"మారతారు వర్షా. తప్పకుండా మారతారు. మారగలిగేలా మనం చెయ్యగలిగినప్పుడు."
"వాళ్ళ గురించి మీకు తెలీదు."
"అందుకే తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాను. ఆమె పేరు ఏమన్నావు! పుష్పకదూ? ఆమెతోనే నా ఉద్యమం మొదలు పెడతాను" అంటూ కదిలాడు.
"ప్లీజ్ వద్దు" అంటూ వర్ష కంగారుగా చెయ్యిజాపి అతన్నాపబోయింది. అందలేదు. గబగబ అడుగులు వేస్తూ ఎదురింటివైపు వెళ్ళిపోతున్నాడు.
శ్రీహర్ష లోపలకు వెళ్ళేసరికి నడివయసులో ఒక పురుషుడూ, స్త్రీ ఒకరి కౌగిలిలో ఒకరు పడుకుని బుడ్డి దీపం వెలుతురులో కనిపించారు. అతనికా దృశ్యం చాలా కంపరంగా అనిపించింది. ఏం చెయ్యాలో తెలియక ఒక క్షణం మెదలకుండా ఊరుకుని_తరువాత_"ఏమండీ? ఏమండీ" అని పిలిచాడు.
ఆ యిద్దరిలో పురుషుడు బలవంతాన కళ్ళు విప్పి చూశాడు. "ఎవరూ? కొత్తవాడివేమిటి? పుష్ప లోపలుంది వెళ్ళు" అన్నాడు. అతని చెయ్యి స్త్రీని అలాగే పొదివి పట్టుకుంది వుంది. కళ్ళు మళ్ళీ బరువుగా మూతలు పడిపోయాయి.
శ్రీహర్ష చొరవ తీసుకుని గోనెసంచి లాంటి అడ్డు తొలగించుకుని లోపలకు వెళ్ళాడు.
పుష్ప చాపమీద పడుకుని వుంది. పమిట స్థానంలో లేదు. జాకెట్ గుండీలు కూడా ఊడి ఉన్నాయి. చీర మోకాళ్ళ పైదాకా తొలగిపోయి వుంది.
అలికిడి విని కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా ఎవరో కొత్త యువకుడు. పది నిముషాలన్నా కాలేదు. అప్పుడే రెండో....
సంతోషంతో మొహం వికసించింది. "రా" అన్నట్లు చూసి రెండు చేతులూ చాచింది.
"ఉహూఁ" అన్నాడు శ్రీహర్ష.
"నేనందుకు రాలేదు."
తాను జోగినిగా మారాక విన్న మొట్టమొదటి కొత్త మాట.
పుష్ప అతనివంక ఆశ్చర్యంగా చూసి లేచి కూర్చుంది. పైట మాత్రం సర్దుకోలేదు.
"ఎవరు నువ్వు?" అనడిగింది.
"ఈ ఊళ్ళోనే వుంటున్నాను. మీతో మాట్లాడదామని వచ్చాను."
ప్రక్కనే చిన్న స్టూల్ వుంది. పుష్ప డాని వంక చూపిస్తూ_"కూర్చో" అంది.
శ్రీహర్ష దానిమీద కూర్చున్నాక_
"ఏమిటి చెప్పు" అంది. ఆమెలో ఓ విశేషముంది. లోపల ఎంత కఠినాత్మురాలయినా బైటకు సౌమ్యంగానే మాట్లాడుతుంది.
"మీరిలా...."
"చెప్పు_ఫర్వాలేదు."
"ఎందుకు చేస్తున్నారో తెలుసు ... ఈ వ్యవస్థలో పాతుకుని వున్న కొన్ని మూఢ నమ్మకాలవల్ల జోగినిగా మార్చబడ్డారు. ఈ సంఘంలోని వ్యక్తుల స్వార్థానికి, కామ దాహానికి బలవుతున్నారు."
పుష్ప నవ్వాపుకుంటోంది.
"తమ ప్రయోజనాల కోసం, స్వార్థంకోసం వేలాదిమంది పెత్తందార్లు, అధికారం కలవారు అమాయకులయిన కొందరిని నమ్మించి ఎప్పుడో రూపొందించిన సాంఘిక దురాచారమిది. సమాజం ఇంత పురోగమిస్తున్నా _ నాగరికత ప్రబలుతున్నా_ఈ అన్యాయం నుంచి బైట పడడానికి ఎందుకు ప్రయత్నించరు?"
"ఎందుకు ప్రయత్నించాలి?"
శ్రీహర్ష షాక్ తిన్నట్టు చూశాడు.
"చూడబ్బాయి. నువ్వెవరు? పత్రికా విలేఖరివా?" అనడిగింది పుష్ప. ఆమె కొంతవరకూ చదువుకుంది.
"కాను."
"సంఘ సంస్కర్తవా?"
"కాను."
"పోనీ కథలూ, నవలలూ రాసే రచయితవా?"
"కాను."
