Previous Page Next Page 
నారాయణరావు (నవల) పేజి 22


    సుబ్బారాయుడు గారికి ఎనిమిదికాండ్ల స్వంత వ్యవసాయమున్నది. అయిదు ఒంగోలు జతలు, రెండు మైసూరు జతలు, సింధీజత యొకటియు, కేవలము సవారి బండ్లకుపయోగించునవి కలవు. రెండుజతల బొబ్బిలిపోతులూ, మూడు జతల బండిపోతులూ, సంతతము వారికడ నుండవలెను. దొడ్డిలో గాపురమున్నవాని పిల్లలే పసుల కాపరులు.
    మనుష్యులు పస్తుండినను, దూడలకు మేత తప్పగూడదని సుబ్బారాయుడుగారి మతము. వట్టిగడ్డి, జనుము దంటు, జొన్న చొప్ప, చిట్టు, తవుడు, ఉలవలు, సమస్తము సుబ్బారాయుడు గారి ఇంట్లో బుష్కలముగా నుండవలెను. పచ్చగడ్డి మేతకై పదియెకరముల భూమిలో బిల్లిపెసర పెంచెదరు. బీటి నేలకూడ బుష్కలముగా నుండుటచే వారికి బశుగ్రాసలో పమెన్నడు నుండెడిది కాదు.
    సుబ్బారాయుడుగారికి బాడిపశువులు విస్తారమున్నవి. ఒంగోలు ఆవులు ఎనిమిది, దేశవాళీ ఆవులు పన్నెండు గలవు. అయిదు పెద్ద గేదెలున్నవి. కొన్ని పాడిపశువులు, కొన్ని చూడివి, కొన్ని వట్టిపోయినవి. వారింట సర్వకాలముల పాడి పుష్కలముగా నుండవలెను. పాడిదూడలు గాక, వారింట గుమ్మడిపండావులని యొక జాతి కలదు. సుబ్బారాయుడుగారి తాతగా రాజాతి నెక్కడనుండి సముపార్జించిరో? ఆవు రెండడుగులన్నరయెత్తు, చిన్నతల, లేడికళ్ళు, పాల సముద్రమువంటి తెల్లని యొడలు, రేపు శేరు మాపు శేరు పాలిచ్చు కుండ పొదుగుతో గామధేనువువలె ముచ్చటగా నుండును. ఆ గుమ్మడిపండావు దూడ కడుచిన్నదియై బొమ్మదూడవలె ముద్దులు మూటగట్టుచుండును.
    వనలక్ష్ములవలె నున్న శారదా, సూర్యకాంతములతో నేగు నారాయణరావు త్రోవలోని మొక్కలను వర్ణించి చెప్పుచు, బాడి పశువుల పాకయున్న దొడ్డిలోని కేగెను. ఆ పెద్దపాకలో నొకప్రక్క గుమ్మడిపండావులు రెండున్నవి. ఒకటి పాలిచ్చుచున్నది. రెండవది వట్టిపోయినది. తన్ను చూడగానే చెంగు చెంగున గంతులిడుచు చేరవచ్చిన దూడను నారాయణరావు ముద్దులాడ దొడగెను. పనుల త్రొక్కిడిచే రొచ్చుగానున్న యాదొడ్డిని గాంచి ఏవగింపు కొనుచున్న శారదకు, భర్త దూడనెత్తి ముద్దులాడుట మీదు మిక్కిలియై _' వదినా ఇంట్లోకి వెళ్ళిపోదాం రావమ్మా' యని వెనుకకు తిరిగి, మగని యెడ్డెతనమును గూర్చిన తలపులతో నింటిదెసకు నడువసాగెను. శారదాచిత్తవృత్తి యెరుంగని సూర్యకాంతము ఆమె వెనుకనే పరువిడి, యామెకడ్డముగ నిలువబడి 'ఏవమ్మా వదినా, ఏమిటి! గుమ్మడిపండు దూడను జూడకుండగనే వెళ్ళిపోతున్నావేమిటి? రా!' అని పిలిచినది. 'చూస్తూనేవున్నా గదా' యన్నది శారద.
    అంతకుమున్నే వికలమనస్కుడైయున్న నారాయణరావు శారద వింతవర్తనమున కింకను నొచ్చుకొనుచు, ఆమెను వెనుకకు గొని తెచ్చుటకు నిర్భంధించు చెల్లెలితో 'సూర్యం! నువ్వు ఇల్లారా! ఇది కబుర్లు చెపుతోంది చూశావా! దీనికి 'వరబాల' అని నాన్నగారు పేరుపెట్టారా?' అనినాడు. సూర్యకాంతము తలవంచికొనియున్న వదిన దెస కొకపరియు, లేని వికాసము దెచ్చుకొను అన్నదెస కొకపరియు జూడ్కి ప్రసరించి నిట్టూర్పు వదలి యన్నగారి దగ్గరకు వెడలిపోయెను. శారద యేమనుకొన్నదో యక్కడనే యాగి, 'వదినా ఆ చిట్టిదూడ నిట్లాతీసుకు రావమ్మా' యన్నది. ఆ మాటకు సూరీడు మొగమింతయై దంతపుబొమ్మవలెనున్న యా పెయ్యదూడను సునాయాసముగ నెత్తికొని వదినగారికడకు గొనిపోయినది. నారాయణరావు నిట్టూర్చుచు నక్కడనుండి నెమ్మదిగా వెడలిపోయినాడు.
    ఆ సాయంత్రమే సుబ్బారాయుడు గారితోట జూచుటకు నాడు పెండ్లివారందరును మోటారుమీద బయలుదేరినారు. సూర్యకాంతము, సత్యవతి, పరమేశ్వరమూర్తి భారీ రుక్మిణియు వారితో వెళ్ళినారు.
    తోటలో మామిడి జాతులు బత్తాయిలు, పనసలు, పోకలు, కొబ్బరులు, జామలు, దబ్బలు, నారింజ, ఉసిరి, సపోటాలు, జంబుమలాకా, గులాబి జామ, పంపరపనాసలు, నిమ్మలు మొదలయిన వివిధ ఫలవృక్షజాతులున్నవి. తోటలో రెండుమూడు కుటుంబముల వారు కాపురమున్నారు. తోట కన్నుల పండువై సువాసనలతో నిండియున్నది. చెట్టున బండిన కాశీజామపళ్ళు, నారాయణరావు బెంగుళూరు నుండి తెప్పించిన గింజ లేని జామపళ్ళు, సపోటా పళ్ళు, తోటమాలులు కోసి వారికెల్ల నర్పించినారు. దీపాలవేళకు మోటారింటికి దిరిగివచ్చినది.
    నారాయణరావున కేదియో వ్యక్తముగాని భయమొండు హృదయమున బ్రవేశించినది. శారద వర్తనమునం దేదియో విశేష భావముండునని యతడునుకొనెను. ఛీ! తప్పు. అది భారతీయ నారీమణులకు సహజమగు లజ్జయని మనస్సును సమాధానపరచుకొనెను.
    నారా: పరం! మన స్త్రీలెంత పాశ్చాత్యవిద్యావంతులైనా, వారికి పాశ్చాత్య నాగరికతా వాసనలెంత యలముకొన్నా, భారతీయ సంప్రదాయ వాసన వారి జీవితాన్ని వదలిపెట్టదురా!
    పరం: ఏం, ఆ ఆలోచన కల్గింది? ఎవరైనా కనపడ్డారా ఏమిటిరా పెద్దచదువు చదివి భారతీయ సంప్రదాయాలున్నవాళ్ళు, ఇవాళ?
    నారా: ఒక ఆలోచన్లోంచి ఇంకోటి తట్టిన వరుసలో ఆఖరు ఆలోచన ఇది.
    పరం: ఆ గొలుసుకు మొదటిలంకె ఎక్కడ మొదలెట్టిందేమిటి?
    నారా: అదేముంటుందిలే, ఏదో చిన్న ఆలోచన!
    పరం: అయినా, మనస్తత్వ పరిశోధన కోసం అడుగుతున్నాను.
    నారా: నేను చెప్పింది తప్పా?
    ఇంతలో లక్ష్మీపతి అక్కడకు వచ్చినాడు.
    లక్ష్మీ: ఏమిట్రా వాదించుకుంటున్నారు?
    పరం: చూడరా, వీడు ఒక పెద్ద సిద్దాంతం చేశాడు. నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవా? అంటాడు. సరేరా, నీ సిద్దాంతానికి ఉపపత్తులైన మొదటి ఆలోచనలేమిటిరా అంటే, వీడు ఇవీ అవీ చెప్పి తప్పించుకుంటాడు.
    లక్ష్మీ: అసలు వీడి సిద్దాంతం చెప్పవోయి.
    పరం: ఈ రోజుల్లో పాశ్చాత్యవిద్య చదువుకున్న ఆడవాళ్ళ అంతరాంతరాల్లో భారతీయ సంప్రదాయ వాసన ఉండనే ఉంటుందట.
    లక్ష్మీ! అదా! అదెప్పుడూ మావాడి వాదనలో ఒకటి.
    పరం: ఒరే! నువ్వు గాంధీగారి భావాలన్నీ అద్భుతం, నిజం అంటావు. ఆయన ఏవన్నారూ, 'పాశ్చాత్యవిద్య లేకపోతే రామ్మోహరాయలింకా చాలా గొప్పవాడయి ఉండును' అని దానిమీదేగా మోడ్రన్ రివ్యూ మొదలైన వాటికి కోపాలొచ్చాయి. అలా అంటే అర్థం ఏమిటిరా లక్ష్మీపతీ? పాశ్చాత్య విద్యవల్ల నిజమైన భారతీయ నాగరికత నశించిపోతుందనేనా?
    లక్ష్మీ: అవును. నిజమే!
    నారా: 'పాశ్చాత్యవిద్య వచ్చినా', అని నేను అననే అన్నాను. అంటే మన వనితా లోకం విషయంలో గాంధీ మహాత్ముని సిద్దాంతం పూర్తిగా అన్వయించుననే నా అభిప్రాయం. అంతేగాని అది తప్పు అని కాదుగదా. అంటే మనదేశంలో కాస్త తెలిసో తెలియకో సంప్రదాయం బ్రతికించి వున్నది ఆడవాళ్ళే అని.
    పరం: ఏమిటి బ్రతికించి ఉన్నది? పక్కపాపిళ్ళు, సినిమా ముస్తాబులు, విడాకులంధీ_వీటినేనా?
    నారా: అన్నీ ఒప్పుకున్నా. కాని యీ పై పై మోజులతో పాశ్చాత్య తత్వం పూర్తయిందంటావా?
    పరం: ఇంతవరకూ వచ్చిన తరువాత పూర్తికాక మానుతుందా? వాళ్ళ చదువు పూర్తిగా ఎక్కినకొద్దీ తక్కిన ముచ్చట్లు కూడా తీరవూ? తొందర పడతావేం?
    నారా: కావచ్చును. కాని నేను ప్రస్తుత స్థితిని గురించే చెపుతున్నా.
    లక్ష్మీ: సరే ఇద్దరి వాదనా ఒక్కటే. ఇక పదండి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS