Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 23


    ఆ విషయం తెలిసిన వాళ్ళు గనక తమ పెళ్లవడం కొంచెం కష్టమేనని అబ్బాయీ అమ్మాయీ అనుకున్నారు. అయినా ఏదో ఒక పిచ్చి ఆశ పెట్టుకుని తమ పెళ్ళికోసం ఎదురు చూస్తున్నారు.

 

    నిజానికి కోదండరాం ఆయింటికి అద్దె వసూలు చేయడానికే వచ్చాడు.

 

    అడగ్గానే సుబ్బారావు అద్దె ఇస్తాడో ఇవ్వడో అనవసరం. అడగాలంటేనే నోరు రావడంలేదు.

 

    ఎట్లా అడగ్గలడు?

 

    తాను గాఢంగా ప్రేమించిన సుందరాంగి సరిగ్గా ఆ యింటిలోనే సుబ్బారావు సంపాదన మీదే బతుకుతోంది!

 

    అద్దె కట్టమని సుబ్బారావుని అడిగితే-కట్టే పరిస్థితి కనిపించక సుబ్బారావు కంగారు పడవచ్చు.

 

    అతను కంగారుపడితే ఇంటిల్లిపాదీ కంగారు పడతారు. మనసు పాడు చేసుకుంటారు.

 

    ముఖ్యంగా సున్నితమైన సుమతి మనసు తప్పకుండా గాయపడుతుంది.

 

    అది తాను సహించగలడా?

 

    అంచేతనే అద్దె అడక్కూడదను కున్నాడు. ఆవడలు కూడా పెట్టేరు. ఇప్పుడస్సలు అడగలేడు.

 

    కోదండం టీ తాగుతుంటే సుబ్బారావు నీళ్ళు తాగుతూ అన్నాడు...

 

    "పదిరోజులు గడిస్తే మాకు బోనస్ ఇస్తారు. అది రాగానే బకాయి పడ్డ మూడు నెలల అద్దె మొత్తం ఒకేసారి యిచ్చేసుకుంటాను. ఏమంటారు?

 

    సుబ్బారావు స్టేటుమెంటుకి కోదండరాం చాలా బాధపడ్డాడు. అద్దె గొడవ ఎత్తకూడదని ఒట్టేసుక్కూచుంటే-అదే విషయం సుబ్బారావు తవ్వినందుకు ఇబ్బంది కూడా పడ్డాడు.

 

    తాను ఆ యింటికి వస్తే గిస్తే కేవలం అద్దె వసూలు చేయడానికే వస్తాడని వాళ్ళు అనుకుంటున్నారెమోనని డవుటు కూడా పడ్డాడు.

 

    ఆఫ్టరాల్ అద్దెకోసమే తాను ఆ ఇంటికి వస్తున్నాడా?

 

    ఆ యింటిలో తన "హృదయం" కాపురం చేస్తోంది గనక చూసి పోవడానికి వస్తున్నాడని వాళ్ళెప్పుడు తెలుసుకుంటారు?

 

    వాళ్ళు అనుకుంటున్నట్టే సుమతి కూడా అనుకుంటే తన ప్రేమ ఏం గాను? తన విలువేంగాను? తన బ్రతుకేంగాను?

 

    ఆవడలు పెడితే అదంతా తనపట్ల వారికిగల ఆదరాభిమానాలను కున్నాడేగాని-అద్దె వాయిదా వేయడానికి అదొక ప్రిపరేషననుకోలేదు కోదండం.

 

    వాళ్ళకంటికి తానొక కాబూలీవాలా లాగా కనిపిస్తున్నాడో ఏమో! అట్లా కనిపిస్తే ఆ తప్పు తండ్రిదవుతుందే గాని తనది కాదు.

 

    కోదండం ఆ కాసేపు నిశ్శబ్దంగా వున్నా-పై గొడవంతా సమీక్షించుకున్నాడు, ఆ పని పూర్తయ్యేక ఎంతో నిబ్బరంగా సుబ్బారావుతో అన్నాడు.

 

    "సుబ్బారావుగారూ-నన్ను మీరెందుకు పరాయివాడిగా ట్రీట్ చేస్తున్నారో నాకర్ధం కావడంలేదు. అద్దె అడగటానికి రాలేదండీ! మిమ్మల్ని చూసిపోదామని వచ్చేను. ఎప్పుడొచ్చినా అందుకే వస్తాను. అద్దెంటారా? డోంట్ కేర్! వీలున్నప్పుడే తీసుకెళ్ళి మానాన్న మొహాన కొట్టండి. వీలుపడనప్పుడు ఏడాదిపాటు రెంటు కట్టకపోయినా ఏమీ అనుకోం? చాలా?"

 

    కోదండం యిచ్చిన హామీకి సుబ్బారావు సంతోషించేడు. కానీ- అవతల లక్ష్మీపతి నైజం తెలిసినవాడై వుండటంవల్ల ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు.

 

    అంచేత కోదండం హామీవిని కూడా ముభావంగా వుండిపోయేడు.

 

    అంత పకడ్బందీగా వరమిచ్చినా సుబ్బారావులో ఏపాటి రియాక్షనూ కన్పించకపోవడంతో రెండో వరంకూడా యిచ్చేయాలను కున్నాడు కోదండం.

 

    "చూడండీ! పక్కవాటా ఎట్లాగూ ఖాళీగా వుంది. మీకు యిల్లు చాలకపోతే ఆ వాటా కూడా ఫ్రీగానే వాడుకోండి- ఎవరైనా అద్దెకొచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఏవంటారు? అన్నాడు కోదండం ఎంతో స్టయిల్ గా.

 

    "చాలా థేంక్సండీ! కానీ-మీ నాన్నగారికి తెలిస్తే బావుండదేమో?" కడుపులో మాట కక్కేసాడు సుబ్బారావు.

 

    హోరాహోరీగా వరాలిచ్చే సందర్భంలో సుబ్బారావు తండ్రి ప్రసక్తి తెచ్చి కోదండాన్ని అంతో ఇంతో భయపెట్టిన మాట నిజమే! అయితే ఆ భయాన్నంతా గుండెల్లో దాచేసుకుని ధీమా నటిస్తూ అన్నాడు కోదండం.

 

    "అలాంటివేమీ పెట్టుకోకండి! మానాన్న నా మాటకెదురు చెప్పడు. చెప్పాడే అనుకోండి. ఇంకంతే!"

 

    "ఇంకంతే" అన్న ఆ ఒక్క పదానికి అర్ధాలు బోలెడు వున్నాయి. ఎవరికి వారు ఎంతవరకు అర్ధం చేసుకుంటే అక్కడితో సరి పెట్టుకోవాలే గానీ వివరాలడక్కూడదు.

 

    కోదండం లేచి నిలబడ్డాడు.

 

    న్యాయానికి అతనంత చప్పున వెళ్ళిపోదామను కోవడంలేదు. అనవసరంగా తండ్రి ప్రసక్తి తెచ్చినందుకు వళ్ళుమండి లేచాడు.

 

    ఆ పెంకుటింటి మీద తండ్రికెంత హక్కుందో తనక్కూడా అంతే అధికారం వుంది. ఉంటుంది.

 

    అంచేత ఏడాదిపాటు అద్దెకట్టక్కర్లేదని వరమివ్వడానికీ. ఖాళీగావున్న వాటా ఫ్రీగా వాడుకోమని చెప్పడానికి తనకీ హక్కు అధికారాలున్నాయి.

 

    ఉన్నాయనుకున్నవి ఉన్నాయో లేవో-అది తండ్రీ కొడుకులు తేల్చుకోవలసిన వివాదం!

 

    అదేదే తేలకముందే-

 

    పూర్తిహక్కులు తండ్రిగారివేనని ఎవరో పరాయివాళ్ళు డిక్లేర్ చేసి తననొక కోన్ కిస్కాగా తీసిపారేయడం కోదండానికి నచ్చలేదు. అల్లాంటి సందర్భాల్లో కోదండం గొప్ప చిరాకు పడిపోతాడు.

 

    ఇప్పుడు కూడా అతను చిరగ్గానే ఆ ఇంట్లోంచి బయటపడ్డాడు! వీధిలో సుమతి కనిపించింది. ఆమెను చూడగానే చిరాకు మరిచిపోయి ఆనందపడ్డాడు.

 

    "మీ ఇంటికెళ్ళి వస్తున్నాను!" అన్నాడు కోదండం.

 

    "అద్దెకోసమా?" అడిగింది సుమతి.

 

    (ఇప్పుడు కూడా కోదండానికి చిరాకు కలిగిందిగానీ-అడిగింది సుమతి గనుక సర్దుకుపోయేడు.)

 

    "నువ్వు ఉంటావని వెళ్ళేను!" నిజం చెప్పేడతను.

 

    "ఆవకాయ పడుతున్నాను సాయం రమ్మని అన్నపూర్ణమ్మగారు పిలుస్తే వెళ్ళాను" అన్నదామె.

 

    "నీ పాకశాస్త్రం పేట పేటంతా తెలిసిందన్నమాట?" అన్నాడతను ఎంతో ఆనందంగా.

 

    "నాకున్న క్వాలిఫికేషన్ అదొక్కటేగా?" అన్నదామె.

 

    "ఆడపిల్లకది అందమయిన క్వాలిఫికేషను. ఆవకాయ వద్దుగానీ - నాకు గోంగూర చాలా ఇష్టం. నీకది చాతనవునా?"

 

    "ఆ మాటకొస్తే గోంగూరతో ఇరవయి రకాలు చేయగలను"

 

    "అబ్బో!"

 

    వాళ్ళిద్దరూ పెళ్ళిచేసుకుందామన్నమాట నిజమే కానీ, వారెప్పుడూ ఎక్కడ కలిసినా ఆ పెళ్ళి విషయం ఒక్కటీ వదిలేసి మిగతా అనేక విషయాలు అనర్గళంగా మాటాడుకుంటారు.

 

    పెళ్ళి విషయం పొరపాటునకదులుతే రిజల్టు ఎటు దారితీస్తుందో నన్న భయంచేత సాధ్యమైనంతవరకు ఆ గొడవరాకుండా జాగ్రత్త పడతారు.

 

    అంచేత ప్రస్తుతం వాళ్ళు పచ్చళ్ళగురించి ముచ్చటించుకుంటున్నారు.

 

    వదిలేయండిక...


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS