అక్కడ ప్రొఫెసర్ గారి లాబ్ వుంది. అందులో టేబుల్ మీద చిన్న క్రిస్టల్ బాటిలు.
అందులో వుంది బంగారపు రంగు ద్రవం!
దానిని తీసుకుని రెండు చిన్న అందమైన గ్లాసులలోకి ఒంపి, వాళ్ళకి ఇచ్చాడు అన్ వేషి. వాళ్ళు తాగారు.
వెంటనే -
వాళ్ళిద్దరూ అంగుళం సైజు అంగుష్టమాత్రులుగా మారిపోయారు!
ఎందుకనీ?
అన్ వేషి కనిపెట్టిన మందు నిత్య యవ్వన ప్రదాయిని కాదు -
మనుషులని మరగుజ్జులుగా మార్చే మందు అది!
అంగుళం సైజుకి కుదించుకుపోయిన వాళ్ళిద్దరినీ -
ఒక చిన్న బొమ్మరిల్లులో వుంచేసి -
పెద్దగా నవ్వాడు అన్ వేషి.
అలా అకస్మాత్తుగా వేలెడంత సైజుకి కుంచించుకుపోయిన ఆ అమ్మాయి, అబ్బాయి గాభరాగా అటూ ఇటూ చూస్తున్నారు. కొద్దిక్షణాలదాకా అసలు జరిగిందేమిటో వాళ్ళకి అంతు పట్టలేదు.
ఇక్కడొక విశేషం వుంది.
ప్రకృతి చూపించిన దారుణమైన పక్షపాతం వల్ల ఈ లోకం అసలు మగవాళ్ళకోసమే సృష్టించబడిందా అన్నట్లు వుంటుంది. అందులోనూ వయసు వచ్చిన మొగవాళ్ళ కోసమే. ఈ సృష్టిలో అన్నీ కూడా అడల్ట్ మేల్స్ కి మాత్రమే అనుకూలంగా వున్నట్లు అనిపిస్తుంది. ఆడవాళ్లు ఈ 'మగలోకంలో' చెప్పలేని ఇక్కట్లు పడుతూ బతుకుతూ వుండడం అందరికీ తెలిసిందే.
ఇంక చిన్నపిల్లల సంగతి చెప్పనక్కర్లేదు.
ఆడపిల్లలయినా మొగపిల్లలయినా కూడా చిన్న పిల్లలు ఈ లోకంలో ఎదుర్కొనే అతి ముఖ్యమైన ప్రాబ్లం సైజు.
ఈ లోకంలో అన్నీ కూడా వయసు వచ్చి శారీరకంగా ఎదిగిన వాళ్ళ కోసమే ఏర్పాటు చేయబడినట్లు వుంటాయి.
ఇళ్ళు -
ఫర్నిచరు -
మంచాలు -
బస్సులలో సీట్లు -
ఒకటేమిటి?
అన్నీనూ!
అన్నీ అడల్ట్ సైజులో వుండే ఈ లోకంలో మినియేచర్ సైజులో వుండే చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఏదో గ్రహాంతర వాసులలాగా ఫీలయిపోతూ వుంటారు.
ఇప్పుడు హఠాత్తుగా మినియేచర్ సైజుకి కుంచించుకుపోయిన ఆ యువతీ యువకులు ఇద్దరూ చాలా అన్నీ అతి పెద్దవిగా వున్న పరిసరాలను చూసి తమకి ఏం జరిగిందో అర్థం చేసుకుని వుండవచ్చును.
కానీ-
అప్పటికే వాళ్ళని అతి చిన్నదిగా వున్న మినీ బంగళాలో పెట్టేశాడు అన్-వే-షీ.
అందులో కుర్చీలు కేవలం ఒక సెంటీమీటరు ఎత్తున వున్నాయి. మంచాలు ఒక అంగుళం ఎత్తున వున్నాయి. పాత్రలు సెనగపప్పు గింజలకంటే చిన్న సైజులో వున్నాయి.
అన్ వేషీ వాళ్ళని సూక్ష్మరూపంలోకి మార్చెయ్యగానే తక్షణం అలా మినీ బంగళాలో ప్రవేశపెట్టడానికి కారణం వుంది.
ఎందుకంటే -
ఒక్కసారిగా జెయింట్ సైజులో కనబడుతున్న పరిసరాలని చూడగానే షాకయిపోయి మరణిస్తారేమో అని భయం వుంది అన్-వే-షీ కి.
వాళ్ళు మరణించకూడదు.
ఎట్టి పరిస్థితులలోనూ!
వాళ్ళతో తను చాలా ప్రయోగాలు చేయాలి!
అందుకే ఈ మినీ బంగళా! అందుకే ఈ మినీ ఫర్నిచరు!
ఆ కారణం వల్లనే కొంతసేపు గడిచేదాకా ఆ యువతీ యువకులకు అసలు ఏం జరిగిందో అంతు బట్టలేదు.
వాళ్ళకి జరిగింది ఏమిటో అర్థం కావడానికి కొద్ది క్షణాల ముందు ఒక శబ్దం వాళ్ళ చెవులకి వినబడింది.
ముందు చాలా దూరంగా. ఆ తరువాత చాలా దగ్గరగా.