్నీ విపరీత పరిణామాలుగా కనిపించాయి శివయ్యకు ఆ రాత్రి మనవ సమాజంలో నియంతలకు స్థానం లేదు మహా మహానియంతలే మట్టికరిచారు అయితే, నియంతలా ఉండగా ఏ నియంతకూ ప్రజాశక్తి కనిపించదు.
    శివయ్య కావాలనుకున్నా రాత్రి నిలువలేదు చీకటిని నిలుపగలవాడూ, ఉషస్సును అడ్డగలవాడూ కనిపించలేదు.
    ఆనాటి సూర్యుడు వింతగా కనిపించాడు వెర్రిగా కనిపించాడు పిచ్చిపిచ్చిగా కనిపించాడు తొలిసారిగా పొడిచినట్లు కనిపించాడు అంతటా వెలుగులు చిమ్మినట్లు కనిపించాడు సమానంగా వెలుగులు పరుస్తున్నట్లు కనిపించాడు అలాంటి సూర్యుడు ఉదయించరా దనుకున్నాడు శివయ్య ఉదయించాడు చీకట్లు పారిపోరాదనుకున్నాడు శివయ్య పారిపోతున్నాయి.
    శివయ్య వాలు కుర్చీలో కూర్చున్నాడు అతని మనసు మనసులో లేదు జగన్నాధం లెక్కలు రాస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS