సాయంత్రం అయిదు గంటలైంది.
తిరుమల కొండ మీద చల్లగాలి పహరా కాస్తోంది.
దేశ,విదేశాల నుంచి వచ్చిన యాత్రికులతో తిరుమల రద్దీగా ఉంది.
హిల్ పార్క్ కాటేజీల్లో ఓ కాటేజీ తీసుకొన్నాడు అవినాష్.
ఇద్దరూ స్నానాలు పూర్తి చేసేశారు.
అవినాష్ స్నానం పూర్తి చేసి వచ్చేసరికి-
గౌతమి అందంగా ముస్తాబై కూర్చుంది.
ఎర్రటి కుంకుమ రంగు జరీ చీర, ఎర్రటి జరీ అంచు జాకెట్టు, నుదుట మీద ఎర్రటి బొట్టు పెదిమల మీద చల్లటి చిరునవ్వు.
"ఏమిటీ-అప్పుడే పెళ్ళికూతుర్లా తయారయ్యావ్-"
ఆ మాట అన్న అవినాష్ వేపు నవ్వుతూ చూసింది గౌతమి.
"అలా బైటకెళ్ళొద్దామా-" అడిగాడు అవినాష్.
ఆమె కాదనలేదు.
* * * *
ఒక విషజంతువు, విషపు నాలుక చాచి, ఒక లేత జింక లేత రక్తం కోసం ఎదురు చూస్తున్న సమయమది.
ప్రేమ ముసుగు కప్పుకున్న ఒక స్వార్థపు బడబాగ్ని చివ్వున నింగి కెగిరి పసిమి పూలను మసి చేయడానికి సిద్ధమౌతున్న సమయమది.
కరెన్సీ కాగితాల ఉచ్చులో ఇరుక్కున్న మనిషి-
జాలి ఏ కోశానా లేని మనిషి-
అన్నెం, పున్నెం ఎరుగని పూల సొగసుల్ని ఉరి తీయడానికి సిద్ధమౌతున్న వేళ-
-అవినాష్ పక్కన నడవడమే సంతృప్తిగా ఉంది గౌతమికి. అప్పటికీ-
గౌతమిని ఎక్కడకు తెసికెళ్ళాలో, ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు అవినాష్.
మాట్లాడుకొంటూ తిరుమల కొండకు అరమైలు దూరంలో ఉన్న 'డీర్ పార్కు' దగ్గరకు వచ్చారు.
డీర్ పార్కుకి కుడివేపున కొండమీద విశాలమైన చదును ప్రదేశం ఉంది.
"అక్కడ కాసేపు కూర్చుందామా" అవినాష్ ప్రపోజ్ చేశాడు.
"ఊ..." అంది గౌతమి.
ఇద్దరూ అతి కష్టమ్మీద రాళ్లిక్కి ఆ ప్రదేశానికి చేరుకున్నారు.
వేసవికాలం మూలానా సూర్యుడింకా వెళ్ళిపోలేదు.
మేఘాల గర్భంలోంచి దూసుకొస్తున్న వెండికత్తుల్లా ఉన్నాయి అస్తమిస్తున్న సూర్యకిరణాలు.
ఆ కొండమీంచి చూస్తే కింద పచ్చికను కప్పుకున్న లోతైన లోయలు నీళ్ళులేని విశాలమైన బావుల్లా ఉన్నాయి.
"ఇక్కడ నుంచి గౌతమిని కిందకు తోసెస్తే..." ఆ ఆలోచనరాగానే అవినాష్ అటూ ఇటూ చూశాడు.
కింద దూరంగా ఒకటీ, అరా బస్సులు రొద చేసుకుంటూ వెళ్తున్న చప్పుడు.
ఎక్కడనుంచో వెంకటేశ్వరుడి భక్తిగీతాలు శ్రావ్యంగా విన్పిస్తున్న సవ్వడి.
అవినాష్ లోని రాక్షసుడు నిద్రలేచాడు-ఆవలించాడు. జూలుదులిపాడు.
అదే సమయంలో-
అంతవరకూ అక్కడ కూర్చున్న గౌతమి లేచి ఆ లోయలోతుని చూస్తోంది.
ఇదే సమయం.
ఇదే సరైన సమయం.
అవినాష్ కుడిచెయ్యి ఆమె కంఠమ్మీద పడడానికింకా రెండు సెకండ్లే సమయముంది.
రెండే రెండు సెకెండ్లు.
ఆమె లేత కంఠమ్మీద ఆ చెయ్యి పడకుండానే ఆమె అయిదు లోతైన బావుల లోతున్న ఆ లోయలో పడిపోవడం ఖాయం...
గోడలోంచి పుట్టిన లేత మొక్కలాంటి గౌతమి ప్రాణవాయువు గాలిలో కల్సిపోవడం ఖాయం.
కానీ-
అదే సమయంలో -
అక్కడకు కొంచెం దూరంలో రెండు సంఘటనలు జరిగాయి.
ఒకటి...
ఆ కొండమీదున్న ప్రాంతానికి కొంచెం దూరంలో ఎవరికీ కన్పించకుండా ఉన్న చిన్న గుహలాంటి ప్రదేశంలోంచి ముందు ఓ ముప్పైఏళ్ళ యువకుడు అప్పుడే,
ఆ సమయంలోనే-
గౌతమి మెడమీద అవినాష్ రాక్షస హస్తం పడే సమయంలోనే లేచాడు.
ఎవరో ఒకవ్యక్తి, ఏదో ఒక ఆకారం తనకు కొంచెం దూరంలో కదలాడడం స్పష్టంగా చూసిన అవినాష్ లో ఒక్కసారి పెను నీరసం తొంగిచూసింది.
విసురుగా చేయి వెనక్కి తీసేసాడు.
అదే సమయంలో -
గౌతమి తల తిప్పి -
"ఇక్కడనుంచి పడిపోతే... చచ్చిపోతాం కదా... అనీ..." చాలా చాలా భయంగానూ, చాలా చాలా బేలతనంతోనూ అడిగింది.
"లేకపోతే ఫుట్ బాల్ లా పైకెగురుతారా..." చికాగ్గా అన్నాడు అవినాష్.
ఇలా జరుగుతున్న సమయంలో-
అవినాష్ చేయి గౌతమి కంఠమ్మీద పడుతున్న సమయంలో రెండో సంఘటన జరిగింది.
గౌతమి అవినాష్ కూర్చున్న కొండకు ఎదురుగా ఉన్న కొండ మీదున్న ఓ చెట్టు పక్కన-
అస్తమిస్తున్న సూర్యుణ్ణి, గూళ్ళకెళ్ళిపోతున్న పక్షుల్ని, రంగులు మార్చుకుంటున్న ఆకాశాన్ని,
