Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 25


    రాజేశ్వరరావుది పచ్చని దబ్బపండు ఛాయ. తెలగబిడ్డయైన నతని నందరు బ్రాహ్మణుడేయని తలంతురు. అతడు శాకాహారి. స్వచ్చమగు పలుకు, మధ్యమోన్నతమై కండపుష్టి కలిగిన శరీరము, వంకర తిరిగిన ముక్కు, సమమైన నుదురు, కామపురుషార్ధపరతాస్పోరకములగు దీర్ఘ చక్రవాకలోచనములు. ఫ్రెంచి పద్ధతిని సగము మిగుల్చుకొన్న నల్లని మీసములు. చుట్టును జవ్వ లేని సులోచనములు ధరించి, ముంగురులు నున్నగ వెనుకకు దువ్వుకొనును. ప్రసిద్ధ సినిమా నాటకుడగు రుడోల్పు వాలంటీనో పద్ధతి నతడు పొడువుగా బెంచుకొను మొగచెంపలును, తీర్చినట్లున్న నల్లని కనుబొమలు నతని మోమునకు గాంభీర్యమును పుణికియిచ్చును. అతడు ధరించునవి చిక్కని మీగడ తరక వంటి ఫ్రెంచిపట్టు చొక్కాలు, తెల్లటి లాగులను తొడుగును. కాళ్ళకి ఖరీదు గల లూథియానా జరీచడావులుండును.
    నారాయణరావతని నఖశిఖపర్యంతము జూచి చిరునవ్వు నవ్వి, తన ముదుక ఖద్దరు పంచె, ఖద్దరు లాల్చీ, ఖద్దరు సేలం కండువాలను జూచుకొని నవ్వుచునే పెదవి విరుచుకొని 'ఒరే రాజీ! నువ్వెప్పుడైనా అలంకారముతో లేని సమయం ఉందిరా?' అని ప్రశ్నించెను.
    'ఇంటిదగ్గిర లబ్బీలుంగీ కడ్తానురా!'
    'అది పట్టుదేనా?'
    'ఆ.'
    'నిద్దట్లో నీ జుట్టు చెరుగుతుందిరా!'
    'పాపము శమించు గాక!'
    'ఏదీ చెయ్యి? పారాహుషార్!'
    'నామీద ఒక వ్యాసం రాయరా! ఒక కథ అల్లరా!'
    'నీవొక్కడిమీదనేనా, ఆ పరకీయను కూడా కలపనా?'
    'శెభాష్! కలిపితే యిక మజా అడిగావూ!'
    'మరి దశావస్థల్లో ప్రస్తుతావస్థయేదో చెప్పు?'
    'మీ కవిత్వాల్లో విరహావస్థ లన్నింటిమాటా నాకు తెలియదుగాని 'ప్రళయం' మట్టుకు తప్పేటట్లు లేదు.'
    'ఎవరికి? నాయికకా, నాయకునకా? ఆ పూర్ క్రీచరుకా? మీ మోహప్రవాహాన్ని ఆ భర్త అరికట్టడనీ, పైపెచ్చు సంతోషంతో ఓలలాడతాడనీ చెప్పావుగా! నీవానాడు చెప్పిన మాటలు తలచుకుంటే నాకిప్పటికి ఒళ్ళు జలదరిస్తున్నది. ఎంత అమానుషపు టూహ చేశావురా!'
    'ఒరేయి! ఈ విషయములో మనం ఇద్దరం ఏకాభిప్రాయులం కామనిన్నీ, ఆ భావాలు మనం చర్చించుకోవడం మానివేద్దామని అనుకున్నాంగా?'
    'అవును. అందుకనే ఆయనమాట తలపెట్టవద్దన్నాను. కాని ఇప్పుడు నీ పెళ్ళిమాట ఎత్తావు కాబట్టి ఇప్పటికైనా ఈ హేయ శృంగార ప్రబంధానికి స్వస్తి చెప్పి పెళ్ళిమాట ఆలోచించడం ఉత్తమం.'
    'నారాయుడూ! నువ్వు చెప్పే ముసలమ్మల సిద్ధాంతాలు నాకు గిట్టవు. ఎప్పుడో ఇక్ష్వాకులనాడు పుట్టిన వివాహాచారాన్ని ఈ ఇరవయ్యో శతాబ్దంలో కూడా పట్టుకు వేళ్ళాడమంటావు నువ్వు. వివాహాలు లేని కాలం కూడా ఒకటి ఉండేదన్న మాట మరచిపోకు. ఏదో ప్రయోజనం కొరకు మధ్యలో కల్పించిన యీ ఆచారంతో ప్రయోజనం లేదనుకుని ఇప్పుడు దాన్ని విడిచిపెట్టేవాళ్ళకు ఆక్షేపణ ఏముంది? స్త్రీ, పురుషుల ప్రేమ సంబంధానికి ఇంత తంతెందుకు?
    'పెళ్ళిలేని కాలం ఒకటి ఉండేది అన్నావు. ఆ కాలం పాశ్చాత్య శాస్త్రజ్ఞుల వాదన ప్రకారం, మానవులు జంతువులలా సంచరించే రోజులు. కనక ఇప్పటి జంతువుల సంగతి విచారిస్తే ఆనాటివారి స్థితి మనకు గోచరిస్తుంది.'
    'అది సరే. నా వాదానికే వస్తున్నాను.'
    'తొందరపడకు. ఆ కాలంలో మానవజాతి అంతా ఇష్టంవచ్చిన మగవాడూ, ఇష్టంవచ్చిన ఆడది వాంఛ తీర్చుకోవడం, తర్వాత వాళ్ళకీ వీళ్ళకీ సంబంధం లేకుండా ఉండడం అనికదా నీ వాదన? నువ్వు అనుకునే జంతుత్వం జంతువులలో లేదు. మానవ సంబంధంలేని జంతువులలో ముఖ్యంగా లేదు. భగవంతుని వల్లనో, లేక ప్రకృతి వల్లనో వచ్చిన 'ఇన్ స్టిన్ క్ట్' (జంతుజ్ఞానం) వల్ల జంతువులు బ్రతకడం జాతి వృద్ధిపొందడం అనేవి మాత్రమే అవి ఎరుగును. ఆ జంతుజ్ఞానం వల్ల ఇష్టమువచ్చిన తిండితినవు. ఇష్టం వచ్చినట్లు కామం తీర్చుకోవు. దేహం కాపాడుకోడానికి తిండి, జాతి వృద్ధిపొందడానికి కామం అని ఆ జంతుజ్ఞానమే వాటికి చెప్పింది. ఇష్టం వచ్చినట్లు తిండితిన్నా, కామం తీర్చుకున్నా జాతి నశిస్తుందని ఆ జంతుజ్ఞానమే చెప్పింది. అందుకనే సాధారణపు కోతులలో ఒక మగకోతి కొన్ని ఆడకోతులు ఉంటాయి. లేక ఉరాంగు ఉటాంగు మొదలైనవైతే, గొరిల్లా లాంటివి అయితే, ఒక మగది ఆడది నీతిగా ఉంటవి. అలాగే సింహం, పులి, తోడేలు, ఎలుగు. అదీ కాకుండా జంతువులకు ఋతుకాలం అంటూ ఒకటి ఉన్నది. ఆ కాలంలోనే కామక్రియా నిర్వహణం జరుగుతుంది. ఇదే జంతువులలో పెళ్ళి వంటిది.'
    'అయితే మన ఆవుల సంగతి, కుక్కల సంగతి ఏమిటి? ఆంబోతుకు ఈ ఆవు ఆ ఆవు అని లేదు. ఎప్పుడు ఏ ఆవు ఎదపోయి సిద్ధంగా వుంటే, ఆ ఆవుతో పొర్లడానికి ఆంబోతు సిద్ధం. ఆ ఆవుకైనా ఏ ఆంబోతైనా సరే. కుక్కలలో ఒక్కొక్క ఋతుకాలంలోనే ఆడకుక్క రెండు మూడు మగ కుక్కలతో సంబంధానికి సిద్ధం. చూలు నిలవగానే మానుకుంటుంది. తన పిల్ల అయిన మగకుక్క అయినా సరే! గాడిదెలు అంతే, పందులు అంతే. ఇప్పుడేమంటావు?'
    'నువ్వు 'మన' అనడంలోనే జవాబంతా వచ్చింది. అయినా విపులం చేస్తాను. మనుష్యుని జీవితాలతో కలిసిపోయినవి ఆల జాతులు, కుక్క, గాడిద, పంది, పిల్లిజాతులు. అందువల్ల చాలాభాగం వాటికి జంతుజ్ఞానము నశించిపోయింది. మనుష్యునికున్న మనస్సునూ లేదు. అయినా అవికూడా ఋతుకాలాన్ని మాత్రం అనుసరిస్తాయా, అనుసరించవా?'
    'సరేరా! పెళ్ళి అనే సంస్థ సంగతి కానీ.'
    జంతు జీవితంలోంచి నెమ్మదిగా మనుష్యుడు తన మనోబలం వల్ల పైకి రాసాగాడు. మనస్సంబంధమైన జ్ఞానము వృద్ధి అయినకొద్దీ జంతుజ్ఞానము నశించినది. భోజన నిద్రా మైధునములు మాత్రమేకాక అనేక వాంఛలు, వాటిని సంపాదించుకోడం పెట్టుకున్నాడు. కళలన్నాడు, లలితకళలన్నాడు, కృషి వాణిజ్యాలు, యుద్ధాలు రాజ్యాంగాలు పరసాధన ఇటువంటి వ్యాపారాలనేకం కల్పించుకున్నాడు. ఆయా వ్యాపారాలలో నిరంతర సాధన చేస్తూ, అద్భుతమైన నాగరికత నిర్మించుకున్నాడు. ఆహారనిద్రా మైధునాలు తప్ప వేరే పని లేనివాళ్ళు అప్పటికీ ఇప్పటికీ నువ్వనుకోగానే పశుతుల్యులుగానే వుంటారు. మన మానవత్వం సార్థకపరుచుకోడానికి ధర్మార్ధాలు సాధింపదలచుకొన్నవాళ్లు పశుప్రవృత్తయిన కామానికి ఒక హద్దు ఏర్పరచుకొన్నారు. నిరంతర కామసేవ కోసం, ఉదర పూజకోసం ఆలోచిస్తూ కూర్చోడానికి వాళ్లకు వీలుపడదు. నిద్రాహారాలు కూడా మాని, దీక్షతో పనిచేసే మానవుడికి కామవిషయం కలలోకి గూడ రాదుగదా! అయితే ప్రజోత్పత్తి మూలకమైన కామం కూడా పురుషార్ధమే కనక, దాన్ని బొత్తిగా వదలి పెట్టనక్కరాలేని సామాన్య గృహస్థులంతా, ఒక స్త్రీతోనే కామ నిర్వహణం చేస్తూ, ఇతర పనులు చేసుకోడానికి మనశ్శాంతీ, తీరికా సంపాదించుకుంటారు. అంతేకాని స్త్రీ, పురుషులు స్వేచ్చా చారపరులయి నిరంతరం సంఘసు స్థితికి భంగం కల్గించే కొట్లాటలు తెచ్చిపెట్టుకోగోరరు.'
    'ఒక స్త్రీతో వుండాలని నేను వొప్పుకుంటాగాని వివాహ కర్మకాండంతా ఎందుకు?'
    'ఆ మాటన్నావు, బాగుంది. జాతి క్షేమానికి, సంఘ సుస్థితికీ ఒక పురుషుడూ ఒక స్త్రీయే కూడి వుండడం అవసరమని ఒప్పుకుంటే నాకు చాలు. వివాహకర్మ మానుకొన్నా నాకు సమ్మతమే.
    'మరి ఎందుకు చేస్తున్నారందరూ ఈ కర్మను?'
    'అది వేరే సంగతి. వివాహం అర్థకామాలనే కాకుండా, ధర్మమోక్షాలకు గూడా సాధనమని నమ్మేవారు ఆ పని చేస్తారు. వాళ్ళ జోలి నీకెందుకు? తానుతప్ప ఇతరం లేదంటూ, ఆత్మాభిమానంతో మ్రగ్గేవాడికి గృహస్థాశ్రమం ఆత్మసాధన. తన చుట్టూ తాను కట్టుకొన్న గిరిని ఆలు బిడ్డల ద్వారా విస్తరింపజేసుకొని, క్రమంగా విశ్వంతో ఐక్యభావం సాధించుకొంటాడు. గృహ్య సూత్రోక్తమైన కర్మలు సర్వభూత దయాళుత్వం మొదలైన ఉన్నత భావాలకు మెట్లవంటివి. ఇది అంతా మతానికీ, దేవుడికీ సంబంధించిన విషయం. నువ్విదంతా వేదాంతమంటావు. కాబట్టి ఆ సంగతి మనకు వద్దు.'
    'వివాహకర్మ అక్కరలేదంటే మనకిక తగాదా లేదు.'
    'లేకేమి? మీ స్వేచ్చాచారులు ఒక స్త్రీ, ఒక పురుషుడు అనే నిబంధన ఒప్పుకోరుగా? మోజు తీరిపోగానే యెవరిదారి వారు చూచుకోవలసిందనేగా మీ మతం?'
    'అవును గాని, స్త్రీకి గూడ స్వతంత్రం అనేది వుంటే మేము చెప్పే స్థితి వస్తుందా, రాదా?'
    'ఆ స్థితికి కారణం స్త్రీ, స్వాతంత్ర్యం అవునో కాదోగాని, ఆ స్థితి మాత్రం అధోగతికి కారణమవుతుంది. జడ్జి లిండ్ సే అమెరికా స్థితి వ్రాశాడు. చూడలేదూ? విడాకులు పుచ్చుకోడానికి స్త్రీకీ పురుషుడికీ సమాన స్వాతంత్ర్యం వున్న సోవియట్ రష్యాలో, అమెరికా కంటే తక్కువ విడాకుల సమాఖ్య. విన్నావో, లేదో? కాబట్టి స్త్రీ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, నీతి నియమాలనేవి వుంటే ధర్మరతి అనేది వుంటే నువ్వనుకొనేస్థితి యెన్నడూ సంభవించదు. ఆహారనిద్రామైధునాలకొఱకే మనం బ్రతుకుతున్నామనుకొంటే మాత్రం ఆ స్థితి తప్పకుండా వస్తుంది. అప్పుడు మనకీ రాజ్యాలూ అక్కరలేదు. కళలూ అక్కరలేదు.'
    'ఒరే నారాయుడూ! నీకీ ప్లీడరీ ఎందుకుగాని, సనాతన మత ప్రచార పీఠం ఒకటి పెట్టరా!' అనుచు రాజేశ్వరరావు నారాయణుని వీపుతట్టి వెడలిపోయెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS