15
పలాసటి సేతులుకి పొడుగాటి రయికేసుకొని , నిండా గాజులు నింపుకొని, మొకానికి రంగు పులుంకొని, సన్నవుగా తలుకు బొట్టేట్టుకుని నడుం మీంచి దిగజారతావున్న పల్చటి సిలుకు పరికినీ ఏసుగుని, సిలిపిగా కళ్ళు తిప్పుతా,సీణేవా పిల్లలా గుంపు నడాని కొచ్చింది సెంద్రకాంతం.
ఓ బొజ్జ గనపయ్య పెదాలు సప్పరించుకొన్నాడు. ఇంకో నీటు కాడు మీసం తడుంకున్నాడు. మరో పొట్టి బుడతగాడు మిరి మిర్రి సూశాడు. ఇంకో బక్కనక్కోడు జబ్బలు సరుసుకున్నాడు. అందవులో కోతికి సినతమ్ముడు , అద్డవుకోసం యిటూ అటూ ఎతుకులాడాడు. ఇంకోడి గొంతుకు లో సిణేవా పాటలేయో గురగుర్లాడినాయి. సికిలికల్లోడు సోగ్గా మొగం సిట్లించుకున్నాడు. ఇంకో గుడ్డి కల్లోడు కాంతపు కాలిగజ్జిల సప్పుడిని దాని అందాన్ని మనస్సులో తలుసు కుంటా నొసలు కదిలిత్తన్నాడు.
బద్రయ్య అరుగు మీదోరిగి , వొత్తిగిలి తొంగున్నాడు. ఎంకన్న వొటేలు గుమ్మవు మీద సెయ్యేసుకు నిలుసున్నాడు. బంగారయ్య అందరి కన్నా ముందలి కెల్లి , కాంతవు సేతి యిసురు నోచ్చీ గాలి లోన తగల్డవు కోసం సిలుకు సోక్కా బొత్తావు లిప్పుకొని వుంగరాలు సోగ్గా సరుదుకున్నాడు.
గలగలా గోదారి సాగిపోతన్నాది. అద్దరి సున్న సెట్లుబూతాల్లా కనిపిత్తన్నాయి. బిజ్జీ మీద రేలు బండి గజ్జిలో యించుగుంటా కొవ్వూరేవుకి ఎల్లి పోతన్నాది.
కాంతం కూడా వొచ్చిన పక్క వోయింపోళ్లు డోలక్కూ, పిడేలూ, సాన్నాయీ , అరవణిలన్నీ మెల్లో ఏసుగుని సరుదుకున్నారు.
కాంతం కాలు కదిపినాది.
అందరి గుండెలూ గల్లు మన్నాయి!
సెయి తిప్పినాది.
ఆళ్ల మనసులు దాని గుప్పిట్లో సిక్కు కున్నాయి!
కళ్లు మెదిపినాది.
అందరి కనుపాపల్లో నూ అదే మెరిసినాది!
వొళ్లిరుసుకున్నాది.
ఆళ్ల నరాల్లో మొగతనపు పరవోళ్ళు తొక్కింది!
పెదాలు కదిపినాది.
అందరి పెదాలూ అదే కదిపినట్టున్నాది!
అడుగు తీసి అడుగేత్తావుంటే వొకడి గుండిలి మీంచి మరోడి మీదికి దూకుతా వున్నట్టే అయినాది!
అది వొక్కతే కాంతవు.
అదే ఆళ్ళందర్నీ కలిపి ముద్దా సేసి వొకే బొమ్మగా పొదివి, దాసుకున్నాది!
అది గొంతెత్తి పొడతావుంటే అ వొంకరల్లో వొదిగిపోయారాళ్ళు!
"బద్రయ్యా సెరబయ్యా బంగారయ్యా ముగ్గురూ కలిసారూ ముంచేరయా
--నిన్ను ముంచేరయా!
ఎంకన్నా! ఓ ఎంకన్నా --"
అని పాడతా, ఆడి దరి కెళ్లి బుగ్గ మీద సిటీ కేసి సొగసు గా సేయ్యట్టుకొన్నాది. ఆడు యిది లించుకున్నాడు. ఉసూరవని సూత్తా మల్లా తిరిగొచ్చింది.
పాటకి సరిబడ్డ ఆటా, ఆటకి తగిన సూపూ, సూపుకి తోడూ గొప్ప సోకూ, ఓలమ్మో! దావాటే కోటోరాల మూట!
పాటేనక పాటా, దావెనక మరోటీ అల్లా వోకోడోకోటి పాడించుగుంటా ఉన్నాడు. ఆళ్లలో వోడు మనుసుపడి అడిగాడు. "సోగ్గాడేలమ్మి , సోగ్గాడే!" అంటా పాడిన పాటకి ఎవుడి మటుకాడే, తన్ని సూసే పాడతన్నాదనుకున్నాడు.
అప్పుడప్పుడు సేతి గడారపు సూత్తానె వున్నాడు బద్రయ్య. అడిక్కూడా దానాట ముచ్చటే అయినాది కానీ, యీ వుసారులో ములిగి పొతే తను పన్నిన వొలంతా టుపుక్కుమని పొతే యింకేవన్నా వుందా? కన్నుగీటి బంగారయని ఎనక్కి లాగాడు.
"నే సెప్పిన టైపు గురుతున్నాదా?"
"ఎందుకు లేదన్నా! పదకొండు కాదో?"
"ఆ అదే అడుగతున్నా! సరింగా పదకొండూ కొట్టేతలికి మీరంతా వూల్లో పడాల. తెలిసిందా? తాగి తందనాలాడతా వుంటానికీల్లేదు. ఎవ్వారం కాని బెడిసి కొట్టిందో , ఆళ్ల మక్కి లిరగదంతాను కబడదార్!"
"నాకు తెలీదేంటి బద్రయ్యా? నువు లోనకి పోయి తొంగో! తొలికోడి కూసీలోపునీ కడవోల్లో కాసులు తెచ్చి నీ కాళ్లకాడ కుమ్మరించా పొతే నాకు మారు పెరెట్టు! తెలిసిందా? ఆ!"
"సెలాన్ బంగారం! నీమాట నీవు నిలబెట్టుకున్నావంటే నిలువెత్తు బంగారం నీకు కట్నం పదియించవో?" అంటా బల్లుని ఆడీపు సరిసాడు బద్రయ్య.
"కాంతావు గజ్జి కట్టి శానా కాలవయినాది గందాని , యీయేల యీళ్ళంతా యిరగబడి పోతున్నారు! కూతంత తవాయించుకొనీ బద్రయ్యా! కాంతాన్ని లోనకంపి, ఆళ్లని నాతొ లేగదీసుక పోతా!"
"సరే, నీ యిట్టవు! కాని, ఆళ్లు మట్టుక్కు తప్పతాగి వొళ్లు మరిసిపోకుండా సూసుకో! సుతి మించి రాగాని పడిందంటే కుతుకి లెరిగి పోగలవు!"
"అదంతా నా కోదిలేయినున్నగా!"
"ఇంతకీ రావోలిసి వొళ్ళంతా సచ్చినట్టేనా?"
"లేపోతే బతగ్గల్రవే?"
"సెబాస్ బంగారం!" నో రెంబగా బెట్టి మల్లా నవ్వాడు బద్రయ్య. ముసిముసిగా మురిసిపోయాడు బంగారయ్య.
కాంతం యింకా ఆటాడతానె ఉన్నాది. ఒకోడి సేయ్యట్టుగుంటానే వున్నాది. మరోడి గేడ్డవు తడుంతాది. ఇంకోడి జట్టట్టుకు లాగుతాది. ఏరేవోడి జేబు నెలుకుతాది!
ఒకోడికి ముద్దిత్తాది. మరోడికి సేయ్యిత్తాది. ఇంకోడి సెంపంటిత్తాది. ఎరేవోడ్నీ గజ్జిలు సరదమంటాది!
ఒకోడ్నీ మావంటాది. మరోడ్నీ బావంటాది. ఇంకోడ్ని బాబు అంటాది. ఏరేవోడ్ని తాతా అని పిలుత్తాది!
ఒకోడి నరాలు వుబ్బుకొత్తాయి. మరోడికి యింటో కసుక్కూకున్న పెళ్లాం గురుతుకొచ్చి వొళ్లు పులకలేత్తుతాది . ఇంకోడికి , కరనం కావన్న తో లెగిసి పోయిన పడుసుది గురుతు కొత్తాది. పేరు మోసిన ఆడదే అయినా, తాలూక్కసీరీ అప్పయ పంతులు పెళ్లాం కొంగట్టుకున్నందుకు నెత్తి మీద దీపవెట్టి వూరంతా తిప్పించిన సంగతి, వొద్దనుకున్నా గురు తొత్తన్నాది ఏరేవోడికి!
ఒక్క సెంద్రకాంతాన్ని సూసి ఒకోడోకో రకవుగా యిదయి పోయాడు.
బంగారయ్య వోకోడి దరికీ ఎల్లి సెవులో ఏదో వూతూ ఉంటె ఒకడేనక మారోడు సల్లగా లోనకెళ్ళి ఎంకన్న సేతి మీదగా సేరుకో గళాసుడూ ఏసుగుని , బుట్టలో అంటి పళ్ళు తీసుగుని , ఎలపలి కొచ్చి మల్లా కాంతం సుట్టూ మూగుతా ఉన్నారు. కాంత వాడతన్న ఆటకి ఆ నిసాలో అందరూ దరువేత్తా వుంటే ఓకొడు బరితెగించి దాని సుట్టూతా గంతులేత్తా ఉన్నారు.
దోలక్కోడు దబదబదబా కొడతన్నాడు. పిడేలోడి పళ్ళు కల్లక్కనిపించనంత సురూగ్గా కదలి పోతన్నాయి. అరవణీబోయిబోయి బోయివంటన్నాది. కాంతవు కాలి గజ్జిలు గలగలల్లాడతన్నాయి. ఎవుడి మట్టుక్కాడే ఏరే లోకవులో ఉన్నట్టే అయిపోయారు!
అయిపోతా వుంటే పెద్ద వురువురువినాది .
"ఆపండి!"
కొండిరిగి మీద పడినట్టున్నాది. ముసలయ్య అరుపు పిడుగు పాటే అయినాది!
"అటాపండి!"
కాంతం కాళ్ళు నిలుసుండిపోయాయి. మిగిలివొళ్ళంతా అదిరి సూశారు. దాని పెదాలు బయంతో వోనికిపోతన్నాయి. మిగిలినోళ్ళు కోపంతో రుసరుసనన్నారు.
పైనించి పడ్డ సందన బొమ్మ లాగయినాది సెంద్రకాంతం!
తాతా, సీతమ్మా గుంపు లో కొచ్చారు.
అప్పుడు, అక్కడ, ఆళ్ళనీ , నడవ అట కత్తిని సానా సోద్డెంగా సూసినాది సీతమ్మ. తాత కళ్ళు సింత నిప్పులు సెరిగినాయి.
"ఏంటి సేత్తన్నారర్రా యిక్కడా?" అందర్నీ కలిపి నిల్దీశాడు ముసలయ్య.
"కనిపించడవులా?' అన్నాడో అసావీ.
"ఏం సేయడవేంటి ముసలోడా?' అన్నడింకోడు.
"బోజనవు సేత్తన్నాం!" అన్నాడో బొంతరటిపండు మొనవోడు.
"సెంద్రకాంతవు సూత్తానంటే, మేవంతా డాన్సు సేత్తన్నాం!" మరోడు.
"నువ్వు కూడా ఓ గళాసేసుగుంటే నీకూ అంటి పల్లెడతావొచ్!" హీ హీ వంటా నవ్వాడు ఏరేవోడు. అడ్నీ అంటుకుని తక్కినోళ్లూ నవ్వారు.
తాతకి కోప వాగలేదు.
"నోరుముయ్!"
"ఎందుకో?' అన్నాడోడు సల్లగా.
ఇంత గొడవయినా బద్రయదొర గద్దిమీంచి దిగేలేదు.సోగ్గా వొత్తిగిలి తొంగున్న వోడల్లా గబుక్కుని లెగిసి కూకున్నాడు.
"సింతసెట్టు సిగురు సూడూ.
సిన్నదాని సొగుసు సూడూ!" అంటా సీతమ్మ ఎంపు కన్ను గీటాడు మరోడు.
ముసలయ్య కి వొళ్లు మండినాది.
"ఏంటిరా కూత్తన్నావ్?" అంటా కర్రెత్తబోయాడు. సటుక్కుని సీతమ్మ పట్టుకున్నాది.
"పొండి! అందరూ బయిటికి పడండి!"
"ఏం? అన్నాడు యింకోడు.
"ఏవా? ఏవో సెప్పాలాంట్రా? దొంగసచ్చివోడా!"
మిగిలివొళ్ళంతా కడుపుబ్బిపోయీలా నవ్వారు.
"ఎల్లమంటే మీక్కాదో? ఇదేవన్నా మీ తాతగారిల్లను కున్నారంట్రా?"
"ఎబ్బే! నీది!" అంటా సాగదీశాడు ఏరేవోడు.
"అవున్రా! ఈ గుడిసెనాది! కాదనీవోడేవడ్రా?"
"ఏయ్ , ముసలోడా! ఇందాక న్నించీ వూ పెల్తాన్నావ్! యా! కుంటోడివని దయితలుత్తా ఉంటె యీవోగుడెంటంట? సూత్తారేం? ఎత్తండర్రా కర్లూ!"
