మరోగంటలో చలపతిరావు వేరే రూమ్ కి మార్చబడ్డాడు. ఆ రూమ్ లో అతనికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాడు పరమేశ్వరం. రోగికి వాడిన వస్తువులన్నీ ఏ రోజుకారోజు తగలబెట్టించే ఏర్పాటు కూడా చేశాడు.
"నేనూ మీతో వుంటాను సార్" అంటూ వచ్చింది రాజ్యం.
సరేనన్నాడు శరత్ చంద్ర.
ముగ్గురూ ప్రత్యేకమైన దుస్తులూ, యాప్రాన్లూ, ఫేస్ మాస్క్ లూ ధరించి వున్నారు.
పనిలో నిమగ్నమవడంతో కొద్దిగా తేరుకున్నాడు శరత్ చంద్ర. ఆ గదిలో అంతా స్థిమితపడ్డాక అతన్ని మాటల్లోకి దింపుతూ అడిగింది రవళి.
"బాబు ఎలా వున్నాడు సార్?"
ఏమని చెప్పాలో అర్ధంకాలేదు శరత్ చంద్రకి. అతనికది చాలా ఇబ్బందైన ప్రశ్న. ఎలా వున్నాడో తెలిస్తే కదా!"
"బాగానే వున్నాడు" అన్నాడు. అతడు చెప్పిన ధోరణి సహజంగా అనిపించలేదు రవళికి.
"ఇవాళ మీరు ఇంటికి వెళ్ళుండాల్సింది సార్!" అంది మృదువుగా ఆమె పలికిన తీరులోని లాలన అతనికి ఓదార్పు నిచ్చింది. ఉదయం నుండి ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలతో అతను మానసికంగా చాలా అలసిపోయి వున్నాడు.
"నాకూ వెళ్ళాలనే వుంది రవళీ. బాధ్యతను మర్చిపోయిన అందరిలాగే మనమూ వుంటే అన్యాయంగా పేషెంట్ ని పోగొట్టుకోవాల్సుంటుంది. మన సొంత బాధలకీ, బాంధవ్యాలకీ బంధం వేసికోలేనిది మన వృత్తి! కుటుంబ బాధలకీ, బాధ్యతలకీ అతీతమైంది, రోగులకు మనతో వున్న అవసరం! మా బాబు పరిస్థితి బాగా లేదని ఈ రోగి బాధ్యతని వదిలేసి ఇంటికెళ్ళి పోగలనా చెప్పండి...." అన్నాడు.
గొప్ప సత్యాలను చెపుతున్న ఫ్రీస్టుని చూస్తున్నట్లు ఆరాధనగా అతన్నే చూస్తోంది రవళి.
* * * *
రాత్రి పన్నెండు కావస్తోంది. బయట పల్చగా వెన్నెల కాస్తోంది. గదిలో టేబిల్ ముందున్న కుర్చీలో కిరణ్ కూర్చుని వున్నాడు. అతనప్పటికి చాలా సేపటినుండి ఆ కుర్చీలో అలాగే వున్నాడు. మెస్ నుండొచ్చిన భోజనం క్యారియర్ కూడా..... విప్పకుండా అలాగే వుంది. పెద్ద భవనంలో ముందువైపున్న వరండాని ఆనుకొని వుందా గది అటాచ్ డ్ బాత్ రూమ్ కలిగి విశాలంగా వున్న ఆ గదిలో టేబిల్ లైటు తప్ప మరో లైటు వెలగడం లేదు. గోడకున్న షెల్ఫ్ నిండా మెడికల్ సైన్సెస్ కి సంబంధించిన మహా మహా గ్రంధాలు వరసలు వరుసలుగా సర్ది వున్నాయి.
గోడవారనున్న మంచమ్మీద దుప్పటి చెదరలేదు. పది గంటలప్పుడు హాస్పిటల్ నుండి వచ్చి బట్టలు మార్చుకుని కుర్చీలో అలాగే కూర్చుండిపోయాడు.
"ఇహనయినా పెళ్ళి చేసుకోరా!" అని తల్లి వ్రాసిన ఉత్తరం టేబిల్ మీద రెపరెపలాడుతోంది.
అతని మనసు ఆ ఉత్తరంలోని విషయంమీద లేదుగానీ, రవళి మీద లగ్నమై వుంది.
రవళి ఎయిడ్స్ పేషెంటు దగ్గర వుండటానికి సిద్ధపడిందని విన్నప్పుడే తెల్లబోయాడు. అప్పటినుండే ఆమె గురించిన ఆలోచనలు మనసుని లొంగదీసుకున్నాయి. భోంచేయాలన్న విషయం కూడా గుర్తు లేకుండా చేశాయి.
రవళికి అంత ధైర్యం ఎలా వచ్చింది? శరత్ చంద్ర ఇన్ ఫ్లూయన్స్ అయ్యుంటుంది. ఆయన వెనకే వెనకే తిరుగుతూ క్షణం కూడా ఖాళీ లేకుండా పనిచేస్తూనే వుంటుంది.
మరి తనెందుకు చెయ్యలేకపోతున్నాడు. తనకీ భయమేమిటి ఇట్లా పీడిస్తోంది?
ఆడపిల్ల అయ్యుండి రవళి చేయగలిగిన పని.... ఛ! తనమీద తనకే అసహ్యం వేస్తోంది అనుకొంటుంటే అతని చేతులు కుర్చీమీద బిగుసుకున్నాయి.
స్త్రీలు ఊహలోకూడా ఇష్టపడని ఈ కార్డియో థొరాసిక్ సబ్జక్టుని రవళి ఎందుకు ఎన్నుకున్నదో అతని ఆలోచనకి అందడం లేదు. హార్ట్ సర్జరీ మీద క్రేజుతో ఎవరయినా ఆడపిల్ల ఈ కోర్సులో చేరినా ఆ టెన్షన్ నీ, శ్రమనీ తట్టుకోలేక ఆరు నెలల్లో ఇంటి ముఖం పట్టిన వాళ్ళనే చూశాడు తప్ప ఇలా అంకిత భావంతో పనిచేసిన వాళ్ళని చూడలేదు.
మగవాడై వుండి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ముప్పయేళ్ళు పుస్తకాల్లో జీవించాడు. కానీ, ఇప్పుడు తానేం చేయగలుగుతున్నాడు? స్టెత్ మెళ్ళో వేసుకొని ప్రొఫెసర్స్ వెనుక వాళ్ళెటు వెళితే అటు తిరగడం తప్ప చేయగలుగుతున్నదేముంది? అనుకున్నాడు. కుర్చీలోంచి ఎప్పుడు లేచాడో అతనికే తెలీదు. గదిలో పచార్లు చేస్తున్నాడు. తన గురించి తనకి చాలా అసంతృప్తిగా, అశాంతిగా అనిపించింది. ఈ పరిస్థితి నుండి తను బయటపడాలి అని దృఢంగా అనుకొన్నాడు. కారిడార్లో శరత్ చంద్ర ప్రక్కన ఠీవిగా నడిచివెళ్ళే రవళి కళ్ళముందు కనిపించింది.
"ఎంత అందమైంది" అనుకున్నాడు. ఇన్నాళ్ళుగా కలిసి పనిచేస్తున్న ఒక్కనాడూ ఆమె అందాన్ని గుర్తించలేని స్థితిలో బ్రతుకుతున్నాడా తను?
ఎలా గడిచిపోయింది ముప్పయి మూడేళ్ళ జీవితం? రవళి ఇంకా పెళ్ళెందుకు చేసుకోలేదో! లేక పెళ్ళయి, ఏదైనా జరిగి ఒంటరిగా బ్రతుకుతోందా? అనుకున్నాడు.
ఏది ఏమయినా ఆమె ఒంటరిదన్నా విషయం అతనికెంతో హాయిని కలిగించింది. ఇంతకాలం తాను పోగొట్టుకున్న అపురూపమైనదేదో కంటబడినట్లు మనసు రెపరెపలాడింది. అతను తిరగడం ఆపి నిశ్చలంగా గది మధ్య నిలబడిపోయాడు.
ఆ రెపరెపల్లోంచి తనతో మాట్లాడుతున్న రవళి, తన ప్రక్కనే నడుస్తున్న రవళి, తనేదో చేస్తే నవ్వుతున్న రవళ్.... సన్నని జలతారు తెరలా కళ్లముందు కదిలి మనసునంతా కలవర పెట్టింది! ఆమెను చూడాలి! ఇప్పుడే చూడాలి! చూడకపోతే ఈ రాత్రి గడవదు! అంతే!
ఇంక ఒక్కక్షణం కూడా అక్కడ నిలబడలేక పోయాడు. టేబిల్ మీది కీ అందుకుని రెండడుగుల్లో గదిలోంచి బైటపడి 'యమహా' ఎక్కి స్టార్ట్ చేశాడు. మరుక్షణం అది హాస్పిటల్ వైపు దూసుకుపోతోంది.
పడమటికి క్రుంగుతున్న అర్ధచంద్రుడు తాళం వేయని తలుపుల్ని చూసి 'తాళనివ్వని' తలుపులంతే.... అంతే!" అనుకొని కిసుక్కుమన్నాడు.
రోడ్డు నిర్మానుష్యంగా వుంది. మోటార్ సైకిల్ బుల్లెట్ లా దూసుకుపోతోంది. చలపతిరావనే పేషెంట్ ని ఏ గదిలో వుంచారో గుర్తు చేసుకున్నాడు. ఆ గదిలో వున్న రవళిని ఊహించుకున్న కొద్దీ ఎక్స్ లేటర్ మీది చెయ్యి వెనక్కి తిరిగిపోతోంది.
కాంతి బాగా తగ్గించుకొని, డాబాల వెనకనుండి కదుల్తూ ఈ పిచ్చివాణ్నీ దొంగచాటుగా అనుసరిస్తున్నాడు చంద్రుడు.
ఆ వేగంతో అయిదు నిముషాల్లో హాస్పిటల్ కి చేరాడు. మోటార్ సైకిల్ పార్క్ చేసి, సీరియస్ కేసుని అటెండ్ చేయబోతున్న డాక్టర్లా ఒక్క పరుగున రవళి వున్న రూమ్ దగ్గరికి చేరాడు. రూమ్ ముందు వరకూ పరుగున వచ్చిన కిరణ్ ఏదో శక్తి గట్టిగా పట్టుకొని ఆపేసినట్లు గడపలోనే ఆగిపోయారు.
