నూతనంలో పురాతనంలో దేనిలోనూ విశ్వాసం లేనివాళ్ళు పురాతన కావ్యాలు మాత్రం వ్రాయగలరా?
కృష్ణుడి వాస్తవత్వంలో , శ్రీరాముడి దేవత్వంలో నమ్మకం లేనివాళ్ళకి యేమి భక్తీ వుంటుంది? భక్తీ లేంది పూర్వ కావ్యాలవంటి కావ్యాలు ఎట్లా రాస్తారు? ఆ విశ్వాసం వుందంటారా? ఇంకా యీ నవీన యుగంలో ఆ మూర్ఖత్వాలన్నీ నమ్మేవాళ్ళు ఏం సందేశం ఇవ్వగలరు, ప్రపంచానికి?
ఇంకా యీనాటికీ మురళీ, గోపికలూ , హనుమంతుడూ, అత్రిమహామునీ! వీటిలోనే వెళ్ళాడుతున్నారు. ఇంకేమీ ప్రపంచమే లేనట్టు. యుద్దాలు వొస్తున్నాయి, క్షామాలు కలుగుతున్నాయి. రాజ్యాలు తల్లక్రిందులవుతున్నాయి. బుద్దిమంతులు ఎట్లా లోకానికి మంగళం, క్షేమం కలగచేద్దామా అని శ్రమ పడుతున్నారు. ఆంధ్ర రచయితలు మాత్రం ప్రణయాలూ, భక్తులూ, తపస్సులూ, పురాతనపు రెడ్లూ, చచ్చిన భోజులు, మా నాన్నగారూ తతయ్యగారూ, శంకరాచార్లూ, నేను చూసినపిల్లా, ఆ రాత్రి మాయమైన కన్యా, అనుకుంటో కూచున్నారు.
పైగా యీ తుక్కునంతా epoc making శాశ్వత కళగా పూజించమంటారు. అక్షరాలూ రానివాడు కూడా ప్రతివాడూ వ్రాసేవాడే! అని వెక్కిరిస్తారు, దిక్కరిస్తారు.
"ఇది అసమంజసంగా వుంది."
"దీని అర్ధం తెలీటం లేదు" అంటే
"నీకేం తెలుసు, ఏం చదివావు?" అంటారు.
గొప్ప కావ్యం వ్రాయాలంటే పదాలు కాదు, సమాసాలు కాదు, వ్యాకరణం కాదు కావలసింది ఆత్మఔన్నత్యం, struggle, rebellion- ఈ పండితులకి నవీన ప్రపంచ వాంగ్మయంతో ఓనమాలు రావు. పుస్తకాలన్నీ కఠిన పదాలలో నింపి కళ్ళు చెదరగొట్టాలని చూస్తారు. పాత తెలుగు వాంగ్మయము మల్లేనే పుస్తకమంతా కలిపితే నాలుగు కొత్త అభిప్రాయాలు ఉపకరించేవి thought provoking ideas కమబడవు. వూరికే భాషామార్ధవంలో భారంతో మూల్గుతాయి గ్రంధాలు -- బతకవు , చలించవు, వుద్రేకిచవు.
---------
నగలు పెట్టుకుని అందం నొప్పించగల స్త్రీలు చాలా తక్కువ ఆంధ్రదేశంలో. పెట్టుకున్న నగలకీ దేహానికీ సంబంధం వుండదు. నగల అందాన్ని , మనిషి అందాన్ని వేరు వేరుగా చూడాలి. పైగా కడియాలు, అందెలు ఆంధ్రదేశపు వనితల కాళ్ళ అందం పూర్తిగా చెడగోట్టాయి. ఏరికల వాళ్ళలో తప్ప యింకేక్కడా అందమైన కాలే చూడలేదు నేను. అర్ధ ప్రసిద్ద ఆంధ్రుణ్ణి సంస్కారి అనుకునే ఆయన్ని, ఓసారి ప్రశ్నించాను-------
"ఈ కడియాల బరువు వల్ల కాళ్ళ అందం ఆంధ్రులలో పూర్తిగా నశించింది. కండరాలే లావెక్కిపోయినాయి. పిక్కల దగ్గిర" అన్నాను. నేను యీతుచ్ఛ బౌతిక సౌందర్యాలకి ఎంత ఎక్కువ విలవ నిస్తానో తెలిసిన ఆ పెద్ద మనిషి, కొంచెంగా కళ్ళు తేలేసి -------
"సౌందర్యమనేది హృదయంలో వుంది." అన్నాడు.
చాలా ఉన్నతంగా జవాబు చెప్పాననుకున్నాడు. అయన భార్యకి కడియాల వల్ల కాళ్ళే కాదు, దేహమంతా లావేక్కిందని అప్పుడు జ్ఞాపకం వొచ్చింది నాకు. అతని కళ్ళకి ఆమెలో అందం కనపడక, హృదయంలోంచి తెచ్చుకున్న సౌందర్యం చూడడం నేర్చుకుని వుంటాడు గావును, పాపం ఆ పెద్ద మనిషి.
చాలామంది యింతే. మనం ఒక plane లో మాట్లాడుతూ వుంటే వాళ్ళు యింకో plane లో జవాబు చెప్పి తప్పించుకోవాలనీ, వోడించాలనీ చూస్తారు. అందమంతా హృదయంలో పుడుతుందని తెలీనివాడు లేడు. కాని objective beauty సంగతి కద నేను మాట్ల్డుతోంది ! తుపాకి పేలిస్తే యెన్ని కాకులు మిగిలి వుంటాయనే ప్రశ్న లాగుంది అయన జవాబు.
కొందరి స్త్రీల చర్మం నగల మేరుగుని తాగేస్తుంది. కొందరి ఒంటిరంగు నగలకి మెరుగునిచ్చి ప్రతిఫలింప చేస్తుంది. కొందరి శరీర కాంతీ , నగల కాంతీ కలిసిపోయి , విడ తియ్యలేక ఏకమైన శోభ కలుగుతుంది.
