Previous Page Next Page 
పావని పేజి 23


    పావని హృదయం నిండిపోయింది పాపల మాటలు గుండెకు గండికొట్టి కళ్ళ ద్వారా ప్రవహించింది.
    "ఇంకాస్త  తినండి" ఉన్నది అందరికీ పంచిపెట్టింది వారందరికీ పాలు గ్లాసుల్లో పోసి ఇచ్చింది.
    పాలు వాళ్ళు ఎన్నడూ తాగలేదు పాలు తాగుతున్న వారి ముఖాల్లోని ఆనందం చూసి శాస్త్రిగారు పరవశించిపోయాడు పావని అనందానికి అవధులు లేవు ఆమె హృదయం నాట్యం చేస్తూంది.
    "అమ్మా పావనీ! నా హృదయం నిండి పోయిందమ్మా! జప తపాదుల్లో లభించని ఆనందం లభింప చేశావమ్మా! అమ్మా పావనీ! నిజంగా నువ్వు తల్లివి, అమ్మవు, మాతవు నీ వంటి మాతృమూర్తులు ఎంతో మంది కావాలమ్మా-ఈ దీనులను, దరిద్రులను కాపాడడానికీ, వారికి సేవ చేయడానికీ"
    తన తండ్రి తనముందే తనను  పొగడుతుంటే సిగ్గనిపించింది పావనికి తల వంచుకుంది తండ్రి తన పనికి అడ్డంకి అవుతాడనుకుంది తండ్రి తనను ప్రోత్సహిస్తున్నాడు అందుకు ఆమె ఉబ్బితబ్బిబ్బు అయింది.
    తెల్లవారి స్కూలుకు వచ్చె పిల్లల సంఖ్య హెచ్చింది పావని చేసి పెట్టే ఉప్మా పోస్తున్న పాలూ అందుకు కారణం కొత్తగా వచ్చిన వారికీ, పాతవారికి చదువు చెప్పడం కాస్త కష్టం అవుతూంది అదీకాక గూడెంలో రాత్రి పాఠశాల, ఊళ్ళో అసలు పనే ఉండదనుకున్న పావనికి విరామం లేకుండా పని లభించింది అంతేకాక, ఆమె శ్రమ ఫలిస్తూంది అందుకు ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది.
    మరుసటి రోజు బ్రహ్మయ్య వచ్చాడు చదువుకుంటున్న పిల్లల తల్లితండ్రులకు ఇవ్వాల్సిన డబ్బు తెచ్చామని చెప్పింది బ్రహ్మయ్య ఆశ్చర్యపడ్డాడు ఇంతకాలంగా వచ్చిన డబ్బు శివయ్య మింగాడని గ్రహించాడు "వాడు మనిషి కాడుండి, దయ్యం అందుకే బిడ్డలు లేకుండ అయిన్రు మొండి మొదలారి పోతడు" అని గూడానికి వెళ్ళాడు శివయ్య డబ్బు మింగడం సంగతీ, పావని డబ్బు తెచ్చిన సంగతీ స్వంత ధోరణిలో ప్రచారం చేశాడు డబ్బు తీసుకోవడానికి గూడెం వాళ్ళను వెంట పెట్టుకుని చింత చెట్టు కిందికి వచ్చాడు పావని ఒక్కొక్కరినీ పిలిచి కాగితం మీద అంగుష్టం వేయించుకుని డబ్బు అందించింది.
    డబ్బు అందుకుని వెళ్లిపోతున్న జనం రకరకాలుగా వ్యాఖ్యానించారు.
    "శివయ్య దొర కాదసె - దొంగ మన కొచ్చిన డబ్బంత మింగిండట, విని కడుపు కాల, వీని పెండ్లాం ముండమొయ్య"
    "పోరల నోటి ముంగలి బువ్వ గుంజు కున్నడటనే వీని ఇంటికి చిచ్చు పెట్ట, వీని ఇంట్ల పీనిగ ఎల్ల"
    "పావనమ్మ దేవతోలే వచ్చింది, పోరలకు చదువు చెపుతాంది"
    "అట్లగాదె, మననుకూడా అంతో ఇంతో తెలిసిన పడేస్తాంది"
    "పోరలకు పాలు పోస్తోంది, బువ్వ పెడ్తాంది"
    "అట్లగాదె పైకం కూడ ఇస్తాంది"
    గూడెం వాళ్ళు ఆనాటికి అంత పైకం ఒక్కసారి ఎన్నడూ కళ్ళ చూడలేదు వాళ్ళకు ఏదో వింతగా ఉంది కొత్తగా ఉంది కూనిరాగాలు వస్తున్నాయి అంత పైకం- అదేం పెద్ద మొత్తం కాదు - యాభయ్యో, అరవయ్యో - అదే లక్షల్లా కనిపిస్తూంది వాళ్ళకు డబ్బు ఏం చేయాలో అర్ధం కావడం లేదు ఎవరికి వారు ఏవో ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు వచ్చిన రూపాయలు మళ్ళీ మళ్ళీ లెక్క పెట్టుకుంటున్నారు.
    డబ్బు నర్సిమ్మకూ వచ్చింది అది చూడగానే అతనికి వచ్చిన  ఆలోచన సారాయి కొట్టు కొట్టుకు వెళ్ళి ఊతంగా తాగాడు బల్లెం పట్టుకుని గూడానికి వచ్చాడు.
    "సర్వ రోగాలకు సారాయిరా మందు అట్ల ఊకె కూకున్నారేమిర లంజకొడుకుల్లారా! పైకమొచ్చినంక సార తాగకుంటే పరమాత్మునికి కోపం వస్తది ఊఁ, తాగాలేరా! తాగకుంటే దున్నపోతయిపుట్తడు పైకం చూసుకొని మురుస్తాన్రేమిరా!" అని సీసా తీసుకుని గటగటా తాగాడు ఇంత ధర్మయ్య నోట్లో పోశాడు వెంకడికీ, పెంటడికీ పోశాడు.
    చుక్కపడ్డ పెంటడు "అవునే, జరపడాల్సిందే, ఏమంటవు?" అన్నాడు.
    మంచంలో పడిచస్తున్న పెంటడి తల్లి "అరే! నాకింత పొయ్యండిర! సార లేక నోరు చచ్చి పోతాంది" అంది.
    సారాయి సీసాలు వచ్చేశాయి గూడెం సాంతం సారాయి ప్రభావానికి లొంగి పోయింది డప్పులు మోగుతున్నాయి పాటలు సాగుతున్నాయి నవ్వుకుంటున్నారు తిట్టుకుంటున్నారు తన్నుకుంటున్నారు ఏడుస్తున్నారు గూడెం సాంతం అయోమయంగా ఉంది అగాధంగా ఉంది.
    పావని రాత్రి పాఠశాలకానీ గూడేనికి బయలుదేరింది కొంతదూరం నుంచే కేకలు, అరుపులు, నవ్వులు, ఏడ్పులు, కేరింతలు వినిపించాయి ప్రమాదం జరిగిందా? సంబరం చేసుకుంటున్నారా? అర్ధం కాలేదామెకు గబగబా నడిచింది ఆ దృశ్యం చూసి విస్తుపోయింది ఆమెను ఎవరూ గమనించలేదు ఎవరి గొడవలో వాళ్ళున్నారు.
    పావని చూచింది సహించలేకపోయింది భరించలేకపోయింది ఎంతో శ్రమతో కట్టిన కొంప కూలుతున్నట్లనిపించింది గడ్డిపరకలు ఒక్కొక్కటీ తెచ్చి కట్టుకున్న గూడు కాలిపోతున్నట్లనిపించింది చేసిన శ్రమ సాంతం బూడిద పాలవుతున్నట్టు అనిపించింది ఆమెకు దుఃఖం ముంచుకొని వస్తూంది వెనక్కు తిరిగింది నోట్లో కొంగు పెట్టుకుని ఇంటివైపు ఉరికింది శాస్త్రిగారు ఇంకా పడుకోలేదు పావని అప్పుడే వస్తుందని ఊహించలేదు పావనినీ, ఆమె ముఖాన్నీ చూచి నివ్వెర పోయారు ఏదో అపాయం జరిగిపోయిందనుకున్నారు జంకారు పావని తండ్రిని కావలించుకుని భోరుమంది.
    "ఏమయిందమ్మా, చెప్పు ఎవడువాడు? వాణ్ణి భస్మం చేస్తాను" శాస్త్రిగారు అగ్గి కక్కుతున్నారు వారికి అర్ధం అయింది మరొకటి.
    "వాళ్ళు మనుషులు కాదు నాన్నా! పశువులు బాగుపడరు"
    శాస్త్రిగారు మండిపడ్డారు పావనిని భుజం మీదినుంచి నెట్టేశారు ఆమె తూలిపడబోయి నిలదొక్కుకుంది.
    శాస్త్రిగారు మూలనున్న గొడ్డలి అందుకున్నారు "ఎవడు వాడు, చెప్పు నరుకుత ముక్కలు చేస్త కాకులకు గద్దలకు వేస్త తల్లిని పట్టినవాణ్ణి క్షమించరాదు తల నరకుతా చెప్పు, వాడెవడో" శాస్త్రి శాస్త్రిలా లేరు కసాయివాడిలా ఉన్నారు ముఖం రక్తం చిమ్ముతూంది కళ్ళు చింతనిప్పులు కురుస్తున్నాయి వళ్ళు వణికి పోతూంది చేతిలో గొడ్డలి ఉంది పావని వైపు ఒక్క డుగు వేశారు.
    పావని నివ్వెరబోయి చూస్తూంది ఓ క్షణం ఆమెకు ఏమీ అర్ధం కాలేదు మరుక్షణం తరువాత అర్ధం చేసుకుంది- తండ్రి ఉద్రేకానికి కారణం.
    "నాన్నా!" కేక పెట్టింది పావని.
    అడుగేసినవారు అలాగే నిలబడిపోయారు శాస్త్రిగారు.
    "నాన్నా! నేను పావనిని పవిత్ర గంగను నన్ను అంటుకున్నవాణ్ణి అక్కడే భస్మం చేయగలను నేను నీ బిడ్డను నాన్నా! అమ్మ కన్న గంగను అపవిత్రం అయిన పావని నీ ముందుకు రాదు నాన్నా! జరిగింది మరొకటి" అని, తాను చూచిందంతా చెప్పింది దుఃఖం ముంచుకురాగా మంచంమీదపడి వెక్కెక్కి ఏడ్చింది.
    "పశువుల్ని మనుషులు చేయటం కష్టమమ్మా! మనలో కూడా పశువు ఉన్నాడు వాడు మనను వదులుతున్నాడా? అధైర్యపడకు ధర్మం నీ పక్షాన ఉంది" అని ఓదార్చారు శాస్త్రిగారు తాననుకున్న అవాంతరం సంభవించనందుకు వారికి ఊరటగా ఉంది.
    
                             13
    
    మరుసటిరోజు రాత్రి పాఠశాలకు వెళ్ళలేదు పావని ఆమె మనసు పరిపరివిధాలుగా పోతూంది గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంది చీకట్లు ముసురుకుంటున్నాయి.
    "అమ్మా!" అనే కేక వినిపించింది గుర్తించింది పిలుస్తున్నది పెంటయ్య, అయినా పలకలేదు మళ్ళీ మళ్ళీ పిలిచాడు నిలువలేకపోయింది చప్పునలేచి చరచరా నడిచివచ్చింది.
    "నేను మీ అమ్మను కాను మీరు పశువులు, మనుషులుకారు నేను రానుపో"
    పెంటయ్యకేమీ పాలుపోలేదు పావని అలా ఎందుకు చీదరించుకుంటూందో అర్ధంకాలేదు "అమ్మా! నిజమేనమ్మా! మేం పశువులమే, నువ్వే మమ్ముల మనుషుల చేస్తున్నావు ఇంక పూర్తి మడుసులం కాలే నీక్కోపమొస్తే మల్ల గొడ్ల మయితం, గొడ్లోలే బతుకుతం"
    "డబ్బువస్తే చాలు, తాగి తందనాలాడ్తారా? మనిషిని గుర్తించరా? మీరు మనుషులేనా?"
    గ్రహించాడు పెంటయ్య రాత్రి జరిగిన రభస అతని మనిఫలకం మీద మెరిసింది "అమ్మా! మడిసి తప్పు చేస్తడని నువ్వేకదమ్మా చెప్పినవు మేము నీ బిడ్డలం, బిడ్డలు తప్పుచేస్తే మన్నించవా తల్లీ! ఒక్కసారి గూడేనికిరా, అన్ని సంగతులూ ఎరకయితయి" - అర్దిస్తున్నాడు పెంటయ్య.
    పావని కరిగిపోయింది వీళ్ళు తనకే భాష్యాలు చెప్పేంత వారయినారు అవును, మనిషి తప్పు చేయడూ! మనిషి తప్పు చేస్తాడు తప్పదు చేసిన తప్పును తెలుసుకున్నవాడు మనిషి పావని పెంటయ్య వెంట బయలుదేరింది, ఆవువెంట దూడలా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS