రవళీ శరత్ చంద్రలు పేషెంట్ ప్రక్కన కుర్చీల్లో కూర్చుని మెడికల్ పుస్తకం తిరగేస్తూ మాట్లాడుకొంటున్నారు. వాళ్ళను చూస్తూనే 'రవళీ' అని పిలవబోయి తటపటాయించాడు. ప్రత్యేక కారణం ఏం లేకపోయినా మనిషిని చూడాలనుకొన్నప్పటికీ చూసినప్పటికీ అతనిలో చాలా తేడా వుంది. ఏదో తడబాటు అతని ఉద్వేగాన్ని నొక్కిపట్టేసింది.
"సార్!" అన్నాడు గొంతు పెగుల్చుకుని.
ఇద్దరూ ఉలిక్కిపడ్డట్లు కిరణ్ ని చూసి ఆశ్చర్యంగా.
"మీరు.... ఈ టైములో ఇక్కడున్నారేమిటి?" అంది రవళి. సమాధానం లేదు. ట్రాన్స్ లో వున్నట్లు కన్నార్పకుండా ఆమెనే చూశాడు.
"లోపలికి రండి సార్!" చిరునవ్వుతో అంది రాజ్యం.
"వాట్ కిరణ్ ఎనీ ప్రాబ్లెం?" అక్కడే నిలబడిపోయిన అతన్ని చూస్తూ అడిగాడు శరత్ చంద్ర.
"నో.... నో సార్!" చూపు మరల్చుకొంటూ అన్నాడు. మరెందుకొచ్చాడో ఆ ఇద్దరికీ అర్ధం కాలేదు.
"లోపలికొస్తారా? రండి, డ్రెస్ మార్చుకోండి!"
అతని ఉద్దేశ్యమేమిటో తెలీక అన్నాడు శరత్. వెంటనే మాట్లాడలేదతను.
కిరణ్ కి లోపలికి వెళ్ళి వాళ్ళతో ఆ రాత్రంతా కూర్చుని గడపాలనిపించింది. రవళిని వదిలి వెనక్కి వెళ్ళాలని లేదు.
పేషెంట్, సెలైన్లు, ఇంజక్షన్లు కళ్ళముందు కదిలాయి. రోగి రక్తంలోని ఎయిడ్స్ వైరస్ ఆకారం అచ్చులు అచ్చులుగా కళ్ళముందు కనిపించింది. అదంతా సిరంజీలకి, సెలైన్ సీసాలకీ, రోగి పక్క బట్టలకీ పాకుతున్నట్లు లుకలుకలాడుతున్నట్లూ అనిపించింది.
అదంతా తనకీ అంటుకొని తన శరీరానికంతా విస్తరిస్తున్నట్లూ, ఇంతై, ఇంతింతై తన శరీరంలో.... తన రక్తంతో సర్వత్రా పాకి, తను ఎండిన శవంలా అయిపోయి.... "నో.....!" మనసులోనే అరిచాడు. ఇంకా ఒక్కక్షణం కూడా అక్కడ నిలవలేకపోయాడు.
"ఏం లేదు సార్! చలపతిరావు ఎలా వున్నాడో చూడాలని వచ్చాను, వస్తాను సార్!" అంటూ వెనుదిరిగాడు.
"ఆయనకంత ధైర్యమెక్కడిది సార్! గుమ్మందాకా వచ్చినందుకే ఇప్పుడు రూమ్ కెళ్ళి పదిసార్లు స్నానం చేస్తారు" నవ్వుతూ అంది రాజ్యం.
"లోపలికి కూడా రాకుండా వెళ్ళిపోతున్నాడు చూడండి. అంత భయం దేనికంటా?" తేలికగా అంది రవళి. అతనంటే ఆ రోజు చాలా చిన్నచూపు కలిగింది ఆమెకి.
"మరీ అంత తక్కువ అంచనా వేయకండి. అతను ఎమ్.ఎస్.లోనూ, ఎమ్.సి.హెచ్ లోనూ గోల్డ్ మెడలిస్టు" చిరునవ్వుతో అన్నాడు శరత్ చంద్ర.
"ఆ....!" అంది రవళి. మరయితే అతను.... అంత చదివి...." అంటూ ఆగిపోయింది.
మెదడు నిండా తెలివితేటలున్నా గుండెల్లో ధైర్యం లేదు. భయానికి తెలివితోడై అతిగా ప్రవర్తిస్తాడు. ఈ రకంగా ప్రజలు ఒక మేధావి వైద్యుడ్ని కోల్పోవాల్సి వస్తోంది!" బాధగా అన్నాడు!
రవళి మొహంలో క్రమంగా బాధ చోటుచేసుకొంది. ఇన్నాళ్ళు అతన్ని ఆటకాయితనంగానే చూసింది తప్ప, అసాధారణ మేధస్సును పొదుపుకున్న గోల్డ్ మెడలిస్ట్ గా గుర్తించలేకపోయిందేమిటి? అనుకొంది.
మరుక్షణంలోనే ఆమెకు అనిపించింది. 'సమాజానికి ఉపయోగపడని మేధావ, నీరులేని మేఘంకన్నా విలువయినవాడేం కాదు' అని.
షిఫ్ట్ ల ప్రకారం కునుకుతీస్తూ పేషెంట్ సంరక్షణలో ఆ రాత్రి గడిపారు.
శరత్ చంద్ర పూర్తిగా తేరుకున్నాడు. రాత్రి పరిస్థితి లేదు. భార్య ఏ రకంగా తన ఆబ్సెన్స్ ని అర్ధం చేసికొన్నా ఫోన్ చేసి వివరించాల్సిన బాధ్యత తనకుందని అనుకున్నాడు.
ఉదయం తొమ్మిదిలోపు చలపతిరావు పనులన్నీ పూర్తయ్యాయి. రవళిని అక్కడ ఉండమని డ్రెస్ మార్చుకొని ఫోన్ చేసేందుకు తన రూమ్ లో కెళ్ళాడు.
ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో ఒక్కసారి మనసులో అనుకున్నాడు. మువ్వకి కూడా వివరించాలనుకున్నాడు. డయిల్ చేశాడు. అటునుండి ఎవరూ ఫోను ఎత్తడం లేదు. రాంగ్ నెంబర్ వెళ్ళిందేమోనని డిస్ కనెక్ట్ చేసి, మళ్లీ డయిల్ చేశాడు. మళ్ళీ నో రిప్లయ్.
ఏం జరిగి వుంటుంది? ఇంట్లో ఎవరూ లేకుండా ఇంత ప్రొద్దుటే ఎక్కడికి వెళ్ళినట్లు? అతని మనసు కీడుని శంకించింది!
* * * *
"గుడ్ మాణింగ్ సార్!" అన్నాడు వార్డు బోయ్ గోవిందం. వయసు ముప్పయి పైనే వుంటుంది. నల్లగా కాస్త బొద్దుగా వున్నాడు మొహంలో తెచ్చి పెట్టుకున్న భావంతో, తెల్లని బట్టతలతో తెల్లకుందేలు చర్మం కప్పుకున్న రాబందులా వున్నాడు. ఆహారం కోసం వెతుకులాడుతున్నట్లు అతని చూపుచురుగ్గా వుంది!
లిఫ్ట్ పైకి లేస్తోంది. లిఫ్ట్ లో స్ట్రెచర్ మీద రోగి పడుకొని వున్నాడు. స్ట్రెచర్ ని ఆనుకొని రోగి బంధువు నిలబడి వున్నాడు.
గోవిందం విష్ చేసింది. తనని కాదేమో అనుకొని సంశయంగా ప్రక్కలకి చూశాడు. మరెవరూ లేరు.
"మీకేం సార్! గుడ్ మాణింగ్ సార్!" చాలా వినయంగా మళ్ళీ చెప్పాడు గోవిందం.
"ఎంత మర్యాద!" అని మనసులో మురిసిపోతూ-
"గుడ్ మాణింగ్, గుడ్ మాణింగ్!" అన్నాడు నవ్వుతూ. అతన్ని క్రింద నుండి పైకి పై నుండి క్రిందికి గొప్ప వ్యక్తిని చూస్తున్నట్లు చూశాడు గోవిందం.
రోగి బంధువులకు అనుమానం వచ్చి,
"నేన్నీకు ఇదివరకు తెలుసా?" అన్నాడు.
"తెల్వాల్నా ఏంది సార్! కొందర్ని చూస్తేనే అంత సమజైతది. మీ పర్సనాల్టీ చూస్తేనే గొప్ప దివాన్ లెక్క వుంది సార్! పెద్ద ఆఫీసర్ దొరవని చూస్తేనే తెల్సిపోతది మల్ల!"
రోగి బంధువు మురిసిపోయాడు. తమ పర్సనాల్టీని మురిపెంగా ఓసారి చూసుకున్నాడు. అతను గవర్నమెంటు స్కూల్లో టీచరు. అతని భార్య కూడా ఉద్యోగం చేస్తుందని ఇతరులు గుర్తించడం ఇష్టం లేకపోయినా పెద్ద ఆదాయం వున్నవాడిలా దర్జాగా కనబడుతుంటాడు. నాలుగో అంతస్థులో లిఫ్ట్ ఆగింది. షట్టర్ తెరుచుకొంది.
స్ట్రెచర్ ని బయటికి లాక్కొచ్చాడు గోవిందం.
"సారీ మీ మెర్సీ!! జేబువైపు చూస్తూ చెయ్యజాపాడు.
"వార్డులోకి వెళ్ళాక ఇస్తాన్లేవోయ్!"
