16
పద్మని రైలెక్కించి కృష్ణమూర్తి తిన్నగా ఇంటికి వచ్చేశాడు.
ఇంటిదగ్గర స్కూటరు దిగి ఇంట్లోకి అడుగుపెడుతుంటే అప్పలకొండ ఎదురయి అన్నాడు.
"తమర్ని అయ్యగారు పిలుస్తున్నారు!"
అనుకున్నట్టుగానే తండ్రి తనకోసం ఎదురుజూస్తున్నందుకు కృష్ణమూర్తి ఎంతో ఆనందించాడు.
పద్మ గురించి ఆయన అడగబోయే ప్రశ్నలకు తాను చెప్పవలసిన సమాధానాలు నెమరేసుకొంటూ తండ్రి గదిలోకి అడుగుపెట్టాడు.
"ఇంతసేపూ ఎక్కడున్నావ్?" అడిగేరాయన.
కావాలని నాన్చుతూ అన్నాడు కృష్ణమూర్తి.
"ఫ్రెండొస్తేనూ..."
ఎవరా ఫ్రెండు? ఆడా మగా?- అని తండ్రి అడగాలి. ఆ టైపు ప్రశ్న కోసం ఎదురుచూస్తున్నాడు కృష్ణమూర్తి.
అయితే ఆయన ఆ లైన్లో పడలేదు.
"డాన్స్ పట్ల నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.
అనుకోని విధంగా అంత చెత్త ప్రశ్న ఎందుకడిగాడో కృష్ణమూర్తికి అంతుపట్టలేదు.
అయినా ఏదో ఒక సమాధానం చెప్పాలి కనక చెప్పేశాడు.
"ఐ లైకిట్!"
కొడుకు చెప్పిన సమాధానానికి సత్యం కుర్చీలో సరదాగా కదిలాడు.
"రక్షించావ్! అసహ్యమంటావేమోనని భయపడ్డాను" అని కూడా అన్నాడాయన.
"అసహ్యమెందుకు? ఆ మాటకొస్తే అదొక కళ. అద్భుతమయిన కళ. భారతీయ సంస్కృతికి పట్టుకొమ్మ..."
చాలా అసహ్యంగా మాట్లాడుతున్నట్టు కృష్ణమూర్తికి డౌటు కలిగింది.
అంచేత అక్కడతో ఆపేశాడు.
అయినా ఆయన అడగవలసిన పాయింటేదో అడక్కుండా ఈ పిచ్చి ప్రశ్న లేమిటనికూడా కృష్ణమూర్తి లోలోన విసుక్కున్నాడు.
"భారతీయ సంస్కృతి నీకు బాగా తెలుసుననుకుంటాను" అడిగాడాయన.
తండ్రి అడిగే వరసకి కృష్ణమూర్తి వళ్ళు మండిపోతోంది. కసిగా కూడా వుంది. అందుకే నోటికొచ్చినట్టు చెడామడా మాటాడాలనే ఉద్దేశంతో-
"ఏ జాతికయినా ఒక సంస్కృతీ, ఒక చరిత్ర ఉన్నాయి. భారత జాతికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతీ చరిత్ర ఉన్నాయి. ఉత్తర భారతం తీసుకుందాం-అదంతా ఆర్య సంస్కృతీ ఆర్యచరిత్ర. దక్షిణదేశం తీసుకుంటే- ఇక్కడంతా ద్రావిడ సంస్కృతీ, చరిత్రా రాజ్యం చేస్తున్నాయి. సంస్కృతి చరిత్రల్లో బోలెడు వ్యత్యాసమున్నా ఆచారవ్యవహారాల్లో మాత్రం ఏకత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అజంతా హరప్పాలకుగానీ, ఎల్లోరా రామప్పలకుగానీ వెళ్ళి అక్కడి శిల్ప సంపదను పరిశీలిస్తే మన విషయం బాగా అర్ధమవుతుంది. అట్లాగే, అమరావతి, నాగార్జునాసాగర్-"
"చాలు" అన్నాడు తండ్రి.
ఆగిపోయేడు కొడుకు.
"అర్జంటుగా నీకు పెళ్ళి చేయాలనుకుంటున్నాను" అన్నాడాయన.
కనీసం ఇప్పటికయినా ఆయన లైన్లోకొచ్చి మాటాడుతున్నందుకు మురిసిపోయేడు కృష్ణమూర్తి.
పెళ్ళి చేస్తాననగానే చేసేయండని ఎగిరి గంతేస్తే బాగుండదన్న ఉద్దేశంతో.
"అప్పుడే ఏం తొందర?" అన్నాడు కృష్ణమూర్తి మాట వరసకి.
"ఇప్పటికే ఆలస్యమయిపోయింది" అన్నాడు సత్యం.
"అంతగా పట్టుబడితే నేను కాదనలేను" అన్నాడు కృష్ణమూర్తి కొంచెం బెట్టుగా.
దట్స్ గుడ్! ఇంక నువ్వు వెళ్ళచ్చు" అన్నాడు తండ్రి.
కృష్ణమూర్తి వెళ్ళిపోలేదు.
పెళ్ళి చేస్తానని డిక్లేర్ చేసేడేగాని పద్మ గురించి ఒక అక్షరమైనా మాటాడకపోవడంతో కృష్ణమూర్తికి అసంతృప్తి కలిగింది.
ఆ సంగతికూడా మాటాడించిగానీ వెళ్ళకూడదనుకున్నాడు కృష్ణమూర్తి.
సత్యం టీపాయ్ మీదనుంచి పేపర్ తీసుకుంటూ అన్నాడు.
"నువ్విక వెళ్ళచ్చని చెప్పేను కదా?"
కృష్ణమూర్తి నసుగుతూ అన్నాడు.
"వెళ్ళచ్చుగానీ... అడగవలసినవి యింకా ఏమయినా ఉండి వుంటాయేమోనని..."
"ఇంకేముంటాయి?"
"ఉండచ్చుగదా!"
"ఉండవు" అని తెగేసి చెప్పాడు తండ్రి.
తండ్రి ధోరణికి అతను చాలా బాధపడ్డాడు. ఆయన యింకా ఆ విధంగానే మాటాడితే తనకి పిచ్చెక్కడం ఖాయమనుకున్నాడు.
రవీంద్రభారతిలో తననీ, పద్మనీ ఆయన స్పష్టంగా చూసేడు. చూసికూడా ఆ అమ్మాయి ఎవరు? ఏమిటి కథ? అని అడగటం లేదంటే ఏమనుకోవాలి?
పెళ్ళీడు కెదిగిన కొడుకు అదే ఈడులోవున్న ఒక అమ్మాయితో తిరుగుతుంటే చూసికూడా తనకేం పట్టనట్టు మవునం వహించే తండ్రులు ఎందరుంటారు! అందులో ఈ తండ్రి నెంబరెంత?
వ్యవహారం గమనించికూడా తనకేం తెలీనట్టు ఎందుకు నటిస్తున్నాడు?
ఏవైనాసరే- తండ్రిని ముగ్గులోకి దించాలనుకున్నాడు కృష్ణమూర్తి.
"నా పెళ్ళిమాట నువ్వే ఎత్తావు. పెద్దలమాట కాదనకూడదనే ఉద్దేశంతో సరే అన్నాను కాని... నేను పెళ్ళాడబోయే అమ్మాయి..." అని ఆగిపోయేడు అతను.
"డాన్సంటే ఇష్టమన్నావుగదా!" అడిగేడాయన.
"అన్నాను, అంటే?"
"నీక్కాబోయే భార్య బాగా డాన్స్ చేయగలదు. షి ఈజ్ వెరీగుడ్ డాన్సర్!"
ఆ మాటతో అతని నెత్తిన పిడుగు పడినట్లయింది.
మొత్తం వ్యవహారం గోల్ మాల్ అయినట్టు గమనించగలిగాడు. పద్మకి డాన్స్ రాదు. అలాంటప్పుడు వెరీగుడ్ డాన్సరనే బిరుదు ఉండనే ఉండదు.
"ఎంతకీ పద్మగురించి తాను తొందర పడతావుంటే... డాన్సరంటాడేమిటి? ఇదేం కొత్తగొడవ?"
కృష్ణమూర్తి మొహమ్మీద అప్పటికే చిరుచెమటలు పట్టాయి.
అతని దీనావస్థ గమనించి వెంటనే మరొక చురక తగిలించేడు సత్యం.
"తొందరలోనే ముహుర్తాలు కూడా పెట్టాలనుకుంటున్నాం, ఆ పిల్ల తండ్రి నాకు బెస్టు ఫ్రెండు"
అని సత్యం కుర్చీలోంచి లేచి వెళ్ళబోయేడు. అక్షరంకూడా అర్ధంకాని స్థితిలో తనని వదిలేసి తండ్రిగారు పారిపోవటం అతనికి నచ్చిందిగాదు.
అంచేత అమాంతం తండ్రిగారి కాళ్ళమీద పడిపోదామానుకున్నాడు అతను.
ఆ కోరికతోనే సగం వంగాడు.
వెంటనే మనసు మార్చుకున్నాడు.
తండ్రిగారు తమ కడుపులో ఏదో కుట్ర పెట్టుకునే అడ్డం తిరుగుతున్నారని ఆ క్షణంలోనే గ్రహించగలిగాడు గనక లేచి స్టడీగా నిలబడ్డాడు.
పరిస్థితి ఇంతవరకూ వచ్చింతర్వాత యింకా దాగుడుమూతలాడి ప్రయోజనం లేదని డైరెక్టు టాకే మంచి టానిక్కన్న ఉద్దేశంతో...
"డాన్సంటే యిష్టమేగాని, డాన్సర్ని పెళ్ళాడటం నాకిష్టంలేదు" అని తెగేసి చెప్పాడు అతను.
