ఇవేమీ మృదులకు కనిపించే అవకాశంలేదు. పైపెచ్చు వాళ్ళ మొఖాలు కూడా కనిపించటం లేదు.
అంతకు మునుపే డ్రయివర్ ప్రక్కనున్న ఆగంతకుడు ముందు భాగంలో డ్రయివర్ కి ఎదురుగావున్న మిర్రర్ ని క్రిందకి టిల్ట్ చేసాడు. కారు సర్ర్ న దూసుకుపోతోంది.
* * * * *
సిగ్నల్ మెన్ బైనాక్యులర్సుతో చూస్తూ అలర్ట్ అయిపోయాడు.
తన కాళ్ళ దగ్గరున్న లైట్ ని వెలిగించాడు. టెర్రస్ పిట్టగోడ దగ్గరకు వచ్చాడు.
ఇప్పుడతనికి మాస్టర్ ఫైలట్ వెహికల్స్ స్పష్టంగా కనిపించాయి.
లైట్ ని కొద్దిగా క్రిందకు జార్చి జోహ్రాకు సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు సిగ్నల్ మెన్.
అంతలో...
అక్కడ.... ఆ టెర్రస్ మీద ఏదో చప్పుడయింది. సిగ్నల్ మెన్ ఉలిక్కిపడి తలమాత్రం వెనక్కి తిప్పిచూసి షాక్ తిన్నాడు.
ఎదురుగా ఇద్దరు మాస్టర్ కమెండోస్..... (గొరిల్లా కమెండోస్) వారి కళ్ళలో నిప్పు కణాలు మండుతున్నాయి.
వాళ్ళు తమ శరీరాలను ఉక్కుముక్కల్లా బిగించి ఒక్కో అడుగు సిగ్నల్ మెన్ కేసి వేయసాగారు. సిగ్నల్ మెన్ భయంతో బిగుసుకు పోయాడు. వెన్నులో ప్రారంభమైన వణుకు శరీరమంతటికి పాకిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి.
అతనికి మిల్లర్, అతనికింద పనిచేసే కమెండోస్ ఎంతటి నరరూప రాక్షసులో బాగా తెలుసు. కథలు కథలుగా విన్నాడు.
గొరిల్లా కమెండోస్ మరింత దగ్గరగా వచ్చారు. అతనికి తెలుసు అవే ఇక తనకి ఆఖరిక్షణాలని. క్షణాల్లో తేరుకుని చేతిలో వున్న రోప్ ని సర్రున క్రిందకు జారవిడిచాడు. దానికి చివర కట్టివున్న లైటు క్రిందకు జారింది.
తను చంపబడినా, అది జరిగేలోపు సిగ్నల్ లైటు జోహ్రా దృష్టికి వస్తే చాలని అతను ఆలోచించాడు.
ఆ వృత్తిలో వున్నవాళ్ళు తమ ప్రాణం కన్నా తాము ఒప్పుకున్నా పనిని పూర్తిచేయటమే ముఖ్యమని భావిస్తారు.
అందుకే మృత్యువు అంచుల్లో నించుని కూడా జోహ్రా దగ్గర తను తీసుకొన్న ఎమౌంట్ కి న్యాయం చేయాలనుకున్నాడు.
అతని చేతిలోని రోప్ మరింత క్రిందకు జారింది.
చెట్టుమీదున్న జోహ్రా అలైట్ ని చూశాడు.
సబ్ మెషిన్ గన్ ని పొజిషనులోకి తీసుకున్నాడు.
సేఫ్టీ కేచెస్ ని ప్లిక్ చేసి సిద్దమైపోయాడు జోహ్రా.
సిగ్నల్ మెన్ కి గొరిల్లా కమెండోస్ ఇద్దరూ ఇప్పుడు కేవలం ఒక అడుగుదూరంలో ఉన్నారు. అతని కళ్ళలో చావు భయం స్థానే చావుకు సిద్దమైన మొండితనం కనిపించింది.
జోహ్రా చందనా థియేటరు దగ్గరున్న ఆగంతకులకు సిగ్నల్స్ ఇచ్చేసాడు.
గొరిల్లా కమెండోస్ లో ఒకతను సిగ్నల్ మెన్ చేతిలో వేలాడుతున్న రోప్ ని లాగేసుకుని, దాన్ని దూరంగా విసిరేసాడు. మరొకతను అతని మెడని గ్లౌసెస్ బిగించుకొని వున్న తన అరచేతుల మధ్య బంధించాడు.
ఆఖరిఘడియలు సమీపించాయని సిగ్నల్ మెన్ కి తెలిసిపోయింది.
మృత్యువుతో ఆటలాడుకొనేవారికి, ఆ మృత్యువే వారిని సయితం ఎప్పుడో ఎక్కడో కబళించి వేస్తుందని కూడా తెలుసు గనుకే, వారి బలం, రాక్షసత్వం తెలుసుగనుకే, అతను ప్రతిఘటించలేదు ప్రతిఘటించలేడు కూడా. ప్రతిఘటించినా ప్రయోజనం వుండదని అతనికి బాగా తెలుసు.
ఫైలట్ బైక్సు దేవానంద్ ఇంటి మలుపును సమీపించాయి.
మలుపు కారణంగా బైక్సు వేగం తగ్గింది. చందనా థియేటర్ ప్రక్క ఆగివున్న కార్లు బయలుదేరాయి.
అంబులెన్స్ డ్రైవింగ్ సీట్లో వున్న మిల్లర్ కళ్ళు పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టేందుకు చలిస్తున్నాయి.
ఫైలట్ కారు కూడా మలుపు తిరిగింది. మామిడిచెట్టుపై చిన్న కదలిక....
రోల్స్ రాయిస్ వేగం తగ్గి ఎడంవేపుకు మలుపు తిరిగింది.
సరిగ్గా అదే టైమ్ కి రెండు అంబాసిడర్ కార్లు ఎదురయి మాస్టర్ వెహికల్స్ వేగాన్ని మరింత తగ్గించాయి.
ఒక్కోక్షణం భారంగా కదులుతుండగా జోహ్రా చేతిలోని సబ్ మెషిన్ గన్ నిప్పులు కక్కింది.
ఒక్కసారి ఆ ప్రాంతంలో పరచుకొని వున్న నిశ్శబ్దం బ్రద్దలయి పోయింది.
చుట్టుప్రక్కల ఇళ్ళలో వున్న జనాలు కలవరపాటుకి గురయ్యారు. ఏం జరిగిందో తెలీక భయకంపితులయ్యారు.
ఒకింత సమయం మాస్టర్ కమెండోస్ కూడా కలవరపాటుకి గురయినా, మిల్లర్ ఆదేశాలు తమ చెవుల్లో మారుమోగుతుండటంతో ఎలాంటి ప్రతిచర్య తీసుకోకుండా సాగిపోయారు.
జోహ్రా రోల్స్ రాయిస్ బేక్ సీటులో వాలిపోతున్న మాస్టర్ ని చూసి సంతృప్తిగా తలపంకించి చెట్టుమీంచి జారిపోతూ రోల్స్ రాయిస్ బేక్ టైర్సుని గురిచూసి కాల్చి ఆ మరుక్షణం అదృశ్యమైపోయాడు.
జరిగిన చర్యకి ప్రతీకారేచ్చతో రగిలిపోయిన కమెండోస్ మిల్లర్ ఆదేశాల్ని ధిక్కరించలేక ముందుకు సాగిపోతూనే వున్నారు.
కాని వాళ్ళు మాస్టర్ ఏమయి వుంటాడన్న ఆలోచనతో బిగుసుకుపోయారు.
రోల్స్ రాయిస్ కారు బ్యాక్ టైర్సు జోహ్రా సబ్ మెషిన్ గన్ బుల్లెట్స్ కు ఫైరయి సడన్ గా ప్రెజర్ ని కోల్పోయాయి. దాంతో కారు ఒక్క క్షణంపాటు కుదుపుకి లోనయి ఫ్రంట్ టైర్సు స్కిడ్ అయ్యేందుకు కారణమయింది.
కాని సెల్ఫ్ సీలింగ్ టూబ్స్ ఆ కారు టైర్సుకి ఉండటంతో క్షణాల్లో బ్యాక్ టైర్స్ అవసరమయిన ఎయిర్ ప్రెజర్ ని పొందగలిగాయి. కారు మామూలు పొజిషన్ కి వచ్చేసింది.
జోహ్రా విజయగర్వంతో దేవానంద్ ఇంటిముందున్న జీప్ లోకి ఎగిరి దూకిన మరుక్షణం అది జుహు బీచ్ కేసి దూసుకుపోయింది.
* * * * *
