"ఎవరో ఒకరివి. ఏమని అడిగావు? ఈ అన్యాయం నుంచి ఎందుకు బైటపడరూ అని కదూ? అసలిది అన్యాయమైతేగా?"
"కాదా? హాయిగా_అందరిలాగే పెళ్లి చేసుకుని_భర్తతో అన్యోన్యంగా కాపరంచేస్తూ, పిల్లల్ని కని సంసారాన్ని చక్కదిద్దుకుంటూ..."
"ఆగాగు." అని పుష్ప నవ్వసాగింది. ఒక్క క్షణం తరువాత గుక్క తిప్పుకుని "హాయిగా... సంసారం. ఎక్కడుంది నాన్నా ఈ హాయి. చక్కదిద్దుకోవడం. పెళ్ళయినప్పుడు నుంచీ కామం తీర్చుకుంటూ వుండడం, తరువాత ఒకరినొకరు హింసించుకుంటూ వుండడం, ఎప్పుడూ చికాకులు, అశాంతి ఏవేవో ఆశలు పెట్టుకుని అవి తీరక కృంగి కృశిస్తూ వుండడం. ఇక్కడ సామాజికంగా స్వార్థమైతే, అక్కడ సాంసారికంగా స్వార్థం.
మొగుడు వుండగా రంకుపని చేసే ఆడది, భార్య వుండగా పదిమందితో తిరిగే షోకిల్లాగాళ్ళు, పిల్లలు... వాళ్ళు చెప్పినమాట వినకపోవడం, దరిద్రగొట్టులాగా తయారవడం. వాళ్ళనిచూసి తలిదండ్రులు కుమిలిపోతూ వుండడం, చెప్పుడు మాటలు విని నిరంతరం కీచులాడుకుంటూ వుండడం. ఆ సాలిగూడు నుంచి తప్పించుకోలేక విలవిల్లాడుతూ వుండడం...
"మీరు చాలా అపార్థం చేసుకుంటున్నారు. మీరు కొందరి జీవితాలనే చూసి అలా మాట్లాడుతున్నారు. అలా కాకుండా సంతోషంగా వుండే కుటుంబాలు చాలా వుంటాయి."
"ఎంతో తక్కువ. ఆ సంసారాలూ, బంధాలూ అంటే అసహ్యం. ఎవడితోనే పుస్తె కట్టించుకుని మనసుని అమ్ముకుంటూ బతకటంకన్నా, దేముడితోనే పుస్తె కట్టించుకుని బతకటం మంచిది."
"ఈ పూనకాలు రావటం, ఎల్లమ్మదేవతో, మరో దేవతో వాళ్ళ ఒంటిమీదికి ప్రవేశించటం... ఇదంతా భ్రాంతి అనీ, మూఢ నమ్మకాలతో మగ్గిపోయే కొందరు మనుషుల కార్యకలాపమనీ మీకనిపించటంలేదా?"
"గుళ్ళకి వెళ్ళి బోడిగుండు చేయించుకుంటే మూఢ నమ్మకం కాదు. పిచ్చెత్తినట్లు పూజలు చేసి ఎన్నో పేర్లతో తాండవం చేస్తోన్న ఆడా మగా దేముళ్ళని కొలుస్తూ, చీటికీ మాటికీ నదుల్లో, సముద్రాల్లో స్నానాలు చేస్తూ, ప్రతి చిన్నదానికీ మొక్కులు మొక్కేస్తూ, నానా హైరానాపడి అవి తీరుస్తూ, సన్యాసుల చుట్టూ, స్వాముల చుట్టూ, బాబాల చుట్టూ అరుగుతూ అయినదానికీ, కానిదానికీ దేముణ్ణి నమ్ముకుంటూ, ఎప్పుడో చచ్చిపోయిన వారి కోసం తద్దినాలమీద తద్దినాలు పెట్టేస్తూ ఇందాక నువ్వు చెప్పిన భ్రాంతితో గడపటం మూఢనమ్మకం కాదుగానీ, మా పూనకాలు, ఎల్లమ్మదేవత శాసనాలూ, మేము జోగినులుగా మారడాలూ నీకు మూఢనమ్మకాలుగా కనిపిస్తున్నాయా నాన్నా?"
"దేవుళ్ళని నమ్మటం సాంఘిక దురాచారం కాదు.అలా నమ్మటం మంచిదా కాదా అన్న విషయమలా ఉంచితే, ఆ నమ్మకంవల్ల వాళ్ళ జీవితాలు వాడిపోవటంలేదు. వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకోవటం లేదు."
"అయితే మేము నాశనం చేసుకుంటున్నామా?"
"అవును"
"ఎవరు చెప్పారు?"
"ఒకరు చెప్పేదేముంది? కంటికి కనబడుతున్న సత్యం"
పుష్ప నవ్వింది. "మా జీవితాలు నాశనం కాలేదని, మేము చాలా సుఖపడుతున్నామనీ అంటే నువ్వేమంటావు?"
"మీరేమీ అనుకోకపోతే, ఆత్మ వంచన చేసుకుంటున్నారంటాను."
పుష్ప మళ్ళీ నవ్వింది. పైట నేలమీదింకా అలా జీరాడుతూనే ఉంది. "మనకు నచ్చనిది యింకొకరిలో చూస్తున్నప్పుడు__అది ఆత్మవంచనలాగే కనబడుతుంది. ప్రపంచంలో ఎన్నో రకాల మనుషులున్నారు. అవినీతి పరులున్నారు, హంతకులున్నారు, దొంగలున్నారు, అడవిజాతివారున్నారు, వేశ్యలున్నారు, అవసరం లేకపోయినా వ్యభిచారం చేసే వాళ్ళున్నారు, తెల్లవాళ్ళున్నారు, నల్ల వాళ్ళున్నారు, రకరకాల కులాల వాళ్ళున్నారు. ఇందులో జోగినులదీ ఒక జాతి అనుకోండి. మా నమ్మకాలు మావి. మా దేవతలమీద మాకు భక్తి. మా పూనకాలమీద మాకు గౌరవం. మేము యెందరితో పోయినా, ఎంతమందికి మా శరీరాలు అప్పజెప్పినా మాకేపాపమూ అంటదు. అంతేకాదు, మావల్ల లోకానికి శాంతి, సుఖం అన్నీ కలుగుతాయి. వర్షాలు కురుస్తాయి, పంటలు పండుతాయి. మహమ్మారి లాంటి జబ్బులు ప్రజల్ని ప్రాణాలు తియ్యకుండా ఆగిపోతాయి. ఇది ఆత్మవంచన కాదు బాబూ, లోకాన్ని కాపాడటం. మీ అందరి సుఖాలూ కోరటం. తెలిసిందా? జోగిని వ్యవస్థకు అడ్డుతగలటానికి ప్రయత్నించావా? నువ్వే నాశనమైపోతావు. ఇహ వెళ్ళు."
