తన కెమెరాలో బంధించడానికి, ఎక్కడనుంచో అక్కడ కొచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ కెమెరాకు-
"జూమ్ లెన్స్"ని సిద్ధం చేసుకుని పక్షిరెక్కల్ని ఎక్స్ పోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్న-
ఆ ఫోటోగ్రాఫర్ కెమెరాకు-
ఎదురుగా ఉన్న కొండమీద ఓ అమ్మాయి కంఠమ్మీద ఓ అబ్బాయి చేయి వేయడానికి ప్రయత్నించడం-
అనుకోకుండా ఓ వ్యక్తి దూరంగా కన్పించడం-
ఆ అబ్బాయి తన చేతిని జాగ్రత్తగా వెనక్కి తీసేయడం-
క్లిక్... క్లిక్... క్లిక్... క్లిక్... క్లిక్... క్లిక్... క్లిక్... క్లిక్... వరుసగా ప్రతి "మూవ్ మెంట్ నీ" ఆ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో నిక్షిప్తం చేసుకుపోయాడు సరదాగా.
ఆ ఫోటోగ్రాఫర్ పేరు మధు. అతను విశాఖపట్నం నుంచి అక్కడకొచ్చాడు. అక్కడున్న ఓ పేపర్లో అతను పని చేస్తుంటాడు.
తిరుపతి మీద ఓ స్పెషల్ స్టోరీ తయారు చెయ్యడానికి అక్కడ కొచ్చాడతను.
ఆ అమ్మాయిని ఆ కొండమీంచి ఆ అబ్బాయి తోసేయాలనుకున్నాడా?
ఆ ఫోటోగ్రాఫర్ చాలాసేపు ఆ అబ్బాయి, ఆ అమ్మాయి గురించే ఆలోచించాడు.
కానీ-
రాత్రి ఏడుగంటల ప్రాంతంలో-
ఆ కొండమీద హత్యా ప్రయత్నం విఫలమైన అవినాష్ ఎలాగైనా ఆ రాత్రికి రాత్రే గౌతమిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
గౌతమితో కల్సి కాటేజీకి తిరిగొస్తున్న సమయంలో
సరిగ్గా-
హిల్ పార్క్ దగ్గర-
వాళ్ళిద్దరుకూ ఫోటోగ్రాఫర్ మధు ఎదురుపడ్డాడు.
వాళ్ళిద్దర్నీ వెంటనే గుర్తించాడు మధు.
వాళ్ళిద్దరుకూ తెలీకుండా ఓ ఫోటో తీసేసాడు.
తన దారిన తను వెళ్ళిపోయాడు మామూలుగా.
కాటేజ్ లోకి వెళ్ళిన అవినాష్ కి చాలా ఉక్రోషంగా ఉంది. ప్రపంచమ్మీద చాలా కోపంగా ఉంది. తను చేసిన హత్యా ప్రయత్నం విఫలమైనందుకు బాధగా ఉంది.
తన కలలు కల్లలైపోతాయేమోననే బెంగ అతనిలో ఆవహించింది.
ఇప్పటివరకూ-
తన పథకం ఏదీ విఫలం కాలేదు.
కానీ ఆచరణలో మొట్టమొదటిసారి అతనికది అశుభ శకునంలా తోచింది.
తన బంగారు భవిష్యత్తుకు గొడ్డలి పెట్టులా తోచింది.
అందుకే అతను-
ఎలాగైనా ఈ రాత్రికి గౌతమిని చంపాలని నిర్ణయించుకున్నాడు.
గదిలో కెళ్ళిన గౌతమి మనసు రేపటి ఉదయం గురించి ఆలోచిస్తోంది.
ఆ ఉదయంలో ఎన్నో కలలున్నాయి... ఆ ఉదయంలో ఎన్నో ఆశలున్నాయి... తన కలలు ఫలించాలని, తన ఆశలు నెరవేరాలని, తన బతుక్కి ఓ మార్గం కనిపించాలని తను పెళ్ళి కాకుండా చేసిన ఓ తప్పుకు పరిష్కార మార్గం లభించాలని దేవుడికి మొక్కుకుంది గౌతమి.
చివురు లేసిన మొక్కలా, కొండల్ని ఆశలతో గౌతమి, చదిమిన దీపంలా ఉంది.
9
రాత్రి పదిగంటలు కావటానికి మరొక్క నిమిషమే ఉంది. హిల్ పార్క్ రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని కాటేజ్ చేరుకున్నారు అవినాష్, గౌతమి.
కాటేజ్ లో అడుగుపెట్టగానే తలుపు గెడవేసి బెడ్ వేపు నడుస్తున్న గౌతమి వేపుకు ఒరిగాడు అవినాష్.
సన్నటి నడుం. ఆ నడుమ్మీద అటూ ఇటూ కదులుతున్న పొడవాటి జడ. జడలో తురుముకున్న తెల్లటి మల్లెపూలు. జడను వెనక్కిలాగి చేరువగా గౌతమి జడలోవున్న మల్లెపూలను వాసన చూసి, వాటిగా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.
"అయ్యగారికి ఇప్పటికిప్పుడు ఏవైందట..." కుడిచేత్తో నడుం మడతల్ని నొక్కుతూ, ఎడమచేత్తో నాభిచుట్టూ కితకితలు పెడుతూ అన్నాడు అవినాష్.
"రేపు... పెళ్ళయ్యాక... ఇవాళ... కాదు..." నెమ్మదిగా అవినాష్ చెవిలో అంది.
"ఏమిటి..." ఏదో తెలీనట్లుగా అన్నాడు అవినాష్.
గౌతమి సిగ్గుపడింది!
కానీ అదే సమయంలో-
"రేపు రాత్రివరకూ నువ్వుంటావా... పిచ్చిమొద్దూ... ఈ తిరుపతి స్మశానంలో... రూపు రేఖలు మారిపోయి... మసిబొగ్గయిపోవూ..." మనసులో అనుకున్నాడు కసిగా.
అతనికిప్పుడు చాలా కసిగా ఉంది-చాలా పగగా ఉంది. ఆ పగని, ఆ కసిని అతను నెమ్మది, నెమ్మదిగా ప్రేమ రూపంలోకి మారుస్తున్నాడు.
ఆ జ్వాలలో గౌతమి కరిగిపోతోంది.
చటుక్కున ఆ సమయంలో అవినాష్ కు ఒక్కసారి గౌతమి తను ఏకమైన మధురమైన తొలిరోజు జ్ఞాపకానికొచ్చింది.
మొట్టమొదటి సారి-
భీమునిపట్నం రోడ్లో, సముద్రతీరానికి కొంచెం దూరంలో నున్న గెస్ట్ హౌస్ లో - విశాలమైన మేడమీద...
