Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 24


    భాస్క: వాళ్ళుమాత్రం మనవాళ్ళు కాదండీ? మనచేతికిందికి వస్తే మాత్రం వాళ్ల ఉద్యోగాలు తీసివెయ్యాలని ఉందాండి?
    సీతా: అయ్యో! ఈ తెలుపూ నలుపూ గాని దొరలున్నారు బాబూ, అసాధ్యులు. అసలు దొరలు నయమండీ! వీళ్ల ముందర ఆగలేం.
    ఆనంద: మీరు చెప్పింది నిజమే కాని ఇప్పుడు చాలా నయమండీ శాస్త్రులు గారూ. వాళ్ళూ తాము హిందూ దేశస్థులమనీ మునిగినా తేలినా మనతోపాటేననీ గ్రహించారు.
    సీతా: వాళ్లని తెల్లదొరలు రానిస్తారాండీ బాబూ?
    మృత్యుం: తెల్లదొరలు వీళ్ళు కంత్రీలు, మాకక్కరలేదు, మాకేం సంబంధం లేదంటారు. మనవాళ్ళు కాదంటారు.
    నారా: అలా అనకండి. భారతీయులు ఎప్పుడూ వాళ్ళని తమలో ఐక్యం చేసుకోడానికి సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళే మేం తెల్లవాళ్ళమని. వాళ్ళ దేశం హోము అంటే ఇంగ్లండని అంటూ వచ్చారు. గాంధీజీ ఎప్పుడూ వాళ్ళని సంపూర్ణ ఐక్యభావంతో మనలో జేరమనే కోరినారు.
    సీతా: వాళ్లు గబ్బిలాలన్న మాట!
    శ్రీజగ: అదేమిటండీ తెలివితక్కువమాటంటారు? తెలియకపోతే ఊరుకోవాలి. గబ్బిలాలూ! యూరేషియను స్త్రీలకి ఉండే అందం ఒక్క ఇంగ్లీషు అమ్మాయికి ఉంది! మీ ఛాదస్తపు బ్రాహ్మణ ముత్తైదువులకు ఉందా పోనీ?
    నారా: అందచందాల విషయం ప్రస్తుతం కాదు, పోనీండి.
    శ్రీని: అదేమిటండీ రాజాగారూ, కోపం వచ్చిందీ! చూశారూ, సోమయాజులు గారు వట్టి అమాయక బ్రాహ్మణుడు. మరేమంటే చూశారూ మీరు ఆ సంగతులూ, ప్రపంచం ఎరిగున్నవారు గనుక తెలుస్తుంది. చూశారూ!
    జమీం: ఏదో ఛలోక్తికన్నారు. అంతే!
    సీతా: చిత్తం చిత్తం. అంతేనండి మహాప్రభూ. క్షంతవ్యుణ్ణి.
    ఇంతలో ఫలహారములకని కబురు వచ్చినది. జమీందారుగారు శాస్త్రిగారిని సోమయాజులు గారినీ లోనికంపి తామందరచ్చటనే యుపాహారముల గైకొందుమని వాక్రుచ్చినారు. తక్కిన వారందరికడ బంట్రోతులు పాలరాలు పరచిన బల్లలనుంచినారు. వంట బ్రాహ్మణులు నేతిలో వేయించిన జీడిపప్పు, ఆవు పెరుగులో వేసిన ఆవడలు, మైసూరుపాకము, గపుచిప్పుమిఠాయి, జిలేబి యుండలు, పనసతొనలు, చక్రకేళి అరటిపండ్లు, అనాసముక్కలు వెండి పళ్ళెములతో అందరికడ నుంచినారు. స్పెన్సర్ కంపెనీ వెండిగళాసులలో మంచువైచిన మంచినీళ్లుంచినారు. చేతులు కడుగుకొనుటకు తళతళలాడు కంచుతట్టలు ఎవరికి వారికి వేరుగా నొకరు తెచ్చియుంచగా వంట బ్రాహ్మణులు నీళ్ళు పోయుటయు, చేతులు కడుగుకొనిరి. అపురూపమైన చీనా దేశపు గిన్నెల సెట్టులలో తేనీరు, కాఫీ, ఏది కావలసిన వారికది ఇచ్చినారు.
    నారాయణరావు రాజేశ్వరరావును దీసికొని మేడమీద తన గదికి వెళ్ళెను. అచట స్నేహితులిరువురు తనవితీరునట్లు సాయంత్రము వరకు మాట్లాడుచూనే యుండిరి.
    పల్లెటూరి మోటుమనిషియనుకొన్న నారాయణరావు తెలివితేటలలో, మాట నేర్పులో నతిశయించుటగాంచి శ్రీ జగన్మోహనరావు జమిందారుగారికి తల కంటగింపు కలిగినది. జమిందారుల ఇంట బుట్టిన తనవంటి వానికున్నచో శోభించునే గాని, ఈ పల్లెటూరి బడుగు తెలివికెవరు సంతసింతురు? ఒకరి సంతసముతో తనకేమి పని? శారద మాత్రము సంతసింపదనుట ముమ్మాటికి నిశ్చయం. ఆంగ్లో ఇండియన్ వనితలను దాను వెనుక వైచికొని మాటలాడిన మాటలా ప్రక్కగదులలో నెచటనైన శారదయుండి వినలేదుకదా!

                             వీణ

    ఆ సాయంత్రము విహారము సలిపివచ్చి నారాయణరావత్తవారి మేడ చేరునప్పటికి దివ్యనాదపూరితమగు విమలగాంధర్వమున దిశల నింపుచున్నదొక బాలిక. రాజేశ్వరుడా పాట విని 'ఎవరురా, అంత అద్భుతంగా పాడుతున్నారు' అని అడిగినాడు.
    'ఆ! శ్రీరామయ్యగారీమధ్య ఊళ్ళో లేరు. నేడే వచ్చారు. వారు ఫిడేలుతో పక్క వాయిద్యం వాయిస్తూ శిష్యురాలిని ఎంత విచిత్రంగా పాడిస్తారనుకొన్నావు!'
    'మీ ఆవిడే నేమిట్రా!'
    'ఆమాత్రం కనిపెట్టలేవురా! ఉండు. శ్యామ ఆలాపన జేస్తున్నారు. విను, విను. మాట్లాడకు.'
    'నాకు సంగీతమంటే తలనొప్పి.'
    'అప్పుడే నీవు 'ఆస్పిరిను' అంశకు వచ్చావుట్రా?' గది ముందరి వరండాలో దీపాలు ఆర్పివేసి రాజేశ్వరరావును, తానును పడక కుర్చీలపై కూర్చుండినారు.
    తారకాకాంతులే 'శాంతమూ లేక సౌఖ్యమూ లేదు' అని పాడుచున్నట్లయినది. చీకటిలో గనబడని పూవులా సౌరభమే సంగీతమై విశ్వమంతయు నావరించిపోయినది. గులాబీపూల పాలగొంతుక నుండి వెడలు నా పవిత్ర స్వనముతో బోల్చుటకు నారాయణరావుకీ ప్రకృతిలో నేదియు తలపునకు రాలేదు.
    వేణు వనస్వనములా, సెలయేటి గానములా, తుమ్మెద ఝంకారములా ఇవి యేవియు దగవని యతడు తలయూచినాడు. కోకిల గొంతులు కావచ్చు ననిపించినది.
    నారాయణరావు హృదయము ఆనందపూరితమై ప్రేమపూర్ణమైనది.
    'నను పాలింపా, నడచివచ్చితివో!'
    చిట్టి శ్రీరాముడు, నీలమేఘశ్యాముడై తొనలు తిరిగిన చిరు చేతులతో చిన్న బంగారు విల్లు పట్టుకొని నవ్వులు వెదజల్లుచు, నడచివచ్చినట్లతనికి గోచరించినది. అతని కన్నుల నీరు తిరిగినది. ఆ గొంతులో చిన్ని శ్రీరాముడే కలడు. శ్రీరామయ్యగారి కంఠములో దుష్టరాక్షస సంహారుడగు రఘువీరుడే కోదండపాణియై అనుజ సౌమిత్రులతో సాక్షాత్కరించుచున్నాడు. ప్రశాంతమగు నా సంధ్యారాగములో మిళితమగు శ్రీరామయ్యగారి కమాను కదుపులోక శారదాదేవి గళము నుండి తొలుతాడు కలికి చెలువంపుతీయ సవ్వడులు గలసి, లత్తుకతీర్చిన చిన్నారి పాదాలపై పరికిణి యంచులు చిందులాడ, కనక కింకిణీనూపుర గలగలారవముతో శీతనగ స్వచ్చహిమశకలముపై నృత్యమొనర్చు సుమాబాల విశ్వమోహనమగు కంఠ కుహూకారములు విరియించినట్లయినది నారాయణరావునకు.
    'ఎటులా బ్రోతువో తేలియా    
    ఏకాంత రామయ్యా...!'
    ఆర్త రక్షకుడగు నా శ్రీరామచంద్రమూర్తి ఎంత చక్కని ప్రభువు! ప్రాచిన నాతడే ప్రోవవలయు. శ్రీరామ నీలమేఘము భక్తమనః కేదారముల బూర్లసస్యముల బండించుగదా! పరాప్రకృతియగు సీతమ్మ తల్లియు, పరమాత్మయగు శ్రీరామచంద్రుడును నవ్యయులు, సత్యచేతన ప్రదాతలు 'ప్రోచినను కబళించినను నీదే భారము ప్రభూ! రామరామా! యని రంజిల్ల నావంతు, నియతిమై రక్షింప నీది వంతు' అని కనులు మోడ్చినాడు నారాయణరావు.
    రాజేశ్వరుడు చెలికానివంక తిరిగి 'ఏమి నారాయుడూ! నేనిన్నాళ్ళూ పెళ్ళిచేసుకోనని మానివేశాను. ఏదో సంబంధము మా నాయన తీసుకువస్తే ఆ పిల్లకూ, నాకూ ప్రేమ కుదురుతుందని నమ్మకం లేదు. మా నాయనతో ఏదో సాకులు చెప్పి తప్పించుకున్నా. మా నాయన పోయిన తర్వాత నేటికి మా అమ్మ వెఱ్ఱి బలవంతం పెట్టింది. గొంతుక్కు వెలక్కాయ పడినట్లయి తర్వాత చెప్తానులే అని పారిపోయి వచ్చాను' అని పడకకుర్చీలో జేరగిలబడి కనులు మూసుకొని నారాయణరావు నడిగెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS