Previous Page Next Page 
క్రాస్ రోడ్స్ పేజి 24


    దాంతో ఎదురుగా వస్తున్న వాహనాల్లో వ్యక్తులు ఆసక్తికరంగా రోల్స్ రాయిస్ కేసే ఆసక్తిగా చూస్తున్నారు- మాస్టర్ కనిపిస్తాడేమోనని.
    
    రోల్స్ రాయిస్ లోపల నిశ్శబ్దంగా ఉంది. మాస్టర్ కి కూడా ఆరోజు తనని అసాసినేషన్ చేసే పథకం సిద్దమయిందని తెలుసు. కానీ తను దాని గురించి పట్టించుకోవటం లేదు. అతని ఆలోచనలిప్పుడు మృదుల చుట్టూ అల్లుకుపోయి వున్నాయి.
    
    "నాన్నా" అంది మాస్టర్ ని ఉద్దేశించి యశోధర ఆ పిలుపు అతనికి వినిపించలేదు.
    
    రెండోసారి పిలిచినప్పుడు అతను ఆలోచనల్నుంచి తేరుకుంటూ "వాట్ మమ్మీ?" అన్నాడు.
    
    "ఎన్నాళ్ళు నాన్నా ఈ జైలు బ్రతుకులు మనకు?"
    
    యశోధర కంఠం భారంగా వుంది.
    
    అతను మాట్లాడలేదు.
    
    అంతలో రోల్స్ రాయిస్ లోని వైర్ లెస్ సెట్ గరగరమంది. అదే సమయానికి అన్ని వాహనాల్లో అమర్చిన వైర్ లెస్ సెట్సు కూడా అలాంటి శబ్దాన్నే సృష్టించాయి.
    
    మిల్లర్ నుంచి అందరినీ ఉద్దేశించి ఏదో మెసేజ్ రాబోతుందని అందరూ అర్ధం చేసుకున్నారు.
    
    "డియర్ కమెండోస్ ఎలాంటి అవాంతరాలు ఎదురయినా, ఏ ప్రమాదం ముంచుకొచ్చినా మీరు ఆగిపోవద్దు ఎదురుదాడి చేయకుండా ముందుకు సాగిపోండి..... ఓవర్" మైక్స్ ఆఫ్ అయ్యాయి.
    
    అందరూ మిల్లర్ ఇచ్చిన సూచనలు అర్ధంకాక పిచ్చెక్కిపోయారు.
    
    వెహికల్స్ దూసుకుపోతూనే ఉన్నాయి.
    
    ఉద్విగ్నత వారి నరనరాన నర్తిస్తుండగా ముందుకు దూసుకు పోతున్నారు.
    
    మిల్లర్ ఆదేశాలే వారి చెవుల్లో మారుమోగుతున్నాయి.
    
    అంధేరి నుండి జుహూకి సాగిపోయే రోడ్ క్రమంగా దగ్గరవుతోంది.
    
    మరోప్రక్క ఇస్కాన్ హరేకృష్ణ మఠం ఆవరణని మాస్టర్ కమెండోస్ పదహారుమంది ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలించేసి ఎలాంటి ప్రమాదమూ ఆ ఆవరణలో పొంచి లేదని నిర్దారించుకున్నారు.
    
    మాస్టర్ హాజరయ్యే ప్రైవేట్ పబ్లిక్ సమావేశాలకుగాని, కార్యక్రమాలకు గాని ముందుగానే పదహారుమంది మాస్టర్ కమెండోస్ ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాన్ని, చుట్టుప్రక్కల క్షుణ్ణంగా శోధించటం మిల్లర్ భద్రతా ఏర్పాట్లలో ఒక అంశం.
    
    మొత్తం నలభయ్ మంది మాస్టర్ కమెండోస్ లో తిరిగి ఐదు వర్గాలున్నాయి.
    
    ఎనిమిదిమంది బ్లాక్ కాట్ కమెండోస్.
    
    ఎనిమిదిమంది సిల్వర్ ఫాక్స్ కమెండోస్.
    
    ఎనిమిదిమంది లైన్ కమెండోస్
    
    ఎనిమిదిమంది బ్రౌన్ డాగ్ కమెండోస్.
    
    ఎనిమిదిమంది గొరిల్లా కమెండోస్. మాస్టర్ వెళ్ళవలసి వున్న నిర్ణీత స్థలమేధో మిల్లర్ నిర్ధారించగానే వారం ముందుగా ఆ ప్రాంతానికి బ్రౌన్ డాగ్ కమెండోస్ వెళ్ళి ఆ ప్రాంతాన్ని, పరిసరాల్ని శోధించి మిల్లర్ కి ఓ రిపోర్టు అందిస్తారు.
    
    ప్రోగ్రామ్ మరోరోజు మాత్రమే ఉండగా సిల్వర్ ఫాక్స్ కమెండోస్ వెళ్ళి మరోసారి శోధించి వాళ్ళూ ఒక రిపోర్టు అందిస్తారు.
    
    కార్యక్రమం రోజు మాస్టర్ ని గొరిల్లా కమెండోస్ ముందు వెనుకలుగా ఫాలో అవుతారు.
    
    ప్రోగ్రామ్ ప్రకారం మాస్టర్ గడిపే నిర్ణీత స్థలాన్ని బ్లాక్ కాట్ కమెండోస్, లైన్ కమెండోస్ పటిష్టమయిన రక్షణ వలయాన్ని సృష్టిస్తారు.
    
    అంత పకడ్బందీగా మాస్టర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తాడు. కనుక మాస్టర్ కూడా మిల్లర్ ముందు తన వ్యక్తిగత కార్యక్రమాల్ని అంత ధైర్యంగా చెప్పుకోలేడు.
    
    అప్పటికే ఇస్కాన్ టెంపుల్ లో మాస్టర్ రాబోతున్నట్లుగా తెలిసిపోయింది.
    
    అక్కడున్న భక్తులలో, ఇస్కాన్ నిర్వాహకుల్లో ఉత్కంఠ ఊపిరి పోసుకుంది.
    
    తెల్లటి సఫారీ డ్రస్ లో జాగిలాల్లా తిరుగుతున్న కమెండోస్ ని చూసి కొందరు మాస్టర్ ఎలా ఉంటాడో అన్న ఆసక్తితో మరికొందరు క్షణమొక యుగంగా గడుపుతున్నారు.
    
    ఇస్కాన్ రిసెప్షన్ ఫోన్స్ నిర్విరామంగా రింగ్ అవుతున్నాయి.
    
    620 0596
    620 6332
    620 0312
    
    ఫోన్ నెంబర్సుకి ముఖ్యమయిన వ్యక్తుల నుంచి వస్తున్న కాల్స్ కి ఆపరేటర్సు వెనువెంటనే సమాధానాలిస్తున్నారు.
    
    "మాస్టర్ ఈజ్ కమింగ్....ఎవ్రీథింగ్ ఓకే?" మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ కాల్ అది.
    
    "మాస్టర్ భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉన్నాయా?" మహారాష్ట్ర స్టేటు గవర్నమెంటు డి.ఐ.జి. ప్రశ్న అది.
    
    "మాస్టర్ క్షేమం మాకు చాలా ముఖ్యం. ఏదన్నా జరిగితే క్షమించం" ఒక ప్రాంతీయ పార్టీ సెక్రటరీ హెచ్చరిక అది.    
    
    "వెయ్యికళ్ళతో కాపలా కాయండి. అనుమానమున్న వ్యక్తుల్ని వెనకా ముందు చూడకుండా కస్టడీలోకి తీసుకోండి" హోమ్ సెక్రటరీ ఉత్తర్వు అది.
    
    ఇస్కాన్ చుట్టుప్రక్కలా చిరుతపులుల్లా తారట్లాడుతున్న క్రయిమ్ బ్రాంచ్ ఆఫీసర్సు, పోలీస్ అధికారుల దగ్గరున్న వైర్ లెస్ సెట్సు ఆన్ అయి ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏవో ఇన్ స్ట్రక్షన్స్ పై అధికారుల నుంచి వారికి వస్తూనే ఉన్నాయి.
    
    మాస్టరు దగ్గరకు ఎవరన్నా వెళ్ళి పార్టీ ఫండ్ పదివేలివ్వమని అడిగితే వారిని కసురుకొని పంపిస్తాడు. వాళ్ళు కోప్మగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి వెళ్ళేసరికి అక్కడ మాస్టరు పంపిన పదిలక్షలు కేష్ ఎదురుచూస్తుంటుంది.
    
    స్వచ్చంద సేవా సంస్థలు, సాంస్క్రుతిక సంస్థల నుండి ఎవరన్నా వెళ్ళి లక్ష చందా అడిగితే మీకు అడగటం చేతకాదని పదో, పదిహేనో లక్షలు ఇచ్చి పంపిస్తాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS