Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 24

ఈలోగా -
అన్ వేషి అటువైపుకొస్తూ గ్రీన్ టీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు.
అతని తండ్రి ఇండియన్- తల్లి జపనీస్.
తండ్రి ఇండియన్ కావడం వల్ల అతనికి భారతీయ సంస్కృతి, భారతీయ పురాణాల పట్ల అవగాహన వుంది. వాటి ప్రభావం అతనిమీద వుంది కూడా!
వేదకాలంలోనే ఇండియాలో అతి ఉత్కృష్టమైన నాగరికత వుండిందనీ, వేదకాలపు సైన్సు, టెక్నాలజీ మహోన్నతికి చేరుకున్నాయనీ అతని విశ్వాసం.
వేదకాలంలోనే కాదు -
చరిత్రలో రికార్డు అయిన కాలంలో కూడా అద్భుతమైన సైన్సు వుంది ఈ దేశంలో.
ఉదాహరణకి ఈ బోన్ సాయ్ మొక్కల విషయమే తీసుకున్నా కూడా -
బోన్ సాయ్ అంటే మరుగుజ్జు మహావృక్షాలని పెంచే విద్యని కనిపెట్టింది జపనీయులే అని అందరి భావన.
కానీ -
ఆయుర్వేదంలో ప్రఖ్యాతి పొందిన చరకుడు చరకసంహిత అనే వైద్య గ్రంథం రాశాడు. ఆ వైద్య గ్రంథంలో మహావృక్షాలని, పెద్దవిగా ఎదిగే మొక్కలనీ కూడా అతి చిన్న సైజులో అవసరానికి తగినట్లు ఎక్కడపడితే అక్కడ పెంచుకునే పద్ధతి గురించి రాశాడు. ఈ పద్ధతిలో వైద్యానికి పనికివచ్చే మొక్కలని ఎక్కడయినా సరే స్థలాభావం సమస్య లేకుండా పెంచుకోవచ్చును.
మొత్తానికి ఆ తర్వాత తర్వాత బోన్ సాయ్ మొక్కల పెంపకం జపనీయుల విద్యగా చలామణిలోకి వచ్చింది.
తను అన్ వేషి, ఇంకో అడుగు ముందుకు వెళ్ళి ఒక మినియేచర్ కుక్కని తయారు చేశాడు.
మరుగుజ్జు మొక్క, మరుగుజ్జు కుక్కా తర్వాత ఇంక మిగిలిందేమిటి?
మనిషి!
మనుషులని సూక్ష్మరూపంలోకి మార్చవచ్చుననే ఊహ తనకి భారతీయ పురాణాలని అధ్యయనం చేస్తుంటే తట్టింది. సూక్ష్మరూపం, విశ్వరూపం అనే భావాలు భారతీయులకి కొత్తకాదు.
హనుమంతుడి సంగతే తీసుకున్నా -
ఆయన లంకకి వెళ్ళినప్పుడు మినియేచర్ సైజుకి మారి లంఖిణిని యాతన పెడతాడు.
ఆ స్ఫూర్తితోనే తను ఎన్నోన్నో పరిశోధనలు చేశాడు.
ఎట్టకేలకు మనుషులని అంగుష్టమాత్రులుగా మార్చే పద్ధతి కనిపెట్టాడు.
ఇంక ఇప్పుడు చెయ్యాల్సింది చాలా వుంది.

                         *    *    *    *
ఈ లోగా...
మినీ బంగళాలో మినియేచర్ సైజులో వున్న ఆ యువతీ యువకులకి ఆ శబ్దం మరీ దగ్గరవుతున్నట్లు అనిపిస్తోంది.
"హెలికాప్టర్!" అన్నాడు ఆ యువకుడు అసందిగ్ధంగా.
చెవి ఒగ్గి విని, "అవును" అంది ఆ అమ్మాయి.
అదే టైంలో -
సింహద్వారంలో నుంచి ఒక్కసారిగా లోపలికి వచ్చేసింది.
హెలికాప్టర్ కాదు.
ఒక దోమ!
ఆ దోమ మామూలు సైజుదే!
కానీ -
వాళ్ళ ప్రాణాలకు అది హెలికాప్టర్ సైజులో వున్నట్లు కనబడుతోంది. మామూలు మనుషుల కళ్ళకు కనబడని దోమ కాళ్ళు, రెక్కలు, కళ్ళూ వాళ్లకి జెయింట్ సైజులో కనబడుతున్నాయి.
అప్పుడు హఠాత్తుగా ఆ యువకుడికి తట్టింది!
తాము ఐదు సెంటీమీటర్ల ఎత్తుకి కృంగిపోయామని!
దోమ వాళ్ళవైపే వస్తోంది.

                                            *    *    *    *

"తెల్లారగానే మనం కొండ ఎక్కడ మొదలుపెడదాం" అన్నాడు సాహస్.
"అసలు ఈ కొండ మనం ఎక్కడం ఎందుకు?" అన్నాడు అంకుష్ ఆవలిస్తూ.
"అది నీకు తర్వాత తెలుస్తుంది" అన్నాడు సాహస్.
ఇద్దరూ ఒక చెట్టు మొదట్లో పడుకున్నారు.
తెల్లారగానే లేచి కొండ ఎక్కడం మొదలుపెట్టారు.
చాలాన్ నిటారుగా వుంది కొండ. ఎక్కడం చాలా ప్రయాసగా వుంది. అతి కష్టం మీద కొండ సగం ఎక్కారు! అక్కడనుంచి చూస్తే ఇప్పుడు అర్థం అవుతుంది. మాయానగరం నాలుగు కొండల తర్వాత వుంది. అది అన్నిట్లోకీ ఎత్తయిన కొండమీద వుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS