"పట్నం సంగతులు చెప్పమ్మా!" ముత్యాలు అడిగింది.
"అబ్బో! అక్కడ చాలా కధలున్నాయి! అక్కడ రైళ్ళున్నాయి. మోటార్లున్నాయి. విమానాలున్నాయి అక్కడా పిల్లలున్నారు, వాళ్ళంతా మిమ్మల్ని రమ్మన్నారు."
"ఓ, వస్తం , ఎప్పుడు తీసుకుపోతవమ్మా , చూస్తం మేము -- పట్నం చూస్తం"
"తీసుకు వెళ్తా, అక్కడి పిల్లలు కూడా మిమ్మల్ని రమ్మన్నారు, అప్పటి దాకా బుద్దిగా చదువుకోవాలి , విన్నారా!"
"చదువుకుంటం - చదువుకుంటం" - అంతా గంతులు వేశారు.
పావని వాళ్ళకు చదువు చెప్పడం ప్రారంభించింది, అందరిదీ ఒకే క్లాసు , ఒకటే పారం, అయిపొయింది మధ్యాహ్నం అయింది, వెంకడు పనికి వెళ్లివుంటాడు, ఎలా వస్తాడు? ఈ ఆలోచన ఆమెకు రాలేదు, అప్పుడు సరే, తానే వెళ్దామని ఇద్దరు ముగ్గురు పిల్లలను తీసుకుని బయలుదేరింది. తోవలో శాస్త్రిగారు కనిపించారు. ఒక చేతిలో పాల బకెట్టు, మరో భుజం మీద ఉప్మా గిన్నెతో వస్తున్నారు. అలా తెస్తున్న తండ్రిని చూచి పావని పొంగిపోయింది.
"నాన్నా! మీరే తెస్తున్నారా?"
"అవునమ్మా! ఎంత చూచినా వెంకడు రాలేదు. పాపం, పసిపిల్లల కోసం చేసి పెట్టినది వారికీ అందకుండా పోతుందేమోనని ఇట్ల తీసుకొచ్చిన"
"బావుంది, మీరు తీసుకురావడమేమిటి/ ఇటివ్వండి " అని వాటిని అందుకుంది, "ఇహ మీరు వెళ్ళండి"
"ఏమమ్మా! నేను రావద్దా అక్కడికి?" శాస్త్రిగారు పసిపిల్లవాడు తల్లిని అడిగినట్లు అడిగారు.
"నాన్నా! మీరు అక్కడికి వస్తారా?"
"వస్తానమ్మా! బాలలు భగవత్స్వరూపులు ఆకలిగొన్న బాలలు ఈ ఆహారం ఎట్ల అందుకొంటారో చూస్తానమ్మా! చూడాలని ఉందమ్మా!" శాస్త్రిగారి గొంతులో ఆవేదన, ఆవేశం కనిపించాయి.
పావని వారించలేదు. శాస్త్రిగారు ఆమెను అనుసరించారు.
ఉప్మా, పాలూ చూశారు పిల్లలు కాని తమ తమ స్థానాల నుంచి కదల్లేదు. శాస్త్రిగారికి అది ఆశ్చర్యం కలిగించింది. ఆకలి గొన్న బాలలు ఈగల్లా ముసురు తారనుకున్నారు. ఆ క్రంశిక్షణ తన కూతురు ఏర్పరచింది. మురిసిపోయారు శాస్త్రిగారు. ఆకుల్లో ఉప్మా పెట్టి అందరికీ అందించింది పావని. చివరి వారు అందుకునే దాకా వారంతా తినడం ప్రారంభించలేదు. వారంతా తినడం మొదలు పెడ్తే వారి ఆకలి తెలిసి వస్తుంది, గబగబా మింగేస్తున్నారు.
శాస్త్రిగారు అది చూచారు. వారికి ఏదో కడుపు నిండినట్లు అనిపించింది. పాపం పసిపాపలు! పేదలు! అన్నం లేనివారు! ఆహారం లభించింది!! ఆవురావురుమని తింటున్నారు!!!
'అమ్మా! శాన బాగున్నదమ్మా! ఇసువంటిది మేము ఎప్పుడూ తినలేదమ్మా!" ఒక్కమ్మడిగా అందరూ అన్నారు.
నుంచున్న శాస్త్రిగారి కళ్ళలోంచి టపటపా నీరు రాలింది, మిగిలిన నీరు సైతం చండాలునికి పోసి, లోకంలోని దుఃఖం సాంతం తనకు ఇచ్చి , లోకానికి ఆనందం ప్రసాదించమని కోరుకుంటున్న రంతి దేవుడు వారి మనోఫలకం మీద మసిలాడు.
పావని హృదయం నిండిపోయింది. పాపల మాటలు గుండెకు గండికొట్టి కళ్ళ ద్వారా ప్రవహించింది.
"ఇంకాస్త తినండి" అన్నది అందరికీ పంచి పెట్టింది వారందరికీ పాలు గ్లాసుల్లో పోసి ఇచ్చింది.
పాలు వాళ్ళు ఎన్నడూ తాగలేదు. పాలు తాగుతున్న వారి ముఖాల్లోని అనందం చూసి శాస్త్రిగారు పరవశించిపోయారు. పావని ఆనందానికి అవధులు లేవు. ఆమె హృదయం నాట్యం చేస్తుంది.
'అమ్మా పావనీ! నా హృదయం నిండి పోయిందమ్మా! జప తపాదుల్లో లభించని అనందం లభింప చేశావమ్మా! అమ్మా పావనీ! నిజంగా నువ్వు తల్లివీ, అమ్మవు, మాతవు. నీవంటి మాతృమూర్తులు ఎంతో మంది కావాలమ్మా -- ఈ దీనులను , దరిద్రులను కాపాడడానికీ , వారికీ సేవ చేయడానికీ"
తన తండ్రీ తనముందే తనను పొగడుతుంటే సిగ్గనిపించింది పావనికి. తల వంచుకుంది. తండ్రి తన పనికి అడ్డంకి అవుతాడనుకుంది. తండ్రి తనను ప్రోత్సహిస్తున్నాడు. అందుకు ఆమె ఉబ్బితబ్బిబ్బుఅయింది.
తెల్లవారి స్కూలుకు వచ్చే పిల్లల సంఖ్య హెచ్చింది. పావని చేసి పెట్టె ఉప్మా పోస్తున్న పాలు అందుకు కారణం. కొత్తగా వచ్చిన వారికీ, పాతవారికీ చదువు చెప్పడం కాస్త కష్టం అవుతుంది. అదీకాక గూడెంలో రాత్రి పాఠశాల , ఊళ్ళో అసలు పనే ఉండదనుకున్న పావనికి విరామం లేకుండా పని లభించింది. అంతేకాక ఆమె శ్రమ ఫలిస్తుంది. అందుకు ఆమెకు ఎంతో సంతోషంగా ఉంది.
మరుసటిరోజు బ్రహ్మయ్య వచ్చాడు. చదువుకుంటున్న పిల్లల తల్లి తండ్రులకు ఇవ్వాల్సిన డబ్బు తెచ్చానని చెప్పింది. బ్రహ్మయ్య ఆశ్చర్యపడ్డాడు. ఇంతకాలంగా వచ్చిన డబ్బు శివయ్య మింగాడని గ్రహించాడు. "వాడు మనిషి కాదుండి, దయ్యం అందుకే బిడ్డలు లేకుండ అయిన్రు ,మొండి మొదలారి పోతడు" అని గూడానికి వెళ్ళాడు. శివయ్య డబ్బు మింగడం సంగతీ, పావని డబ్బు తెచ్చిన సంగతీ స్వంత ధోరణిలో ప్రచారం చేశాడు. డబ్బు తీసుకోవడానికి గూడెం వాళ్ళను వెంట పెట్టుకుని చింత చెట్టు కిందికి వచ్చాడు. పావని ఒక్కొక్కరికీ పిలిచి కాగితం మీద అంగుష్ఠం వేయించుకుని డబ్బు అందించింది.
డబ్బు అందుకుని వెళ్ళిపోతున్న జనం రకరకాలుగా వ్యాఖ్యానించారు.
"శివయ్య దొర కాదసె - దొంగ మన కొచ్చిన డబ్బంత మింగిండట, విని కడుపు కాల, వీని పెండ్లాం ముండమొయ్య"
-- "పొరల నోటి ముంగలి బువ్వ గుంజు కున్నడటనే వీని ఇంటికి చిచ్చు పెట్ట, వీని ఇంట్ల పీనిగ ఎల్ల"
"పావనమ్మ దేవతోలే వచ్చింది, పోరలకు చదువు చేపుతాంది"
"అట్లగాదె, మనను కూడా అంతో ఇంతో తెలివిన పడేస్తాంది"
"పోరలకు పాలు పోస్తాంది, బువ్వ పెడ్తాంది"
