అలా ఇవ్వటం ద్వారానే మాస్టర్ ప్రాణరక్షణపట్ల బొంబాయిలో చాలామంది ఆతృత వ్యక్తం చేస్తుంటారు.
మాస్టర్ అలా ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం పాపభీతా? ఉదార స్వభావమా? లేక మరేదయినా ఉందా అన్నది ఎవరికీ తెలీదు. ఎవ్వరూ అర్ధం చేసుకోలేక పోయారింత వరకు.
అయితే మాస్టర్ మాతృమూర్తి యశోధరకు మాత్రం దయాగుణం, పాపభీతి, ఉదార స్వభావం ఉన్నాయని అందరికీ తెలుసు.
హరేకృష్ణ మఠం (ఇస్కాన్) ఇంటర్నేషనల్ లైఫ్ మెంబర్ షిప్ డైరెక్టర్ ధన్వంతరీదాస్ గారు మెయిన్ గేట్ వద్దే మాస్టర్ కి స్వాగతమిచ్చేందుకు నించున్నారు నిలువెత్తు దండతో.
భక్తి వేదాంత ఇన్ స్టిత్యూట్ డైరెక్టర్ కూడా మాస్టర్ కోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
బొంబాయి ఇస్కాన్ ని అజమాయిషీ చేస్తున్న ప్రధాన వ్యక్తి అమెరికన్.
ఎన్ని లక్షల డొనేషన్ ని యశోధరగారందించ వచ్చని మరో డైరెక్టర్ తో డిస్ కస్ చేస్తున్నారాయన.
క్రమంగా మాస్టర్ కార్లు దూసుకువస్తున్నాయి.
ఇస్కాన్, జుహురోడ్, జుహు, బొంబాయి 400 049 ప్రాంతంలో నివసించే వారంతా వారి వారి అపార్ట్ మెంట్స్ విండోల దగ్గరకు వచ్చి మాస్టర్ ని చూడాలన్న ఉద్వేగాన్ని ఆపుకోలేకపోతున్నారు.
అప్పటికే అమెరికాలో 84, కార్ల్ స్ట్రీట్, శాన్ ఫ్రాన్ సిస్కో, సి.ఎం. 94117లో ఉన్న ఇస్కాన్ హెడ్డాఫీస్ కి కూడా మాస్టర్ రాబోతున్న వార్త అందిపోయింది.
ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఇస్కాన్ టెంపుల్స్ అన్నిట్లో మాస్టర్ ఎనౌన్స్ చేయబోయే భూరివిరాళం ఎంతన్నది తెలుసుకొనేందుకు ఫోన్స్ దగ్గరే కూచున్నారు.
ఇస్కాన్ ఆవరణలో అద్భుతమయిన వాస్తుకళతో మలచబడిన ఇస్కాన్ హోటల్ లో దిగిన అతిధులు తమ తమ గదుల్లోంచి బయటకు వచ్చి ఊపిరి బిగబట్టి మాస్టర్ కోసం ఎదురుచూస్తున్నారు.
వేగంగా రామ్ డాఇన్ పామ్ గ్రోవ్ హోటల్ కసి దూసుకుపోతున్న మృదుల కారు ఉన్నట్టుండి వేగం తగ్గి ఒక వీధి మలుపువద్ద రోడ్ వారగా ఆగిపోయింది.
కలల్లో విహరిస్తున్న మృదుల ఉలిక్కిపడి తేరుకుని ఏమయిందని డ్రయివర్ ని అడిగింది. అతనికి ఏం జరిగిందో తెలియదు కాని కారు అక్కడే వెంటనే ఆపకపోతే మాత్రం ప్రమాదమని గుర్తించాడు.
చూస్తుండగానే సర్.... సర్... మంటూ రెండు మోటార్ బైక్స్, ఆ వెనుకే ఒక కారు ఆ వీధిలోకి దూసుకువచ్చాయి.
స్టెన్ గన్స్ ధరించిన వాళ్ళను చూసి బిత్తరపోయింది మృదుల.
ఎవరువాళ్ళు? ఎవరికి ఫైలట్ గా వస్తున్నారు అని ఆలోచిస్తున్నంతలో ఒక విచిత్రం జరిగింది.
మోటార్ బైక్స్, ఆ వెనుక కారు తమకేసే వస్తుండగా, సడన్ గా ప్రక్క వీధిలోంచి ఒక రోల్స్ రాయిస్ కారు ఒకటి రోడ్ మీదకు దూసుకువచ్చి ఫైలట్ వాహనాన్ని ఫాలో కాసాగింది. అంతలోనే వీధి మలుపులోంచి అచ్చం అలాగే వున్న మరో రోల్స్ రాయిస్ తామున్న రోడ్ లోకి మలుపు తిరిగి వెంటనే అంతకు ముందు వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఏ వీధిలోంచి ఆ రోడ్ లోకి వచ్చిందో ఆ వీధిలోకి వెళ్ళి అదృశ్యమయి పోయింది.
మరికొద్ది క్షణాలకి అంబులెన్స్, ఆ వెనుకే సెక్యూరిటీ వెహికల్స్ ఆ రోడ్ లోకి వచ్చి రీప్లేస్ అయిన రోల్స్ రాయిస్ ని ఫాలో అయి ముందుకు దూసుకుపోయాయి.
తమ కళ్ళముందే కొద్ది క్షణాల వ్యవధిలో పెద్ద మిస్టరీ జరిగిపోయింది. ఏమయిందో? ఆ వాహనాలెవరివో? ఎందుకలా జరిగిందో అర్ధంకాక మృదుల ఖిన్నురాలయిపోయింది.
"డ్రయివర్ ఆ వాహనాలెవరివి? ఎవరంత సెక్యూరిటీతో సాగి పోయింది?" దిగ్భ్రమనుంచి తేరుకుంటూ అడిగింది మృదుల.
సరిగ్గా అదే స్థితిలో ఉన్న డ్రయివర్ తేరుకుని "ది గ్రేట్ గేంబ్లర్...అంతర్జాతీయ స్థాయి జూద వ్యాపారస్తుడు మాస్టర్ అని నాకనిపించింది" డ్రయివర్ మాటలు పూర్తికాకుండానే మృదుల ఒళ్ళు గగుర్పొడిచింది.
"వ్వాట్?" అంది.
"అవును మేడమ్.... వాళ్ళ యూనిఫారంపై ఉన్న ఎమ్ అన్న అక్షరాన్ని, భద్రతా ఏర్పాట్లను చూసాకే నాకూ తెలిసింది. అయితే ఏదో గోల్ మాల్ జరిగింది మేడమ్. ఒకే రకంగా ఉన్న రెండు రోల్స్ రాయిస్ కార్లు తారుమారయి పోయాయి?" అన్నాడు డ్రయివర్ ప్రపంచ వింతను చూసిన ఉద్విగ్నతకు లోనవుతూ.
"మాస్టర్.... మాస్టర్... ఓ మైగాడ్.... ముందు తెలిసుంటే అతన్ని చూడగలిగేదాన్ని" అంది నొచ్చుకుంటున్నట్లుగా మృదుల.
ఆ మాటలు డ్రయివరుకి వినిపించాయి.
కారును స్టార్టు చేస్తూ "మాస్టర్ ని చూడటం, కలవటం అంత తేలికయిన పనికాదు మేడమ్. మహామహులకే అది దుర్లభం..." అన్నాడు.
"వాడ్డూయూ మీన్?" కోపంగా అంది మృదుల. ఆమె కంఠంలో ఆశ్చర్యం కూడా తొంగిచూసింది.
"సారీ మేడమ్ ఇట్స్ ఫేక్ట్" అంటూ డ్రయివర్ కారును ముందుకు దూకించాడు.
కారు వందగజాలు ముందుకెళ్ళగానే ఇద్దరు యువకులు రోడ్ మీదకు వచ్చి లిఫ్టు ఇవ్వమన్నట్లుగా చేతులతో సంజ్ఞ చేస్తూ రోడ్ కి అడ్డంగా నించున్నారు.
లిఫ్టు ఇవ్వకపోతే కాల్చిపారేస్తారేమో అని భయపడిన డ్రయివర్ కారుని స్లో చేశాడు.
ఆ ఇద్దరు వ్యక్తులు మృదుల ఏదో అడిగే ప్రయత్నంలో ఉండగానే డ్రయివర్ ప్రక్కన కూర్చుని కారు ముందుకు పోనివ్వమని కళ్ళతో బెదిరించారు.
ఏం జరిగిందో, ఏం జరగబోతోందో అర్ధం కాని మృదుల ఏమీ మాట్లాడలేక శిలాప్రతిమలా వెనుకసీట్లో బిగుసుకు పోయింది.
డ్రయివరు ప్రక్కనే కూచున్న వ్యక్తి కుడిచేతిలోకి క్షణాల్లో రివాల్వర్ వచ్చేసింది.
ఎడంచేత్తో కారు ఎటువెళ్ళవలసింది ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు.
డ్రయివర్ ప్రాణభయంతో మృదులను తీసుకెళ్ళవలసిన రూట్ ని వదిలేసి వారికీ కావల్సిన రూట్ లోకి కారు తిప్పాడు.
