దొంగసొమ్ము
కొంతకాలం గుసగుసలు - ఇరుగు పొరుగుల గుట్టు గుండెలో దాచుకోలేక గుబగుబలాడ్తారు.
పొరుగున కొత్తవారు వస్తే కొత్తవార్తలు, వృత్తాంతాలూ వెంటతెస్తారు. ఏడుతరాల వారి కథలు బయటపడ్తాయి, ఆడవాళ్ల ఆరాటం చెప్పలేం-రాత్రిళ్లు నిద్దర్లుండవు- పిల్లలు నిముషానికి ఒక వార్త తెల్తుంటారు.
"ఛాయ మార్కెట్టు నుంచి కొబ్బరిబొండాలు తెచ్చింది"
"ఛాయ మిద్దెమీద బట్టలు ఆరేస్తుంది"
"ఛాయ వెండిసెమ్మెలు నరసమ్మకు అమ్ముతూంది"
కొత్త పొరుగుల ప్రతి కదలికలో రహస్యాలు దాగి ఉంటాయి. వాళ్ళ ప్రతిమాటలో అనేక అర్థాలు కనిపిస్తాయి. వారి ప్రతి ప్రవర్తనా వీధిసాంతాన్ని కదిలిస్తుంది.
కాని ఛాయ, ఆమె తల్లి అతిగుట్టుగా ఉంటున్నారు. వారి విషయాలేమీ బయటికి రావడంలేదు.
ఛాయ తండ్రి అమాంతంగా చనిపోతే సంసారం నెత్తిన వేసుకొని ఇక్కడికి వచ్చారనీ, ఉద్యోగం వెదుక్కుంటామనీ చెప్పుకున్నారు. అయితే ఆమాట ఎవరూ నమ్మలేదు. ఇద్దరు ఆడవాళ్లు-వంటరిగా- ఉపాధి వెతుక్కోవడానికి ప్రయత్నించడం మామూలు నేరమా? అంత తేలిగ్గా ఎలా వదిలేయడం!
వీధిలోని మగాళ్లకు ఛాయకు మగదిక్కులేదని తెలిసిపోయింది. వారందరికీ ఆమె మీద అమాంతంగా సానుభూతి పుట్టుకొచ్చింది. దాంతో ఆడవాళ్ళంతా అప్రమత్తులయ్యారు.
నాకు చాలాసార్లు కనిపించింది ఛాయ-కిటికీలోనుంచొని. తల దువ్వుకుంటుంది. ఆమె వెంట్రుకలు చాలా పొడవు. అక్కణ్ణుంచే నన్ను చూస్తుంది. నమస్కరించి మాట్లాడాలనుకుంటుంది. అప్పుడు నాకున్న వేలెడు జుట్టు గుర్తుకువస్తుంది. మాట్లాడలేను. అంతేకాదు ఏముంది-దానిదగ్గర? రంగు పచ్చదే కాని ఆకర్షణ లేదు. కళ్లు ఎడారుల్లా ఉంటాయి. ఎప్పుడూ విరిగిపోయిన హార్మోనియం మీద స్వరంలేని రాగం ఆలపిస్తుంటుంది. ఇంగ్లీషు నవల చదువుతుంటుంది- డిక్షనరీ సాయంతో. అంత ఓపిక పనులు చేస్తే నాకు వళ్లు మంట. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళేప్పుడు ఆమె కాటుక కంటిచూపు నా గుండెలోకి దూసుకుపోతుంది.
ఆ తల్లీ కూతుళ్లతో పరిచయం కలిగించుకోవడం ఏమోగాని పట్టించుకునేవాళ్లు కారు వీధివాళ్లు. అంతేకాదు, వాళ్ళంటే వీళ్ళకు గిట్టదు-మంట కూడా. అందుకు మూడు కారణాలు వారి సంపద-స్వేచ్చ-సౌందర్యం.
వాస్తవానికి ఆ తల్లీకూతుళ్ళవద్ద ఆ మూడిట్లో ఏదీలేదు. పాపం, ఛాయతల్లి రెక్కలు ముక్కలు చేసుకొని అప్పడాలు చేస్తుంది. వాటిని మార్కెట్లో అమ్ముతుంది. దాంతోనూ పొట్ట నిండకుంటే ఛాయ పొరుగింట్లో ఉంగరం అమ్ముతుంది-కడియాలు కుదువపెడ్తుంది.
వీధిలోని ఆడవాళ్ళంతా అనేక తర్జనభర్జనల తరువాత నిర్ణయించిందేమనగా - అదంతా దొంగసొమ్మని. ఈ నిర్ణయం నమ్మకం కలగలేదు. ఎందుకంటారా, అంతటితో ఆ కథ ముగిసిందిగా! కథ ముగియడం చాలామందికి ఇష్టం ఉండదు. అయినా ఏం చేయగలరు? కొత్తగా వచ్చిన పొరుగుల మీద కుక్కల్లా మొరగ్గలరు.
ఆ రోజు ఒక నిర్ణయానికి వచ్చారు-ఛాయ తెచ్చిన వస్తువులు కొనరాదని మా అమ్మ మరో అడుగు ముందుకు వేసింది. ఎప్పుడో ఒకప్పుడు పోలీసులు విరుచుకు పడ్తారనీ-దొంగసొమ్ము కొన్న వీధివాళ్ళందరినీ పట్టుకపోతారని!
పనులు ముగించుకున్న అమ్మలక్కలు మధ్యాహ్నం మా ఇంట్లో కూడుతారు. అప్పుడు వారికి ఛాయ, ఛాయ తల్లిని గురించిన ముచ్చట్లకంటే ఆసక్తికరమైన విషయం మరొకటి కనిపించదు. ఏమిటిది? ఎందుకిలా జరుగుతుంది? అనేక పుష్పాలు వికసిస్తే వాతావరణం సురభిళమౌతుంది. అనేక చుక్కల వెలుగుకు ఆకాశం వెలుగుతోంది. అనేకమంది ఆడవాళ్లు కూడితే ద్వేషానల జ్వాలలు రగుల్తాయి.
గుసగుసలు, కర్కశ దృక్కులు, మగమహారాయిల హావభావాలు ఛాయను కుంగదీశాయి, వెండిగిన్నె పయ్యద మాటున దాచి, బిచ్చగత్తెవలె ఇంటింటికీ తిరిగేది. ఆడపిల్లలు గారడివానిచుట్టువలె ఆమె చుట్టూ గుమిగూడేవారు- "వెండిగిన్నెలు మీ ఇంట్లో ఉండగలవు-మేం వాటిని కొనగలమా?" అని.
తరవాత ఛాయతల్లి దుకాణాలకు తిరిగింది. ఇహ మా ఇళ్ళకు వాళ్ళ రాకపోకలు తగ్గాయి. క్రమక్రమంగా నగలు, వెండి సామాగ్రి హరించింది. పాతచీరలు, పాత హార్మోనియం తీసుకొని తిరిగారు. తరవాత రోజులు తరబడి బయటికి వచ్చేవారుకారు.
తన్నులుపడి తిట్లు తిట్టినవార్ని మరో తన్ను తన్నొచ్చు.....ఒకే దెబ్బకు పడిపోయినవాణ్ణి లేవనెత్తక తప్పదు. ఛాయ ఇంటిపొయ్యిలో పిల్లి లేవకపోవడం, వారి వేడి నిట్టూర్పులు అందరి గుండెలు కరిగించాయి. తల్లీ కూతుళ్ళ శవాలు ఆ యింట్లో కుళ్ళాలనుకున్నారా ఎవరన్నా? అలా జరిగితే ఆ పీడ సాంతం వాడవాళ్ళకు కొట్టదూ!
తమ ప్రాముఖ్యాన్ని గుర్తింపజేసుకున్న వీధి వనితలు మళ్ళీ ఛాయను తమ ఇళ్ళకు రానిచ్చారు. వాళ్ళంతా ఛాయకు సాయపడాలనీ చిత్తశుద్ధితోనే అలా చేశారనుకో గండి, అయితే పదిరూపాయిల సరకు ఒక్కరూపాయికే కొన్నారు- అదీ ఏదో దానధర్మం చేసినట్లే!
ఒకనాడు కాలేజీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. గుమ్మంలో నుంచున్నాను, రిక్షా పిలుస్తున్నాను. ఛాయ కిటికీలోనుంచి చూచింది. నా దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీరు నిండనుంది. నలువైపులా భయం భయంగా చూస్తూంది. ఆమె చేతిలో చిన్న పాలరాతి తాజ్ మహల్ ఉంది. ఎండకు ఆ చిన్న తాజ్ మహల్ నీడ వణుకుతూంది. మార్గశీర్షపు చలిలో చన్నీళ్లు స్నానం చేసినట్లు వణికిపోతూంది ఛాయ.
బుట్ట పట్టుకొని మార్కెట్టుకు వెళ్ళే రామయ్య భార్యను భయం భయంగా చూచింది. ఆమె వెళ్ళిపోయేవరకూ చూచి చిన్న తాజ్ మహల్ నా చేతికి అందించింది- చూడమన్నట్లు. నాకు అమ్మ చెప్పిన నీతులు గుర్తుకు వచ్చాయి. అయినా ఎలా కాదనడం?
"ఇదిమీకు ఎలా వచ్చింది?" మెల్లగా అడిగాను.
ఆమె నేలమీద ఏదో వెదికినట్లు చూచింది. తరువాత తన చేతులు చూచుకుంది. తరువాత ఆమె విశాల నేత్రాలు నన్ను చూచాయి నా గుండెలో గుచ్చుకున్నాయి.
"తాజ్, చాలామండి అమ్మాయిల దగ్గరికి ఎలాగో వచ్చేస్తుంది. నా దగ్గరికీ వచ్చేసింది. అయితే అది దొంగసొమ్ము కాదని నమ్మండి. అవును- తాజ్ మహల్ ను ఎవడు దొంగలించగలడు?"
ఆరోజు తొలిసారి ఛాయను ధ్యాసగా చూచాను. వికారంగా లేదు. ఈమెకోసం ఒక తాజ్ మహల్ కట్టించవచ్చు.
"అవును- ఎందుకీ 'తాజ్' ను అమ్ముతున్నారు?"
"ఇది అమ్ముడుపోయే వస్తువు కాదు కాబట్టి."
ఆమె "తాజు" ను తన చేతిలోకి తీసుకొని, తల్లి తన ఒంటరి బిడ్డను తుడిచినట్లు, తుడిచింది ఇహ ఇప్పుడిది ఆటబొమ్మ-అంతే. బొమ్మల దుకాణాల్లో మీరు చూచి ఉంటారు ఇలాంటివి వరసలుగా పెట్టిఉంటాయి. అయిదు రూపాయిలకొకటి అమ్ముతారు.
వీధిలోని ఆడపిల్లల గుంపు నావైపు వస్తూంది. ఛాయ బెదురుచూపులు చూచింది. చప్పున ఆమె చేతిలో రెండు రూపాయిలు పెట్టాను. "తాజ్"ను టిఫిన్ తీసికెళ్ళే డబ్బాలో దాచేశాను.
అలా ఛాయకు అంత ఉదార హృదయంతో సాయం చేసినందుకు నాకెంతో గర్వంగా ఉంది-ఆ రోజంతా-రెండు రూపాయిలు ఆమెకు దానం చేశాననుకున్నాను. ఎవరైనా ఛాయ కష్టాల్ని గురించి ప్రస్తావిస్తే నేనిచ్చిన రెండు రూపాయిలు నాకు చప్పున గుర్తొస్తాయి-కాని నా టేబుల్ మీద ఉన్న చిన్న 'తాజ్' గుర్తుకు రాదు.
