Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 23


                         మనుగుడుపులు

    జమీందారుగారు వ్రాసిన యుత్తరమువల్లను, తీసికొని వెళ్ళుటకు వచ్చిన జమీందారు గారి చుట్టము గంగరాజు రంగారావు దేశముఖ్ గారి పట్టువల్లను, నారాయణరావుతో మనుగుడుపులకు నతని యప్పుచెల్లెండ్రు నలువురు, వదినగారు, సూర్యకాంతము అత్తగారును తరలి వెళ్ళినారు.
    సుబ్బారాయుడుగారు వధువువెంట వచ్చిన ఆడపెళ్ళివారి కందఱుకు, రంగారావు దేశముఖుగారికి వెలపొడుగు వస్త్రములు వెండిపళ్ళెములు ఫలములు మొదలగు బహుమతులర్పించి పంపిరి. వారి నౌకరులకుగూడ దలకు మొలకు గట్ట నిచ్చిరి.
    అల్లుని చూడగానే జమిందారుగారి వదనము ప్రఫుల్లమయ్యెను. మధ్యహాలులో శ్రీనివాసరావు గారు, మృత్యుంజయరావుగారు, సీతారామాంజనేయ సోమయాజులుగారు, ఆనందరావుగారు, భాస్కరమూర్తి శాస్త్రిగారు, బసవ రాజరాజేశ్వర శ్రీ జగన్మోహనరావు జమిందారుగారు, రంగారావు దేశముఖ్ గారు, నారాయణరావు, జమిందారుగారు, నారాయణరావు రెండవ భావమరిది వీరభద్రరావు మొదలగు వారందరూ సోఫాలపై నధివసించి కొంతతడవు ఇష్టాగోష్ఠి సల్పిరి. నారాయణరావు మాటలాడక యన్నియు వినుచుండెను. శ్రీనివాసరావుగారు తనవైపు తిరిగి తన్ను ప్రత్యేక మప్పుడప్పుడు ప్రశ్నించుచుండుటచే నారాయణరావు గంభీరములు, నాలోచనాపూరితములునగు సమాధానములు చెప్పుచుండెను. నారాయణరావు స్నేహితుడగు రాజేశ్వరరావు నాయుడుగూడ నప్పుడేవచ్చి యందఱకు నమస్కృతు లొనరించి యచ్చట గూర్చుండెను.
    రైళ్ళ విషయమై సంభాషణ నడచుచుండెను.
    శ్రీనివాసరావుగారు నారాయణరావును జూచి,
    శ్రీని: ఏవండీ నారాయణరావు గారూ, చూశారూ! మరేమంటే మనదేశంలో రైళ్ళు కంపెనీల క్రింద వుండడం లాభమా, ప్రభుత్వం క్రిందఉండడం లాభమా?
    నారా: ప్రభుత్వం క్రింద ఉండడమే లాభం.
    శ్రీని: ప్రయివేటు కంపెనీలకు వుండే లాభాపేక్ష ప్రభుత్వానికి ఉండదనా మీ యభిప్రాయం?
    నారా: ఆశ ఉండక పోవడమే కాదు. గవర్నమెంటు డిపార్టుమెంటై, ఎర్రటేపు పద్ధతి అమలులోకి వస్తే లాభాలనేవి వుంటాయా అని.
    జమీ: ఆబుకారీ డిపార్టుమెంటు లాభసాటిగా లేదుటండీ?
    శ్రీని: రైల్వేలు ప్రభుత్వం చేతిలోవుంటే చూశారూ, పెద్ద ఉద్యోగాలన్నీ ఇంగ్లీషువాళ్లకే కట్టబెట్టి వాళ్ళందరికీ జీతాలు విపరీతంగా ఇస్తారు. మరేమంటే ఆ సొమ్ము ఐ.సి.ఎస్. వాళ్ల జీతాలలాగ అంతా ఇంగ్లండే చేరుతుంది.
    రాజే: కంపెనీ అయితేమాత్రం ఇప్పుడూ ఆ పనే జరుగుతోంది కదా అండీ.
    నారా: వారి ఉద్దేశం ఏమిటంటే, బ్రిటీషు ప్రభుత్వం చేతిలో రైల్వేలు ఉండడం లాభమా లేక హిందూదేశపు ప్రయివేటు కంపెనీ చేతిలో ఉండడం లాభమా అని.
    శ్రీని: అవును.
    నారా: బ్రిటీషు ప్రభుత్వం హిందూదేశంలో వున్నన్నాళ్లు హిందూ దేశంలో కంపెనీలకు ఇవ్వరు. ప్రస్తుతం హిందూ దేశంలో అంత పెద్ద పెట్టుబడి పెట్టి రైల్వేలు కొనే కంపెనీలు తయారుగా లేవు. ఇంక రైల్వేలు వెనుకటి షరతుల ప్రకారం ప్రభుత్వం చేతిలోకి ఎప్పటికైనా వస్తాయి. కొన్ని వచ్చాయి అప్పుడే.
    జమీం: రైళ్ళ విషయం లెక్కలన్నీ నాదగ్గర వున్నాయి. ఇంతవరకు హిందూదేశంలో వేసిన రైళ్ళ వలన ప్రైవేటు ఇంగ్లీషు కంపెనీలకు, హామీ రూపంగానున్న ప్రభుత్వం వేసిన రైల్వేలకు, వడ్డీ నష్టం వగైరాలమీదనున్న గవర్నమెంటుకు చాలా నష్టం వచ్చింది. (నారాయణరావు వైపుకు తిరిగి) ఆనక ఒకసారి నా స్వంత గదిలోకి వస్తే ఆ లెక్కలన్నీ చూడవచ్చును.
    నారా: అలాగేనండి. నాకూ ఈమధ్య ఆ లెక్కలన్నీ కావలసే వచ్చాయి.
    జమీ: ఆక్సువర్తు కమిషను సంగతి ఎరుగుదువు కాదూ?
    నారా: అవును ఆ రిపోర్టులు చూడాలి.
    మృత్యు: ఏమిటండీ ఆ కమీషను?
    జమీం: రైల్వేలు గవర్నమెంటు చేతిలో వుంటే ఎక్కువ లాభమా, కంపెనీల చేతుల్లో ఉంటే ఎక్కువ లాభమా అన్న ఈ ప్రశ్నే.
    నారా: ఇతర దేశాలు ప్రస్తుతం భాగ్యవంతమైన దేశాలు. మనదేశం చాలా బీదది. పైగా పాశ్చాత్య దేశాల్లోనే ఇప్పుడు రైల్వేలు గవర్నమెంటుకు ఇచ్చి ప్రజాధీనం చెయ్యాలని రభస చేస్తున్నారు.
    శ్రీని: గవర్నమెంటు స్వాధీనం అయితే లాభాల సంగతి వేరే చెప్పాలా!
    నారా: చిత్తం, వస్తున్నాను. ముందు రైల్వేలు లాభదాయకాలైనవి అనే సంగతి మనం ఒప్పుకుంటే.
    శ్రీని: ఒప్పుకున్నాను ప్రస్తుతం.
    నారా: అయితే, దేశంలో ఏ కొద్దిమందికో కంపెనీ రూపంగా వచ్చే లాభం గవర్నమెంటు వస్తే ఆ రాబడి విలువ ఇతర పన్నులలో తగ్గించవచ్చు కదా? మఱి ప్రస్తుత ప్రభుత్వం అలా తగ్గిస్తుందాంటే, ఇది కేవలం లాభసాటి గవర్నమెంటు గనుక, యిప్పుడు ప్రజలకి ఉపయోగం లేదు. అయితే రేపు ప్రజాప్రభుత్వం, అనగా కెనడా మొదలయిన దేశాలలో ఉన్నటువంటి డొమినియను ప్రభుత్వం, వచ్చినా లేక సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినా ఆ లాభం అంతా ప్రజలకే గదండీ?
    శ్రీజగ: ఇంగ్లీషు వాళ్లు కోట్లకొద్ది డబ్బు పెట్టి మనదేశంలో రైళ్ళు వేస్తే మన ప్రజలు లాభంపొందాలీ! ఇది సబబేనా?
    నారా: వాళ్ళు పెట్టిన పెట్టుబడి తీరగా ఏటేటా బోలెడు లాభాలను వాళ్ళెలాగూ గుంజుకుపోతున్నారు. ఇంక మనం కోరేదానిలో అన్యాయం ఏం ఉంది?
    జమీం: గవర్నమెంటు, కంపెనీ దగ్గిర నుంచి రైల్వేలను పుచ్చుకోవాలంటే ఉన్న యావత్తు సరకులకు రోడ్లకు పట్టాలకు ఖరీదు ఇవ్వనక్కరలేదా? ఆ డబ్బు ఇప్పుడు మనదగ్గర లేదే! ఆ డబ్బు మళ్ళీ ఇంగ్లాండే పెట్టుబడి పెట్టాలే.  
    నారా: డెబ్బది అయిదు సాలుసరి వాయిదాల మీద తీర్చడానికి ఏర్పాటు చేసికొని కదాండి?
    జమీం: అవును తిరిగి పుచ్చుకున్న తేదీకి ముందు మూడు సంవత్సరాలు వచ్చిన లాభం కంపెనీ వాటాలకు పంచి, సగటు ధరను బట్టి అనగా నూరు కాసుల షేరుకు ఏ నూటఇరవయ్యనో అంచనా వేసి నూటికి నాలుగున్నర వడ్డీతో డెబ్బది అయిదు వాయిదాలలో తీర్చడానికే ఒప్పందం చేసుకున్నారని జ్ఞాపకం.
    శ్రీజగ: ఈ రైళ్ళు మనవాళ్ళు సరిగా నడపగలరండీ? మనవాళ్లే నడపడం వచ్చిందంటే రోజుకు రెండుసార్లు బోల్తాలో ఢీకొట్టమో జరగదా!
    భాస్క: అదేమిటండీ రాజాగారూ! అట్లా సెలవిస్తారు? ఎంతమంది గొప్ప ఇంజనీయర్లు, గార్డులు, డ్రైవర్లు మనవాళ్ళు లేరు? స్టేషను మాస్టర్లంతా మనవాళ్ళే. పోనీ ఇంగ్లీషువాళ్ళు పై ఉద్యోగాలు చేస్తున్నారా?
    శ్రీజగ: ఇంగ్లీషు వాళ్లకు ఏమాత్రం తీసిపోని యూరేషియన్లు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS