ఆ చిన్ని తాజ్ వెనుక సిరాతో ఏదో రాసి ఉంది. ఛాయ దాన్ని దాచడానికి యత్నించింది-కాని చెరపలేకపోయింది. జారిన భాష్పబిందువులా, ఒక సిరా చుక్క అక్కడ చెదిరిపోయింది. తాజ్ నా టేబుల్ మీద ఉంది. రాత్రికి లాంపు వెలిగిస్తాను చదువుకోడానికి. అప్పుడు దాని నీడ గోడమీద మహా సౌధంలా విరజిల్లుతుంది. దీన్ని తయారుచేయడానికీ, దీన్ని ప్రేమ కానుకగా అందించడానికి ఎన్ని కొండలు మలచారో? ఎన్ని పూల రేకులు వజ్రపు గుండెకు గాట్లు పెట్టాయో! తాజ్ మహల్ అణువు అణువునా ఎన్ని స్వప్నదీపాలు వెలిగాయో! విడిపోయిన షాహ్ జహాఁ ఎన్ని కన్నీటి దీపావళులు జరుపుకున్నాడో!
ఛాయ మరోసారి నాదగ్గరికి వచ్చింది.
ఆరోజు జాగ్రత్తపడి వచ్చింది-అయినా కనుకొనల్లో చెమ్మా, చెదిరిన వెంట్రుకలు ఆమె బాధను వ్యక్తపరుస్తూనే ఉన్నాయి. ఎవరో లోపలికి బలవంతంగా నెట్టినట్లు బెదురుతూ గదిలో ప్రవేశించింది. ఆమె చేతిలో ఒక బట్టల ప్యాకెట్ ఉంది. అది చేతిలోంచి జారిపోకుండా గట్టిగా పట్టుకుంది. గదిలో ప్రవేశించి వేళ్ళు ఆడిస్తూ నుంచుంది. నాతో మాట్లాడే ధైర్యం లేనట్లు నుంచుంది. ఎలా చెప్పాలో తెలియక తడబడుతూంది.
నేను ఆమె చెప్పకుండానే గ్రహించాను- ఏదో పనికిరాని వస్తువు తెచ్చింది అమ్మడానికని. దాన్ని కొనాలి. ఈలోగా ఎవరైనా వస్తే ఛాయ వెళ్ళిపోతుంది. అమ్మలేదు అమ్మే రావచ్చు గద్దించి వెళ్ళగొట్టచ్చు. ఈ ఛాయకు మేమే దొరకినట్లున్నాం దోచుకోడానికి? రోపాయీ, అర్దా ఇచ్చి వదిలించుకోవడం మంచిదనుకున్నాను.
"అచ్ఛా! ఒక రూపాయి ఇస్తే గడుస్తుందా?"
'నాకు మీ రూపాయి అక్కరలేదు' ఆమె ధ్వనిలో దుఃఖపు జీరలున్నాయి ఆమె కన్నుల్లో దిగంతవ్యాప్తమైన ఎడారులు కనిపించాయి. వాటిల్లో అడుగుపెట్టాలంటే జంకాను.
'అయితే ఆ ప్యాకెట్ లో ఏముంది?' త్వరగా వదిలించుకోవాలని అడిగాను.
ఆమె కష్టాలు గట్టెక్కినట్లు ఒక నిట్టూర్పు విడిచింది. ప్యాకెట్ విప్పింది. అందులోంచి చిరిగినా ఒక ఉర్దూ నవల 'జుర్ ఇన్సాన్ మర్ గయా' (మానవత చచ్చిపోయింది), ఒక పెన్ను, ఒక బనారస్ పట్టుచీర తీసింది.
"ఇది దొంగసొమ్ము కాదు. ఇవన్నీ నావి."
నేను నిర్ధయగా పుస్తకం అందుకున్నాను. పాత పుస్తకాన్ని అంటుకోవడం అంటే గిట్టదు నాకు. అయినా శ్రద్ధగా చూడాల్సి వచ్చింది. పుస్తకానికి అట్టలేదు. తొలి పుటమీద 'నా ఛాయకు, అస్లమ్' అని రాసి ఉంది. పుస్తకం పక్కనపెట్టి చీర అందుకున్నాను. సర్రున జారిపడిపోయింది.
"కాస్త జాగ్రత్తగా పరిశీలించండి" నా నిర్లక్ష్యాన్ని ఓర్చలేకపోయింది.
అది ఎరుపు జరీచీర. రంగు వెలసిపోయింది. ఇలాంటి చీరలు సాధారణంగా హిందూ వధువులు ధరిస్తారు.
"ఈ చీర మీదేనా?"
"అవును. కాని ఎన్నడూ కట్టలేదు." చప్పున వివరించింది.
"అలాగా! అయితే పెళ్ళినాడు కట్టుకుంటారేమో!"
ఆమె సిగ్గుతో తలవంచుకుంది. వెంటనే బొట్టు చెరిపేసింది. అప్పుడు ఆమె ముఖంమీద చీకట్లు మరీ పెరిగాయి.
"చీర అమ్మడానికి తెచ్చాను."
అయితే ఇందులో ఏదో ఒకటి కొనక తప్పదన్నట్లు తలమీద చేతులు పెట్టుకొని కూర్చున్నాను. ఛాయకు సాయపడ్డానికి నా దగ్గర అంత డబ్బులేదు. కాదని మాత్రం ఎలా అనడం?
"ఏమిటిలా చిరాగ్గా ఉన్నారివాళ్ళ?" ఆమె నా దగ్గరకు జరిగింది.
"అవును చిరాకేమరి, నిన్నటినుంచి కాలేజీకి వెళ్ళలేదు." చిరాకుకు ఏదో కారణం ఉండాలికదా అని అన్నాను.
"మీరు కాలేజీ మానేశారా?" ఆమె చీర తీసి పక్కకు పెట్టింది. "మీరు కాలేజీకి వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకూ మీలాగే కాలేజీకి వెళ్ళాలని ఉంటుంది."
జవాబుకోసం చాలాసేపు ఎదురుచూచి బలవంతంగా నాతల పైకెత్తి "మీరు ఫీజు కట్టలేకపోయారా?" అని అడిగింది.
"అవును" నేను కృతజ్ఞతా దృక్కుల్తో చూచాను. అవును, నేను విచారంగా ఉండడానికి ఇలాంటిదీ కారణం కావచ్చు ననుకున్నాను.
ఆమె మళ్ళీ వేళ్ళు ఆడించింది. ఆమె కనుల ఎడార్లలో మబ్బులు కమ్ముకోసాగాయి. నా మాట పూర్తిగా నమ్మింది పాపం. "మీరు విచారించకండి- నేనేదో ఏర్పాటు చేస్తాను" అన్నది.
"నిజం!" ఆశ్చర్యంగా అడిగాను.
ఇంత తొందరగా విముక్తి లభిస్తుందనుకోలేదు. ఎంతో కృతజ్ఞత నటిస్తూ ఆమె వస్తువులు ఆమెకు అందించాను. నన్ను ఓదారుస్తూ వెళ్ళిపోయింది.
అయిదారురోజులు గడిచాయి. ఛాయ వచ్చింది. నాముందు నిలిచింది. నేను జంకాను. చూస్తే ఆమె చేతిలో కవరుంది. ఏముందబ్బా కవర్లో......
ఆమెకూడా నావలెనే బెదిరిపోతుంది-ముఖంలో రక్తపుచుక్కలేదు. బాగా అలసినట్లుంది. అలసట కొట్టవచ్చినట్లు కనిపిస్తూంది.
"మీరు చాలా బాధపడుతున్నారు......" అని నా చేయి అందుకుంది. ఆమె చేయి చల్లగా ఉంది. నా చేతిని వెనక్కు లాక్కుంటున్నాను- ఆ కవరు చేతిలో పెడ్తుందని తెలుసు నాకు. అయినా బలవంతంగా కవరు నా చేతిలో పెట్టింది.
"ఇందులో మీ ఫీజుంది!"
నేను అదిరిపడ్డాను. నేనిచ్చిన రూపాయలు ఛాయ నా ముఖాన విసిరికొట్టినట్లనిపించింది.
ఆమె వీధివాళ్ళందరి వ్యర్ధద్వేషానికి జవాబు చెపుతున్నట్లు నుంచుంది.
ఇంత ప్రేమను, ఆత్మీయతను ఎలా భరించడం!
"అయితే ఆ చీర అమ్మేశారా?"
"అవును, దానికి తగినంత డబ్బురాలేదు." ఆమె కుర్చీలో కూలబడి తల వెనక్కు ఆనించింది.
"నా రక్తం అమ్మాను!"
"ఏమిటి?" నేను ఎగిరి గంతేశాను. పక్కనే బాంబు పేలినట్లనిపించింది. కొన్ని క్షణాలు మెదడు మొద్దుబారిపోయింది. మళ్ళీ చైతన్యం కలుగుతున్నప్పుడు మెల్లగా ఏవో మాటలు వినిపించాయి.
"ఆస్పత్రి వాళ్లు సంతోషంగా రక్తం కొనేస్తారు. వాళ్ళకు ఇది దొంగసొమ్ము అనే అనుమానం రాదు!"
* * * *
